
ఎంఎల్‌సి ఎన్నికల్లో కమల విలాసం?
తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ గొడవ మధ్యలో బిజెపి బలం పెంచుకోవడం ఈ ఫలితాలలో స్పష్టమవుతుంది
-తెలకపల్లి రవి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉపాధ్యాయులు పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికల ఫలితాలు బిజెపికి,టిడిపి ఎన్‌డిఎలకు ఉత్సాహం కలిగించడంలో ఆశ్చర్యమేమీ లేదు.ఇరు రాష్ట్రాలలో చెరి మూడు చొప్పున ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నికలు జరగ్గా బిజెపి నేరుగా తెలంగాణలో కరీంనగర్ నిజామాబాద్ ఉపాధ్యాయులు, పట్టభద్రులకు సంబంధించిన రెండు సీట్లలోవిజయం సాధించింది. టీచర్ల స్థానంలో ముల్క కొమరయ్య విజయం సాధించగా పట్టభద్రుల స్థానంలో అంజిరెడ్డి ఆధిక్యంలో వున్నారు. నల్గొండ ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గంలో పిఆర్‌టియు తరపున శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు.
ఎపిలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో బిజెపి బలపర్చిన పిఆర్‌టియు అభ్యరిగాదె శ్రీనివాసులసు నాయుడు గెలిచారు. గుంటూరు కృష్ణా పట్టభద్రుల స్థానంలో కూటమి తరపున పోటీ చేసిన టిడిపి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉభయ గోదావరి పట్టభద్రుల స్థానంలో టిడిపి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ భారీ తేడాతో విజయం సాధించారు.అయితే ఉత్తరాంధ్రలో బిజెపి తన దారి చూసుకుంది. టిడిపి జనసేనలు ప్రస్తుత ఎంఎల్‌సి రఘువర్మ కు మద్దతు నిచ్చాయి. ఆయన పరాజయం చెందడం రాజకీయ చర్చకు దారితీసింది.
ఈ ఫలితాల తర్వాత తెలంగాణ బిజెపి నేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపి ఈటెల రాజేందర్ వంటివారు విజయోత్సాహ ప్రకటనలు చేశారు. అయితే అంతకు మించి బిజెపి తెలంగాణలో పట్టుపెంచుకుంటుందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు.బిఆర్‌ఎస్ ఈ ఎన్నికలలో పాల్గొనడకుండా వుండిపోవడంతో వారి ఓట్లు కూడా పడ్డాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ
గతంలోనూ మండలి ఎన్నికలలో బిఆర్‌ఎస్ పెద్ద ప్రభావం చూపలేకపోయింది.ప్రతిపక్షంగా ఇప్పుడు తన సత్తా చూపడానికి ప్రయత్నించే బదులు దూరంగా వుండిపోవడం సందేహాలకు దారితీసింది.కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టడమే గాక స్వయంగా ముఖ్కమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక దశలో రంగంలోకి దిగి ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది.
రాజకీయంగా చూస్తే కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల మధ్యలో బిజెపి బలం పెంచుకోవడం ఈ ఫలితాలలో స్పష్టమవుతుంది.బండి సంజయ్ మాటల్లోనైతే ఉపాధ్యాయులు హిందూత్వ రాజకీయాలను బలపర్చారని కూడా కేంద్రమంత్రి సంజయ్ నొక్కి చెబుతున్నారు.తాత్కాలికంగా కాంగ్రెస్‌లో చేరి ఎంఎల్‌సి ప దవి చేపట్టిన తీన్మార్ మల్లన్న ఈ ఎన్నికల్లో ఎలాటి పాత్ర వహించాడనేది ఒకటైతే ఆయన మళ్లీ బిజెపి వైపే వెళతాడన్న కథలు మళ్లీ వినిపిస్తున్నాయి.ఆయన విడియోలను బిఆర్‌ఎస్ వారు ఎక్కువగా షేర్ చేస్తుండటం బట్టి ఆ వైపు వెళతారని కూడా వూహాగానాలున్నాయి.
ఎంఎల్‌సి ఎన్నికల్లో రెండు పార్టీలూ కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేశాయి గనక ఇందులో ఏదైనా సంభవమేననాలి. ఈ లోగా బిసి కార్డు, స్వంత పార్టీ వంటి కథలను కూడా వ్యాప్తిలో పెట్టారు.వ్యక్తిగతంగా ఆయన చేసేదేముంటుందన్న ప్రశ్న ఒకటైతే ఈ ఫలితాల రాజకీయ ప్రభావమేంటనేది మరొకటి.దక్షిణాదిన తమ తదుపరి మజిలీ ఆశ తెలంగాణనే అంటున్న బిజెపి నిస్సందేహంగా ఈ విజయాలను గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. మధ్య తరగతిలో తన ఇమేజి పెంచుకోవడానికి దీన్ని అస్త్రంగా ఉపయోగిస్తుంది.
బిజెపి వ్యూహం
అయితే హిందూత్వ విజయం అంటున్న కేంద్ర మంత్రి మాటలు కూడా వారి భావి వ్యూహాలను సూచిస్తున్నాయి.ఇటీవలి కాలంలో బిజెపిని విమర్శించడమే విరమించిన బిఆర్‌ఎస్ కూడా వారి సానుకూల ఫలితాలు చూశాక మరింత మారొచ్చు.ఇక నల్గొండలో యుటిఎప్ తరపున పోటీ చేసిన ప్రస్తుత ఎంఎల్‌సి నర్సిరెడ్డి చివరి దాకా తన ఓట్లను కాపాడుకుంటూ వచ్చారు. ఆయన ఎలిమినేషన్ తర్వాతనే శ్రీపాల్‌రెడ్డి విజయం ప్రకటించారు.ఈయన చాలా కాలంగా ఓటర్ల కోసం ఖర్చులు చేస్తూ విందులు సమ్మేళనాలు నిర్వహిస్తూ అనుకూల వాతావరణం సృష్టించుకున్నారని పరిశీలకుల మాట. విద్యా సంస్థల అధినేత ముల్క కొమరయ్య ఇప్పుడు రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానానికే గట్టిగా ప్రయత్నించిన వ్యక్తి.
ఉత్తరాంధ్రలో విజయం సాధించిన పిఆర్‌టియు అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గ తంలోనూ రెండుసార్లు ఎంఎల్‌సి గా పనిచేశారు. గతసారి పిడిఎఫ్ మద్దతుతో గెలిచిన రఘువర్మ చేతిలో ఓడిపోయారు.అయితే ఈ ఇద్దరు కూడా టిడిపి వైసీపీ మధ్యలో వూగిసలాడిన వారే. కాకపోతే ఈ సారి రఘువర్మ తరపున టిడిపి జనసేన గట్టిగా ప్రచారం చేయగా గాదెను బిజెపి బలపర్చింది. ముందుగా ఆయన విజయమే ప్రకటించారు.ఫలితాలు రాగానే సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లడుతూ ఇదీ తమ విజయమేనని.రెండవ ప్రాధాన్యత ఓటు వేశామని సమర్థించుకున్నారు. కానీ గెలిచిన గాదె మాత్రం తనకు ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
వైసిపిలో సంతోషం ఎందుకు?
ఇది కూటమికి ఎదురుదెబ్బ అని వైసీపీ వారి మీడియా భారీగా ప్రచారమెత్తుకున్నాయి.రాజకీయంగా ఇది కూటమికి నష్టమే గానీ వైసీపీ అతిగా సంతోషించడానికి ఏమీ లేదు. ఎందుకంటే వారేమీ గాదె కు మద్దతు ప్రకటించింది లేదు. ఎన్నికలకు దూరంగా వుంటామని ప్రకటించారు.కనుక టిడిపి కూటమి ఓడిపోయిందని సంతోషించడ తప్ప అదనంగా ఆనందించవలసింది కనిపించదు. కాకపోతే ఉత్తరాంధ్రలో ఓటమి అన్నది ప్రాంతీయ కోణంలో కూడా ముందుకు తెచ్చేందుకు వైసీపీ ప్రయత్నించడం కనిపిస్తుంది.
ఈ సమయంలోనే మరోసారి మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అమరావతి రాజధాని చర్చ తేవడం,మాజీ మంత్రి గుడివాడ అమర్మాథ్ విశాఖకు అన్యాయం గురించి మాట్లాడటం చూస్తే వైసీపీ ఉత్తరాంధ్ర వ్యూహాన్ని చేపడుతుందా అనుకోవలసి వస్తుంది. కొద్ది రోజుల్లో ఆ పార్టీ అధినేత జగన్ యాత్ర కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తారని చెబుతున్నారు.
టిడిపి విజయం ప్రాధాన్యం
కృష్ణా గుంటూరు ,ఉభయ గోదావరి స్థానాల్లో టిడిపి పెద్ద మెజార్టితో గెలుపొందడం రాజకీయంగా కీలకమైన పరిణామమే. గత ప్రభుత్వ హయాంలోనూ అంతకుముందు కూడా టిడిపి మండలి ఎన్నికల్లో పెద్ద విజయాలు సాధించిందేమీ లేదు.2023 చివరలో మాత్రమే అది కూడా పిడిఎప్ మద్దతు తీసుకుని చాలా విజయాలు సాధించింది.నిజానికి అది వైసీపీ పాలన చివరి ఘట్టం. తాము అవగాహన ప్రకారం టిడిపికి ఓట్లేసినా అటునుంచి తగినంత బదలాయింపు జరగలేదని తర్వాత పిడిఎప్ నాయకత్వం భావించింది. అప్పుడు వంటరిగా వున్న టిడిపి ఇప్పుడు బిజెపితో జతకట్టి ఎన్‌డిఎ భాగస్వామిగా ప్రధాన మద్దతుదారుగా వుంది. ఆ రీత్యా కూడా ఈ విజయం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
వామపక్షాల్లో నిరుత్సాహం
ఈ రెండు స్థానాలు కూడా పిడిఎఫ్ తరపున యుటిఎఫ్ ప్రాతినిధ్యంలో వుండేవి, నాలుగుసార్లు పోటీ చేసి మూడుసార్లు గెలిచిన కెఎస్ ల క్ష్మణరావు, గతసారి గెలిచిన ఇలా వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహించారు.ఈ స్థానాలు కోల్పోవడం వామపక్ష భా వాలు గల వారికి నిరుత్సాహం కలిగించే విషయమే.2004లో శాసనమండలిని పునరుద్ధరించిన తర్వాత ఏర్పడిన పిడిఎప్ ఎంఎల్‌సి స్థానాలలో ప్రాబల్యం కొనసాగించింది. చుక్కారామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వం,లక్ష్మణరావు, విఠపు బాలసుబ్రహ్మణ్యం,ఎంవిఎస్ శర్మ, రాముసూర్యారావు వంటివారు ధనబలాన్ని ఓడిరచి గెలవడం ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక రాజకీయాలకు ప్రతిబింబంగా భావించబడింది. అంతకు ముందు కాలంలో జనసంఘం/బిజెపి గెలుస్తూ వచ్చిన ఈ సా ్థనాలను క్రమబద్దమైన ప్రణాళికతో కృషితో ప్రగతిశీల సంస్థల ప్రతినిధులు గెలవడం హర్షామోదాలు పొందింది.
ఎన్నికల పోరాటంలో సవాళ్లు ఎదురైనా, ప్రభుత్వాధికారంలోకి ఎవరొచ్చినా రెండు రాష్ట్రాలుగా విభజితమైనా పిడిఎఫ్ స్థానం కొనసాగింది. కాని ఈసారి భారీ ధన ప్రయోగం పరిస్థితిని మార్చివేసిందని నివేదికలు చెబుతున్నాయి.లక్ష్మణరావు వంటివారిపై అసత్య ప్రచారాలు సాగించడం,పోలింగ్ రోజు దౌర్జన్యం వంటి ఆరోపణలు కూడా వచ్చాయి,ఫలితాలు వచ్చాక కూడా అచ్చెం నాయుడు వంటి సీనియర్ మంత్రి,విజేత అలపాటి వైసీపీ యుటిఎఫ్ ముసుగులో పోటీ చేసిందని ఆరోపించారంటే దుష్ప్రచారం తీవ్రత తెలుస్తుంది.
మితవాద మతవాద రాజకీయాల విస్తరణ
కూటమి విజయం సాధించి కొద్ది కాలమే గడిచింది కూడా ఆప్రభావం కూడా పడి వుండొచ్చు. మరిన్ని వివరాలు వచ్చాక సమీక్షలు జరిగాక మాత్రమే పూర్తి చిత్రం బోధపడుతుంది. తెలంగాణలో విజయం సాధించిన బిజెపి ఎన్‌డిఎకు జాతీయ నాయకత్వంలో వుంది గనక ఎపిలోనూ విజయమని చెప్పుకోవడం సహజం, మితవాద మతవాద రాజకీయాల ప్రభావం విస్తరిస్తున్న తీరుకు ఇది ఒక ఉదాహరణగా చూడాల్సి వుంటుందేమో! ప్రైవేటీకరణ, విద్య కాషాయకరణతో సహా అనేక తిరోగామి చర్యలకు మూలపీఠంగా వున్న బిజెపి గెలిలచిందంటేి బిఆర్‌ఎస్ జనసేన( పరోక్షంగావైసీపీ కూడా) వంటి ప్రాంతీయ మిత్రులు కారణం కాదా? 2004లో అన్ని స్థానాల్లో పిడిఎఫ్ గెలిచినప్పుడు నేను ఎరుపు గెలుపు అని ఒక వ్యాసం రాశాను. మరి ఈ మలుపులో ప్రత్యామ్నాయ శక్తులు ఎలాటి నిర్ణయాలతో ముందుకు పోతాయో చూడవలసిందే.
Next Story