అమెరికా అయినా ఆదిలాబాద్ అయినా కౌలు రైతుల పరిస్థితి ఒకటే
x
Source: People's Archives for Rural India

అమెరికా అయినా ఆదిలాబాద్ అయినా కౌలు రైతుల పరిస్థితి ఒకటే

కౌలు రైతులకు ప్రభుత్వాలు చేసే సహాయం అందకుండా, మన దేశంలో లాగే అమెరికా లోనూ కూడా భూ యజమానులు అడ్డు పడుతున్నారు.


బడా భూస్వాముల/ దొరల దోపిడీ సాగే భూస్వామ్య వ్యవస్థలోనే కాదు , ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థ లోనూ , కౌలు రైతుల పై దోపిడీ కొనసాగుతుందని, భూముల యజమానులు కౌలు రూపంలో అదనపు విలువను కొల్ల గొడుతున్నారని వివిధ దేశాల వ్యవసాయ రంగాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు అర్థమవుతున్న మాట.

వ్యవసాయ రంగానికి సబ్సిడీ లు, పెట్టుబడి సహాయాలు ఇచ్చే పేరున, బడా రైతులకు, పరోక్ష భూస్వాములకు ఆయా ప్రభుత్వాలు ప్రభుత్వ నిధులను దోచిపెడుతున్నాయని కూడా ఈ అధ్యయన సారాంశం. కౌలు రైతులకు ప్రభుత్వాలు చేసే సహాయం అందకుండా, మన దేశం లోనూ, అమెరికా లోనూ కూడా భూ యజమానులు అడ్డు పడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

పూర్తిగా ప్రైవేట్ పెట్టుబడి రాజ్యమేలే అమెరికా, యూరప్ లాంటి దేశాలలోనే కాదు, సంక్షేమ రాజ్యం గా చెప్పుకునే భారత దేశం లోనూ ఇదే ధోరణి కనపడుతున్నది. ఆయా దేశాలలో రైతు ఉద్యమాల ఫలితంగా లేదా వ్యవసాయ రంగ సంక్షోభాన్ని,రైతు ఆత్మహత్యల సమస్యను పరిష్కరించే పేరున, కౌలు రైతులకు , కుటుంబ కమతాలకు రక్షణగా కొన్ని దేశాలలో ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను, చట్టాలను అమలు చేస్తున్న తీరు కూడా కనపడుతున్నది. అయితే ఇది ఇప్పటికీ ప్రధాన ధోరణి కాదు. అనేక దేశాలలో భూ యజమానులు , స్వయంగా వ్యవసాయం చేయకపోయినా, ప్రభుత్వ సబ్సిడీలను తామే తీసుకుంటున్న పరిస్థితి, కౌలు రైతులను ప్రభుత్వాలు గుర్తించకుండా అడ్డు కుంటున్న పరిస్థితి ప్రధాన ధోరణి గా ఉంది.

కౌలు రైతుల విషయంలో మన రాష్ట్రంలో ఏమి జరుగుతోంది?

హైదరాబాద్ రాష్ట్రంలో 1950 లోనే కౌలు రైతులకు రక్షణగా ఒక ప్రగతిశీల చట్టం రూపొందింది. 1956 లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక ఈ చట్టాన్ని కౌలు రైతుల కోసం అమలు చేస్తామని ప్రకటించినా అమలు చేయలేదు. ఈ నేపధ్యంలో సంక్షోభంలో ఉన్న కౌలు రైతులను గుర్తించడానికి 2011 లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ అసెంబ్లీ అధీకృత సాగుదారుల చట్టం పేరుతో మరో చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ఉమ్మడి రాష్ట్రంలో 2012, 2013 సంవత్సరాలలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా 2015 సంవత్సరంలో అమలైంది. వేలాదిమంది కౌలు రైతులను గుర్తించి ఋణ అర్హత కార్డు ( LEC)లు ఇచ్చారు. ఈ కార్డుల ఆధారంగా కౌలు రైతులకు కొద్ది మొత్తంలో మాత్రమే రుణాలు బ్యాంకుల నుండీ అందినా, ప్రధానంగా ఈ కార్డు, కౌలు రైతులను గుర్తించడానికి ఉపయోగపడింది.

2016 నుండీ అప్పటి ముఖ్యమంత్రి KCR ఈ చట్టం అమలును నిలిపేశాడు. కౌలు వ్యవసాయమనేది , భూ యజమానికీ , కౌలు దారుకూ మధ్య జరిగే ఒప్పంద వ్యవహారమని, అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదనే తప్పుడు వాదనతో ఈ చట్టం అమలు చేయకుండా పక్కకు పెట్టాడు.

2018 నుండీ తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలను కూడా కౌలు రైతులకు వర్తింప చేయకుండా అన్యాయం చేశాడు.

ఈ చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 నుండీ మే చివరి వరకూ కౌలు రైతులను గుర్తించడానికి రెవెన్యూ శాఖ ప్రక్రియ చేపట్టాలి. ఈ చట్టం అమలు గురించి, మొదట గ్రామాలలో ప్రచారం చేయడం, టముకు వేయడం, కౌలు రైతులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా గ్రామాలలో దరఖాస్తులను అందుబాటులో ఉంచడం, మీ సేవా కేంద్రాలలో దరఖాస్తులు తీసుకోవడం జరగాలి. వచ్చిన దరఖాస్తులను తీసుకుని మండల రెవెన్యూ శాఖ , గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి విచారణ చేయాలి. గ్రామ సభలలో కౌలు రైతులను గుర్తించి వారికి ఋణ అర్హత కార్డులను మంజూరు చేయాలి. కౌలు రైతులను గుర్తించడానికి, ఈ చట్టం ప్రకారం భూ యాజమానుల అనుమతి అవసరం లేదు.

ఈ చట్టం నియమాల ప్రకారం కౌలు రైతుల గుర్తింపు కార్డులు పొందిన వారి రిజిస్టర్ ప్రత్యేకంగా తయారు చేసి, మండల రెవెన్యూ కార్యాలయంలో ఉంచాలి. ఈ లిస్టును స్థానిక బ్యాంకు అధికారులకు, వ్యవసాయ శాఖకు కూడా ఇవ్వాలి. బ్యాంకు అధికారులు ఆ సీజన్ కు పంట రుణాలు మంజూరు చేసేటప్పుడు, ఆయా సర్వే నంబర్ లలో ఎవరికైనా కౌలు రైతు గుర్తింపు కార్డు మంజూరు అయిందా లేదా అనేది చూడాలి. కౌలు రైతుకు గుర్తింపు కార్డు మంజూరయితే ఆ సర్వే నంబర్ లో కౌలు రైతుకు పంట రుణం ఇవ్వాలి. కాకపోతే, భూమి యజమానికి పంట రుణం ఇవ్వాలి. ఈ గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులకు ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇచ్చే ఇతర అన్ని రకాల సహాయాలను అందించాలి . ఇది చట్టంలో, రూల్స్ లో రాసిన మాట. కానీ 2016 నుండీ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల, కౌలు రైతులకు ఎటువంటి సహాయం అందడం లేదు. చట్టబద్ధ పాలన అందిస్తామని ప్రమాణం చేసిన ప్రభుత్వాలు , అసెంబ్లీ ఆమోదించిన చట్టాన్ని అమలు చేయకపోవడం, రాజ్యాంగ విరుద్ధమే.

2023 డిసెంబర్ లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని అమలు చేస్తుందని ఎవరైనా ఆశిస్తారు. పైగా ఎన్నికల సందర్భంగా కౌలు రైతులకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు కూడా ఇచ్చింది . రాష్ట్ర వ్యాపితంగా ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా కౌలు రైతులకు సహాయం అందించాలని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. కానీ కారణమేదైనా ఈ ప్రభుత్వం కూడా కౌలు రైతులకు ఇచ్చిన హామీలను మరిచిపోయి, మళ్ళీ వారికి అన్యాయమే చేసింది. రైతు భరోసా, పంట నష్ట పరిహారం లాంటివి కేవలం భూమి యాజమానులకే అందుతున్నాయి. క్వింటాలుకు 500 రూపాయల వరికి బోనస్ కూడా కేవలం కొద్ది మంది కౌలు రైతులకు మాత్రమే అందింది. వ్యవసాయం చేయని భూ యజమానులకు, రైతు భరోసా, పంట నష్ట పరిహారం అందించడం వల్ల, వేల కోట్ల నిధుల దుర్వినియోగం జరుగుతున్నది.

ఇప్పుడు మళ్ళీ ఈ ప్రక్రియను గుర్తు చేయడానికి కారణం , 2025 ఫిబ్రవరి నుండీ చట్టం అమలు కోసం ప్రక్రియ మొదలు పెట్టాల్సిన రెవెన్యూ శాఖ , ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకూ మౌనంగా ఉంది. అంటే, మళ్ళీ వచ్చే ఖరీఫ్ లో కూడా కౌలు రైతులకు గుర్తింపు దొరకదనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే కౌలు రైతులకు మరో సంవత్సరం కూడా అన్యాయం కొన సాగుతుందన్నమాట.

కౌలు రైతుల విషయంలో అమెరికాలో ఏం జరుగుతోంది?

అమెరికా వ్యవసాయ శాఖ 2022 లో విడుదల చేసిన వ్యవసాయ గణాంకాల ప్రకారం అమెరికాలో వ్యవసాయ భూమి మొత్తం 88 కోట్ల ఎకరాలు. అమెరికాలో వ్యవసాయ భూమి 2000 సంవత్సరం నుండీ క్రమంగా తగ్గుతోంది. 2000లో 94 కోట్ల 50 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా, 2022 నాటికి 75 కోట్ల ఎకరాలకు తగ్గింది. 2017 లో 20,40,000 కమతాలు ఉండగా, 2022 నాటికి ఇవి 20,03,000 కమతాలకు తగ్గాయి.

2000 లో సగటు కమతం సైజు 434 ఎకరాలు కాగా, 2022 నాటికి సగటు కమతం సైజు 441 ఎకరాలకు పెరిగింది. చిన్న కమతాలు తగ్గి, పెద్ద కమతాలుగా మారుతున్నాయి. 3,50,000 డాలర్ల ఆదాయం కంటే తక్కువ ఆదాయం వచ్చినప్పుడు వాటిని చిన్న కమతాలు అంటారు. ఇవి మొత్తం కమతాలలో 86 శాతం (సుమారు 10,72,000 కమతాలు). కానీ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో వీటి వాటా తక్కువ గా ఉంటుంది. అమెరికాలో 50 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం కలిగిన చిన్న కమతాలు, 2000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన కమతాల సంఖ్య పెరిగింది. మధ్యస్థ కమతాల సంఖ్య (50 నుండీ 2000 ఎకరాలు) తగ్గింది.

సంవత్సరానికి 10 లక్షల డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు వాటిని పెద్ద కమతాలు అంటారు. మొత్తం కమతాలలో ఇవి 4 శాతం ఉంటాయి (సుమారు 80,000 ), కానీ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 48 శాతం ఈ కమతాల నుండే వస్తుంది. మొత్తం భూమిలో పంటలు పండే భూమి 33 కోట్ల 80 లక్షల ఎకరాలు ( ఇది మొత్తం వ్యవసాయ భూమిలో 38 శాతం ) ఉంటుంది. అమెరికా వ్యవసాయ భూమిలో గణనీయమైన భాగం కంపెనీలు లేదా సంస్థాగత పెట్టుబడిదారుల (institutional investors) చేతుల్లో ఉంటుంది.

అమెరికా వ్యవసాయ భూమిలో ఎక్కువ భాగం (సుమారు 60-70 శాతం ) వ్యక్తిగత రైతులు లేదా కుటుంబ కమతాలుగా ఉంది. 2014 USDA TOTAL (Tenure, Ownership, and Transition of Agricultural Land) సర్వే ప్రకారం, 96 శాతం కమతాలు కుటుంబ యాజమాన్యం లో ఉన్నాయి, ఇవి 52 కోట్ల 80 లక్షల ఎకరాలకు పైగా నియంత్రిస్తాయి.

మొత్తం వ్యవసాయ భూమిలో 40 శాతం (సుమారు 35 కోట్ల 30 లక్షల ఎకరాలు) కౌలుకు తీసుకున్న భూమి. ఇందులో 80 శాతం (28 కోట్ల 30 లక్షల ఎకరాలు) నాన్-ఆపరేటర్ ల్యాండ్‌ లార్డ్స్ (వ్యవసాయం చేయని వ్యక్తులు) స్వంత భూమిగా ఉంది, మిగిలిన 20 శాతం ( 7 కోట్ల ఎకరాలు) ఇతర రైతులు (వ్యవసాయం చేసే భూ యజమానులు ) కలిగి ఉన్నారు.

విదేశీ, కార్పొరేట్ యాజమాన్యం చేతుల్లో ఉన్న భూమిని తీసివేస్తే, వ్యక్తిగత లేదా కుటుంబ కమతాల యాజమాన్యంలో సుమారు 70 కోట్లు నుండీ -75 కోట్ల ఎకరాల భూమి ఉందని అంచనా.

2022 లో అమెరికా ప్రభుత్వం రైతులకు 15.6 బిలియన్ డాలర్ల సబ్సిడీలను అందించింది. 1995 నుండి 2021 వరకు మొత్తం 478 బిలియన్ డాలర్ల సబ్సిడీలు పంపిణీ చేయబడ్డాయి (Environmental Working Group - EWG డేటా)

EWG నివేదిక ప్రకారం, పై స్థాయిలో ఉన్న టాప్ 10శాతం రైతులు (పెద్ద,ధనిక కమతాలు ) 1995-2021 మధ్య 79 శాతం సబ్సిడీలను (సుమారు 377 బిలియన్ డాలర్లు ) పొందారు. పై స్థాయిలో ఉన్న టాప్ 1 శాతం రైతులు 27 శాతం సబ్సిడీ లను (సుమారు 129 బిలియన్ డాలర్లు ) పొందారు.

అతి చిన్న కమతాలు కలిగిన 80 శాతం రైతులు కేవలం 9 శాతం సబ్సిడీలను (సుమారు 43 బిలియన్ డాలర్లు ) మాత్రమే పొందారు. అమెరికాలో సబ్సిడీలు ప్రధానంగా పంట బీమా (25శాతం ), ధరల క్షీణత కవరేజ్ (PLC), వ్యవసాయ రిస్క్ కవరేజ్ (ARC), మరియు విపత్తు సహాయంగా అందుతాయి. ఎక్కువ సబ్సిడీలు మొక్కజొన్న, సోయాబీన్, గోధుమ వంటి వాణిజ్య పంటలకు వెళ్తాయి.

కౌలు రైతులు సబ్సిడీలకు అర్హులైనప్పటికీ, చాలా సందర్భాల్లో భూమి యజమానులు (నాన్-ఆపరేటర్ ల్యాండ్‌ లార్డ్స్ ) సబ్సిడీ లను పొందుతారు, ఫలితంగా కౌలు రైతులకు తక్కువ మొత్తాలు లభిస్థాయి. సబ్సిడీలు పొందడానికి రైతు ఆదాయం సంవత్సరానికి 900,000 డాలర్ల కంటే తక్కువ ఉండాలి (జంటలకు 18 లక్షల డాలర్లు ), మరియు వారి కమతాల నుండీ వచ్చే కనీస ఆదాయాలు 1,000 డాలర్లు దాటాలి.

అమెరికాలో కౌలు రైతులు (tenant farmers) వ్యవసాయ రంగంలో ముఖ్యమైన భాగం. వీరు సొంత భూమి లేకుండా, ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని సాగు చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిళ్లు, భూమి ధరల పెరుగుదల, మరియు వాతావరణ మార్పుల వల్ల. గత కొన్ని దశాబ్దాలుగా కౌలు రైతుల పరిస్థితిలో మార్పులు చోటు చేసుకున్నాయి.

కౌలు రైతులు తరచూ అధిక అద్దె ఖర్చులు,పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు (విత్తనాలు, ఎరువులు, యంత్రాలు), మరియు అస్థిరమైన మార్కెట్ ధరలను ఎదుర్కొంటారు. భూమి యజమానులతో ఒప్పందాలు సాధారణంగా ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ కాలానికి ఉంటాయి, ఇది దీర్ఘ కాలిక పెట్టుబడులు లేదా భూమి సంరక్షణకు పెట్టుబడులు పెట్టడానికి అడ్డంకిగా మారుతున్నది. చాలా మంది కౌలు రైతులు చిన్న, మధ్య తరగతి వ్యవసాయ కుటుంబాల నుండి వస్తారు. వీరిలో యువ రైతులు మరియు మైనారిటీ సమూహాలు (ఆఫ్రికన్-అమెరికన్, హిస్పానిక్) కూడా ఉన్నారు, వీరికి సొంత భూమి కొనుగోలు చేసే ఆర్థిక సామర్థ్యం తక్కువగా ఉంటుంది.

అమెరికాలో కౌలు రైతుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది, క్రమంగా వ్యవసాయం పెద్ద కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లడమే ఇందుకు కారణం. అయితే, ఇప్పటికీ మొత్తం రైతుల్లో కౌలు రైతులు గణనీయమైన శాతాన్ని కలిగి ఉన్నారు.

అమెరికా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వివిధ రూపాల్లో సహాయం అందిస్తుంది. కౌలు రైతులు కూడా ఈ పథకాల నుండి లబ్ధి పొందవచ్చు. ఈ సహాయం అమెరికా వ్యవసాయ శాఖ ద్వారా అందుతుంది. పంట ధరలు పడిపోయినప్పుడు ఆదాయ భద్రత కోసం "ప్రైస్ లాస్ కవరేజ్" (PLC) మరియు "అగ్రికల్చరల్ రిస్క్ కవరేజ్" (ARC) వంటి కార్యక్రమాలు ఉన్నాయి. కౌలు రైతులు ఈ సబ్సిడీలకు అర్హులు, కానీ భూమి యజమాని అంగీకరిస్తేనే వీటిని పొందగలరు.

అమెరికా వ్యవసాయ శాఖ పరిధిలో ఫార్మ్ సర్వీస్ ఏజెన్సీ (FSA) ద్వారా తక్కువ వడ్డీ రుణాలు అందుబాటులో ఉన్నాయి. కౌలు రైతులు ఈ రుణాలను తీసుకుని విత్తనాలు, పరికరాలు, లేదా భూమికి కౌలు చెల్లించేందుకు ఉపయోగించుకోవచ్చు. ఫెడరల్ క్రాప్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, ధరల పతనం వల్ల రైతులకు కలిగే నష్టాల నుండి రక్షణ కల్పిస్తారు. కౌలు రైతులు కూడా ఈ బీమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అమెరికా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేచురల్ రిసోర్సెస్ కన్సర్వేషన్ సర్వీస్ (NRCS) ద్వారా భూమి సంరక్షణ, నీటి వినియోగం మెరుగుదల కోసం సలహాలు మరియు ఆర్థిక సహాయం అందుతుంది. అయితే, ఇది భూమి యజమాని సహకరిస్తేనే కౌలు రైతులకు కూడా అందుతుంది. కౌలు రైతులకు ప్రభుత్వ సహాయం అందినప్పటికీ, భూమి యజమానులతో ఒప్పందాలు, కౌలు ఒప్పందాల్లోని షరతులు వీరిని పరిమితం చేస్తాయి. ఉదాహరణకు, కొన్ని సబ్సిడీలు సాగు చేసే రైతుకు కాకుండా భూమి యజమానికి నేరుగా వెళతాయి,

అమెరికా వ్యవసాయ శాఖ 2017 గణాంకాల ప్రకారం అమెరికా మొత్తం సాగు భూమిలో సుమారు 39 శాతం భూమిని (దాదాపు 35-40 మిలియన్ హెక్టార్లు) కౌలు రైతులు సాగు చేస్తారు. ఈ శాతం రాష్ట్రాలను బట్టి మారుతుంటుంది—మధ్య పశ్చిమ రాష్ట్రాల్లో (ఇల్లినాయిస్, ఐవోవా) ఇది 50 శాతం కంటే కంటే ఎక్కువగా ఉంటుంది, తూర్పు, పశ్చిమ రాష్ట్రాల్లో కౌలు తక్కువగా ఉంటుంది. అమెరికా లో ఉన్న మొత్తం రైతుల్లో కౌలు రైతులు సుమారు 28 శాతం (దాదాపు 5,70,000 మంది) మాత్రమే ఉన్నారు. కానీ వీరు సాగు చేసే భూమి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వారికి తగిన ప్రాముఖ్యత ఉంది.

అమెరికాలో కౌలు రైతులు ఆర్థిక స్థిరత్వం కోసం ఇంకా పోరాడుతున్నప్పటికీ, ప్రభుత్వం నుండి ఒక మేరకు కొన్ని అంశాలలో సహాయం అందుతోంది. అయితే భూమిపై యాజమాన్య హక్కులు లేని కారణంగా ఈ సహాయం పూర్తిగా వారి సమస్యలను పరిష్కరించలేకపోతోంది . వారు సాగు చేసే 39 శాతం భూమి దేశ వ్యవసాయ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది, కానీ వారి భవిష్యత్తు మాత్రం భూమి ధరలు, ప్రభుత్వ వాణిజ్య విధానాలు, మరియు ప్రభుత్వం అందించే మద్దతుపై ఆధారపడి ఉంటుంది.

అమెరికాలో కౌలు రైతులకు ప్రభుత్వం సహాయం అందించడానికి భూమి యజమానులు అడ్డుపడకుండా , ప్రభుత్వం ఎటువంటి ప్రచారం, చర్యలు చేపడుతోంది ? అవి ఫలి తాలను ఇస్తున్నాయా ? కౌలు రైతులను గుర్తించడానికి అక్కడ చట్టాలు ఉన్నాయా ?

అమెరికాలో కౌలు రైతులకు (tenant farmers) ప్రభుత్వం సహాయం అందించడంలో భూమి యజమానుల (landowners) పాత్ర కీలకంగా ఉంటుంది, ఎందుకంటే చాలా సబ్సిడీలు మరియు సహాయ కార్యక్రమాలు భూమి యాజమాన్యంతో ముడిపడి ఉంటాయి. భూమి యజమానులు అడ్డుపడకుండా సహాయం అందించడానికి అమెరికా ప్రభుత్వం, ముఖ్యంగా యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ద్వారా, కొన్ని చర్యలు మరియు ప్రచారాలను చేపడుతోంది:

అమెరికా వ్యవసాయ శాఖ, దాని భాగస్వామి సంస్థలు (ఫార్మ్ సర్వీస్ ఏజెన్సీ - FSA, నేచురల్ రిసోర్సెస్ కన్సర్వేషన్ సర్వీస్ - NRCS) కౌలు రైతులకు, భూమి యజమానులకు సహాయ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు, వెబినార్లు, మరియు సమాచార సెషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రచారాలు కౌలు రైతులకు సహకరించేలా భూమి యజమానులను ప్రోత్సహిస్తాయి. కొన్ని సబ్సిడీలు భూమి యజమానులకు కూడా పరోక్షంగా లాభం చేకూరుస్తాయి (ఉదా : భూమి సంరక్షణ కార్యక్రమాలు). "Know Your Farmer, Know Your Food" వంటి కార్యక్రమాలు కౌలు రైతులు, యజమానుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టి పని చేస్తున్నాయి.

అమెరికా వ్యవసాయ శాఖ కౌలు రైతులు తమ ఒప్పందాలలో (lease agreements) సబ్సిడీలు మరియు బీమా ప్రయోజనాలను పొందే హక్కును చేర్చుకునేలా మార్గదర్శకాలు అందిస్తుంది. ఈ మార్గదర్శకాలు కౌలు రైతులకు ప్రభుత్వం చేసే సహాయాన్ని భూమి యజమానులు అడ్డుకోకుండా చూస్తాయి. "Farm Bill" (అగ్రికల్చరల్ యాక్ట్) ద్వారా కౌలు రైతులకు నేరుగా సహాయం అందేలా కొన్ని నిబంధనలు సవరించబడ్డాయి, ఉదాహరణకు, పంట బీమా (Federal Crop Insurance) కోసం భూ యజమాని అనుమతి అవసరం లేకుండా రైతు స్వతంత్రంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. .

"Price Loss Coverage" (PLC) మరియు "Agriculture Risk Coverage" (ARC) వంటి కార్యక్రమాలలో, సహాయం భూమి యజమానికి బదులు సాగు చేసే కౌలు రైతుకు నేరుగా చేరేలా అమెరికా వ్యవసాయ శాఖ కొన్ని నిబంధనలను సరళీకరించింది. ఈ నిబంధనలు యజమానులు కౌలు రైతులకు సహాయాన్ని ఆపేయడం లేదా తమకు మళ్లించు కోవడంవంటి సమస్యలను తగ్గిస్తాయని అమెరికా వ్యవసాయ శాఖ నమ్ముతోంది.

ఇటీవల కాలంలో కౌలు రైతులు కొంత మేరకు సబ్సిడీలను, రుణాలను సులభంగా పొందుతున్నారు. ఉదాహరణకు, 2018 ఫార్మ్ బిల్ తర్వాత, కౌలు రైతులకు పంట బీమా లభ్యత 20 శాతం పెరిగిందని అమెరికన్ వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. అలాగే, భూమి సంరక్షణ కార్యక్రమాలలో (EQIP - Environmental Quality Incentives Program) కౌలు రైతుల భాగస్వామ్యం కూడా మెరుగుపడింది.

అయితే, భూమి యజమానులు ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో కౌలు రైతులకు సహాయం అందకుండా అడ్డు కుంటున్నారు. ముఖ్యంగా ఒప్పందాలు మౌఖికంగా (అనధికారికంగా) (verbal agreements) ఉన్నప్పుడు అమెరికా వ్యవసాయ శాఖ అందించే సహాయం పూర్తిగా కౌలు రైతులకు చేరాలంటే, యజమానుల సహకారం లేదా చట్టపరమైన ఒప్పందాలు అవసరం. అమెరికాలో ఇది ఇప్పటికీ ప్రధాన సమస్య గా ఉంది. చిన్న కౌలు రైతులు, మైనారిటీ కౌలు రైతులు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.

అమెరికా లో కౌలు రైతులను గుర్తించడానికి నేరుగా జాతీయ స్థాయిలో ఒకే చట్టం లేదు, కానీ వివిధ రాష్ట్రాల్లో,ఆమెరికా వ్యవసాయ శాఖ కార్యక్రమాల ద్వారా కౌలు రైతుల గుర్తింపు విధానాలు ఉన్నాయి: కౌలు ఒప్పందాలు రాష్ట్ర చట్టాల ఆధారంగా జరుగుతాయి. ఉదాహరణకు, ఐవోవా,ఇల్లినాయిస్ వంటి రాష్ట్రాల్లో "Farm Tenancy Laws" ఉన్నాయి, ఇవి కౌలు రైతుల హక్కులను (భూమి సాగు, లీజ్ వ్యవధి) నిర్దేశిస్తాయి. ఈ చట్టాలు కౌలు రైతులను గుర్తించడానికి లీజ్ ఒప్పందాలను ఆధారంగా తీసుకుంటాయి.

అమెరికా వ్యవసాయ శాఖ కార్యక్రమాలలో (సబ్సిడీలు, రుణాలు) దరఖాస్తు చేసుకునేందుకు కౌలు రైతులు "Farm Operating Plan" సమర్పించాలి. ఇందులో భూమి కౌలు ఒప్పందం, లేదా భూమి యజమాని నుండి లిఖితపూర్వక అనుమతి అవసరం. ఈ పత్రాల ఆధారంగా వారిని గుర్తిస్తారు. చాలా కౌలు ఒప్పందాలు (ముఖ్యంగా చిన్న రైతుల విషయంలో) నోటి మాటలపై ఆధారపడి ఉంటాయి, ఇది చట్టపరమైన గుర్తింపును కష్ట తరం చేస్తుంది. దీన్ని పరిష్కరించడానికి USDA "Self-Certification" ఎంపికను కొన్ని కార్యక్రమాల్లో ప్రవేశపెట్టింది, కానీ ఇది పూర్తిగా విఫలమైంది.

అమెరికా లో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) 2016లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, వ్యవసాయం, అటవీ, మరియు మత్స్య రంగాల్లో పనిచేసే వారిలో ఆత్మహత్యల రేటు ప్రతి లక్ష మందికి 36.1 గా ఉంది, ఇది సాధారణ జనాభా రేటు ( 2022లో ప్రతి లక్ష మందికి 14.4,) కంటే గణనీయంగా ఎక్కువ. 2020 లో యూనివర్సిటీ ఆఫ్ ఐవోవా అధ్యయనం ప్రకారం, రైతులలో, వ్యవసాయ సంబంధిత వృత్తుల్లో ఉన్నవారిలో ఆత్మహత్యల రేటు ప్రతి లక్షకు 43.7 కు పెరిగింది. అమెరికాలో కౌలు రైతుల ఆత్మహత్యలను ప్రత్యేకంగా లెక్కించే జాతీయ గణాంకాలు లేవు. CDC లేదా ఇతర అధ్యయనాలు రైతులను వ్యవసాయ వృత్తిగా గుర్తించినప్పటికీ, వారు భూమి యజమానులా (owner-operators) లేదా కౌలు రైతులా అనే విభజన స్పష్టంగా చేయలేదు.

కౌలు రైతులు అద్దె ఖర్చులు, అస్థిరమైన లీజ్ ఒప్పందాలు, మరియు భూమిపై దీర్ఘకాలిక నియంత్రణ లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంతున్నారు. ఇవి సాధారణ రైతుల కంటే వీరిపై ఎక్కువ ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తాయి. అమెరికా వ్యవసాయ సబ్సిడీలు, పంట బీమా వంటి సహాయ కార్యక్రమాలు తరచూ భూమి యజమానుల అనుమతి పై ఆధారపడి ఉంటాయి, దీనివల్ల కౌలు రైతులు పూర్తి ప్రయోజనం పొందలేకపోతున్నారు.

ఈ అసమానత కౌలు రైతులలో మానసిక ఒత్తిడిని పెంచవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సేవల కొరత కౌలు రైతులను కూడా ప్రభావితం చేస్తుంది, వారి ఆర్థిక అస్థిరత వారిని మరింత దుర్బలంగా మారుస్తుంది. నేషనల్ ఫార్మర్స్ యూనియన్ (NFU) వెలువరించే నివేదికలు కూడా రైతుల మానసిక, ఆరోగ్య సంక్షోభంపై చర్చిస్తున్నాయి కానీ, కానీ కౌలు రైతులను ప్రత్యేకంగా విశ్లేషించే అధ్యయనాలు చేయడం లేదు.

మన ప్రభుత్వాలకు , మన మధ్యతరగతి ప్రజలకు అమెరికా పై ఆసక్తి ఎక్కువ. అమెరికా అభివృద్ధి నమూనా లో నడవలని ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో అమెరికాలో కౌలు రైతులకు కూడా న్యాయం చేయడానికి అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్ధతులు, కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధ్యయనం చేసి తెలంగాణ లో కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలని మనం కోరుకుందాం.

Read More
Next Story