వీరోచిత పోరాటం, వివాదాల సుడిగుండం - జార్జి ఫెర్నాండెజ్
దేశంలో కార్మిక, ఉద్యోగ వర్గాల పోరాట నాయకుడిగా ముద్రపడిన జార్జి ఫెర్నాండెజ్ ఉన్నత పదవులు నిర్వహించినా సాధారణ జీవితం గడిపారు. సోషలిస్టు నేతగా మొదలైన ఆయన ప్రస్థానం
-నందిరాజు రాధాకృష్ణ, వెటరన్ జర్నలిస్ట్
దేశంలో కార్మిక, ఉద్యోగ వర్గాల పోరాట నాయకుడిగా ముద్రపడిన ఆయన ఉన్నత పదవులు నిర్వహించినా.. సాధారణ జీవితం గడిపారు. సోషలిస్టు నేతగా మొదలైన ఆయన ప్రస్థానం ఉన్నత స్థానాలకు చేరింది. దేశంలోనే అత్యంత కీలకమైన రక్షణ శాఖ ఆయన్ని వరించింది. మరో పొరుగు దేశంలో కీర్తి గడించిన జార్జి ఫెర్నాండెజ్ రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకం. 1967లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ముంబై నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. అప్పట్లో కాంగ్రెస్ హవా నడచినప్పటికీ జార్జి ఫెర్నాండెజ్ విజయం సాధించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. బాంబే సౌత్ సెగ్మెంట్ నుంచి సంయుక్త సోషలిస్టు పార్టీ తరపున పోటీ చేసిన జార్జి ఫెర్నాండెజ్.. కాంగ్రెస్ నేతగా ఖ్యాతినొందిన సదాశివ్ కనోజీ పాటిల్ (ఎస్.కె.పాటిల్)ను భారీ మెజార్టీతో ఓడించి, 'జార్జ్ - ద జెయింట్-కిల్లర్' అని ఖ్యాతి గడించారు.
1967 నుంచి 2004 వరకు ఆయన 9 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009 ఆగస్టు నుంచి 2010 జూలై వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. దీర్ఘకాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారు. అయినా కూడా సోషలిస్ట్ భావజాలమున్న జార్జి ఫెర్నాండెజ్ సాధారణ జీవితం గడపడం విశేషం. ఆయన ఒక అనుభవజ్ఞుడైన సోషలిస్ట్. కొన్ని సందర్భాల్లో కేంద్ర మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కొందరికి మింగుడు పడలేదు. విధుల నిర్వహణలో సమర్థుడుగా పేరున్న జార్జి ఫెర్నాండెజ్ అదే స్థాయిలో, అణు పరీక్షలు, బారక్ మిస్సైల్ స్కాండల్, తెహల్కా.. ఇలా అనేక అంశాల్లో ఆయన ఆరోపణలు, వివాదాలు ఎదుర్కొన్నారు. ఐబీఎం, కోకకోలా లాంటి విదేశీ కంపెనీలను దేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆయన ఆదేశించడం వివాదాలకు దారి తీసింది. పెట్టుబడి విధానాలను ఆ కంపెనీలు తుంగలో తొక్కాయనేది జార్జి ఫెర్నాండెజ్ అభిప్రాయం.
జార్జ్ ఫెర్నాండెజ్ 1930 జూన్ 3న జాన్ జోసెఫ్ ఫెర్నాండెజ్-ఆలిస్ మార్తా ఫెర్నాండెజ్ క్యాథలిక్ దంపతులకు మంగళూరులో జన్మించారు. కొన్ని సంవత్సరాల పాటు ఇంటికి సమీపంలోని "ప్రభుత్వ బోర్డు పాఠశాల" బోర్డ్ స్కూల్లో, సెయింట్ అలోసియస్ కాలేజీకి అనుబంధంగా ఉన్న చర్చి పాఠశాలలో చదివి సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఉత్తీర్ణుడయ్యారు. న్యాయవిద్య చదవాలనుకున్నారు కానీ న్యాయవాదిగా మారాలని కోరుకోలేదు. 16 సంవత్సరాల వయస్సులో రోమన్ కాథలిక్ మతగురువుగా శిక్షణ పొందేందుకు బెంగుళూరులోని సెయింట్ పీటర్స్ సెమినరీకి వెళ్ళారు. 1946 నుండి 1948 వరకు రెండున్నర సంవత్సరాలు తత్వశాస్త్రం అభ్యసించిన కాలంలో కొన్ని విధానాలు నచ్చక నిరాశతో సెమినరీని విడిచి 19 ఏళ్ల వయసులో 1949లో ఉపాధి వెతుక్కుంటూ బొంబాయి చేరుకున్నారు.
మొదట్లో చాలా కష్టాలు పడ్డారు. కొన్ని రోజులు రోడ్ల పక్కన ఉండే బెంచీలపై నిద్రించారు. ఒక దినపత్రికలో ప్రూఫ్ రీడర్ ఉద్యోగం దొరకడంతో కుదుటపడ్డారు. బొంబాయికి చెందిన ప్రఖ్యాత ట్రేడ్ యూనియన్ నాయకుడు ప్లాసిడ్ డి'మెల్లో తో పరిచయం ఏర్పడింది. సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా వంటి నేతల ప్రభావంతో కార్మిక సమస్యలపై గళమెత్తారు. చిన్న పరిశ్రమలలోని కార్మికుల హక్కుల కోసం పెద్ద పోరాటం చేశారు. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవంతో సోషలిస్ట్ ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో క్రీయాశీలక నేతగా ఎదిగారు. 1967లో బొంబాయి నుండి మొదలై 2009 వరకు ఎక్కువగా బీహార్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. 30 సంవత్సరాలకు పైగా లోక్‌సభ సభ్యుడు. జనతాదళ్‌లో కీలక సభ్యుడు, సమతా పార్టీ వ్యవస్థాపకుడు.
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో.. దేశంలోనే కీలక శాఖైన రక్షణ శాఖకు మంత్రిగా ఫెర్నాండెజ్ పనిచేశారు. అంతేకాదు రైల్వే, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు లాంటి అత్యున్నత శాఖలను కూడా ఆయన నిర్వర్తించారు. 1975 నాటి ఎమర్జెన్సీ సమయంలో ఫెర్నాండెజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు సాధారణ కార్యకర్తలతో పాటే ఆయన్ని జైలుకు పంపారు. అనంతరం బరోడా డైనమెట్ కేసులో కోల్‌కతాలో పోలీసులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపారు. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని ముజఫర్‌పుర్ నుంచి ఎంపీగా బరిలోకి దిగి జైలు నుంచే పోటీచేసి దాదాపు 3 లక్షల ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించడం విశేషం.
దేశంలోని మొదటి కాంగ్రెస్ యేతర ప్రభుత్వంలో ఆయన మంత్రి అయ్యారు. 1979లో జనతా పార్టీకి రాజీనామా చేసి, చరణ్ సింగ్ విడిపోయిన జనతా పార్టీలో చేరి, 1980లో ముజఫర్‌పూర్ నుంచి మళ్లీ గెలుపొందారు. 1984లో బెంగళూరు నుంచి జనతా పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి కాంగ్రెస్‌కు చెందిన జాఫర్ షరీఫ్ చేతిలో ఓడిపోయాడు. 1985లో, 1986లో బంకా నుండి ఉప ఎన్నికలో ఓటమి పొందారు. 1989, 1991లో ఆయన బీహార్ రాజకీయాలలో కాలు పెట్టి జనతాదళ్ అభ్యర్థిగా ముజఫర్‌పూర్ నుండి రెండుసార్లు గెలిచారు. 1994లో లాలూ యాదవ్‌తో విభేదాల కారణంగా జనతాదళ్ వీడి బీజేపీతో పొత్తు పెట్టుకుని సమతా పార్టీని స్థాపించారు. 1996, 1998 ఎన్నికల్లో నలంద నుంచి సమతా పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు.
సమతా పార్టీ జనతాదళ్ (యునైటెడ్)లో విలీనమైంది. ఆయన 1999లో నలంద నుంచి, 2004లో ముజఫర్‌పూర్ నుంచి తిరిగి విజయం సాధించారు. 2009లో ఆయన పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో ముజఫర్‌పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలై 2009 ఆగస్టులో రాజ్యసభ సభ్యునిగా గెలుపొంది, 2010 జులై వరకు కొనసాగారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఫెర్నాండెజ్. కొన్నాళ్లు అల్జీమర్స్ వ్యాధితో బాధపడ్డారు. సోషలిస్టు భావజాలంతో దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన 2019 జనవరి 29 కన్నుమూశారు.
(జార్జి ఫెర్నాండెజ్ జయంతి సందర్భంగా)