నరేంద్రమోడీ, రేవంత్ రెడ్డి, రామోజీ రావు స్వయంకృషికి నిదర్శనం
x

నరేంద్రమోడీ, రేవంత్ రెడ్డి, రామోజీ రావు స్వయంకృషికి నిదర్శనం

మూడవసారి ప్రధాని అయిన మోడీ నుంచి, ఇటీవల కాలం చేసిన రామోజీరావు నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. తొలితరం నుండి ఎదిగి ఎదిగి పాత తరాలను అధిగమించి నూతన చరిత్ర సృష్టించారు.


మూడవసారి ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోడీ నుంచి, ఇటీవల కాలం చేసిన ఈనాడు రామోజీరావు నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. తొలితరం నుండి ఎదిగి ఎదిగి పాత తరాలను అధిగమించి నూతన చరిత్ర సృష్టించారు.

ప్రజా స్వామ్యంలో ఎలా ఎదగవచ్చో చెప్పడానికి నరేంద్ర మోడీ, మాయావతి, మమతా బెనర్జీ, ఈనాడు రామోజీరావు, దీరూబాయి అంబానీ, నిర్మా సబ్బు తయారీదారు కొన్ని ఉదాహరణలు మాత్రమే! వ్యక్తిత్వ వికాస గ్రంథాలు రాసినవాడిగా చెప్పదలుచుకున్నది ఏమంటే లక్ష్యం సూటిగా వున్నపుడు నిరంతరకృషి, సంకల్పబలం తోడైతే ఎలా ఎదగవచ్చో చెప్పడానికి అలెగ్జాండర్ విజయాలే కాదు, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి, మార్గదర్శి ఈనాడు రామోజీరావు, మాయావతి, మమతా బెనర్జీ, దీరూబాయి అంబానీ, అబ్దుల్ కలామ్ కూడా సమకాలీన ఉదాహరణలు!

ఎదిగిన వారి నుండి స్పూర్తి పొందకుండా విమర్శిస్తే తమ ఇగో తృప్తి పొందడానికో అలా ఎదగడాన్ని నిరుత్సాహపరచడానికో ఉపయోగపడుతాయి. ఏ పెట్టుబడిదారుడు, ధనవంతుడు, వ్యాపార వేత్త, పారిశ్రామిక వేత్త, రాజకీయ వేత్త అయినా ఇలానే ఎదుగుతారని “శక్తి యొక్క 48 సూత్రాలు,” కౌటిల్యుని అర్థశాస్త్రం, మార్క్సు రచనలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల విమర్శించాలనుకుంటే ఎన్నో దొరుకుతాయి. రామోజీరావు కమ్మ వర్గాన్ని పారిశ్రామిక వర్గంగా మార్వాడీ గుజరాతీలతో పోటీగా నిలిపే దశలో తన పాత్ర నిర్వహించాడు. ఎదిగిన వ్యక్తి నుంచి స్పూర్తి పొంది ఎదగడం అవసరం.

స్వయం కృషితో ఎదిగేవారి గురించి ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వవచ్చు. స్వయం కృషితో ఎదిగినవారికి అంబేద్కర్ ఒక గొప్ప ఉదాహరణ. ఆయన వేసిన బాటలో వేలాదిమంది రాజకీయ నాయకులయ్యారు, ఉన్నత అధికారులయ్యారు, విద్యావంతులయ్యారు, ఉపాధ్యాయులయ్యారు, పారిశ్రామికవేత్తలయ్యారు.

స్వయంకృషితో ఇళయరాజా, ఏఆర్ రహమాన్, చిరంజీవి, ఘంటసాల, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్, ఎందరో సినీ ప్రముఖులు, ఆటగాళ్లు, సాహితీవేత్తలు ఎదిగారు. అయితే మన దేశంలో నైపుణ్యాలున్నప్పటికీ కోట్లాది మందికి తొలి పెట్టుబడి లేక కూలీలుగా జీతగాల్లుగా ఉద్యోగులుగా మారుతున్నారు. దున్నేవారికి భూమి తొలి పెట్టుబడి! కులవృత్తులవారికి వారి నైపుణ్యాలే పెట్టుబడి. అందుకు ఆర్థిక పెట్టుబడి లేక ఇతరుల వద్ద ఎంప్లాయీ గా పని చేస్తున్నారు. పెట్టుబడి మార్కెటింగ్, వ్యాపార రంగాల్లో వారికి దారి చూపి ఉదాత్త లక్ష్యాల వైపు నడిపిస్తే ఎదుగుతారు. ఎంతైనా ఎదుగుతారు. లేదా ఎంతో కొంత ఎదుగుతారు.

రాజకీయాల్లో నరేంద్ర మోడీ... మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ వారసత్వ క్రమాన్ని అధిగమించి తొలి తరం నుండి మూడవ సారి ప్రధానిగా పదవి చేపట్టారు. దాని వెనక 1925 నుండి ఆర్ ఎస్ ఎస్ చేస్తున్న నిర్మాణ కృషి వుంది. అలా మోడీకి, బండారు దత్తాత్రేయకు తొలి పెట్టుబడిగా అదంతా ఉపయోగపడింది.

తొలి పెట్టుబడి లేని వారు విద్యనే తొలి పెట్టుబడిగా ఎంప్లాయీ గా ఎదుగుతారు. కొందరు కాల క్రమంలో మలుపు తీసుకొని ఎంప్లాయీ నుండి ఎంప్లాయర్ గా మారుతారు. అనగా పెట్టుబడి పై యాజమాన్యం సాధిస్తారు. విద్య విజ్ఞానం తో అంబేద్కర్ మానవ సమాజానికి గొప్ప దారి చూపారు.

స్వేచ్చ సమానత్వం సౌభ్రాతృత్వం, అందరికి సమాన అవకాశాలు, సమాన అవకాశాలు అందుకోవడానికి సమాన స్థాయికి తేవడం ప్రజాస్వామ్య కర్తవ్యంగా భావించారు. ఇలా తొలి పెట్టుబడి లేని వారికి ప్రభుత్వమే విద్య, ఉద్యోగం అనే తొలి పెట్టుబడి సమకూర్చాలి అని భావించారు. విద్య విజ్ఞానంతో, ప్రజలను నడిపించే శక్తితో మొత్తం పెట్టుబడిపై, మానవ వనరులపై ఎంప్లాయర్స్ గా ఎదిగారు లెనిన్ మావో. తొలి పెట్టుబడి పుట్టుకతోనే సమకూరిన వారి ఎదుగుదల మరో విధంగా సాగుతుంది. దీరూబాయి అంబానీ తొలి పెట్టుబడి సాధించాక ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల ఎదుగుదల వలె సాగుతుంది. రాజకీయాల్లో మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరుసలో సాగుతుంది. ఎంప్లాయీ క్రమంగా తొలి పెట్టుబడి దారులుగా, ఎంప్లాయర్ అవడం ఎలానో వామ పక్షాలు ప్రజలకు శిక్షణ ఇవ్వలేదు. దాంతో ఉద్యోగులు ఉద్యోగులుగానే వుండి పోయారు. నిరుపేదలకు మధ్య తరగతి తొలి పెట్టుబడి సమకూర్చడంలో భాగంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత గృహ వసతి సమకూర్చడం ప్రభుత్వాల/ అనగా ఎంప్లాయర్సు బాధ్యత అవుతున్నది.

అమెరికాలో కొన్ని దశాబ్దాలుగా విద్య నైపుణ్యాలు నూతన ఆవిష్కరణల ద్వారా తొలి పెట్టుబడి దారులు ఎదిగారు. అమెరికాలోని నేటి బిలియనీర్లలో 75 శాతం తొలి తరంగా ఎదిగినవారే. ఇండియాలో ఈ సంఖ్య పదిశాతం కూడా లేదు. కారణం ఏమిటి? మన విద్య ఎంప్లాయీగా మలిచే విద్య నేర్పుతున్నది. ఇన్నోవేటివ్ నూతన ఆలోచనలను రేకెత్తించే విద్యా విధానం లేక పోవడం, ఉద్యోగాలకు పరిమతమయ్యే దశ కొనసాగుతున్నది. అమెరికాలో పెట్టుబడిదారుల పిల్లలు సొంత సంస్థలు నిర్మించే క్రమంలో నష్టపోతే తల్లిదండ్రులు ఆదుకుంటే అలాంటి సంస్థలు మళ్ళీ నష్టపోయి దివాలా తీశారు. అనిల్ అంబానీ మనకొక ఉదాహరణ. ఇండియాలో “ప్రజాస్వామిక అర్థ శాస్త్రం“ రూపొందక పోవడం వల్ల తొలి పెట్టుబడిదారులుగా ఎదగాల్సిన విద్యా వైజ్ఞానిక నిపుణులు శాస్త్రవేత్తలు ఉద్యోగులుగా జీవిస్తున్నారే తప్ప ఎంప్లాయర్లుగా ఎదగడం లేదు.

డా. బి ఆర్ అంబేద్కర్ పెట్టుబడిదారీ అర్థశాస్త్రానికి భిన్నంగా, మార్క్సిస్టు అర్థశాస్త్రానికి భిన్నంగా “ప్రజాస్వామ్య అర్థశాస్త్రం” రూపొందించడం వీలు కాలేదు. రాజ్యాంగంలో కొన్ని మార్గదర్శకాలు పొందు పరిచారు. ప్రజాస్వామ్యంలో సామాన్య మానవుడు తొలి పెట్టుబడి దారుడుగా, అదే క్రమంలో ఆర్థిక దిగ్గజంగా ఎదిగినవారున్నారు. దీరూబాయి అంబానీ, మొదలుకొని ఈనాడు రామోజీరావుదాకా ఎందరినైనా ఉదహరించవచ్చు. కానీ ఈ ప్రాసెస్ ఒక ప్రజాస్వామ్యం అర్ధశాస్త్రంగా రూపొందించబడ లేదు. దళిత పారిశ్రామిక వేత్తలు ఎదగాలి అని చంద్రభాను ప్రసాద్ అనేక వ్యాసాలు రాశారు. దళితులు తమ జీవిత కాలంలో మిలియనీర్లు, బిలియనీర్లుగా ఎదిగారు. ఆ అనుభవాలు ప్రజాస్వామ్యం అర్థ శాస్త్రంగా మలచవలసి వుంది. అపుడే ఆర్థిక రంగంలో నిజమైన ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుంది. అంతదాకా ఎంత గొప్ప మేధావులైనా నిర్వహణ సామర్థ్యం గల వారైనా ఎంప్లాయీలుగానే ఉండి పోతారు. దానికి ఉదాహరణే అనేక అమెరికా కార్పోరేట్ సంస్థలకు ఇండియా మూలాలున్నవారు సిఈవోలుగా యండీలుగా కొనసాగడం చూడవచ్చు. మనం పెట్టుబడి దారీ అర్ధ శాస్త్రం, కౌటిల్యుని అర్ధ శాస్త్రం, మార్క్సు అర్ధ శాస్త్రం కు భిన్నంగా అంబేద్కర్ మార్గంలో రాజ్యాంగ లక్ష్యాలతో మనదైన “ప్రజాస్వామిక అర్థ శాస్త్రం“ రూపొందించుకోవడం అవసరం.

Read More
Next Story