‘ఇథనాల్ ప్లాంట్ వద్దు’ సభ పెట్టుకోండి,  షరతులు వర్తిస్తాయి...
x

‘ఇథనాల్ ప్లాంట్ వద్దు’ సభ పెట్టుకోండి, షరతులు వర్తిస్తాయి...

ప్లాంటుకు KCR ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూ ఉంది. స్థానిక ప్రజల అభిప్రాయాలకు పూచిక పుల్ల విలువ లేదిపుడు కూడా.


2023 డిసెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చుకున్న తెలంగాణ ప్రజలిప్పుడు పది నెలల తరువాత రాష్ట్రంలో ప్రజల నుండీ వినపడుతున్న నిర్ధిష్ట డిమాండ్ల వైపు, ఆందోళనలతో ముందుకు వస్తున్న ప్రజా సమూహాల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ డిమాండ్లు, ప్రజా కదలికలన్నీ, రాష్ట్రంలో వేగంగా అమలవుతున్న, గతం నుండీ కొనసాగుతున్న అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్నవే. ఏ అభివృద్ధి కయినా ప్రజలు, ప్రజా సంక్షేమం, పర్యావరణం కేంద్రంగా ఉండాలని ప్రజా పక్ష సంస్థలు, బుద్ది జీవులు సూచిస్తున్నా, ప్రస్తుత ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వ తరహాలోనే ముందుకు వెళుతుండడం ఈ ప్రజా ఆందోళనలకు ప్రధాన కారణం.

నిజానికి గత పదేళ్ళ KCR ప్రభుత్వ నిరంకుశ పాలన లో ప్రజలు అన్ని హక్కులను కోల్పోయారు. కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కేంద్రంగా అప్పటి ప్రభుత్వ పాలన సాగింది. ఈ ఏకపక్ష, ఏక వ్యక్తి పాలన నుండీ బయట పడడానికి రాష్ట్ర ప్రజలు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో దేశంలో మోడీ ప్రభుత్వం కూడా పదేళ్ళపాటు ఫాసిస్టు పాలన సాగించి, ప్రజల పౌర హక్కులను పూర్తిగా హరించింది.

కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో గెలిపించడానికి , అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన ప్రజా పాలన నినాదం ఒక ప్రధాన కారణం. ప్రజాస్వామిక పాలన 7 వ గ్యారంటీగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించినప్పుడు ప్రజలు నమ్మారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రజా భవన్ గా మారిన ప్రగతి భవన్ లో ప్రజల నుండీ వారానికి రెండు సార్లు దరఖాస్తులు తీసుకోవడం కొనసాగుతుంది కానీ, మారు మూల గ్రామాలలో, నగర బస్తీలలో మాత్రం, ప్రభుత్వం నుండీ ప్రజాస్వామిక స్పూర్తి అడుగంటుతున్నది.

వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో 12 లక్షల చెట్లను కొట్టేస్తూ, 2900 ఎకరాల సహజ అడవిని, స్థానికంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా , ఏకపక్షంగా , రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం నావికా దళానికి రేవంత్ ప్రభుత్వం కట్టబెట్టడం ఇందుకో ఉదాహరణ. నిజానికి ఈ ప్రాజెక్టుకు అటవీ భూములను ఇవ్వడానికి ముందుగా అంగీకరించింది, ఒప్పందం చేసుకున్నది KCR ప్రభుత్వమే అయినా, దానిని రద్ధు చేయకుండా, ముందుకు తీసుకు వెళ్ళింది మాత్రం రేవంత్ ప్రభుత్వం. స్థానిక ప్రజల, ప్రజా సంఘాల, పర్యావరణ వేత్తల అభిప్రాయాలకు పూచిక పుల్ల విలువ కూడా ఇవ్వకుండా, గత ప్రభుత్వం లాగే రేవంత్ ప్రభుత్వం కూడా, దేశ రక్షణ అవసరాల పేరుతో, ఈ ప్రాజెక్టుకు అండగా నిలబడింది.న ప్రజల ఆందోళనలను పట్టించు కోకుండా, దగ్గరుండి ప్రాజెక్టు పనులు కొనసాగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ప్రజాభిప్రాయానికి, ప్రజా పాలన స్పూర్తికి తూట్లు పొడవడమే.

హైదరాబాద్ నగరం నడి బొడ్డులో చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కూడా ఈ ప్రభుత్వ దుందుడుకు వైఖరికి మరో ఉదాహరణ. నిజానికి ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కూడా KCR ప్రభుత్వం చేపట్టి ముందుకు తెచ్చిందే. ఈ ప్రభుత్వం మూసీ తీర ప్రాంత ప్రజల ఘోషను పట్టించుకోకుండా, కాలుష్య మూసీ నదిని, మంచి నీళ్ళ నదిగా మారుస్తామనే బృహత్ ప్రణాళికతో, వీలైతే వేల కోట్ల ప్రపంచ బ్యాంకు అప్పుతో నిర్మిస్తామనే ప్రణాళికలతో , మూసీ చుట్టూ నివసిస్తున్న పేద, మధ్యతరగతి ఇళ్ల పైకి బుల్డోజర్లను పంపుతున్నది. ఇళ్లపై, RB-X అనే ముద్రలు వేస్తున్నది. రివర్ బెడ్, బఫర్ జోన్ పేరుతో, బస్తీలలో, కాలనీ లలో గీతలు గీస్తున్నది . ఇప్పటి వరకూ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సమగ్ర నివేదిక తయారు కాలేదు. పారిశ్రామిక వ్యర్ధాలు, నగర వ్యర్ధాలు, మురికి నీరు మూసీ నదిలో కలవడం ఆగలేదు కానీ, అర్జంట్ ప్రాతిపదికన పేదల ఇళ్ళు మాత్రం కూలుతున్నాయి. ప్రభుత్వ ఈ వైఖరితో, ఆ ప్రాంత ప్రజలు తీవ్రమైన ఆందోళనలతో జీవిస్తున్నారు.

రాజకీయ పార్టీలు అవకాశవాదంతో వ్యవహరిస్తున్నా, పౌర, ప్రజా సంఘాల మద్ధతుతో, ఇప్పుడిప్పుడే ప్రజలు తమ గొంతు విప్పి మాట్లాడు తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు, ప్రజల ముందు పెడుతున్నారు. ప్రభుత్వ బుల్డోజర్ దూకుడును ఆపడానికి ఐక్యమవు తున్నారు. బస్తీలలో సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. కోర్టులలో కేసులు కూడా దాఖలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆందోళనలను పట్టించుకుని, ప్రజలతో, పౌర సమాజంతో, ప్రజా సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తే ఆందోళనలు ఆగుతాయి. కేవలం తమను రాజకీయంగా విమర్శిస్తున్న అదే స్థాయిలో రాజకీయంగా బీఆర్ఎస్ నాయకులకు జవాబు ఇస్తే సరిపోతుంది అనుకుంటే, ప్రజల చైతన్య శక్తిని తక్కువ అంచనా వేస్తున్నట్లే.

రాష్ట్రంలో ప్రజల కోణంలో అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయం రాష్ట్ర వ్యాపితంగా 29 ఇథనాల్ కంపనీలకు అనుమతులు ఇవ్వడం. కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ పాలసీకి అనుగుణంగా పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలిపేందుకు అనుగుణంగా దేశ వ్యాపితంగా ఇథనాల్ పరిశ్రమలు వస్తున్నాయి. బియ్యం, జొన్న, మొక్క జొన్న ఆధారంగా తయారయ్యే ఇథనాల్ ఇది.

రైతులకు సంవత్సరం పొడవునా ,ఆదాయం, స్థానిక యువతకు ఉపాధి, పరిశ్రమ చుట్టూ ఉండే గ్రామాల అభివృద్ధి దేశంలో పర్యావరణ హితమైన ఇంధనం తయారీ పేరుతో వస్తున్న ఈ పరిశ్రమలు వాస్తవానికి రైతులకు ఏ మాత్రం లాభం కల్పించవు. రైతుల నుండీ కనీస మద్ధతు ధరలతో ఒక్క గింజ కూడా ఈ పరిశ్రమలు నేరుగా కొనవు. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తాయన్న గ్యారంటీ అసలు లేదు. పైగా ఈ ఇథనాల్ పరిశ్రమ ఆయా గ్రామాల, పంట పొలాల మధ్యలో అత్యంత వాయు , జల కాలుష్యానికి కారణమవుతున్నాయని, అనేక చోట్ల నుండీ ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలో నారాయణ పేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామంలో గత రెండేళ్లుగా ఇథనాల్ ను ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమ సృష్టిస్తున్న కాలుష్యం అంతా ఇంతా కాదు.

ఈ పరిస్థితులు ఏ మాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహా, ఇతర ప్రభుత్వ శాఖలు రాష్ట్రంలో ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులు ఈజీగా ఇచ్చేస్తున్నాయి. పైగా ఆ పరిశ్రమ పక్షాన వకాల్తా పుచ్చుకుని, పరిశ్రమ ఏర్పాటు ప్రయోజనాలపై ప్రజలకు నచ్చ చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను కాలుష్య నియంత్రణ మండలి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆయా పరిశ్రమలపై చర్యలు తీసుకోవడం లేదు. ప్రజల దరఖాస్తులకు జవాబు కూడా ఇవ్వడం లేదు. పైగా కాలుష్య నియంత్రణ మండలి ఈ పరిశ్రమలకు అనుకూలంగా గ్రామాలలో పోస్టర్స్ వేసి ప్రచారం చేస్తున్నది.

ఈ నేపధ్యంలో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రానికి దగ్గరలో ఏర్పాటవుతున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా అక్కడి స్థానిక ప్రజలు సంవత్సర కాలంగా పోరాడుతున్నారు. చిత్తనూరు వెళ్ళి అక్కడి ప్రజలతో చర్చించి, పరిస్థితులను లోతుగా అర్థం చేసుకున్నాక, దిలావర్పూర్ ప్రజలు, చాలా గట్టిగా, తమ ప్రాంతంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు చేసుకుని పోరాడు తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. గత 90 రోజులుగా గ్రామంలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. గత డిసెంబర్ లో నిర్మాణ మవుతున్న ఫ్యాక్టరీ ప్రాంగణం ముందు ప్రజలు ఆందోళన చేస్తే, 57 మందిపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది . ఆ తరువాత కూడా ప్రజల ఆందోళనలను అణచి వేయడానికి పోలీసులు కొన్ని కేసులు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాలలో ప్రజలు అడిగిన ఏ ప్రశ్నకూ కంపనీ ప్రతినిధులు జవాబులు ఇవ్వలేదు. పర్యావరణ కాలుష్యం కోణంలో మానవ హక్కుల వేదిక నాయకులు, పర్యావరణ వేత్త, ప్రజల సైంటిస్టు డాక్టర్ కలపాల బాబూరావు గారు లేవనెత్తిన పలు ప్రశ్నలకు కూడా కంపనీ యజమానులు జవాబులు దాట వేశారు.

ఈ పరిస్థితులలో దిలావర్ పూర్ గ్రామంలో అక్టోబర్ 10 న ఒక బహిరంగ సభ నిర్వహించి, ఇథనాల్ పరిశ్రమపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని పోరాట కమిటీ నిర్ణయించింది. సభ నిర్వహణకు పోలీసుల అనుమతి కోరింది. జిల్లా పోలీసు అధికారి నిర్వాహకులను పిలిచి , దసరా తరువాత సభ నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేసింది. నిర్వాహకులు అంగీకరించి సభను అక్టోబర్ 16 కు వాయిదా వేశారు. కానీ పోలీసు అధికారులు ఇచ్చిన మాట తప్పి , సభ నిర్వహణకు అనుమతిని నిరాకరించారు. పైగా పోరాట కమిటీ బ్యాంకు అకౌంట్ ను బ్యాంక్ మేనేజర్ పై ఒత్తిడి తెచ్చి ఫ్రీజ్ చేయించారు.

అనివార్యమైన స్థితిలో పోరాట కమిటీ రాష్ట్ర హైకోర్టులో రిట్ దాఖలు చేసి సభా నిర్వహణకు అనుమతి మంజూరు చేయించాలని కోరింది. రెండు రోజుల వాదనల అనంతరం అక్టోబర్ 18 న సభ నిర్వహించుకునేందుకు రాష్ట్ర హైకోర్టు అనుమతిని మంజూరు చేస్తూ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సభా నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మండలంలో వివిధ గ్రామాలకు చెందిన వేలాదిమంది ప్రజలు స్వచ్చంధంగా ఈ సభలో పాల్గొంటున్నారు.

ప్రొఫెసర్ కోదండరామ్ సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ప్రజలకు సంఘీభవంగా తరలి వెళుతున్నారు. ఈ సారి కోర్టు విచారణలో విచిత్రం ఏమంటే, కంపనీ కూడా కేసులో ఇంప్లీడ్ అయి, కోర్టు తన వాదనలు కూడా వినాలని, సభకు అనుమతి ఇవ్వకూడదని వాదించడం, ఇది ప్రమాదకరమైన కొత్త ట్రెండ్. ప్రభుత్వాలు పరిశ్రమల యాజమానుల పక్షం తీసుకున్నప్పుడే ఈ ధైర్యం పరిశ్రమల యజమానులకు వస్తుంది. ఇప్పడు ఆర్టికిల్ 19 ఆధారంగా ప్రజలకు ఉండే కనీస ప్రజాస్వామిక హక్కును కాలరాయడానికి పారిశ్రామిక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయని ఈ ఘటన మనకు నేర్పే అంశం. తస్మాత్ జాగ్రత్త..

Read More
Next Story