గువ్వలగుట్ట గొంతు తడిచేదెప్పుడు..!
x
కృష్ణ నది వొడ్డునే ఉన్న గువ్వలగుట్ట తండా

గువ్వలగుట్ట గొంతు తడిచేదెప్పుడు..!

ఇప్పటికీ అంతుచిక్కని తండాలో కిడ్నీ వ్యాధులకు కారణనాలు. పది రోజులకో ఒకసారే అందుతున్న తాగునీరు.


మిషన్ భగీరథ వచ్చి 10 సంవత్సరాలు అయినా తెలంగాణలోని స్వచ్ఛమైన త్రాగునీటిని నోచుకోని గ్రామాలు ఎన్నో వున్నాయి. వీటిల్లో త్రాగు నీటి వల్ల కిడ్నీ వ్యాధులకు నిలయంగా మారిన నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని గువ్వలగుట్ట తండా తెలంగాణ ఉద్దానంగా పేరుపొందుతుంది. మర్రిగూడ మండలంలో మళ్ళి వెలుగు చూసిన డెంటల్ ఫ్లోరోసిస్ కేసులు కూడా మిషన్ భగీరథ లోని లోపాలను ఎత్తిచూపుతున్నాయి.

గత బి.ఆర్.ఎస్. ప్రభుత్వం తెలంగాణలోని అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు 45,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథని చేపట్టింది. కానీ ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ త్రాగునీటి పథకం లక్ష్యంను సంపూర్ణంగా సాధించలేదనే చెప్పవచ్చు.

మిషన్ భగీరథ అధికారులు మాత్రం గువ్వలగుట్ట తండా ఎత్తు ప్రాంతంపులో ఉండటంతో నీటి సరఫరాలో కొంత ఇబ్బంది ఉంది. దానిని అధిగమించేందుకు ఎక్కువ సామర్ధ్యంగల వాల్వ్ ని అమర్చామని తెలిపారు.

గువ్వలగుట్ట తండా వద్ద నిర్మించిన మిషన్ భగీరథ త్రాగునీటి ట్యాంక్

గువ్వలగుట్ట తాండ జిల్లా కేంద్రం నల్గొండ నుంచి ౯౭ కిలోమీటర్ల దూరంలో ఉంది. కృష్ణ నది ప్రక్కనే ఉన్నా తండాలోని గిరిజనులకు స్వత్చమైన త్రాగునీరు లభించటంలేదు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటి నల్లాలు ఏర్పాటు చేసినా ఏ వారానికి ఒక సారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రతి ఇంటిలో ఒక వ్యక్తి అయినా కిడ్నీ వ్యాధితో భాధ పడటం మరొక విషాదం. కలుషిత త్రాగు నీటితోనే తాండ గిరిజనులు కిడ్నీ వ్యాధుల భారిన పడుతున్నారు.

తాండాలోని 1,500 మందిలో, మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది శస్త్రచికిత్స చేయించుకున్నారు, మూడు సంవత్సరాల లోపు చిన్నారులు సైతం కిడ్నీ వ్యాధుల భారిన పడుతున్నారు. కిడ్నీలో స్టోన్స్ తొలగింపు శాస్త్ర చికిత్స కోసం వారు రూ. 50,000 నుండి రూ. లక్ష వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. ఇది పేద గిరిజన కుటుంబాలను అప్పులపాలు చేస్తుంది. గత దశాబ్ద కాలంలో 100కు పైగా తండా గిరిజనులు కిడ్నీ వ్యాధులతో మరణిస్తున్నారు. సరైన సమయంలోచికిత్స తీసుకోకపోటం వాళ్ళ కిడ్నీలలో రాళ్ల పరిణామం పెరిగి ఇన్ఫెక్షన్స్ కు కారణం కావటంతో గిరిజనులు తీవ్ర అనారోగ్యం బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.

గువ్వలగుట్ట తండాలో ఏర్పాడు చేసిన త్రాగునీటి సరఫరా నల్లాలు

కిడ్నీ జబ్బులకు కారణం ఏమిటి ?

గతంలో గువ్వలగుట్ట తండా చందంపేట మండలంలోని ఓకే చిన్న గుట్టమీద ఉండేది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం తరువాత ఆ గుట్ట ముంపుకు గురికావడంతో గిరిజనులు కృష్ణ నది ప్రక్కనే నివాసం ఏర్పాటు చేసుకుంది. ఈ ప్రాంత భూగర్భంలో సున్నపు రాళ్ల నిల్వలు ఉండటంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. సమస్య పరిష్కారం కొరకు నాటి నల్గొండ జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ విక్రమ్ జీత్ దుగ్గల్ 2015 సంవత్సరంలో రివర్స్ ఓస్మోసిస్ (ఆర్.ఓ) ప్లాంట్ ను గువ్వలగుట్ట వద్ద ఏర్పాటు చేసినా అది కొన్ని రోజులలోనే పాడైపోయింది. భూగర్భ జలాలలో సున్నపు సాంద్రత ఎక్కువ ఉండటంతో ఆర్. ఓ. ప్లాంట్ రిపేర్ చేయించినా ఎక్కువ కాలం పనిచేయకపోవడంతో దానిని వదిలేసారు.

అధికారులు తండాను సందర్శించడం, భూగర్భ జలం నమూనాలు తీసుకువెళ్లటం తండా గిరిజనులకు షరా మాములుగా మారింది. వైద్య నిపుణుల బృందం సైతం గువ్వల గుట్ట తండాను సందర్శించి, గిరిజనుల మెడికల్ రిపోర్టులను పరిశీలించారు. కానీ తండాలో కిడ్నీ వ్యాధులకు కారణనాన్ని నేటికీ కనిపెట్టలేక పోయారు.

పరిష్కారం చూపని మిషన్ భగీరథ!

మిషన్ భగీరథ ద్వారా స్వచ్చమైన త్రాగునీటిని పొంది తమ కిందనీ వ్యాధుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని తండా గిరిజనులు ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యాయి.

మిషన్ భగీరథ క్రింద గువ్వలగుట్ట వద్ద 14,000 లీటర్ల నిల్వ సామర్ధ్యంతో వాటర్ ట్యాంకును నిర్మించి, ప్రతి ఇంటికి నీటి పుంపుని ఏర్పాటు చేసారు, కానీ వారానికో, పది రోజులకో ఒకసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారని తండాకు చెందిన గిరిజనుడు రమావత్ బాలియా అన్నారు. తమకు మళ్ళి భూగర్భ జలాలే త్రాగునీటి దిక్కయ్యాయని అయన వాపోయారు.

మరొక గిరిజనుడు కేతావత్ శ్రీను మాట్లాడుతూ " కిడ్నీలో స్టోన్స్ తొలగించే శస్త్ర చికిత్సకోసం నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశాను. నాలుగు సంవత్సరాల లోనే మళ్ళి కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయి. చికిత్స కోసం డబ్బులు లేక చావుకోసం ఎదురు చూస్తున్నాను”.

గ్రామీణ నీటి సరఫరా వాటర్ టెస్టింగ్ ల్యాబ్ కన్సల్టెంట్ బెల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గువ్వలగుట్ట నుంచి సేకరించిన భూగర్భ జలాల నమూనాలను పరిశీలించటం జరిగింది. ఆ నీటిలో నత్రజని, క్యాల్షియం సాల్ట్స్ పరిణామం ఎక్కువగా ఉంది. తండా గిరిజనులు మిషన్ భగీరథ నీటిని త్రాగినట్లు అయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని అయన తెలిపారు.

వైద్య నిపుణుడు డాక్టర్ విట్టల్ బాబు మాట్లాడుతూ కిడ్నీలలోని రాళ్ల పరిమాణం ఎక్కువ ఉన్నపుడు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు శస్త్రచికిత్సకు వెళ్ళవలసి ఉంటుంది. గిరిజనులు డాక్టర్లను సంప్రదించటంలో ఆలస్యం వల్ల ఈ పరిస్థితికి దారి తీస్తుంది. కిడ్నీ వ్యాధులపై గిరిజనులలో అవగాహన కల్పించాల్సిన అవసరముంది అని అయన తెలిపారు.

మిషన్ భగీరథ అధికారులు మాత్రం గువ్వలగుట్ట తండా ఎత్తు ప్రాంతంపులో ఉండటంతో నీటి సరఫరాలో కొంత ఇబ్బంది ఉంది. దానిని అధిగమించేందుకు ఎక్కువ సామర్ధ్యంగల వాల్వ్ ని అమర్చామని తెలిపారు.

Read More
Next Story