చంద్రబాబు ‘అమరావతి’ భాషలో కొత్త పదాలు
x

చంద్రబాబు ‘అమరావతి’ భాషలో కొత్త పదాలు

రాజధాని నిర్మాణానికి అప్పు ఇచ్చామన్న పేరుతో, రుణం తీరేదాకా 29 ఏళ్ళపాటు ‘ప్రపంచ బ్యాంక్’ అమరావతిని పర్యవేక్షిస్తుందా?




చివరికి పదకొండో ఏట గాని ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయం గాడిన పడలేదు. అందుకు కారణం బాబు గెలవడం కాదు. విభజన చట్టంలోని పదేళ్ళ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు తీరింది. దాంతో ఇప్పుడు ఎవరైనా ‘అమరావతి’ గురించి బహిరంగంగా మాట్లాడడానికి వీలు కుదిరింది. మరి గడచిన పదేళ్ళు జరిగింది ఏమిటి అంటే, మళ్ళీ వెనక్కి వెళ్లి జరిగింది తవ్వుకోవడం వృధా ప్రయత్నం, కాలహరణం. ఎందుకంటే, ‘ఒక పొరపాటుకు యుగములు పోగిలేవూ...’ అని పాట పాడుకోవడం ఒక్కటే మనకు అక్కడ మిగిలింది.

రాష్ట్ర విభజన తర్వాత ‘మోడీ-బాబు మిక్స్’ 2024 ఎన్నికల్లో మరోసారి కలిసి ప్రభుత్వం పట్టాలెక్కినా ఇప్పటి ఏపి మాత్రం ఇకముందు ప్రత్యేకం. కారణం ఇక్కడ మధ్యలో ఐదేళ్ళు జగన్ వైఎస్సార్ సీపి ప్రభుత్వం సాగించిన స్వతంత్ర ‘పబ్లిక్ పాలసీ’. అది ఇప్పుడు మోడీ-బాబు బాటకు కొత్త బంధకం అయింది. ఆ మాట మనం ఎవరినో అనడం కంటే, అదేదో ‘వరల్డ్ బ్యాంక్’ ఇండియా డైరక్టర్ అగస్టే టానో కొమి (Auguste Tano Kouamé) చెప్పింది వినడమే మంచిది.

బిజెపి, జనసేనతో కలిసి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసాక, 2024లో ‘అమరావతి’ విషయంలో చంద్రబాబు ఆచితూచి అడుగులు కదుపుతున్నారు. బాబు గత పరిపాలనా పద్దతికి ఇది భిన్నం కావడానికి గడచిన ఐదేళ్ళలో ప్రభుత్వ వ్యవస్థల్లో జరిగిన నిర్మాణపరమైన మార్పులు కారణం కావొచ్చు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ రెండవ వారంలో డిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ను కలిసి ‘ప్రపంచ బ్యాంక్’ అప్పు విషయంలో ఆ శాఖ సహకారం కోరారు. సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉన్న కాలంలో బాబు 2014-19 మధ్య కేంద్రాన్ని ‘బై పాస్’ చేసి మరీ ‘సింగపూర్ కాన్స ర్టియం’ అంటున్న రోజుల్లో, ఇదే జై శంకర్ విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి. రాష్ట్ర స్థాయిలో ఒక ముఖ్యమంత్రి విదేశీ ఒప్పందాలు అంటూ తీసుకుంటున్న స్వేఛ్చను ఆ శాఖ కార్యదర్శిగా ఆయన గమనించకుండా ఉండే అవకాశం లేదు.

జగన్ సిఎం అయ్యాక, ‘అమరావతి’ విషయంలో రాజకీయంగా తమ పార్టీకి ప్రయోజనం ఉండే విషయాలు వరకూ అసెంబ్లీలో చెబితే చెప్పి ఉండవచ్చు. కానీ, ఇటువంటి విషయాల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో విషయాలు ఏమిటో అవి బయటకు తెలిసే అవకాశం లేదు. మున్ముందు రావొచ్చు. కారణాలు ఏమైనా కావొచ్చు కానీ బాబు మాత్రం ఇప్పుడు అమరావతి విషయంలో ‘రిస్క్’ తీసుకోకుండా, ‘సేఫ్’ పద్దతి అనుసరిస్తున్నారు.

ప్రపంచ బ్యాంకును రాష్ట్ర ప్రభుత్వం అప్పు అడిగారు. రాజధాని అమరావతి 217 చ.కి.మీ. వైశాల్యంతో 2050 నాటికి 3.5 మిలియన్ల మందికి ఆవాసం కల్పించే విధంగా నిర్మిస్తామని, ప్రస్తుత అమరావతి జనాభా ఒక లక్ష ఉంటుందని తెలియచేసారు. భారత ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంకును అమరావతి అభివృద్దికి సహకరించమని కోరింది. దాంతో డిసెంబర్ 20న ప్రపంచ బ్యాంక్ అప్పు మంజూరు విషయం బ్యాంక్ కంట్రీ డైరక్టర్ అగస్టే టానో కొమి ఒక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు.

అందులో- “నగరీకరణతో జరిగే రూపాంతర ప్రక్రియకు ఇది నమూనా కానుంది కనుక, దీని డిజైన్ల తయారీ కోసం ప్రపంచలోని మేలైన నిపుణులను తీసుకువస్తాము, వాళ్ళు నగరాల్లో ఉండాల్సిన సంస్థలను గుర్తించి వాటి ద్వారా రేపు స్త్రీలు, యువత, దుర్భలులకు (Vulnerable group) ఆర్ధికపరమైన అవకాశాలు కల్పించే విధంగా వాటిని రూపొందిస్తారు. ప్రపంచ బ్యాంకు ఈ ‘ప్రాజెక్టు’ పని చేసేటప్పుడు స్థానిక సమూహాలతో నిరంతరం సంభాషణ బ్యాంకు కొనసాగిస్తుంది, ఇక్కడ (అమరావతి) జరిగే కార్యకలాపాలు స్థానిక సమాజాల ఆర్ధిక పరిపుష్టికి దోహదపడాలి...”

ఇలాంటి పదాలు ఇన్నాళ్ళూ మనకు తెలిసిన ‘అమరావతి’ భాషకు పూర్తిగా భిన్నమైనది. ఈ ధోరణి చూసాక, అస్సలు ఈ బ్యాంక్ కంట్రీ డైరక్టర్ నేపధ్యం ఏమిటని వెతికినప్పుడు, ప్రపంచ బ్యాంకులో పట్టణ అభివృద్ధి విభాగంలో అగస్టే బలమైన విషయ పరిజ్ఞానమున్న ఆర్థికవేత్త అని తేలింది.

ఆ మాటలు డిసెంబర్ 20న ‘పి.టి.ఐ,’ వార్తలో చూస్తే స్పష్టంగా మనకు అర్ధమవుతుంది. బ్యాంకు- ‘అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ కోసం 800 మిలియన్ డాలర్ల అప్పు మంజూరు చేస్తూ, అగస్టే పేరుతో వెల్లడించిన ఆ ప్రకటనలో ఉపయోగించిన పదాలు, విషయ అంతర్యం బాబు సహజ పాలనా శైలికి భిన్నంగానూ కొంతమేర ఆసక్తికరంగా కూడా వున్నాయి. బాబు ‘అమరావతి’ భాషలో మునుపెన్నడూ లేని కొత్త పదాలు అందులో కనిపించాయి.

ఇప్పుడు కొత్తగా ఇవి ఎందుకు వచ్చాయి, అంటే ఈ మధ్యలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలన ‘టేబుల్స్’ను అడ్డంగా తిప్పేసింది. దాన్నే తెలుగులో కధ అడ్డం తిరిగిందని అంటారు. టిడిపి ప్రభుత్వం మొదటి ఐదేళ్ళు అమరావతి విషయంలో ‘బ్యురోక్రసీ’ని బొత్తిగా లెక్కలోకి తీసుకోలేదు. శివరామ కృష్ణన్ కమిటీ రిపోర్టును పక్కన పెట్టడంతో ఆ నిర్లక్ష్యం మొదలయింది. ఒక దశలో అయితే, ఒక సినిమా డైరక్టర్ తో కూడా సంప్రదించారు. ప్రధానిగా మోడీకి మొదటి టర్మ్ అయితే, ‘చిన్న రాష్ట్రానికి పెద్ద సిఎం’ అన్నట్టుగా ఉండేది అప్పటి బాబు పరిస్థితి. దాంతో రమ్మని పిలిస్తే... మోడీ వచ్చి శంకుస్థాపన చేసి వెళ్లారు.

ఆ తర్వాత ‘రాజధాని’ విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న అధికారిక అంశాలు ఏవీ పైకి కనిపించేవి కాదు. ఆ కాలంలో గరిష్ట స్థాయిలో గందరగోళం నడిచింది. సింగపూర్ తో ఒప్పందం అన్నారు. తర్వాత అది ప్రభుత్వంతో కాదు ‘ప్రైవేట్’ అన్నారు. ఏవేవో కొత్త పద్దతులు చెప్పేవారు. అప్పటికి అవి ఇక్కడి ‘సిస్టం’లో ఉన్నవి కాదు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ (ఆయన అవినీతి నేరాలతో జైలు కెళ్లారు) పేరు చెప్పేవారు. ఆ కాలంలో డిల్లీ నుంచి, కేంద్ర పట్టణాభివృద్ది శాఖ సెక్రటరీ ఎవరూ వచ్చి ఇక్కడ ఏమి జరుగుతున్నది అని అడిగిన పాపాన పోయింది లేదు.

మళ్ళీ... ఆ శాఖ మంత్రి ఇక్కడివారే... ఈ మధ్యలో బాబు ఇటలీ కంపెనీ నార్మన్ ఫోస్టర్ డిజైన్లు అనేవారు. ఇక్కడి హోటళ్ళలో జరిగే భేటీలో ఆయనే స్వయంగా వాళ్లు తెచ్చిన నమూనాలు చూసి, ఆ కంపెనీ ప్రతినిధులకు సూచనలు చేసేవారు. ఈ కాలంలో ప్రభుత్వం నుంచి ఒక్క ‘బ్యూరోక్రాట్’ మీడియా ముందుకు వచ్చి ‘అమరావతి విషయంలో ఇది జరుగుతుంది’ అని దాన్ని ‘ఓన్’ చేసుకున్నది లేదు. ఇదంతా అయ్యేసరికి 2018 ఆఖరు అయ్యింది. వెంటనే ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది.

బాబుకు భిన్నంగా జగన్ తమ పార్టీ ప్రభుత్వం పరిపాలన ‘బ్యురోక్రసీ’కి అప్పగించడంతో, వాళ్ళు పైన రాష్ట్ర సచివాలయం నుంచి క్రింద గ్రామ సచివాలయాల దాకా తమ ‘నెట్ వర్క్’తో బిగించి, పరిపాలనలో రాజకీయ జోక్యాన్ని నిలువరించారు. అందుకు నిరుత్సాహపడిన స్వంత శ్రేణుల పార్టీ విశ్వాసం సన్నగిల్లి ఉంటే ఉండవచ్చు. ఆ విషయం ఎన్నికల్లో ఓటమిగా ఎదురుగా కనిపిస్తూనే ఉంది. అయితే, అధికారులు తమకు అందివచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదలకుండా తమకున్న ‘స్టీల్ ఫ్రేం’ పేరును వారు సార్ధకం చేసుకుంటూ, ఎక్కడికక్కడ వ్యవస్థల్ని బిగించేసారు. పైగా ఈ ఐదేళ్ళలో అదనంగా మరో 13 జిల్లాలు వాళ్ళు సృష్టించారు.

ఆ ఐదేళ్ళలోనే మనం కూడా చూసాము కదా, ‘అమవరావతి’ భూములు పేరుతో, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డితో ఈ అధికారులు ఏకంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు లేఖ రాయించి, దాన్ని బహిరంగం చేసారు. అంతేనా, UNDP ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ (Sustainable Development Goals) ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు చేసి, పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, వ్యవసాయం, వంటివి ‘పబ్లిక్ పాలసీ’ చేయగలిగారు.

అయితే చంద్రబాబు ‘పొలిటికల్ ఎడ్మినిస్ట్రేషన్’ పూర్తిగా ఇందుకు భిన్నమైంది. బాబు పాలనలో రాజకీయులకు ఉండే ‘వొదులు’ (‘లూజ్’) ఎక్కువ. దాన్ని బిగిస్తూ జగన్ ప్రభుత్వంలో పూర్తిగా ‘టైట్’ చేయడం చూసాక, దాన్ని- ‘విధ్వంసం’ అని ప్రచారం చేసారు. పైగా ఓట్ల కోసం జగన్ కూడా ‘నా పేదలు...’ అంటూ ఎక్కువగా మాట్లాడేవాడు. ఒకపక్క ప్రక్షాళన జరుగుతున్న క్రమంలోనే జగన్ పార్టీ నాయకులు కూడా మరో ఎలక్షన్ కోసం ‘సిద్దపడి’ ఉండవచ్చు. ఏ పార్టీ ప్రభుత్వం అయినా అది కొత్త ఏమీ కాదు, కానీ ఈ కాలంలో ‘సిస్టమ్స్’ను లీకేజీ లేకుండా బిగించడం ఒక గ్రూపు మీడియా పెద్ద ఎత్తున తప్పుపట్టింది.


‘వరల్డ్ బ్యాంక్’ ఇండియా డైరక్టర్ అగస్టే టానో కొమి

అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు తర్వాత కూడా కొన్ని పత్రికలు ‘వైసీపి అధికారులు’ అని ఇంకా కొందరి గురించి రాయడం అందుకే. ఈ గత నేపధ్యం అంతా ఇప్పుడు ఇక్కడ చెప్పడం ఎందుకు అంటే, అది ప్రస్తుత అంశానికి ఎంతైనా అవసరం.


మరింత ఆసక్తితో వెతికితే, అగస్టే రాస్తున్న వ్యాసాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పట్టణాభివృద్దికి సంబంధించిన ఆధునిక భావనలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఇది చూసాక, పదేళ్ళ క్రితం బాబు ప్రభుత్వం పక్కనపెట్టిన రాజధాని ఎంపిక కమిటీ శివరామకృష్ణన్ రిపోర్టు ప్రతిపాదించిన సమ్మిళిత వృద్ది (‘ఇంక్లూజివ్ గ్రోత్’) స్ఫూర్తి ‘అమరావతికి’ కి అప్పిస్తున్న ప్రపంచ బ్యాంకు డైరక్టర్ రూపంలో మళ్ళీ ఇలా అది రాష్ట్రంలోకి ప్రవేశించినట్లుగా చూడాలి.

గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో 1,135 ఎకరాల్లో- 'పేదలు అందరికీ ఇళ్ళు' పథకంలో చేపట్టిన 48, 218 గృహాల నిర్మాణం అడ్డుకుంటూ, సామాజిక సమతౌల్యం దెబ్బతింటుంది అని అప్పట్లో కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో, అప్పిచ్చిన అగస్టే మాటల్లో- ‘అమరావతి’ నిర్మాణం తమ పర్యవేక్షణలో జరుగుతుంది అనే సూచనలు స్పష్టంగానే కనిపించాయి. దానర్ధం ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ ‘ప్రాజెక్టు’ ఆగదు అనేది ఒక అంశం అయితే, ఇటువంటి వాటికి మేము అప్పు ఇచ్చేప్పుడు, ‘షరతులు వర్తిస్తాయి...’ అనేది కూడా అందులో ఇమిడి ఉంది.

ఇక్కడ వ్యక్తులు ఎవరు? అనేదానికంటే, ‘ఎప్పుడు?’ ‘ఎక్కడ?’ అనేది ప్రధానం అవుతుంది. బాబు కాలంలో 2004 నాటికి ‘కంప్యూటర్లు’ ప్రభుత్వ కార్యాలయాలకు రావడం నిజమే. కానీ, రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లకు 2024 వచ్చేసరికి, అదే బాబు తెచ్చినవి అంటున్న ‘కంప్యూటర్ల’లోకి జగన్ ‘పబ్లిక్ పాలసీ’ కొత్త ‘సాఫ్ట్ వేర్’గా వచ్చి కూర్చుంది. దాన్ని- ‘విధ్వంసం’ అనాలి అంటే అనుకోనిద్దాం. దానికి అభ్యంతరం ఎందుకు? కానీ ‘ఇక్కడ’ ‘ఇప్పుడు’ వచ్చిన ‘మార్పు’ ఎటువంటిదో అర్థమయితేనే, ఎవరికైనా ఇకముందు కాలు కదపడం సాధ్యమవుతుంది.

ఆగస్టు 2022 నుంచి కంట్రీ డైరక్టర్ గా పనిచేస్తున్న అగస్టే వరల్డ్ బ్యాంక్ పర్యవేక్షిస్తున్న యు.ఎన్.డి.పి. నిర్దేశించిన- 'సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్' ప్రోగ్రామ్ క్రింద ఆంధ్రప్రదేశ్ లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల ప్రగతి ఎలా ఉందో స్వయంగా చూడడానికి తన బృందంతో 2023 మార్చి 27-28 తేదీల్లో కృష్ణాజిల్లాలో వణుకూరు, గుంటూరు జిల్లాలో వడ్లమాను గ్రామాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన కలిసారు. బ్రిటిష్ పాలనలో 200 ఏళ్ళపాటు వున్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తన నూతన రాజధాని ‘అమరావతి’ నిర్మాణం పేరుతొ, అప్పు తీర్చాల్సిన 29 ఏళ్ళపాటు ‘ప్రపంచ బ్యాంక్’ పర్యవేక్షణలోకి వెళ్ళడంలో చంద్రబాబు పాత్ర అయితే, కీలకమే కాదు, అది చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది.

(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రచయిత సొంత అభిప్రాయాలు. ‘ది ఫెడరల్’ వాటిని సమర్థించాల్సిన అవసరం లేదు.)

Read More
Next Story