
పూడు పాము: మూఢ విశ్వాసాలకు బలవుతున్న ‘రైతు నేస్తం
ప్రపంచంలో అత్యధిక స్మగ్లింగ్ అవుతున్న పాము కాని పాము కథ ఇది
రెండుతలల పామును ( పూడు పాము లేదా రెడ్ శాండ్ బోవ (Red Sand బోయే)) చంపితే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రు. 25 వేల జరిమానా విధించడం జరగుతుందని ఆ మధ్య తెలంగాణ అటవీ శాఖ ఒక హెచ్చరిక చేసింది.దీనికి కారణం ఈ రకం పాములను పట్టుకుని విదేశాలకు స్మగ్లింగ్ చేయడం పెరుగుతూ ఉండటమే. 2021 సెప్టెంబర్ లో శాండ్ బోవ పామును విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. పాము ను కొంటామని సాకుతో స్మగ్గర్లను చేరుకుని వారిని అరెస్టు చేశారు. 2023లో సైబరాబాద్ పోలీసులు ఒక ముఠాను పట్టుకుని వారి దగ్దిర ఉన్న రెండు పాముపాములను విడిపించి అడవిలో వదలిపెట్టారు.
ఇలాడే ఆంధ్రప్రదేశ్ కూడా ఇటీవల అటవీశాఖ అధికారులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రెండు పూడు పాములను స్వాధీనం చేసుకున్నారు. ఈ పాములను వెంటనే సురక్షిత ప్రదేశానికి తరలించి, నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం కేసులు నమోదుచేశారు.
ఇటీవల తరచుగా ఇలాంటి వార్తలే వార్తాపత్రికలలో చోటుచేసుకొంటున్నాయి. రెండు తలల పాము లేదా పూడు పాములపై మనలో వున్న అపోహలు మోసగాళ్ల పాలిట అదృష్టమయి ప్రజలను దురదృష్టంలోకి నెడుతున్నాయి.
ప్రజలు ఈ మోసగాళ్ల ప్రలోభాలకు లోనయి భారీగా నష్టపోతున్నారు.ఇటువంటి పరిస్థితులలో ఈ పాముల గురించి నిజానిజాలు తెలుసుకోవడం ఎంతో అవసరం
రెండు తలల పామా? మాయలో పడకండి – ఇది శాంతియుత ‘సాండ్ బో’ పాము!
పాము అనే పదం వినపడితే చాలు మనలో చాలా మంది భయంతో బిగుసుకు పోతుంటారు. కానీ కొన్ని పాములు అసలే హానికరం కావు. అలాంటి వాటిలో ముందువరుసలో నిలుస్తుంది ‘ఇండియన్ సాండ్ బో’ (Indian Sand Boa). ఈ పాము విషరహితం, శాంతియుతం, ఇంకా పర్యావరణానికి ఉపయోగపడే జాతి.
కానీ ప్రజలలో వున్న తప్పుడు నమ్మకాల వల్ల ఈ పాములు వేటకు, అక్రమ రవాణాకు గురవుతున్నాయి.ప్రపంచంలో అత్యంత అధికంగా అక్రమ రవాణా అయ్యే జంతువుల్లో ఇదొకటి. మోసగాళ్లు ఈ పాములకు "రెండు తలల పాము", "నాగమణి పాము" అంటూ పేరుపెట్టి ప్రజలను మోసం చేస్తుంటారు.
భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోని మూఢనమ్మకాలు, పురాణ ప్రస్తావనలు ఈ పూడు పాముల ఎర్ర ఇసుక బో ల అక్రమ వ్యాపారానికి ఆజ్యం పోశాయనడం లో సందేహం లేదు.
రెండు తలల పాము కాదు – ఒక తలే!
పూడు పాము (సాండ్ బో పాము) శరీర నిర్మాణం కారణంగా రెండు తలలతో ఉందనే అపోహ కలుగుతుంది. దీని తోక తల మాదిరిగా ఉండటమే ఇందుకు కారణం. కానీ శాస్త్రపరంగా చూస్తే, ఇది అన్ని ప్రాణుల్లాగే ఒకే తల కలిగిన సాధారణ పాము మాత్రమే.
ఈ పాము పూర్తిగా విషరహితం. మనుషులకు దీని వల్ల ఎటువంటి హానీ కలగదు. కానీ మానవులు భయంతో చంపేస్తున్నారు. ఇది పాములపై అవగాహన లోపాన్ని చూపిస్తోంది
సాండ్ బోవా పాము పగలంతా భూమిలో పొరలలో వుంటూ రాత్రిపూట బయటకు వచ్చి ఎలుకలు, చిన్న జంతువులను వేటాడుతుంది. ఇది పంటలకు హానిచేసే కీటకాలను నియంత్రించే ప్రకృతి సహాయకారి. అందుకే ఈ పాము రైతు నేస్తం.
అక్రమ వేట – మాయగాళ్ల వలలో అమాయకులు.
కొందరు దీన్ని "నాగమణి కలిగిన పాము" అని చెప్పి ఈ పాములను లక్షల రూపాయలకు కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ శాస్త్రీయంగా నాగమణి అనే విషయం అసత్యం. ఇదంతా మోసం.
గ్రామీణ ప్రాంతాలలో ఈ పాములపై వివిధ విచిత్ర కధనాలు ప్రాచుర్యంలో వున్నాయి వాటిలో కొన్ని : ఈ పాము భూమిలో దాచిన నిధులకు దారి చూపిస్తుందని , లేదా ఈ పామును ఇంట్లో ఉంచుకుంటే ఐశ్వర్యం వస్తుందని, పాము ఎంత బరువు ఉంటే అంత సంపదను ఆకర్షిస్తుందని అపోహ పడుతున్నారు.
కొందరు మోసగాళ్లు ప్రజలలో వున్నా అపోహలను ఆసరా చేసుకొని ఈ ‘పూడు పాము’ల బరువును పెంచడానికి చిన్న చిన్న ప్లాస్టిక్ గొట్టాలను లేదా సీసపు బంతులను పాములు మింగేలా చేస్తారు.,ఇది పాముకు హాని కలిగించడమే కాకుండా కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవుతావుంది.
తమిళనాడు లోని స్మగ్లర్స్ కేరళ, తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్ణాటకలలో క్రీ.శ 1000 మరియు 1300 మధ్య ఉల్కాపాతం జరిగిందని అప్పుడు భూమిపై పడిన ఇరిడియం ఐసోటోప్ ఈ పాముల కణజాలాలలో పేరుకుపోయిందని ప్రజలకు నమ్మబలుకుతున్నారు.
ఈ 'బయో-ఇరిడియం' పాములకు అతీంద్రియ లక్షణాలను ఇచ్చిందని , ఈ పాము నుండి సేకరించిన రక్తం ఎయిడ్స్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయగలదని నమ్మబలుకుతుండటంతో ఇతర దేశాలకు వీటి అక్రమ రవాణా జోరుగా సాగిస్తున్నారు . ఇంకొంతమంది మోసగాళ్లు పాము నుండి వచ్చే బయో-ఇరిడియం అనే పదార్థం బియ్యాన్ని ఆకర్షిస్తుందని , అదృష్టాన్ని తెస్తుందని ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు, కానీ ఇవ్వన్నీ వాస్తవానికి నిరాధారమైన అపోహలు మాత్రమే. కానీ ఇవ్వన్నీ అపోహలే.
గల్ఫ్ దేశాలలో ఈ పాము రక్తం కామోద్దీపనగా పనిచేస్తుందని కొంతమంది భావిస్తారు. ఈ అపోహ ఈ పాముల అక్రమ వ్యాపారానికి కారణం అవుతున్నాయి. `
పూడు పాములు బియ్యాన్ని ఆకర్షించే (రైస్ పుల్లింగ్ )మాట దేవుడెరుగు కానీ జనాలలోని ఈ అపోహలు ఈ పూడు పాములకు దురదృష్టాన్ని తెస్తున్నాయి. దీనితో ఈ పాముల స్మగ్గింగ్ పెరిగిపోయి, చివరకు ఈజాతిఅంతరించే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ పామును IUCN(International Union for Conservation of Nature) రెడ్ లిస్టులో ‘దాదాపు అంతరించిపోతున్న’ (Near Threatened) క్యాటగరిలో చేర్చారు. భారతదేశం కూడా ఈ పామును 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం (Wildlife Protection Act, 1972) కింద రక్షిత జంతవుగా ప్రకటించింది. అయినా సరే, ఈ పాములను పట్టుకోవడం, అక్రమంగా రవాణా చేయడం జరుగుతూనే ఉంది.
ఈ విషయాలను బాలపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి గారితో ప్రస్తావించినప్పుడు ఈ పాముచుట్టూ అల్లుకున్న కథనాలలో ఏదీ నిజం కాదని అన్నారు. ఈ పామును పట్టుకోవడం, అలా విదేశాలకు అక్రమరవాణ చేయడం ‘ఒక వ్యవస్థీకృత నేరం’ అని ఆయన అన్నారు.
ఈ పూడు పాముల అక్రమ వ్యాపారం ఏదో ఒక ప్రాంతానికి కానీ లేదా మూఢనమ్మకాలను నమ్మే చదువురాని వ్యక్తులకు మాత్రమే పరిమితం కాదు, విద్యావంతులు, డబ్బు ఉన్న బాగా స్థిరపడిన వ్యక్తులు కూడా మూఢ నమ్మకాలతో అక్రమ రవాణాలో పాల్గొంటున్నారని ఒక నివేదిక పేర్కొనింది.
ఈ పాముల అక్రమ వ్యాపారం వలన , సాధారణంగా ఉండే ప్రాంతాలలో కూడా వాటి జనాభా తగ్గుతోందని స్థానిక వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రక్షణలో ఉన్న జాతి – చట్టపరంగా పట్టడం నేరం
ఇండియన్ సాండ్ బోవ పాము భారతదేశం వన్యప్రాణుల సంరక్షణ చట్టం (1972) ప్రకారం రక్షిత జాతి అయినందున దీనిని పట్టడం, అమ్మడం, పెంచడం కూడా నేరమని , మోసగాళ్ల మాటలు నమ్మి ఈ పాము వేటలో పాల్గొనటం వలన జైలుశిక్ష కూడా పడుతుందని ప్రభాకర్ రెడ్డి అన్నారు .
ప్రజల కర్తవ్యం – అపోహలు వీడి అవగాహన పెంపొందించాలి
పాఠశాల స్థాయిలోనే పిల్లలకు పాములపై శాస్త్రీయ అవగాహన కల్పించాలి. గ్రామాల్లో పోలీస్, అటవీ శాఖల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మోసాలకు గురవుతున్న ప్రజలకు సాయం చేయాలి.
ఎవరైనా ఈ పాము ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రకృతిని రక్షించండి – మూఢనమ్మకాలను కాదు.