నీరజ్, అర్షద్ జావలిన్ విద్వేష కారుమేఘాలను చెదరగొడితే...
పాకిస్తాన్లో కూడా కలకలం లేపిన నీరజ్ - అర్షాద్ ల విజయం! వారి తల్లుల, కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు ఎంత గొప్పగా ఉన్నాయి.
-దివి కుమార్
ఒలింపిక్ విజేతలు నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ పుట్టిన గ్రామాలలో ఒకరిది భారతదేశం (హర్యానా రాష్ట్రం) రెండవవారిది పాకిస్తాన్ (పంజాబ్ రాష్ట్రం) అయినప్పటికీ ఆ రెంటికీ నడుమ విజయవాడ - హైదరాబాద్ కంటే ఎక్కువ దూరం ఉండదు . రాజా రంజిత్ సింగ్ ఏలిక నాడు బహుశా ఆ రెండు గ్రామాలు ఒకే రాజ్యంలో భాగాలు అయి వుండవచ్చు. కానీ
అనేక రాజకీయ పరిణామాల ఫలితంగా అవి ఇప్పుడు రెండు దేశాలుగా ఏర్పడి, ప్రపంచస్థాయి క్రీడలలో విడివిడిగా ప్రాతినిధ్యం వహిస్తూ పోటీలు పడే పరిస్థితి! రాజకీయ ప్రయోజనాలకై ప్రజల నడుమ ఉన్మాదాలు రెచ్చగొట్టే ధోరణులు ఉండినప్పటికీ, నిజంగా క్రీడాకారుల మధ్య కూడా వైషమ్యాలు ఉంటాయా ?
అలాంటివి ఏమీ లేవని ప్రస్తుతం ఒలింపిక్స్ జావలిన్ (బల్లెం) విసురుడులో బంగారు, వెండి పతకాలను సాధించిన అర్షాద్ నదీం, నీరజ్ చోప్రాలు రుజుపరిచారు. అంతకంటే ఎక్కువగా వారి తల్లులు గొప్ప ఆదర్శమాతలుగా నిలిచారు. మిగిలిన వారి కుటుంబ సభ్యులు కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శించారు.
సరిగా సంవత్సరం క్రితం 27 ఆగస్టు 2023 నాడు హంగరీ రాజధాని బుడాబెస్టులో జరిగిన ప్రపంచ స్థాయి పోటీలలో కూడా వీరిరువురే బల్లెం విసురుడులో బంగారు, వెండి పతకాలు సాధించినప్పుడు నీరజ్ చోప్రా తల్లి తన కొడుకు తర్వాత స్థానంలో వెండి పతకం సాధించిన అర్షాద్ నదీంని కూడా తన కొడుకేనంటూ చేసిన ప్రకటన అప్పుడే చాలా మందిని ఆకర్షించింది. ఈసారి విశేషం ఏమిటంటే అర్షాద్ నదీం కుటుంబ సభ్యుల నుండి కూడా వచ్చిన ప్రతి స్పందన క్రీడా జగతికే ఒక ఆదర్శనీయంగా ఉంది.
నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి గత సంవత్సరం హంగరీ ప్రపంచ కప్ పోటీలలో తన కొడుకు స్థానం తర్వాత నిలిచి వెండి పతకం సాధించిన అర్షాద్ నదీమ్ కూడా తన కొడుకు లాంటి వాడే అని ప్రకటించినట్లే ఈసారి కూడా పునరుద్ఘాటించారు. "మాకు ఎలాంటి విచారం లేదు. రజిత పతకం కూడా మాకు బంగారమే. నా మరో బిడ్డ లాంటి అర్షాద్ దాన్ని పొందడం పట్ల పూర్తి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. నేను అతని కోసం కూడా దేవుని ప్రార్థించాను."
నదీమ్ తల్లి రజియా పర్వీన్ -- వారిరువురూ మంచి స్నేహితులని, నా బిడ్డలు లాంటివారేనoటూ నీరజ్ చోప్రాను పంజాబ్ రాష్ట్రంలోని తమ గ్రామానికి ఒకసారి వచ్చి వెళ్ళవలసిందిగా ఆహ్వానించారు.
నీరజ్ చోప్రా తండ్రి సత్యనారాయణ చోప్రా ఈ పోటీలు భారత పాకిస్తాన్ దేశాలకు కాదు అంటూ ఈ పోటీలు మన రెండు దేశాలను దగ్గరకు తెచ్చాయి అని అనగా, స్వయంగా నీరజ్ చోప్రా చేసిన ప్రకటన ఇంకా లోతైనది. ఈరోజు అర్షాద్ నదీoది. దాన్ని నేను ఆమోదించాలి. నాకు మంచి మిత్రుడయిన అర్షాద్ దాన్ని సాధించినందుకు నాకు సంతోషంగా ఉంది. ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలలో మా ఇరువురి విజయం, ఈ రెండు దేశాల క్రికెట్ కు పట్టిన గ్రహణాన్ని పోగొట్టవచ్చు!
అర్షాద్ నదీమ్ కు పాకిస్తాన్ ప్రభుత్వం వైపు నుండి వారి ఒలింపిక్ స్పోర్ట్స్ అథారిటీ నుండి లభించిన సహాయ సహకారాలు చాలా తక్కువ అని చెప్పాలి. అతను చాలా పేద కుటుంబంలో పుట్టాడు. తండ్రి అష్రాఫ్ తాపీ పని చేస్తూ ఎనిమిది మంది సంతానాన్ని పోషిస్తూ అర్షాద్ నదీమ్ ని ఆటల పోటీలకు ప్రోత్సహించాడు. నేను కూలి పనులు చేసుకుంటూనే నా కొడుకుని ఇంకా పోషించుకోగలను అనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు.
ఆయన పెద్ద కొడుకు, అర్షాద్ నదీమ్ అన్న అయిన షాహిద్ నదీమ్ విలేకరుల ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, నీరజ్ చోప్రా మా ఆహ్వానాన్ని స్వీకరించి మా ఊరు వస్తే విమానాశ్రయం నుండి మా ఇంటి దాకా గొప్ప స్వాగత సత్కారాలతో వెంట పెట్టుకు వస్తాము అన్నాడు.
అర్షాద్ నదీమ్ నీరజ్ చోప్రా తల్లి మాటలకు చాలా చలించి పోయాడు.
"ఒక తల్లి ప్రతి ఒక్కరికీ తల్లి. కాబట్టి ఆమె అందరి కోసం ప్రార్థిస్తుంది. నీరజ్ చోప్రా తల్లికి నేను కృతజ్ఞుడను. వో భీ మేరీ మా హై (ఆమె కూడా నా తల్లి). ఆమె మా కోసం ప్రార్థించింది. దక్షిణాసియాకు చెందిన ఇద్దరు క్రీడాకారులమైన మేము మాత్రమే ప్రపంచ వేదికపై ప్రదర్శన ఇచ్చాం" అని స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత నదీమ్ పాక్ మీడియాతో అన్నాడు.
చాలా సంస్కారవంతంగా, ఉన్నత మానవీయ ప్రమాణాలతో కూడిన పై స్పందనలు భారత పాకిస్తాన్ దేశాల సాధారణ ప్రజల నుండి వ్యక్తమైనవిగా మనం భావించాలి. అయితే పాలకులకు అలా ఉండదు. వారు తమ ఆర్థిక రాజకీయ సంక్షోభపు సమస్యల నుండి తప్పించుకోవడానికి , ప్రజలను పక్క దారి పట్టించడానికి మతోన్మాదాలను, అన్య దేశీయుల పట్ల విద్వేషాలను రెచ్చగొడతారు. వాటిని కనీసం రాజకీయ స్థాయిలోనైనా మిగల్చకుండా, సరిహద్దుల పరిధిని అధిగమించగల క్రీడలకు, సాంస్కృతిక కార్యకలాపాలకు, సాహిత్యాలకు కూడా రుద్దుతారు.
ప్రస్తుత మన పరిస్థితులలో భారత పాకిస్తాన్ ల నడుమ జరిగే క్రికెట్ పోటీల సందర్భంగా చెలరేగే ఉన్మాదాలు, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమైన తత్వాలుగా మనకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు క్రీడాకారులు, నీరజ్ చోప్రా, అర్షాద్ నదీమ్ లు క్రికెట్ పేరుతో కమ్ముకున్న విద్వేషపూరిత కారు మేఘాలను జావలిన్ బల్లెంతో చెల్లా చెదురు చేయాలని ప్రయత్నిస్తే మంచిదే!
అయినా ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ క్రీడలలో బహుమతులు సంపాదించడం వేరు, ఉపఖండంలోని అభివృద్ధి నిరోధక ప్రభుత్వాల నిరంకుశ విధానాలతో పోరాడటం వేరు.
వినేష్ ఫోగట్ తదితరులు కేవలం పారిస్ ఒలంపిక్ వేదికపైనే కాదు, భారత రెజ్లింగ్ సమాఖ్య పైనా, ప్రభుత్వ విధానంపైనా గతంలో పోరాడారు . సమాఖ్య ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఏడాదిపాటు వీధుల్లోకి వచ్చి పోరాటంచేసినా వారికి తగు న్యాయం జరగలేదు. భాజపా పాలకుల బేటి బచావో నినాదం లోని పరవంచన ఎలాంటిదో దేశ ప్రజలకు అర్థమైంది.
అసలు విషయానికి వస్తే... ఈ ఉన్మాద రాజకీయ నాయకులు లాగానే క్రీడాకారులు కూడా తమ నడుమ విద్వేషపూరిత సంబంధాలనే కొనసాగిస్తారా? అంటే కాదు అని కొన్ని ఉదాహరణలు స్పష్టం చేస్తాయి.
ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ గా ఉండిన ఇమ్రాన్ ఖాన్, భారత ఆటగాడు నవజ్యోతి సింగ్ సిద్ధు నడుమ స్నేహం కొద్దిగా ఎక్కువగా ఉండేది. ఇమ్రాన్ ఖాన్ 2018 లో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు, నవజ్యోత్ సింగ్ సిద్దు ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంలో వారి స్నేహం గురించి ప్రజలు ఎక్కువగా చెప్పుకున్నారు. వారి క్రికెట్ కెరీర్ సమయంలో వారు ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, వారి మధ్య పరస్పర గౌరవం, స్నేహం ఉండేది.
2019 నవంబర్‌లో సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ పుట్టిన పాకిస్తాన్లోని కర్తార్‌పూర్ గ్రామంలో ఉన్న గురుద్వారాను (కర్తార్‌పూర్ సాహిబ్) వీసాలు లేకుండా నేరుగా సందర్శించడానికి కారిడార్ (Kartarpur Corridor), ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉండగా ప్రారంభించబడింది. ఇది పంజాబ్, భారతదేశంలోని డేరా బాబా నానక్ అనే ప్రాంతం నుండి పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ ను కలుపుతుంది. ఆ క్యారిడార్ ద్వారా గురునానక్ జన్మస్థలoలోని గురుద్వారాను భారతదేశo నుండి భక్తులు నేరుగా సందర్శించుకోవచ్చు. ఆ సందర్భంగా సిద్ధూ కూడా ఇమ్రాన్ పక్కనే నిలబడి దాని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పర్యవేక్షించాడు .
2003 వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఒక సందర్భంలో ఒక బృందంలో సభ్యునిగా నేను కూడా పాకిస్తాన్ వెళ్లినప్పుడు, ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ ముబషీర్ హసన్ ను లాహోరులోని ఆయన నివాసంలోనే కలుసుకున్నాము. లాహోరు అసెంబ్లీ హాలుని చూడాలనే మా ఆసక్తిని పట్టించుకుని, ఎవరితోనో మాట్లాడి మమ్ములను అక్కడికి పంపించారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంలో క్రీడల శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న షహబాజ్ అహ్మద్ అక్కడ మా కోసం ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ హాలును చూసిన తరువాత మాతో కొంతసేపు ఆయన ముచ్చటించారు. అప్పుడు తెలిసింది, ఆయన పాకిస్తాన్ హాకీ బృందంలో ఒకనాటి క్రీడాకారుడు అని! ఆయనను నేను అడిగాను ‘భారత పాకిస్తాన్ హాకీ క్రీడాకారుల నడుమ ఎలాంటి సంబంధాలు ఉండేవి,’ అని?
"ఆట ఆటే!! మైదానంలో నుండి బయటకు వస్తే అందరం స్నేహితులమే! అందులో ఇతర దేశాల క్రీడాకారులు ఎవరితో కన్నా భారతీయులతో మాట్లాడుకోవటం చాలా సులువు. భాష కారణంగా, పాత కొత్త సినిమాల నుండి జోకుల దాకా అనేక ముచ్చట్లు పంచుకోవడం భలే మజాగా ఉంటుంది. అందుచేత బాగా కలిసి పోయే వాళ్ళం. క్రీడాకారులు ఒకరే కాదు. ఇతర దేశాలలో జీవించే భారత పాకిస్తాన్ వాసులందరి మధ్య కూడా ఇలాంటి స్నేహపూరిత వాతావరణమే ఉంటుంది," ఇవి షహబాజ్ అహ్మద్ చెప్పిన మాటలు.
ఉన్మాదాలు విద్వేషాలు పెంచడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూసే వారికి ఇవి నచ్చవు. అర్షాద్ నదీమ్, నీరజ్ చోప్రాల ఉదంతం భారత పాకిస్తాన్ప్రజల నడుమ సహోదర సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక దారి చూపుతాయేమో వేచి చూద్దాం!!