తెలంగాణలో ప్రజలు ప్రశ్నించడం మొదలయింది...
x
హైదరాబాద్ జ్యోతీబా ఫూలే భవన్ లో తెలంగాణ ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు డా. జి చిన్నారెడ్డికి తమ డిమాండ్లను వినిపిస్తున్న కౌలు రైతులు

తెలంగాణలో ప్రజలు ప్రశ్నించడం మొదలయింది...

ఏడు నెలలుగా ఎదురు చూసిన ప్రజలు తమ ఆకాంక్షలను తమకు ఇచ్చిన హామీలను పాలకులకు గుర్తు చేయడానికి రోడ్డెక్కుతున్నారని చెబుతున్నారు సామాజిక ఉద్యమ కారుడు కన్నెగంటి రవి



డిసెంబర్ 7 న తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక, ఎన్నికల మానిఫెస్టో లో ఇచ్చిన హామీల అమలు కోసం 7 నెలలుగా ఎదురు చూసిన ప్రజలు ఇప్పుడిప్పుడే తమ ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికి, తమకు ఇచ్చిన హామీలను పాలకులకు గుర్తు చేయడానికి రోడ్డెక్కుతున్నారు.
మరీ ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతం అంతా ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి అధికారం అప్పగించింది. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, ఒక్క తాటిపైకి వచ్చి, గత పాలనను కూలదోశారు. సంక్షోభంలో ఉన్న తమ జీవితాలను బాగు చేయడానికి KCR ప్రభుత్వం ఏ చర్యలూ చేపట్టడం లేదని వారు భావించారు. పైగా తమ జీవితాలపై ఫ్యూడల్ దొరతనం రాజ్య మేలడం సహించలేకపోయారు.
గత 1920 దశకం నుండీ గత వందేళ్లుగా రాచరిక పాలనకు, భూస్వామ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన చరిత్ర తెలంగాణ కు ఉంది. ఈ ఉద్యమాలపై రాజ్య హింసను, హత్యాకాండను కూడా వాళ్ళు చవి చూశారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతమంతా అట్టుడికిన రైతులు, కూలీలు సాగించిన ఉద్యమాలతో, దొరలు ఊళ్ళొదిలి పారిపోయిన సంఘటనలు ఎన్నెన్నో. తెలంగాణ అంటేనే గ్రామీణ పేదలు భూమి కోసం సాగించిన పోరాటాల చరిత్ర . 1950 లోనే హైదరాబాద్ కౌలు దారీ చట్టం పేరుతో దేశంలోనే అత్యంత ప్రగతిశీల కౌలు దారీ చట్టాన్ని సాధించుకున్నారు.
1973 లో వచ్చిన భూ గరిష్ట పరిమితి చట్టం, తెలంగాణ లో కొన్ని వేల మంది దళితులు, వెనకబడిన వర్గాల ప్రజలకు కొంత భూమి పంచి ఇచ్చినప్పటికీ, ఆ తరువాత కాలంలో ప్రభుత్వలు వివిధ దశలలో , వివిధ పేర్లతో మరి కొన్ని వేల ఎకరాల భూములను భూమి లేని పేదలకు అసైన్డ్ చేసినప్పటికీ, ఇంకా తెలంగాణ లో భూమి సమస్య పరిష్కారం కాలేదు. పైగా 1980 దశకం నుండీ అమలులోకి వచ్చిన నూతన ఆర్ధిక పారిశ్రామిక విధానాల వల్ల, గ్రామీణ ప్రాంత వ్యవసాయంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. భూ సంస్కరణలు ఆగిపోయాయి.
రాష్ట్ర పంటల పొందికలో మార్పులు రావడమే కాదు, రాష్ట్ర రైతు సమాజంలో కూడా మార్పులు జరిగాయి. ఆధిపత్య కులాల వారు, తమ భూములను తమ చేతుల్లోనే ఉంచుకుని, విద్యా,ఉద్యోగాలు,వ్యాపారాల పేరుతో ఇతర రంగాలలోకి తరలి పోయారు. కొత్తగా కొన్ని ఆస్తి పర వర్గాల వారు , తమకున్న మిగులు ధనాన్ని ( నల్ల డబ్బును కూడా ) భూమి పై పెట్టుబడులు పెట్టి, గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొన్నారు. ఆ భూములను కౌలు ఇవ్వడం ప్రారంభించారు.

డిమాండ్లను ప్రదర్శిస్తున్న తెలంగాణ కౌలు రైతులు


వెట్టి నుండీ, అంతులేని శారీరక శ్రమ నుండీ బయట పడాలనే కోరికతో, దళితులు, వెనుకబడిన వర్గాల గ్రామీణ ప్రజలు , రైతులుగా బతికితే ఉండే ఆత్మగౌరవం కోసం , రుణాలు పొందే పరపతి కోసం, వ్యవసాయంలో వచ్చే అదనపు ఆదాయం కోసం కౌలు రైతులుగా రంగం లోకి వచ్చారు.

కానీ ఈ కౌలు రైతులను ప్రభుత్వాలు రైతులుగా గుర్తించలేదు. వారి వ్యవసాయానికి ఎటువంటి సహాయం చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు భారీగా పెరిగి పోయాయి. 1995 నుండీ 2013 వరకూ కనీసం 35 వేల మంది రైతులు తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఆత్మహత్య చేసుకున్నారు . 2014 నుండీ 2022 మధ్య కాలంలో కూడా 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రైతు ఆత్మహత్యలలో 80 శాతం కౌలు రైతులవే కావడం ఇందులో విషాదం.
ఈ విషాదం గుర్తించిన రైతు సంఘాలు చేసిన ఆందోళనల మేరకు 2011 లో భూ అధీకృత సాగు దారుల చట్టం పేరుతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకు వచ్చింది. ఈ చట్టం ప్రకారం గ్రామాలలో కౌలు రైతుల నుండీ దరఖాస్తులు తీసుకుని, రెవెన్యూ శాఖ గ్రామాలలో వాటిపై విచారణ చేసి, నిజమైన కౌలు రైతులుగా తేలిన వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఈ కార్డు భూమి పై కౌలు రైతుకు ఎటువాని హక్కు ఇవ్వదు. కానీ ఈ కార్డు ఆధారంగా కౌలు రైతులకు ప్రభుత్వ వ్యవసాయ పథకాలు అమలు చేయవచ్చు. పంట రుణాలు ఇవ్వవచ్చు.
2011 నుండీ 2015 వరకూ ఒక మేరకు ఈ చట్టం తెలంగాణ ప్రాంతంలో అమలైంది. కొన్ని వేల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు దక్కాయి. కానీ 2016 నుండీ అకస్మాత్తుగా KCR ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయడం ఆపేసింది. కౌలు రైతులు తమ ఎజెండాలో లేరని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. 2018 నుండీ అమలవుతున్న రైతు బంధు పథకం లో కూడా కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా పెట్టబడి సహాయాన్ని ఆ ప్రభుత్వం అందించలేదు. అసలు రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య ఎంతో కూడా తెలియ కుండా పోయింది.
ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కౌలు రైతుల స్థితి గతులపై 2022 లో 20 జిల్లాలలో, 30 మండలాలలో, 35 గ్రామ పంచాయితీలలో అధ్యయనం చేసిన రైతు స్వరాజ్య వేదిక రాష్ట్రంలో 36 శాతం కౌలు రైతులు ఉన్నారని తేల్చింది. ఈ కౌలు రైతులు కనీసం మూడు నుండీ 10 సంవత్సరాల వరకూ ఒకే భూభూమిని కౌలు తీసుకుని సాగు చేస్తున్నారని చెప్పింది. వారికి ఎటువంటి సహాయం ( రైతు బంధు పెట్టబడి సహాయం , పంట రుణం, పంటల బీమా, పంట నష్ట పరిహారం, భూమి లేని కౌలు రైతులకు రైతు భీమా, మద్ధతు ధరలకు పంట కొనుగోలు , ఇతర సబ్సిడీ పథకాలు ) అందక, ఆయా కుటుంబాలు సంక్షోభంలో, అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయని స్పష్టమైన నివేదిక విడుదల చేసింది.
ఈ నివేదికను కూడా KCR ప్రభుత్వం పట్టించుకోలేదు. తమ పథకాలను కౌలు రైతులకు అందించలేదు. ఇది కౌలు రైతులలో తీవ్ర నిరాశను నింపింది. KCR ప్రభుత్వం పై అసంతృప్తిని పెంచింది. తమ ఆగ్రహాన్ని కౌలు రైతులు అసెంబ్లీ ఎన్నికలలో వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2022 లోనే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో రైతులతో పాటు, కౌలు రైతులకు కూడా ఇందిరమ్మ రైతు భరోసా సహాయం అందిస్తామని ప్రకటించింది. ఇదే విషయాన్ని ఎన్నికల మానిఫెస్టో లో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలలో చేర్చింది. 2023 సెప్టెంబర్ ళ్ళొ PCC అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, కౌలు రైతులకు ఒక బహిరంగ లేక రాస్తూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ,తాము కౌలు రైతులకు సహాయం చేస్తామని, కౌలు రైతులను 2011 చట్టం ప్రకారం గుర్తిస్తామని భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు రూపొందిస్తున్నది . మంత్రి వర్గ ఉప సంఘం అందరితో చర్చిస్తున్న సమయం. ఈ సమయం కౌలు రైతులకు అత్యంత కీలకమైనది. తాము రాష్ట్ర వ్యవసాయంలో గుర్తింపుకు నోచుకోవాలంటే, ఇప్పుడే గొంతు విప్పాలని నిర్ణయించుకున్నారు.
ఈ లక్ష్యం తోనే జులై 5వ తేదీన పలు జిల్లాల నుండి కౌలు రైతులు హైదరాబాద్ చేరుకొని తమ గొంతు వినిపించారు. ప్రజా భవన్ వద్ద ప్రజావాణిలో పాల్గొన్న కౌలు రైతులు కాంగ్రెసు పార్టీ కౌలు రైతులను గుర్తించి రైతు భరోసా మరియు ఇతర ప్రభుత్వ పథకాలను వారికి కూడా అందజేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వినతి పత్రాలు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు జి చిన్నారెడ్డి గారికి మరియు ఉన్నత అధికారులకు తమ సమస్యలను, డిమాండ్లను తెలియబరిచారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారు స్పందిస్తూ, ఈ విషయం పై ప్రభుత్వం సీరియస్ గా రైతుల అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం చేస్తుందని, కౌలు రైతులకు న్యాయం చేసే విషయానికి కట్టుబడి ఉందని, రైతుల డిమాండ్లను ముఖ్యమంత్రి మరియు కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు.
ప్రజావాణిలో పాల్గొన్న తర్వాత ప్రజా భవన్ బయట కౌలు రైతులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని తాము కోరుతున్నామని, రైతు భరోసా మార్గదర్శకాలపై ప్రభుత్వము ఏర్పాటు చేసిన నలుగురు మంత్రుల కేబినెట్ సబ్ కమిటీ కి కూడా తమ వినతి పత్రాలను అందజేస్తున్నామని తెలిపారు.
అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రైతు స్వరాజ్య వేదిక “తెలంగాణలో కౌలు రైతుల గుర్తింపు – రైతు భరోసా” అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. రౌండ్ టేబుల్ లో యాదాద్రి భువనగిరి, వికారాబాద్, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల నుండి కౌలు రైతులు పాల్గొని తమ సమస్యలు, డిమాండ్లను వినిపించారు.
సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా నుండి జక్క మల్కన్న, అశోక్, యాదాద్రి జిల్లా నుండి చైతన్య, వికారాబాద్ జిల్లా నుండి మంజుల, నల్గొండ జిల్లా నుండి యాదమ్మ, కరీంనగర్ నుండి మెరుగు శ్రీనివాస్, మంచిర్యాల నుండి సిడం రమేష్ కౌలు రైతులుగా తాము ఎదుర్కుంటున్న సమస్యలను వివరించారు.
పంట ఖర్చు మాత్రమే కాకుండా కౌలు రేటుగా నీరు లేని భూమికి ఎకరానికి 10 వేల నుండి సాగునీరు ఉన్న భూమికి 25 వేల దాకా వారి వారి ప్రాంతంలో చెల్లిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం నుండి కౌలు రైతులకు ఎటువంటి పథకాల నుండి లబ్ధి అందలేదు, ఎటువంటి గుర్తింపు లభించలేదు, రైతు బంధు, రైతు బీమా అందకపోగా, పంట నష్టపరిహారం కూడా అందలేదు, పంట అమ్మకం వద్ద కూడా రేటు లభించలేదని చెప్పారు. వికారాబాద్ జిల్లా నుండి మంజుల మాట్లాడుతూ కౌలు రైతుగా నష్టపోతూ అప్పుల పాలై తన భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా తాను కౌలు రైతుగానే కష్టపడి సాగు చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించనందుకే కౌలు రైతులు కోపంతో ఉన్నట్లు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను అమలు చేసి కౌలు రైతులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.
సమావేశంలో కౌలు రైతులు, రైతు స్వరాజ్య వేదిక, తదితర రైతు సంఘాల, ప్రజా సంఘాల నాయకులు పెట్టిన ముఖ్యమైన డిమాండ్లు:
1. వెంటనే 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తూ, కౌలు సాగుదారుల నుండి దరఖాస్తులు తీసుకొని, వారికి ఎల్.ఈ.సి. గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
2. రైతు భరోసా అనేది పెట్టుబడి సహాయం కాబట్టి, కౌలు రైతులు స్వంత పెట్టుబడితో వ్యవసాయం చేస్తున్నాము కాబట్టి, రైతు భరోసా సహాయాన్ని కౌలు రైతులకు కూడా అందించాలి. ఆరు గ్యారంటీలలో ఒకటైన ఈ హామీని మొదటి సంవత్సరంలోనే అమలు చేయాలి.
3. గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులకు పంట బీమా, పంట నష్ట పరిహారం, రైతు బీమా, పంట అమ్మకము, బ్యాంకు రుణాలు – వంటివన్నీ అందించాలి.
రైతు భరోసా పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలుగురు మంత్రుల కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కౌలు రైతులు, నాయకులు కోరారు.


Read More
Next Story