వరద బాధిత ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వ మైండ్ గేమ్!
వరద బాధిత ప్రజలకు సహాయం అమలు జరగకపోవడానికి ప్రజలదే బాధ్యతగా పౌర సమాజం దృష్టిలో చిత్రించే ప్రయత్నం జరుగుతోంది.
-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
వరదల బాధిత ప్రజలకు జరిగిన నష్టాల్ని అంచనా వేయడంలో, తానే స్వయంగా ప్రకటించిన సహాయ ప్యాకేజీని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి ఘోర వైఫల్యాలు జరిగాయి. వీటిని వెలుగులోకి రానివ్వకుండా కప్పిపెట్టే ప్రయత్నం మొదట జరిగింది. అది ముగిసిన అధ్యాయంగా చేయడానికి కూడా ప్రయత్నం జరిగింది. ప్యాకేజీని ప్రకటించిన వెంటనే తిరుపతి లడ్డూ కథ తెర పైకి రావడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టి ఒక్క దెబ్బకే దారి మళ్లడం దృష్టిలో ఉండాలి. అది ముగిసిన అధ్యాయంగా మార్చాలని మొదటి దశ మైండ్ గేమ్ సాగింది. అది బెడిసికొట్టింది. ఎన్యుమరేషన్ ప్రక్రియలో అన్యాయాలకి వ్యతిరేకంగా వరద బాధిత ప్రజల్లో నిరసన వెల్లువెత్తడం పాలకులకు మింగుడు పడలేదు. మొదర సింగ్ నగర్ ప్రాంత ప్రజలు శాసనసభ్యుల్ని ఉక్కిరిబిక్కిరి చేయడం, ఆ వెంటనే భవానీపురం ప్రాంత వరద బాధిత ప్రజలు ఏకంగా కలెక్టరేట్ కి భారీ ఎత్తున వెల్లువెత్తడం, ఆ తర్వాత ఆటో కార్మిక సంఘాలు ఐక్య ఆందోళనకి దిగడం వంటి వరసవారీ పరిణామాలతో అనూహ్యంగా ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైనది. ప్రజల్లో ప్రభుత్వం రాజకీయంగా అప్రతిష్ట పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. గత్యంతరం లేక ముగించిన అధ్యాయాన్ని తిరిగి తెరవక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో తిరిగి సమీక్షకు దిగింది. ఇప్పుడు మరో కొత్త రకం మైండ్ గేమ్ కి దిగింది.
ప్రభుత్వ పాలనాపరమైన ఘోర తప్పిదాల్ని సాంకేతిక పొరపాట్లుగా చిత్రించడానికి కొత్తగా మరో రకం మానసిక యుద్దాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా వరద బాధిత ప్రజలకు సహాయం అమలు జరగకపోవడానికి ప్రజలదే బాధ్యతగా పౌర సమాజం దృష్టిలో చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. వరద బాధిత ప్రజల్లో కేవలం మూడు శాతం మందికే సాయం అందలేదట. ఆ పిడికెడు మందికి అందక పోవడానికి కూడా బ్యాంక్ అకౌంట్స్ లో ఏర్పడ్డ లోపాలే కారణమట. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటితప్పులు లేవని కొత్త మైండ్ గేమ్ కి దిగింది. ప్రభుత్వం చేపట్టిన ఎన్యుమరేషన్ తప్పులతడక వంటిది. ముంపు ప్రాంతాలకి వెళ్లి ఏ నిస్పాక్షిక పరిశీలక బృందాలు వెళ్లి పరిశీలించినా వరద బాధిత ప్రజలకు జరిగిన ఘోరమైన అన్యాయాలు స్పష్టంగా అర్ధమౌతాయి. కానీ ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పదల్చుకుంది. ప్రజలకు ప్రజలే వరద సాయం అందకుండా చేసుకున్నట్లు పౌర సమాజం ఎదుట అది పబ్లిసిటీ చేయదల్చుకుంది. ప్రజల స్వయం కృతాపరాధం ప్రజలకు శాపంగా మారిందని చెప్పదల్చుకుంది. ఇది కన్నీటి వరద బాధిత ప్రాంతాల ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వ మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి అత్యంత వ్యూహాత్మక దృష్టితో జరుగుతోంది. ఈ మానసిక యుద్ధం పట్ల ప్రజా ఉద్యమ శక్తులలో అప్రమత్తత చాలా అవసరం. లక్షలాది వరద బాధిత ప్రజలకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజలతో కూడిన పౌర సమాజాన్ని నిలబెట్టి వారికి అన్యాయం చేసే మానసిక యుద్దాన్ని అధిగమించకుండా ప్రజలకు న్యాయం జరగదు. ఈ రెండోసారి సమీక్ష పేరిట మొక్కుబడిగా మూడు శాతం మందికి సాయం చేసి తిరిగి ముగిసిన అధ్యాయంగా మార్చే వ్యూహాన్ని గ్రహించి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రజా ఉద్యమ శక్తుల భుజస్కంధాలపై ఉంది. తస్మాత్ జాగ్రత్త!