
మూసీ ప్రాజక్టు: అరచేతిలోస్వర్గమా, మాయాజాలమా?
మూసీ ప్రాజెక్ట్‌పై సందేహాలు పెరుగుతున్నాయి. కాలుష్యం, నిర్వాసితులు, పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
-షేక్ బాబా
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇటీవల విడుదల కావడం నగర పర్యావరణ భవిష్యత్తుకు కీలక మలుపుగా ప్రచారం చేయబడుతోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 21 కిలోమీటర్ల పరిధిని కవర్ చేసే ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుండి 4,100 కోట్ల రుణం ప్రతిపాదించబడింది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అమలుకాబోయే ఈ ప్రాజెక్టు 55 కిలోమీటర్ల కాలుష్యంతో నిండిన నదిని ఆధునిక పట్టణ కారిడార్‌గా మార్చుతామని హామీ ఇస్తోంది. అయితే మెరిసే ప్రెజెంటేషన్లు, అంతర్జాతీయ కన్సల్టెన్సీ పేర్ల వెనుక ఒక కీలక ప్రశ్న ఉంది: హైదరాబాద్ నిజంగా నదిని
పునర్నిర్మిస్తున్నదా? లేక కేవలం నది ఒడ్డులను అలంకరిస్తుందా?
కాంక్రీటు పై ఆధారపడిన దృష్టికోణం ఈ ప్రణాళికలో మలినజల శుద్ధి కేంద్రాలు, అందమైన రివర్‌ఫ్రంట్‌లు, వాణిజ్య మండలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, పర్యాటక సదుపాయాలు ఉన్నాయి. అధికారులు ఇవి నదిని శుభ్రం చేస్తాయని, వరదలను నియంత్రిస్తాయని, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుస్తాయని చెబుతున్నారు. కానీ విమర్శకుల అభిప్రాయం వేరుగా ఉంది. ఈ ప్రాజెక్టు నిజమైన పర్యావరణ పునరుద్ధరణ కంటే రియల్ ఎస్టేట్ ఆధారిత అభివృద్ధి వైపు ఎక్కువగా మొగ్గుచూపుతోందని వారు అంటున్నారు. వాకింగ్ ట్రాక్‌లు, పార్కులు, వాణిజ్య ప్రాంతాలు నది ఒడ్డులను అందంగా మార్చినా, నదిలో ప్రవహిస్తున్న విషజలాలు, పారిశ్రామిక వ్యర్థాలు, దశాబ్దాల నిర్లక్ష్యాన్ని పరిష్కరించలేవు.
అసలు సమస్య అలాగే
హైదరాబాద్ నగరం రోజుకు సుమారు 1,950 యం ఎల్ డి మలినజలాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందులో సుమారు 750 యం ఎల్ డి నేరుగా మూసీ నదిలోకి చేరుతోంది. నదిలో ఆక్సిజన్ స్థాయిలు అత్యంత తక్కువగా ఉండగా, భారీ లోహాలు, ప్రమాదకర బ్యాక్టీరియా నీటిని మానవులకు, జీవజాలానికి అనర్హంగా మార్చాయి. ఇంకా కొత్త శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసినా, కాలుష్యాన్ని మూలంలోనే ఆపకపోతే నది ఎప్పటికీ మురుగు కాలువగానే మిగిలిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదనంగా, నదిబెడలో పేరుకుపోయిన విషపూరిత మట్టి నిర్వహణపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
నిర్వాసితుల బాధ: కనిపించని ఖర్చుప్రపంచ స్థాయి పబ్లిక్ స్పేస్‌లు అనే మాటలు వినిపిస్తున్నప్పటికీ, నది ఒడ్డున నివసిస్తున్న వేలాది కుటుంబాల భవిష్యత్తు గురించి స్పష్టత లేదు. పౌర సమాజ సంస్థలు భారీ స్థాయిలో నిర్వాసితుల సమస్య, తగిన పునరావాసం లేకపోవడం, జీవనాధారాల కోల్పోవడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చాలామందికి మూసీ నది కేవలం నీటి వనరు కాదు అది వారి జీవితం. సరైన పునరావాసం లేకుండా బహిష్కరణలు జరిగితే, పట్టణ అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
పారదర్శకత ఎక్కడ?ఇంత పెద్ద ప్రాజెక్టుకు ప్రజల పరిశీలన అవసరం. కానీ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ప్రజలకు అందుబాటులో ఉంచబడలేదు. బదులుగా ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రదర్శనలపై ఆధారపడుతున్నట్లు కనిపిస్తోంది.ఇది ఒక కీలక ప్రశ్నను లేవనెత్తుతోంది: నది పక్కన నివసించే ప్రజల మాట వినకుండా నది పునరుద్ధరణ సాధ్యమా? ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో ప్రజా కమిటీ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ప్రజల ముందుంచాలని, ప్రజల భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ప్రాధాన్యతల మార్పు అవసరమా?
బాపూఘాట్ వద్ద ఆలయాలు, మసీదు, చర్చి వంటి మత నిర్మాణాల ప్రతిపాదనలు కూడా వివాదానికి దారి తీసాయి. “మత నిర్మాణాలు నదిని శుభ్రం చేయవు. పర్యావరణ పునరుద్ధరణ, పట్టణ ప్రణాళిక అవసరం” అని మేధావులు, పర్యావరణవేత్తలు కార్యకర్తలు అంటున్నారు.
నైట్ ఎకానమీ: అభివృద్ధి లేదా ప్రమాదం?
ప్రాజెక్టులో భాగంగా రాత్రి ఆర్థిక వ్యవస్థ (నైట్ ఎకానమీ)ను ప్రోత్సహించే ఆలోచనలు ఉన్నాయి. రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు, రాత్రి కార్యకలాపాలు పెరగవచ్చు. అయితే ఇది ప్రజారోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి జీవనశైలి జీవజాల గడియారాన్ని దెబ్బతీసి, మెటబాలిక్ వ్యాధులు, గుండె జబ్బులు, మానసిక సమస్యలు పెరగవచ్చు. ఇప్పుడు పబ్ రిసార్ట్స్ క్లబ్ లో రేవ్ పార్టీలు, డ్రగ్స్ మాదకద్రవ్యాలు, వ్యభిచారం, గూండాగిరీ పెచ్చుమీరి కాల్పులు శాంతిభద్రతలు దెబ్బతీసి తేటతెల్లమవుతుంది సంగతి తెలిసిందే. కాలుష్యంతో నిండిన నదిని ముందుగా శుభ్రం చేయాలా? లేక ముందే నైట్‌లైఫ్ కేంద్రంగా మార్చాలా?
గతం ఇచ్చిన పాఠాలు
మూసీ శుభ్రపరిచే ప్రయత్నాలు గతంలో ఎన్నో జరిగాయి. కానీ అవి విఫలమయ్యాయి. కారణం నిధుల కొరత కాదు సమన్వయం లోపం, విభజిత పాలన, పర్యావరణం కంటే అందంపై దృష్టి. వివిధ శాఖలు విడివిడిగా పనిచేయడం, పర్యవేక్షణ లోపం, ప్రజల భాగస్వామ్యం లేకపోవడం వల్ల తాత్కాలిక పరిష్కారాలే సాధ్యమయ్యాయి.
తీసుకోని మార్గం
నిజమైన పునరుజ్జీవనానికి నిపుణులు సూచించే మార్గం: మలినజలం ఒక్క చుక్క కూడా నదిలోకి వెళ్లకూడదు, శాస్త్రీయ విధానంలో స్లడ్జ్ నిర్వహణ, కాంక్రీట్ నిర్మాణాల కంటే సహజ పర్యావరణ పునరుద్ధరణ, నీటి నాణ్యతపై రియల్ టైమ్ పబ్లిక్ మానిటరింగ్, ప్రజల భాగస్వామ్యం మరియు బాధ్యత ఇవి లేకపోతే ఈ ప్రాజెక్టు మరొక ఖరీదైన ప్రయోగంగా మిగిలిపోవచ్చు. అనుభవం లేని కన్సల్టెంట్లపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రణాళికలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని కార్యకర్తలు అంటున్నారు. “ఎయిర్ కండీషన్డ్ గదుల్లో రిపోర్టులు తయారవుతున్నాయి. కానీ మూసీ నది ఇరుకైన వీధులు, బస్తీలు, నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల గుండా ప్రవహిస్తోంది,” అని బస్తీవాసులు భావిస్తున్నారు. మూసీ నది కేవలం నీటి మార్గం కాదు అది హైదరాబాద్ చరిత్ర, గుర్తింపు, పర్యావరణ స్థితిని ప్రతిబింబించే సూచిక. ఇప్పుడు ఒక స్పష్టమైన నిర్ణయం ప్రభుత్వం ముందుంది: జీవంతో నిండిన నదిలో పెట్టుబడి పెట్టాలా? లేక అలంకార కారిడార్‌తో సరిపెట్టాలా? ఈ నిర్ణయం మూసీ భవిష్యత్తును మాత్రమే కాదు నగర ఆరోగ్యం, సమానత్వం, స్థిరత్వాన్ని కూడా నిర్ణయిస్తుంది. (షేక్ బాబా, ప్రధాన కార్యదర్శి, ప్రజా సైన్స్ వేదిక, హైదరాబాద్)

