
రేవంత్ సర్కార్ కు లొంగని స్కూళ్ల ఫీజులు
20–30% వరకు ఫీజులు పెంచారని తల్లిదండ్రులు ఆందోళన
తెలంగాణా ప్రభుత్వం 2026–27 నుంచి కొత్త విద్యా విధానం అమలు చేస్తుందని ప్రకటించినప్పటికీ, విద్యా కమిటీల మధ్య సమన్వయం లేకపోవడంతో అనిశ్చితి నెలకొంది. నివేదికలు పూర్తికావడం లేదు, నిర్ణయాల్లో స్పష్టత లేదు. మంత్రివర్గ ఉపసంఘం, మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినా, అవి పరస్పరం సమన్వయం లేకుండా విడివిడిగా వ్యవహరిస్తున్నాయి. దీంతో కొత్త విధానం అమలుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం పదేపదే హామీలు ఇచ్చినప్పటికీ, స్పష్టమైన చట్టం తీసుకురాలేదు. బిల్లు సిద్ధమై ఏడాది దాటినప్పటికీ శాసనసభలో ప్రవేశపెట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
వచ్చే విద్యాసంవత్సరం దగ్గరపడుతున్నప్పటికీ పాఠశాలలు ఇప్పటికే ప్రవేశాలు పూర్తి చేసి ఫీజులు వసూలు చేయడం ప్రారంభించాయి. కొన్ని పాఠశాలలు ఏటా 20–30% వరకు ఫీజులు పెంచారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి 8% మాత్రమే ఫీజు పెంపు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పి. తేజ ఫెడరల్ తెలంగాణాతో మాట్లాడారు. “రాజకీయ నేతలే పెట్టుబడులు పెట్టి విద్యావ్యాపారం చేస్తున్నారు. ఫీజుల దోపిడీకి ఏ విధమైన అదుపు లేదు. పేద మధ్యతరగతి ప్రజలు నేరుగా ఆర్థిక భారానికి గురవుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఫీజులపై నియంత్రణ లేదు,” అని తేజ తెలిపారు.
తెలంగాణలో 20,000కు పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిని ఐదు విభాగాలుగా వర్గీకరించి, మేనేజ్మెంట్లు, తల్లిదండ్రులతో అనేక సార్లు చర్చలు జరిపామని తెలంగాణ విద్యా కమిషన్ (టీఈసీ) సభ్యుడు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు చెప్పారు. “ముసాయిదా చట్టాన్ని ప్రభుత్వం ఇప్పటికే సమర్పించాం. ప్రతిపాదిత ఫీజు నియంత్రణ బిల్లు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇది చర్చల్లోనే ఉంది. ఫీజుల నియంత్రణ వీలైనంత త్వరగా అమలు కావాలి. స్కూల్ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ అమలు అయిన తర్వాతే నియంత్రణ సాద్యం అవుతుంది.” అని విశ్వేశ్వరరావు చెప్పారు.
2026–27 విద్యా సంవత్సరం నుంచే సంస్కరణలు చేస్తామని రేవంత్ సర్కార్ అంటోంది. 2024 జూలైలో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రంలో అమలు చేయదగిన అంశాలపై సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. కానీ ఆపై సమావేశాలు జరగలేదు.2024 సెప్టెంబర్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విద్యా కమిషన్ ఛైర్మన్‌గా నియమించబడ్డారు. ఈ కమిటీ సమర్పించిన నివేదిక వివాదాస్పదంగా మారింది.2025 ఆగస్టులో కే. కేశవరావు అధ్యక్షతన మరో కమిటీ ఏర్పాటు చేశారు. 2025 అక్టోబర్ 30లోపు నివేదిక సమర్పించాలని నిర్ణయించారు కానీ ఇప్పటి వరకు అది సమర్పించ లేదు.

