కొత్త ఉపాధి హామీ బిల్లులో పని హక్కు‘ ను మాయం చేశారు
x

కొత్త ఉపాధి హామీ బిల్లులో 'పని హక్కు‘ ను మాయం చేశారు

సమస్యలు ఎన్ని ఉన్నా, గత 20 ఏళ్లలో పాత చట్టం గ్రామీణ పేదలకు ఆర్ధికంగా ఆసరా ఇచ్చింది.దీన్నొక ప్రభుత్వ పథకంగా కుదించేస్తున్నారు.

విస్తరిస్తున్న నగరీకరణ, వ్యవసాయ రంగా పనులలో పెరుగుతున్న యాంత్రీకరణ , సస్య రక్షణ, కలుపు నివారణ పేరుతో భారీగా విష రసాయనాల వినియోగం, బహుళ పంటల స్థానంలో పెరుగుతున్న ఏక పంట విధానం ఇప్పటికే గ్రామీణ పేదలకు, ముఖ్యంగా మహిళలకు సంవత్సరం పొడవునా చేతినిండా పని దొరకకుండా చేస్తున్నాయి. ఫలితంగా గ్రామీణ పేదల ఆదాయాలు గణనీయంగా పడిపోతున్నాయి.

ఇలాంటి స్థితిలో తాజాగా నరేంద్ర మోదీ నేతృత్వం లోని NDA కూటమి ప్రభుత్వం గ్రామీణ పేదలను చావు దెబ్బ తీసేలా మరో పిడుగు వేసింది. UPA ప్రభుత్వ పాలనా కాలంలో వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA ) లో తీవ్ర మార్పులు చేస్తూ , 2005 లో వచ్చిన ఆ చట్టం స్పూర్తిని దెబ్బ తీస్తూ, వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) ( VB-G RAM ( G) బిల్లు, 2025 పేరుతో పార్లమెంటు లో కొత్త బిల్లును డిసెంబర్ 16 న ప్రవేశ పెట్టింది.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA ) అమలు తీరులో అనేక సమస్యలు ఉన్నమాట నిజం. వాటిని గ్రామీణ పేదల దృష్టి కోణంలో సమీక్షించి ఆ చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం పరిధి లోకి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు తోడ్పడేలా, ఉపాధి హామీ పథకంలో కార్మికులకు మరిన్ని పని దినాలు లభించేలా ఇంకా కొన్ని అదనపు పనులను జోడించాల్సి ఉంది. కానీ, గత 11 సంవత్సరాలలో ఈ పనులేవీ చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు.

మొదటి నుండీ ఈ పథకానికి మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగానే ఉంది. ఈ పథకంపై అనేక సార్లు చట్ట సభల లోనే దుష్ప్రచారం సాగించింది. పైగా ఉపాధి హామీ కార్మికుల సంఖ్య, పని డిమాండ్ కు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా ప్రతి సంవత్సరం తగ్గిస్తూ వచ్చింది. తద్వారా జాబ్ కార్డులు కలిగిన కార్మికులకు 100 రోజుల పని కల్పించడం లో విఫలమైంది.

ఇంటర్నెట్ సౌకర్యం కూడా సరిగా లేని గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలలో డిజిటల్ టెక్నాలజీ వినియోగించి, కార్మికుల హాజరు, ఆధార కార్డ్, బ్యాంక్ అకౌంట్ అనుసంధానం పేరుతో , నిరక్షరాస్య గ్రామీణ కార్మికులను తీవ్రంగా వేధించింది.

ఆయా రాష్ట్రాల కనీస వేతనాలను, ఉపాధి హామీ కార్మికుల కనీస వేతనాలుగా నిర్ణయించాలన్న కార్మికుల, ప్రజా సంఘాల డిమాండ్ ను కూడా మోదీ ప్రభుత్వం పట్టించుకోకుండా, ప్రతి సంవత్సరం అతి తక్కువ రోజువారీ వేతనాలను మాత్రమే ఈ పథకానికి నిర్ణయించింది. ఆ వేతనాలు కూడా కార్మికులకు అందకుండా, అనేక నిబంధనలు పెట్టింది.

ఈ చట్టం అమలు విషయంలో మోడీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వమే చట్ట విరుద్ధంగా అనేక సార్లు వ్యవహరించింది. వేతనాలను సకాలంలో చెల్లించకపోవడం, పని కల్పించలేని స్థితిలో నష్ట పరిహారం చెల్లించడం, తప్పకుండా కుటుంబానికి 100 రోజుల పనిని కల్పించాలనే నిబంధనను తానే పాటించకపోవడం లాంటి నేరాలకు పాల్పడింది.

ఈ సమస్యలు ఎన్ని ఉన్నా, గత 20 ఏళ్లలో గ్రామీణ భారతావనికి ఆ చట్టం ఎంతో మేలు చేసింది. గ్రామీణ పేదలకు ఆర్ధికంగా ఆసరా ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో పేదల భూముల అభివృద్ధికి , సాగునీటి వనరులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి చేయూత ఇచ్చింది.

కరోనా కాలంలో ఈ పథకం నిజంగా దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రాణం పోసింది. దేశమంతా మూతపడిపోయిన స్థితిలో గ్రామీణ ప్రజలు,నగరాల నుండీ గ్రామాలకు తరలి వచ్చిన ప్రజలు ఆకలి చావులకు గురి కాకుండా కాపాడింది.

ఇలాంటి ఈ చట్టాన్ని దాని స్వంత చట్రంలోనే మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చి బలోపేతం చేసే అవకాశం ఉండేది.

కానీ మోడీ ప్రభుత్వం ప్రతిపాదిత చట్టం లోని కేవలం నాలుగు నిబంధనలే ఈ చట్టబద్ధమైన గ్యారెంటీ ఎంత అబద్ధమో స్పష్టం చేస్తాయి. పైగా ఎటువంటి ముందస్తు సంప్రదింపులు లేకుండా, కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) రద్దు చేసి, దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) — VB-G RAM G బిల్లు, 2025 ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

వాస్తవానికి, MGNREGA మరియు VB-G RAM G ల పరిధి, లక్ష్యాలు ప్రాథమికంగా భిన్నమైనవి. కాబట్టి ఇవి రెండు వేర్వేరు చట్టాలుగా ఉండాల్సింది.

కొత్త బిల్లులో కీలకమైన పని హక్కు కనుమరుగైంది. ఈ కొత్త బిల్లు MGNREGA కల్పించిన ప్రాథమిక 'పని అడిగే హక్కు'ను ప్రాధమికంగా తొలగించింది. "వికసిత్ భారత్ @ 2047" లక్ష్యంతో ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 రోజుల పని కల్పిస్తామని చెబుతున్నా, ఇందులో పని హక్కు అనే అంశమే లేదు.

కొత్త బిల్లులో ప్రతిపాదించిన సెక్షన్ 4 (5) ప్రకారం ఏ రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించాలో కేంద్రమే నిర్ణయిస్తుంది. పాత చట్టం ప్రకారం కింద స్థాయి నుండి డిమాండ్ ఆధారంగా నడిచే పథకం అమలయ్యేది. కానీ కొత్త బిల్లు, కార్మికులకు ఉండే చట్ట బద్ధమైన గ్యారెంటీని కేవలం ఒక ప్రభుత్వ పథకంగా మారుస్తున్నది.

కొత్త బిల్లులో ప్రతిపాదించిన సెక్షన్ 5 (1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాంతాలను నోటిఫై చేస్తుందో, అక్కడ మాత్రమే ఈ పథకం అమలవుతుంది. "కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే, నైపుణ్యం లేని పని చేయడానికి ముందుకొచ్చే కుటుంబాలకు 125 రోజులకు తగ్గకుండా గ్యారెంటీ పనిని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది." దీనర్థం, ఒకవేళ కేంద్రం ఏదైనా ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతంగా నోటిఫై చేయకపోతే, ఆ ప్రాంత ప్రజలకు పని హక్కు ఉండదు.

దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ ప్రాంతంలోనూ పని కల్పించే విధంగా గత చట్టంలో ఉన్న నిబంధనను ఈ బిల్లు తొలగించింది. సంవత్సరానికి పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచుతున్నామన్న వాగ్దానం ఆచరణలో అమలు కాదు. ఎందుకంటే ఇప్పటికే నిధుల కొరత వల్ల సగటున ఒక కుటుంబానికి సంవత్సరానికి 50-55 రోజులు మాత్రమే పని దొరుకుతోంది.

కొత్త బిల్లులో ప్రతిపాదించిన సెక్షన్ 22 (2) ప్రకారం నిధుల భాగస్వామ్యాన్ని కేంద్ర, రాష్ట్రాల మధ్య 60:40 నిష్పత్తికి మార్చారు. అంటే రాష్ట్రాలు 40 % నిధులు భరించాల్సి ఉంటుంది.

నిజానికి గత చట్టం బలం అంతా, దాని డిమాండ్ ఆధారిత స్వభావంలో ఉంది. అంటే ప్రజలు పని అడిగిన (డిమాండ్ చేసిన) 15 రోజుల్లోగా ప్రభుత్వం పని కల్పించాలి, లేకపోతే కార్మికులకు నిరుద్యోగ భృతి పొందే హక్కు ఉంటుంది. పైగా ఇప్పటి వరకూ కూలీల వేతనాలు 100 % కేంద్రమే భరిస్తున్నది.

కొత్త బిల్లు లోని సెక్షన్ 4(5) ప్రకారం, "కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణికాల (objective parameters) ఆధారంగా, ప్రతి ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపును కేంద్రమే నిర్ణయిస్తుంది." అంతేకాకుండా, సెక్షన్ 4(6) ప్రకారం, "కేటాయించిన నిధుల కంటే ఎక్కువ ఖర్చు అయితే, దానిని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి." దీనివల్ల నిధుల కేటాయింపులో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇది MGNREGA యొక్క మూల సూత్రమైన "డిమాండ్‌ను బట్టి నిధులు" అనే విధానాన్ని తలక్రిందులు చేసి, "బడ్జెట్‌ను బట్టి డిమాండ్" అనే స్థాయికి మారుస్తుంది.

MGNREGA కింద 75 % మెటీరియల్ ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించేది. ఆచరణలో ఇది కేంద్రం, రాష్ట్రాల మధ్య 90:10 నిష్పత్తిలో ఉండేది. కానీ కొత్త బిల్లులోని సెక్షన్ 22(2) ప్రకారం, ఈ నిష్పత్తిని ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలకు 90:10గా ఉంచారు. మిగిలిన ఇతర రాష్ట్రాలకు 60:40 గా మార్చారు. ఈ నిబంధన ఆయా రాష్ట్రాలపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. పేద, వలస కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆర్థిక భారం పెరగడం వల్ల, రాష్ట్రాలు కార్మికుల పని డిమాండ్‌ను నమోదు చేయడానికి వెనుకడుగు వేసే ప్రమాదం ఉంది.

73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా, ఇంతకాలం MGNREGAలో పనుల ప్రణాళికను స్థానిక అవసరాల ఆధారంగా గ్రామ సభలు నిర్ణయిస్తాయి. కానీ కొత్త బిల్లులోని షెడ్యూల్ 1, క్లాజ్ 6(4) ప్రకారం, ' వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్' అనే వ్యవస్థ రాష్ట్రాలకు, పంచాయతీలకు మార్గ నిర్దేశం చేస్తుంది. స్థానికంగా జరగాల్సిన ప్రణాళికా రచనను, కేంద్రం నిర్దేశించిన ప్రాధాన్యతలకు మార్చడం ద్వారా ఇది 73వ రాజ్యాంగ సవరణను ఉల్లంఘిస్తోంది.

ఇప్పటికే డిజిటల్ హాజరు (NMMS), ఆధార్ ఆధారిత చెల్లింపుల (ABPS) వంటి సాంకేతికతల వల్ల అనేక మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ, కొత్త బిల్లు బయోమెట్రిక్ ధృవీకరణను, జియో-స్పేషియల్ టెక్నాలజీని తప్పనిసరి చేస్తూ, కార్మికులపై నిఘా పెంచేలా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు బయోమెట్రిక్ విధానం తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందని అనేక నివేదికలు చెప్పాయి.

MGNREGAలో కార్మికులకు ఎప్పుడైనా పని అడిగే హక్కు ఉంది. కానీ కొత్త బిల్లులోని సెక్షన్ 6(2) ప్రకారం, "వ్యవసాయ సీజన్లలో (విత్తనాలు వేసేటప్పుడు, కోతల సమయంలో) పనులు చేపట్టకుండా, ఆర్థిక సంవత్సరంలో మొత్తం 60 రోజులు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే నోటిఫై చేయాలి." దీనివల్ల పని అవసరం ఉన్న కార్మికులు కనీసం రెండు నెలల పాటు చట్ట బద్ధంగా పనికి దూరమవుతారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం “ప్రతి చేతికి పని ఇవ్వండి, పనికి తగిన ప్రతిఫలం ఇవ్వండి” అనే నినాదంతో వచ్చిన ప్రజల చట్టం. మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ కొత్త బిల్లు గ్రామీణ పేదల హక్కులను పూర్తిగా కాల రాస్తోంది.

ఈ బిల్లు సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తోంది. ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. 73వ రాజ్యాంగ సవరణ స్పూర్తికి విరుద్ధం. ఇది అధికారాన్ని కార్మికులు, గ్రామ సభలు, రాష్ట్రాల చేతుల్లోంచి లాక్కుని కేంద్రం చేతుల్లో పెడుతుంది.ఈ బిల్లును వ్యతిరేకించడం, చట్టం కాకుండా ఆపడం మనందరి బాధ్యత.

Read More
Next Story