దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఆర్థిక వనరులు, సహజ వనరులు దోపిడికి గురై, భారత ప్రజలు బానిసలుగా మగ్గుతున్న సమయంలో జాతీయ నాయకుల త్యాగాల ఫలితంగా దాస్య శృంఖలాలను తెంచుకొని దేశం 1947 ఆగస్టు 15 స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న సమయం. రజాకార్ల రూపంలో ఉన్న రాక్షసులను నిర్మూలించడం, హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేయడంలో అతి ముఖ్య పాత్ర పోషించింది దేశ ప్రథమ ఉప ప్రధాని, హోం మంత్రి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ ఝవేర్‌భాయ్ పటేల్. దేశప్రజలు అసంఖ్యాక భారతీయ సైనికులతో పాటు స్థానిక తిరుగుబాటుదారులు, సర్దార్ పటేల్ కు రుణపడి ఉన్నారు. పటేల్ కారణంగానే భారత్ నేడు దృఢమైన దేశంగా నిలుస్తున్నది. చరిత్రే భవిష్యత్తుకు బలమైన పునాది, పునాది లేకుండా కట్టడం మనుగడ సాగించలేదు. గతం లేకుండా వర్తమానం, భవిష్యత్తు ఉండదు. సర్దార్ పటేల్ అందించిన అపూర్వమైన సహకారం దేశ చరిత్ర పుటల్లో కనుమరుగయింది
అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ చేసిన ప్రకటన ప్రకారం సంస్థానాలన్నీ యూనియన్ లో కలవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చు, కాకుంటే పాకిస్తాన్ తో కూడా కలవ వచ్చు అని స్వేచ్ఛనివ్వడం. సర్దార్ వల్లభ్‌భాయ్ ఝవేర్‌భాయ్ పటేల్, విశ్వాసపాత్ర కార్యదర్శి, ప్రముఖ ఐ సి ఎస్ అధికారి వి పి మీనన్‌లకు ప్రావిన్స్లను ఏకం చేసే బాధ్యత అప్పగించారు. అద్భుత వ్యూహంతో సర్దార్ పటేల్, మీనన్ అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసారు. ఒక సంవత్సరంలోనే 562 సంస్థానాలు భారతదేశంలో విలీనానికి అంగీకరించాయి . నిజాం సంస్థానం, జమ్ము కాశ్మీర్, జునా ఘడ్ , త్రిపుర సంస్థానాలు మాత్రం యూనియన్‌లో కలవడానికి తిరస్కరించాయి.
నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాజ్యం పాకిస్తాన్లో కలుస్తుందని ప్రకటించారు . హైదరాబాద్ అతిపెద్ద రాచరిక రాష్ట్రం మాత్రమే కాదు, మొత్తం భౌగోళిక ప్రాంతం యునైటెడ్ కింగ్‌డమ్ కంటే పెద్దది. నాటి హైదరాబాద్ రాష్ట్రం ప్రస్తుత మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ వంటి అనేక రాష్ట్రాలకు వ్యాపించి ఉంది. హైదరాబాదును ప్రత్యేక దేశంగా, కాకుంటే కనీసం పాకిస్తాన్‌లో విలీనం చేయాలని విశ్వప్రయత్నం చేసిన నిజాం పన్నాగాలను పటేల్ బద్దలు కొట్టారు. ఐక్యరాజ్య సమితికి భారతదేశంపై ఫిర్యాదు చేయడానికి నిజాం ప్రధాని లాయక్ అలీ నాటకాలు పటేల్ ఎదుట పనిచేయలేదు.. “ఆపరేషన్ పోలో” సైనిక చర్య విజయవంతం కావడానికి అప్పటి భారత హోంశాఖా మంత్రి సర్దార్ పటేల్ కృషి అపారం. పటేల్ రాజకీయ చతురతతో నిజాం పాలనకు చరమగీతం పలికారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం సంస్థానంలో మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్యాన్నిసొంతంచేసుకునే ప్రయత్నం మొదలిడ గానే, రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటాలు ఉధృతమయ్యాయి. రజాకర్ దళాల దురాగతాలకు అంతుండేదికాదు. రైతులు పండించిన పంటలుకూడా దక్కనిచ్చేవారు కాదు. భారీ ఎత్తున మహిళలు మానభంగాలకు గురయ్యారు. ఉద్యమకారులు చిత్రహింసలకు గురయ్యారు.
ప్రజలు తిండిలేక అలమటిస్తే పట్టించుకొనేవారు కాదు. నిజాంను ఎదిరించినందుకు బైరాన్‌పల్లిలో అనేక మందిని కాల్చి చంపారు, నిర్మల్‌లో భారీగా ఉరితీశారు, గాలిపెల్లిని తగుల బెట్టారు. ఇలాంటి సంఘటనలు అనేకం. రజాకార్ల అరాచకాలు అనేకం. సంస్థాన ఉద్యోగాల్లో స్థానికులను కాకుండా ఉత్తర భారతం నుండి అపాకీలను రప్పించి నియమించారు. అదే సమయంలో హైదరాబాద్‌లో కూడా తిరుగుబాటు మొదలైంది. దౌర్జన్యాలకు పాల్పడుతున్న నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, జాతీయవాదులు అందరూ ఏకమయ్యారు.. నిజాం నుంచి హైదరాబాద్ విముక్తి కోసం సంస్థాన ప్రజలు చేసిన వీరోచిత పోరాటాన్నే తెలంగాణ విమోచనోద్యమం అన్నారు.
“ఆపరేషన్ పోలో” కి 76 సంవత్సరాలు
ఆపరేషన్ పోలో విజయవంతమై ఈ రోజు 77వ సంవత్సరంలోకి ప్రవేశించింది. రజాకార్ల రూపంలో ఉన్న రాక్షసులను నిర్మూలించడం, హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేయడం . వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామిక వాదుల, రచయితల, ప్రజల సంఘటిత -పరిణామ పోరాటం. ఇది ధర్మయుద్ధానికి తక్కువ కాదు. చివరి వైస్రాయ్ లార్డ్ లూయిస్ ఎడ్వర్డ్ మౌంట్ బాటెన్ హైదరాబాద్ రాష్ట్రం విలీనానికి ఎలాంటి బలాన్ని ఉపయోగించటానికి అనుకూలంగా లేడు. ఆంతేకాక, అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకున్నాడు.
ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఆమోదించినా, సర్దార్ పటేల్ పూర్తిగా అంగీకరించలేదు. సైనిక చర్య లేకుండా హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేయడం అసాధ్యం అని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ ప్రక్రియలో భారత సైన్యం హైదరాబాద్ సరిహద్దుల వెలుపల మజిలీ చేసి ఉంటుంది. హైదరాబాద్‌లో అత్యధిక సంఖ్యలో పోలో మైదానాలు ఉన్నందున, ఈ సైనిక బలగాన్ని పోలో మైదానాలలో బసచేసి ఉంచిన కార్ణంగా సైనిక్ చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. ఈ ప్రకటనకు ముగ్గురూ అంగీకరించారు. హైదరాబాద్ పౌరులతో న్యాయ బద్ధంగా, ధర్మ బద్ధంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసారు. రజాకార్ల తీవ్ర వ్యతిరేకత కారణంగా ఈ ప్రతిపాదనపై సంతకం చేయడానికి ఖాసిం రిజ్వీ నిరాకరించాడు. ఆ తర్వాత సర్దార్ పటేల్ బలాలను ప్రయోగించవలసి వచ్చింది.
జనరల్ జె.ఎన్.చౌదరి నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 13న సైనిక చర్య మొదలైంది. మొదట్లో భారత సైన్యం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంది. అయితే కుయుక్తులు పన్నుతున్న రజాకర్లపై భారత సైన్యం విరుచుకుపడి యుద్ధభూమి నుండి పారిపోయేలా చేసింది. సైనిక చర్యలో భాగంగా నలువైపులా నుంచి వస్తున్న భారత బలగాలను చూసి నిజాం కింగ్‌కోఠి నుంచి బయటకు వచ్చి భారత ప్రతినిధి కె.ఎం.మున్షీని కలిశాడు. అప్పటికే సమాచార సాధనాలు తెగిపోవడంతో ఎటూ అర్థంకాక కాళ్ళబేరానికి దిగాడు. లొంగుబాటుకు మించిన తరుణోపాయం లేదను మున్షీ చెప్పడంతో నిజాం ఒప్పుకోకతప్పలేదు.
అయిదో రోజు, సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు నిజాం కాల్పుల విరమణ ప్రకటించారు. మేజర్ జనరల్ జయంతో నాథ్ చౌధురి హైదరాబాద్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ అల్ ఎడ్రూస్ లొంగిపోవడానికి అంగీకరించారు. హైదరాబాద్ అధికారికంగా భారతదేశంలో విలీనమయింది. ఈ యుద్ధంలో 800 మంది హైదరాబాద్ రాజ్య దళాలతో పాటు 2000 మందికి పైగా రజాకార్లు హతమయ్యారు. భారత సైన్యంలోని 32 మంది వీర యోధులు వీరమరణం పొందడం తీరని నష్టం.
పోరాటయోధులు
నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమానికి జమలాపురం కేశవరావు, లక్ష్మీనరసయ్య, ఆరుట్ల కమలాదేవి, రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం, చండ్ర రాజేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్, షోయబ్ ఉల్లాఖాన్, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, రాంజీగోండ్, విశ్వనాథ్ సూరి, దొడ్డి కొమరయ్య, బెల్లం నాగయ్య, కిషన్ మోదాని తదితరులు పోరాటాలు చేశారు. మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి తదితర యోధులు సాయుధ వీరులకు మద్దతుగా నిలిచారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు తేడా లేకుండా తుపాకులు, బడిసెలు పట్టి రజాకార్ల మూకలను తరిమికొట్టారు. ఈ భయంకర పరిస్థితిని చూసి వందేమాతరం రామచంద్రరావు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నిజాం దుర్మార్గాలపై లేఖ రాసారు.
1948 సెప్టెంబరు 17న హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది. ప్రజలకు అసలైన స్వాతంత్ర్యం లభించింది. నిజాం ప్రధాని లాయక్ అలీని తొలిగించారు. ప్రజలకు నరకయాతన చూపిన ఖాసిం రజ్వీని అరెస్టు చేశారు. తర్వాత హైదరాబాదు అసెంబ్లీ రద్దయింది. . జీవిత ఖైదు పడిన ఖాసిం రిజ్వీని సర్దార్ పటేల్ మరణించిన కొన్ని సంవత్సరాలలో విడుదల చేసి, ప్రేమతో పాకిస్తాన్ పంపారు. ఆయన, అక్కడ 1955 లో మరణించారు. హైదరాబాద్ లో ఇక తలెత్తుకు తిరగలేమని భావించి లాయక్ అలీ, రడ్వీ పాకిస్తాన్ పారిపోయారు. విలీనం అనంతరం సెప్టెంబర్ 18న సైనిక చర్యకు నేతృత్వం వహించిన జె.ఎన్.చౌదరి సైనిక గవర్నర్‌గా పదవీ ప్రమాణం చేయగా, ఎం. కె. వెల్లోడి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగుబాటుతో రజాకారులనుంచి విమోచనం/ విముక్తి లభించి సంపొర్ణ స్వతంత్ర్యం లభించిన రోజు.
(నందిరాజు రాధాకృష్ణ, జర్నలిస్టు, హైదరాబాద్)