దక్షిణాది ఉపఎన్నిక ఎంచుకున్న తొలి నెహ్రూ కుటుంబ సభ్యురాలు
అన్న నెహ్రూ మృతితో విజయలక్ష్మి ఫూల్‌పుర్ నుంచి పోటీచేసి గెలిస్తే రాహుల్ రాజీనామాతో వయనాడ్ నుంచి ప్రియాంక!
–నాంచారయ్య మెరుగుమాల
మొదటి ప్రధానమంత్రి జవాహర్‌లాల్ నెహ్రూ పెద్ద చెల్లెలు విజయలక్ష్మీ పండిత్ సరిగ్గా 60 సంవత్సరాల క్రితం 1964 నవంబర్ 22న జరిగిన ఫూల్‌పుర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆరు దశాబ్దాల తర్వాత 2024 నవంబర్ 13 వయనాడ్ పార్లమెంటు ఉప ఎన్నికలో తొలిసారి పోటీకి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాందీ చెల్లెలు ప్రియాంకా గాంధీ వాడ్రా సిద్ధమౌతున్నారు.
పెళ్లయ్యాక అత్తవారి ఇంట విజయలక్ష్మిగా మారిన మోతీలాల్ నెహ్రూ పెద్ద కుమార్తె సరూప్‌కుమారి తన అన్న జవాహర్ అదే ఏడాది మే 27న కన్నుమూయడంతో సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఖాళీ అయిన ఫూల్‌పుర్ నుంచి పోటీచేయాల్సి వచ్చింది. అలాగే, మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో యూపీలోని ‘కుటుంబ నియోజవకర్గం’ రాయబరేలీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా గెలిచిన రాహుల్ దక్షిణాది స్థానానికి రాజీనామా చేయడంతో నెహ్రూ–గాంధీ కుటుంబానికి చెందిన ఐదో మహిళగా ప్రియాంక తొలిసారి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు.
60 సంవత్సరాల తేడాతో ఈ రెండు కీలక ఉప ఎన్నికల సమయం నవంబర్ కావడం యాదృచ్ఛికం. నెహ్రూ సోదరి విజయలక్ష్మి బ్రిటిష్‌వారి హయాంలో యూపీ (యునైటెడ్ ప్రావిన్స్) ప్రొవిన్షియల్ అసెంబ్లీకి 1937లో 36 ఏళ్ల వయసులోనే ఎన్నికయ్యారు. ఆమె భారత పార్లమెంటుకు పోటీచేసిన తొలి నెహ్రూ కుటుంబ మహిళగా చరిత్రకెక్కారు. ఇప్పుడు 52 ఏళ్ల ప్రియాంక తన ముత్తాత నెహ్రూ సోదరి విజయలక్ష్మి అడుగుజాడల్లో నడుస్తూ సోదరుడు గెలిచిన సీటు నుంచి (వయనాడ్) ఉప ఎన్నికలో పోటీచేయడం విశేషం.
నాడు విజయలక్ష్మి ప్రథమ భారత రాజకీయ కుటుంబంగా పరిగణించే నెహ్రూ పరివారం సొంత రాష్ట్రం యూపీలోని సొంతూరు అలహాబాద్ భాగంగా ఉన్న సీటు ఫూల్‌పుర్ నుంచి మొదటిసారి ఎన్నికలో పోటీచేస్తే, ప్రియాంక మాత్రం తొలి ఎన్నికల యుద్ధం తాను పుట్టిపెరిగిన ప్రాంతానికి వేల కిలోమీటర్ల దూరంలోని దక్షిణాది నియోజకవర్గంలో చేయాలని నిర్ణయించుకోవడం ఆసక్తికర పరిణామం. వయసులో 72 సంవత్సరాల వ్యత్యాసం ఉన్న ఈ ఉన్నత కుటుంబ మహిళలు ఇద్దరూ తమ సోదరులకు అత్యంత ఇష్టమైన చెల్లెళ్లుగా భారత ప్రజలకు తెలిసిన ముఖాలు. అయితే, 64 ఏళ్ల వయసులో ఫూల్‌పుర్ ఉప ఎన్నికలో పోటీచేసే నాటికి విజయలక్ష్మి ఐరాస జనరల్ అసెంబ్లీ 8వ ప్రెసిడెంట్ (1953–54), మహారాష్ట్ర గవర్నర్ (1962–64) వంటి అధికార పదవులు నిర్వహించగా, ప్రియాంక ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పదవులకే పరిమితమయ్యారు.
మేనత్త కన్నా ముందే పార్లమెంటుకు ఇందిరమ్మ
ప్రధాని లాల్‌బహాదుర్ శాస్త్రి, ఇతర కాంగ్రెస్ నేతల మద్దతుతో తాను పుట్టిపెరిగిన ప్రాంతంతో కూడిన పూల్‌పుర్ నియోజకవర్గం నుంచి నుంచి విజయలక్ష్మి 1964 శీతాకాలం పార్లమెంటుకు పోటీచేయగా, నాటి సోషలిస్టు దిగ్గజం డా. రాంమనోహర్ లోహియా ఆమెకు వ్యతిరేకంగా తన పార్టీ అభ్యర్ధి సాలిగ్రామ్ జైస్వాల్ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ‘‘మాజీ ప్రధాని చెల్లెలైన విజయలక్ష్మి సౌందర్యం చూసి మోసపోవద్దు, ఆమె లోపల ఉన్నదంతా స్వచ్ఛమైన విషం,’’ అని ఆయన నిప్పులు చెరిగారు.
‘‘ వృద్ధాప్యంలో ఇంటికి తిరిగొస్తున్న మహిళను నేను. నేను ఉండడానికి ఒక గది మీరు ఇవ్వకపోతే నేను ఎక్కడికి పోవాలి?’’ అంటూ ఆమె ఓటర్ల మనసులను ఆకట్టుకున్నారు విజయలక్ష్మి. ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా, ఇతర ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ‘నెహ్రూ కుటుంబ అహంభావం’ ప్రదర్శించారనే విమర్శలు ఎదుర్కొన్న పండిత నెహ్రూకు ప్రియ సోదరి ఫూల్‌పుర్‌లో మాత్రం కాలినడకన ఓటర్లను కలుసుకున్నారు. వినయ వినమ్రతలకు మారుపేరు అయినట్టు జనంతో ఆమె కలిసిపోయి ఓట్లు అభ్యర్థించారు. మొత్తం 25 రోజుల ఎన్నికల ప్రచార కాలంలో ఆమె రైతుల ఇళ్ల మధ్య టెంటు వేసుకుని నియోజకవర్గంలో బసచేశారు.
వాస్తవానికి ఆమెతో పోల్చితే అధికారం, డబ్బు లేని సోషలిస్ట్ అభ్యర్థి జైస్వాల్ నానా తిప్పలుపడి ఎర్రజెండా కట్టిన మోటర్‌సైకిల్ ముందు పరిగెత్తుతుండగా వెనక ఉన్న కారులో తిరుగుతూ ప్రచారం చేశారు. తాము గెలిస్తే ఆహారధాన్యాల ధరలు తగ్గిస్తామన్న సోషలిస్టు పార్టీ హామీ స్థానిక రైతులకు నచ్చలేదు. తిండిగింజలు పండించే రైతన్నలకు గిట్టుబాటు ధర లభించకపోవడం అప్పుడూ పెద్ద సమస్యే.
చివరికి జైస్వాల్‌పై విజయలక్ష్మి పండిత్ 36,183 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు 1,10,549, జైస్వాల్‌కు 52,529 ఓట్లు పోలయ్యాయి. ప్రధాని శాస్త్రి మద్దతుతో పోటీచేసిన ఆమె తర్వాత ఏమాత్రం మొహమాటం లేకుండా ఆయన సర్కారుపై విమర్శలు చేయడం విశేషం.
తనకంటే ముందు 1964 ఆగస్ట్‌లో సొంత రాష్ట్రం యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మేనకోడలు ఇందిరాగాంధీని కాంగ్రెస్ ప్రధాని శాస్త్రి ఎన్నికైన వెంటనే తన మంత్రివర్గంలో చేర్చుకుని సమాచార, ప్రసార శాఖ కట్టబెట్టారు. కాని, అందరూ అంచనావేసినట్టు విజయలక్ష్మికి తన కేబినెట్‌లో స్థానం కల్పించలేదు. ఏడాదిన్నర లోపే 1966 జనవరిలో లాల్‌బహాదుర్ మరణంతో ఇందిర ప్రధాని అయ్యారు. సంవత్సరం పైగా గడిచాక జరిగిన 1967 మార్చి పార్లమెంటు ఎన్నికల్లో విజయలక్ష్మి మరోసారి ఫూల్‌పుర్ నుంచి పోటీచేసి డా.లోహియా నాయకత్వంలోని సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్ ఎస్ పి ) అభ్యర్థి జనేశ్వర్ మిశ్రాను 36,183 ఓట్ల మెజారిటీతో ఓడించి రెండోసారి వరుస విజయం సాధించారు.
తర్వాత కేంద్రంలో ఏర్పడిన కాంగ్రెసేత సర్కార్లలో మిశ్రా కేంద్రమంత్రిగా పనిచేయడమేగాక ‘చోటా లోహియా’ యూపీలో ప్రముఖనేతగా ఎదిగిన విషయం తెలిసిందే. రెండేళ్ల తర్వాత మారిన దేశ రాజకీయ పరిస్థితులకు ఇమడలేక, మేనకోడలితో సత్సంబంధాలు లేక విజయలక్ష్మి 69 ఏళ్ల వయసులో 1969లో లోక్‌సభకు రాజీనామా చేశారు.
ఎంపీగా ఎన్నికయ్యాక కూడా రాజకీయాల నుంచి వైదొలిగిన తొలి నెహ్రూ–గాంధీ కుటుంబ మహిళగా చరిత్రలో స్థానం సంపాదించారు విజయలక్ష్మి. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977లో లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయ సన్యాసం నుంచి బయటికొచ్చిన నెహ్రూ జీ పెద్ద చెల్లెలు జనతాపార్టీ తరఫున మేనకోడలు ఇందిరకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేసి సంచలనం సృష్టించారు. తర్వాత రాష్ట్రపతి పదవికి జనతా పార్టీ నాయకత్వం తనను నామినేట్ చేస్తారనుకున్న ప్రచారం నిజం కాకపోవడంతో విజయలక్ష్మి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగారు. ఇలా తొలి నెహ్రూ కుటుంబ మహిళ అసంతృప్తితో తన రాజకీయ జీవితం ముగించారు.
రాయ్‌బరేలీలో తొలి గెలుపు, మరో విజయం తర్వాత ఓ ఓటమి, చివరికి రాజీనామా
తండ్రి ప్రధాని నెహ్రూ మరణించిన కొద్ది నెలలకే ఇందిరాగాంధీ 1964 ఆగస్టులో 46 ఏళ్ల వయసులో రాజ్యసభకు ఎన్నికయ్యాక శాస్త్రి కేబినెట్‌లో మంత్రిగా చేరడం సాఫీగా జరిగిపోయింది. కొద్ది కాలానికే శాస్త్రి కన్నుమూయడంతో నాటి కాంగ్రెస్ అంతర్గత రాజయకీయాలు ఇందిరను ప్రధాని పీఠమెక్కించాయి. ఏడాది కల్లా వచ్చిన 1967 సాధారణ ఎన్నికల్లో తన భర్త దివంగత ఫిరోజ్‌గాంధీ అంతకు ముందు మొదటి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన యూపీలోని రాయ్‌బరేలీ నుంచి పోటీచేసి తన సమీప స్వతంత్ర అభ్యర్ధి బీడీ సేఠీపై 91,703 ఓట్ల మెజారిటీతో ఇందిరాగాంధీ తన 49వ ఏట విజయం సాధించారు. మొదట రాజ్యసభకు ఎన్నికై, తర్వాత లోక్‌సభకు అనేకసార్లు గెలిచిన మొదటి నెహ్రూ కుటుంబ సభ్యురాలిగా ఆమె ప్రత్యేక స్థానం సంపాదించారు. అయితే, రాయ్‌బరేలీలో 1971లో రెండోసారి గెలిచిన తర్వాత ఆమె ఎన్నిక చెల్లదని 1975లో వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పు ఆమె సభ్యత్వాన్ని రద్దుచేయకపోయినా ఎమర్జెన్సీ వంటి తర్వాతి పరిణామాలు 1977లో అదే స్థానంలో ఇందిర చరిత్రాత్మక ఓటమికి దారితీశాయి. ఈ పరాజయం ఆమెను ఎంతగా బాధించిందంటే 1980లో నాటి ఉమ్మడి ఏపీలోని మెదక్ నుంచి కూడా గెలిచాక రాయ్‌బరేలీ సీటును ఇందిర వదులుకుని మెదక్ ఎంపీగానే 1984 అక్టోబర్ 31న కన్నుమూశారు.
ఎన్నికల బరిలోకి దిగిన మూడో ‘తిరుగుబాటు’ నెహ్రూ కుటుంబ నేత మేనక
ఇందిరాగాంధీ రెండో కొడుకు సంజయ్ పెద్ద కుమారుడు రాజీవ్ కన్నా ఏడాది ముందు రాయ్‌బరేలీ పొరుగు స్థానం అమేఠీ నుంచి 1980 జనవరిలో ఎన్నికయ్యారు. ఆరు నెలల లోపే విమాన దుర్ఘటనలో మరణించాక తన రాజకీయ వారసునిగా రాజీవ్‌ను ఇందిర ఎంపికచేసుకున్నారు. ఫలితంగా, ఏడాది తర్వాత 1981లో జరిగిన ఉపఎన్నిక నాటికే చిన్న కోడలు మేనకను ప్రధాని అధికార నివాసం నుంచి బయటికి పంపించారు. తనను తన భర్త సంజయ్ రాజకీయ వారసురాలిగా అత్త, బావలు గుర్తించకపోవడంతో మేనక ఆగ్రహించినాగాని అమేఠీ ఉప ఎన్నిక సమయానికి లోక్‌సభకు పోటీచేయడానికి అవసరమైన 25 ఏళ్లు ఆమెకు లేకపోవడంతో అప్పుడామె బరిలోకి దిగలేదు. రాజీవ్ ఈ ఉపఎన్నికలో లోక్‌దళ్ అభ్యర్థి శరద్‌యాదవ్‌పై సునాయాసంగా గెలిచారు. 1984 అక్టోబర్ 31న హత్యకు గురైన ఇందిర తర్వాత ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్ డిసెంబర్ చివర్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రెండోసారి అమేఠీ నుంచి పోటీకి దిగారు. ప్రతిపక్షాల మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బావపై తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన మేనకా గాంధీకి ఘోర పరాజయం ఎదురైంది. రాజీవ్ తన మరదలిపై 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ప్రధాని పదవిలో ఉండి గెలిచారు.
ఇలా తన తొలి ఎన్నికల పోరులో ఓటమి పాలైన మేనక యూపీలో సిక్కు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న పిలీభీత్ నుంచి 1989 ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థిగా పోటీచేశారు. కాంగ్రెస్ అభ్యర్థి భానుప్రతాప్‌సింగ్‌పై లక్షా 30 వేల ఓట్లకు పైగా భారీ మెజారిటీతో గెలిచి మేనక తొలిసారి పార్లమెటుకు ఎన్నికయ్యారు. అప్పటికి మేనకకు 33 ఏళ్లు. 26 సంవత్సరాల వయసులో అమేఠీ నుంచి లోక్‌సభలో అడుగుబెట్టడానికి 1984లో ఇందిర చిన్న కోడలు చేసిన ప్రయత్నం విఫలమైనాగాని చివరికి నియోజకవర్గం మారి విజయం సాధించారు.
తర్వాత 1991లో నాటి ప్రధాని చంద్రశేఖర్ నేతృత్వంలోని ఎస్‌జేపీ టికెట్‌పై అదే స్థానంలో ఓడిపోయినా మేనక తర్వాత జనతాదళ్, బీజేపీలో చేరి 1996 నుంచి 2019 ఎన్నికల వరకూ (పిలీభీత్, ఆవ్లా, సుల్తాన్‌పూర్ నుంచి) ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు ప్రధానుల కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన ఇందిర చిన్న కోడలు నెహ్రూ–గాంధీ ఫ్యామిలీలో రెబల్‌గా ముద్రపడి చివరికి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫునే సుల్తాన్‌పూర్‌లో రెండోసారి పోటీచేసి ఓడిపోయారు.
2009 నుంచీ తన మాదిరిగానే బీజేపీ టికెట్‌పై పోటీచేసి 2019 వరకూ గెలుస్తూ వచ్చిన కుమారుడు ఫిరోజ్ వరుణ్‌కు 2024 ఎన్నికల్లో టికెట్ లభించకపోవడం, తాను ఓడిపోవడంతో తల్లీకొడుకులిద్దరూ భారత పార్లమెంటులో లేకపోవడం 2009 తర్వాత ఇదే మొదటిసారి.
అమేఠీ నుంచి సోనియా ప్రస్థానం–పదేళ్లుగా ప్రియాంక పోటీపై ఊగిసలాట
1999 లోక్‌సభ ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాంగ్రెస్ పూర్వ వైభవం కోల్పోయిన ఒక్క యూపీ నుంచి పోటీచేయడానికి వెనకాడారు. తన మరిది సంజయ్, భర్త రాజీవ్ నియోజకవర్గం అమేఠీ నుంచే గాక, కష్టకాలంలో అత్తగారిని గెలిపించిన కర్ణాటకలోని బళ్లారి నుంచి కూడా పోటీచేసి గెలిచారు. అప్పుడు ఆమె వయసు 52 ఏళ్లు. తోడికోడలు మేనకతో పోల్చితే ఆమె బాగా ఆలస్యంగా ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చారు.
ఇప్పుడు ఆమె కుమార్తె ప్రియాంక కూడా అదే బాటలో 52 సంవత్సరాల వయసులో ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధం కావడం కాకతాళీయం. సోనియాగాంధీ మొదటిసారి పోటీచేసిన ఈ ఎన్నికల్లో అమేఠీలో తన సమీప బీజేపీ అభ్యర్థి సంజయ్‌సింగ్‌పై మూడు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 56 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఉత్తరాది బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌పై బళ్లారిలో సోనియా విజయం సాధించి, తర్వాత ఆ సీటుకు రాజీనామా చేశారు.
మరుసటి 2004 ఎన్నికల్లో కుమారుడు రాహుల్‌గాంధీని అమేఠీ నుంచి పోటీకి దింపి సోనియా తన అత్తమామల పాత స్థానమైన రాయ్‌బరేలీకి మారారు. 2004 నుంచి వరుసగా 4సార్లు రాయ్‌బరేలీ నుంచి ఎన్నికయ్యాక ఆమె ఆరోగ్య కారణాల రీత్యా 2023 చివర్లో రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక ఆమె కూతురు, నాయనమ్మ ఇందిర పోలికలు బాగా ఉన్నాయనే ప్రచారం పొందిన ప్రియాంక తన పిల్లలు పెద్దయ్యాక ఎన్నికల రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు 2014 నుంచి వస్తూనే ఉన్నాయి.
కాంగ్రెస్‌కు మొదట్లో బ్రహ్మాస్త్రం లేదా పాశుపతాస్త్రంగా మీడియా, పార్టీ నేతలు వర్ణించిన ప్రియంక అన్న రాహుల్ కన్నా 2 సెంటీమీటర్లు ఎక్కువ ఎత్తు ఉన్నాగాని పార్లమెంటుకు పోటీ విషయంలో బాగా వెనుకబడిపోయారని చెప్పక తప్పదు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి 2024 పార్లమెంటు ఎన్నికల వరకూ ప్రియాంక పోటీచేస్తారనే ప్రచారం ప్రతిసారీ జరిగేది. ఒకదశలో వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోదీపై బరిలోకి ప్రియంక దిగుతారని 2019లో వార్తలొచ్చాయి. తల్లి కిందటేడాది రాజ్యసభకు ఎన్నికవడంతో 18వ లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక రాయ్‌బరేలీ నుంచి, అన్న రాహుల్ అమేఠీ నుంచి పోటీచేస్తారని కూడా ప్రచారం జరిగింది. చివరికి రాహుల్ ఒకసారి ఓడిన అమేఠీలో మళ్లీ పోటీచేయడానికి భయపడి రాయ్‌బరేలీకి వెళ్లడంతో అమేఠీ నుంచి బరిలోకి దిగే అవకాశం వచ్చినాగాని ప్రియాంక ఎందుకో ఆ సాహసం చేయలేదు.
దీంతో రాహుల్ రెండు చోట్ల నుంచి గెలిస్తే కేరళ స్థానం వయనాడ్‌కు రాజీనామా చేస్తారనే ప్రచారం నిజమైంది. మొన్న రాహుల్ రెండో సీటుకు రాజీనామా చేసిన వెంటనే వయనాడ్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థి ప్రియాంక అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. దీంతో వచ్చే నెల 13న పోలింగ్ జరిగే వయనాడ్ ఉప ఎన్నికలో నెహ్రూ–గాంధీ కుటుంబానికి చెందిన ఐదో మహిళగా ప్రియాంక కాంగ్రెస్ టికెట్‌పై పోటీకి దిగడం ఖాయమని తేలిపోయింది. ఈ కుటుంబంలోని ఇందిర 1977లో రాయ్‌బరేలీలో ఓటమి పాలయ్యాక 1978లో కర్ణాటకలోని చిక్‌మగళూరు నుంచి పోటీచేసి గెలిచారు.
అలాగే తల్లి సోనియా కుటుంబ స్థానం అమేఠీతోపాటు కర్ణాటకలోని బళ్లారి నుంచి కూడా 1999లో మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగి గెలిచారు. రాహుల్ కూడా 2019 పార్లమెంటు ఎన్నికల్లో అమేఠీ గెలుపుపై అనుమానంతో వయనాడ్‌లోనూ నామినేషన్ వేసి గెలిచారు. కాని, ప్రియాంక తన కుటుంబం సభ్యుల ఆనవాయితీకి భిన్నంగా తన మొదటి ఉప ఎన్నిక పోరులో దక్షిణాది నుంచి పోటీచేయడం విశేషం.