
తెలంగాణలో 5 వేల పాఠశాలలు మూత?
సంక్షోభంలో ప్రభుత్వ పాఠశాలలు: ప్రభుత్వ ఉపాధ్యాయుడు పల్లె నాగరాజు ఆందోళన
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడింది అనడానికి ప్రభుత్వం ఇటీవల విద్యా రంగంలో మార్పులు తీసుకోని రావడానికి తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శనం.కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పెర్పార్మేన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ )లో రాష్ట్రం యొక్క ర్యాంక్ పడిపోకుండా ఉండటం కోసం, 1,441 బడులను జీరో ఎన్ రోల్ మెంట్ కారణంగా మూసి వేయ్యాలని విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో విద్యాశాఖ దయనీయ స్థితికి అద్దం పడుతుంది.
కేంద్ర ప్రభుత్వం జులై నెలలో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో విద్యార్థులు లేని పాఠశాల జాబితాలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ రెండో స్థానంలో ఉండేది. తాజాగా కేంద్రం ప్రకటించిన నివేదికలో జీరో ఎన్ రోల్ మెంట్ ఉన్న జాబితాలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ప్రకటించింది. దీనితో రాష్ట్ర పెర్పార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) ర్యాంక్ పడిపోతుంది. దీనితో ప్రభుత్వం 1441 పాఠశాలలను మూసి వేసి 2026-27 యూడైస్ లెక్కల నుండి తొలిగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.మరో 640 పాఠశాలలో కేవలం ఉపాధ్యాయులు మాత్రమే ఉండి, ఒక్క విద్యార్థి కూడ లేకపోవడంతో అందులో పని చేస్తున్న ఉపాధ్యాయులను వేరే పాఠశాలలకు డిప్యుటేషన్ పై పంపించి వాటిని కూడ త్వరలో మూసి వేయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో ప్రభుత్వ విద్య పట్ల పాలక వర్గాలకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 2,081జీరో ఎన్ రోల్ మెంట్ పాఠశాలలు ఉన్నట్టు తేలగా, ప్రస్తుతానికి 1,441 స్కూళ్లను మూసి వేయ్యడంతో పాటు, మిగిలిన 640 పాఠశాలలను మూసివేస్తే ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 24 వేల లోపే పరిమితం కానుంది.ఇవే కాకుండా సంవత్సరం క్రితం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో విద్యా రంగంపైన జరిగిన చర్చలో 3,144 అప్పర్ ప్రైమరీ పాఠశాలల విలీనంపైన నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.అంటే భవిష్యత్తులో అప్పర్ ప్రైమరీ పాఠశాలలు కూడ ముసివేసే ప్రమాదం ఉంది. ఇటు 2వేల జీరో ఎన్ రోల్ మెంట్ బడులు, అటు అప్పర్ ప్రైమరీ పాఠశాలు మొత్తంగా కలిపి 5వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు శాశ్వతంగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి తోడు ఇటీవల విడుదల చేసిన తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ -2047లోను ఓకే ప్రాంగణంలోని ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలలను విలీనం చెయ్యాలని ప్రకటించారు. దీనితో మరికొన్ని పాఠశాలలు కనుమరుగయ్యే పరిస్థితితులు ఉన్నాయి.
గ్రామాలలో పాఠశాలలు మూతపడటం వల్ల పేద, దళిత, గిరిజన, వెనుక బడిన వర్గాల పిల్లలు విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్ళలంటే రవాణా ఖర్చులు భరించలేని తల్లి దండ్రులు పిల్లలను బడి మాన్పించే అవకాశం ఉందికిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకోవడం చిన్న పిల్లలకు భారంగా మారుతుంది.ముఖ్యంగా ఆడపిల్లల విద్యపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది మధ్యలో చదువు మానేసే వారి (డ్రాపౌట్స్ )సంఖ్యను పెంచుతుంది.ఇది బాలకార్మిక వ్యవస్థకు లేదా బాల్య వివాహలకు దారితీయవచ్చు.
ప్రభుత్వ పాఠశాలలను మూసి వెయ్యడం కంటే వాటిని పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం ఆలోచన చెయ్యాలి. ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యను, ఆంగ్ల మాధ్యమాన్ని బలోపేతం చెయ్యాలి.పాఠశాలలో మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించాలి.తాగు నీరు,టాయిలెట్స్ సౌకర్యాలు లేని పాఠశాలలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి.గ్రామాలలోని సర్పంచులను, విద్యా కమిటీలలో భాగస్వామ్యం చేసి అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసికోవాలి.ఖాళీగా ఉన్న పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేసి పాఠశాలలో బోధనపైన పర్యవేక్షణ చెయ్యాలి. దీనితో తల్లి దండ్రులకు ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం కలిగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించే అవకాశాలు ఉన్నాయి.
పాఠశాలల ముసివేత తాత్కాలికమే విద్యార్థులు వస్తే మళ్ళీ తెరుస్తాం అన్న ప్రభుత్వ ప్రకటన ఆచరణలో సాధ్యం అవుతుందా? ఒక్కసారి మూత పడిన పాఠశాల మళ్ళీ తెరుచుకోవడం వ్యవస్థలో చాలా అరుదు. ప్రభుత్వం ర్యాంకింగ్ కోసం పాఠశాలలను మూసివేసి దళిత, గిరిజన, వెనుక బడిన వర్గాల పిల్లలకు ప్రాథమిక విద్యను దూరం చెయ్యకూడదు. పాఠశాలలను మూసివేయడం సమస్యకు ముగింపు కాదు. అది ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చెయ్యడంలో ప్రభుత్వ వైపల్యానికి అంగీకారం మాత్రమే అవుతుంది. పాఠశాలల మూసివేతను విద్యావేత్తలు, యువజన, విద్యార్ధి, ప్రజా సంఘాల నాయకులు వ్యతిరేఖించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకమేఅవుతుంది.

