
‘పబ్లిక్ హియిరింగ్స్’ కు వచ్చే ప్రజలను వేదిస్తున్నారు
పబ్లిక్ హియరింగ్‌ను నిజాయితీగా కొనసాగించడంలో ప్రభుత్వానికి లేని ఆసక్తి.
మనం నేర్చుకోవాలీ, మార్చుకోవాలీ అనుకుంటే , అవసరమైన విషయాలను సాధారణ ప్రజా సమూహాల నుండే నేర్చుకోవచ్చు. సామాజిక మార్పుకు చెందిన సైద్ధాంతిక , పోరాట దృక్పథాలను అక్కడి నుండే రూపొందించుకోవచ్చు. పడక్కుర్చీ రాజకీయ వాదనల కంటే , పరస్పర దూషణ భూషణల కంటే నిజానికి ప్రజల్లోకి రోజువారీగా మనం నిరంతరం సాగించే ప్రయాణమే, ఓపెన్ మైండ్ తో వారితో సాగించే సంభాషణే సరైన అధ్యయన, కార్యాచరణ పద్ధతి . గత నెల రోజుల నా ప్రయాణ అనుభవాలు దీనినే మరోసారి రుజువు చేశాయి.
వ్యక్తిగతంగా నేను గత 40 ఏళ్లుగా సామాజిక, రాజకీయ ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నాను. విద్యార్ధి రంగ ఉద్యమాలలో ప్రారంభమై, కార్మిక, రైతు కూలీ, యువజన, సాహిత్య ఉద్యమాలలో, కృషిలో భాగం పంచుకున్నాను. అధ్యయనం, రచన , పత్రికలకు సంపాదకత్వం నిత్య జీవితం లో భాగంగా ఉంటున్నాయి.
కానీ, ఇంత సుదీర్ఘ కాలంలో గత 30 ఏళ్ల క్రితమే ఉనికిలోకి వచ్చిన పబ్లిక్ హియరింగ్ అనే ప్రక్రియలో నేనెప్పుడూ భాగం పంచుకోలేదు. వాటిపై అనుభవం కూడా లేదు. కానీ గత నెల రోజులలో తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలలో జరిగిన మూడు ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియలలో భాగస్వామినై ఎంతో ఉత్సాహం పొందాను. ఈ క్రమంలో అనేక విషయాలు నేర్చుకున్నాను. సాధారణ గ్రామీణ ప్రజల తిరుగుబాట్లను ప్రత్యక్షంగా చూశాను. ఆయా ప్రాంతాల ప్రజల ప్రేమాభిమానాలను కూడా గుండె నిండా పొందాను.
గ్రామీణ ప్రజలు, వాళ్ళ ప్రత్యేక సమస్యలు, గ్రామాలలో వచ్చిన సాంస్కృతిక మార్పులు, ఆర్ధిక, రాజకీయ,భూ సంబంధాలలో వచ్చిన మార్పులు , స్థానిక రాజకీయ నాయకుల మనస్తత్వమూ, పారిశ్రామిక వేత్తల దుష్ట పన్నాగాలూ, పోలీసులతో సహా, అధికార యంత్రాంగ నిర్లక్ష్య వైఖరీ, వాళ్ళలో పాతుకుపోయిన ఆవినీతీ, తమ స్వంత గ్రామాలను ఇంకా బలంగా ప్రేమిస్తున్న యువతా, మహిళల పోరాట స్పూర్తీ – అన్నీ తాజా అధ్యయన విషయాలు.
ప్రభుత్వాలయినా, రాజకీయ పార్టీలయినా, ప్రజా సంఘాలయినా, పౌర సమాజ వేదికలయినా, నిజమైన ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి, ప్రజల ఆలోచనలను అర్థం చేసుకోవడానికి, ఈ పబ్లిక్ హియరింగ్ ప్రక్రియ గొప్ప మార్గమని నాకు అనిపించింది. నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహిస్తే, ఈ పబ్లిక్ హియరింగ్ లు , ప్రజల అభిప్రాయాల వెల్లడికి మంచి వేదికలు అవుతాయి.
ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వడం, అది కూడా అబద్ధాలు, వక్రీకరణలు లేని వాస్తవ సమాచారం దాపరికం లేకుండా ఇవ్వడం, ప్రజల ప్రశ్నలకు నిజాయితీగా కప్పదాట్లు వేయకుండా జవాబు ఇవ్వడం, అంతిమంగా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం అనే ప్రక్రియ ఎంతో మంచిది. పక్షపాతాలు, నిర్బంధాలు, ఒత్తిడిలు, ప్రలోభాలు లేకుండా, స్థానిక ప్రజలకు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం కల్పించడం ఇందులో కీలక అంశం.
రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా పార్టీలో అంతర్గతంగానూ, బయట సమాజంలో అనేక మందితోనూ చర్చించి ఎన్నికల మానిఫెస్టో తయారు చేస్తాయి. ఈ మానిఫెస్టో లో అనేక హామీలు ఇస్తాయి. ఈ హామీలు ప్రజలకు మేలు చేస్తాయని కూడా చెబుతాయి.
కానీ అధికారంలోకి వచ్చాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో, అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రజలతో చర్చించకుండా ఏకపక్షంగా విధానాలు ప్రకటిస్తాయి. ముందుగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా, తాము అనుకున్న అభివృద్ధి నమూనాలో మాత్రం ముందుకు వెళుతుంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరుగుతున్నది ఇదే.
ఒక్కోసారి ఈ అభివృద్ధి ప్రణాళికలు ప్రజలకు, పర్యావరణానికి వ్యతిరేకంగా ఉంటాయి. గాలిలో ఉద్గార వాయువులను మరింత పెంచుతాయి. భూమి మరింత వేడెక్కడానికి, ప్రకృతి వైపరీత్యాలు పెరగడానికి కారణమవుతాయి. ,భూమి, నీరు,అడవులు,కొండలు, గుట్టలు లాంటి సహజ వనరులకు గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలకు హాని చేస్తాయి. మరో వైపు ఈ ప్రణాళికలు, ప్రైవేట్ కంపనీలకు, కార్పొరేట్ కంపనీలకు, కొంతదారు రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, అవినీతి కార్య ప్రభుత్వ యంత్రాంగానికి మేలు చేస్తాయి. భారత దేశం లోనూ, తెలంగాణ రాష్ట్ర పరిధిలోనూ గత మూడు దశబ్ధాలుగా మన దగ్గర విస్తృతంగా ముందుకు సాగుతున్న పెట్టుబడిదారీ ఉత్పత్తి ఆర్ధిక వ్యవస్థ నమూనా స్థానికంగా ప్రజలకు కలిగిస్తున్ననష్టాలను కూడా మనం గమనిస్తున్నాం.
పబ్లిక్ హియరింగ్ లు ఎలా ఉనికిలోకి వచ్చాయి ?
ప్రపంచమంతా ఈ అభివృద్ధి నమూనా పెడ ధోరణి ఉనికిలో ఉంది. ఇవే నష్టాలను,ప్రజలకు, పర్యావరణానికి కలిగిస్తున్నది. ఈ నేపధ్యంలో ప్రపంచ వ్యాపితంగా ప్రజా పక్ష శాస్త్రవేత్తలు, పర్యావరణ కారులు,మేధావులు ఈ అభివృద్ధి నమూనా ప్రజలకు కలిగిస్తున్న నష్టాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ వేదికలలోనూ, ఆయా దేశాల ప్రభుత్వాల దగ్గరా బలంగా తమ వాదనలు వినిపించారు. ప్రజలకు కూడా వీటిపై అవగాహన కల్పించారు.
సాధారణ ప్రజలు, ముఖ్యంగా ఆదివాసీ, గ్రామీణ సమాజాలు, ఈ అభివృద్ధి నమూనా వల్ల తమకు జరుగుతున్న నష్టాలను గుర్తిస్తూ, తమదైన పద్ధతులలో ఉద్యమాలు కూడా సాగించారు. దీనిని ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అంశంగా తమ పోరాటాలతో, త్యాగాలతో మార్చారు.
వీటన్నిటి ఫలితంగా 1992లో జరిగిన రియో డిక్లరేషన్‌లోని ప్రిన్సిపుల్ 10 (Principle 10) రూపొందింది. ఈ నిమయం ప్రకారం పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకం. ఇందుకోసం ఈ క్రింది అంశాలను ప్రభుత్వాలు అమలు చేయవలసి ఉంటుంది.
పర్యావరణ పరమైన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం, నిర్ణయ ప్రక్రియలో (Decision-making) ప్రజలకు అవకాశం కల్పించడం, పర్యావరణ నష్టాలపై న్యాయం పొందే అవకాశం ఇస్తూ, ఈ అంతర్జాతీయ ఒప్పందానికి కట్టుబడి ఉండడం అనేవి ఆ మూడు అంశాలు.
ఈ ఒప్పందానికి అనుగుణంగా భారత ప్రభుత్వం 1994 లో పర్యావరణ ప్రభావ అంచనా (Environmental Impact Assessment - EIA) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో మొదట పబ్లిక్ హియరింగ్ ప్రక్రియ లేదు. కానీ ఈ ప్రక్రియలో పబ్లిక్ హియరింగ్‌లను తప్పనిసరి చేస్తూ 1997 లో సవరణలు చేశారు.
ప్రస్తుతం భారతదేశంలో EIA నోటిఫికేషన్ 2006 ప్రకారం ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ లు (పరిశ్రమలు, గనులు, డ్యామ్‌లు మొదలైనవి) ప్రారంభించే ముందు స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి 'పబ్లిక్ హియరింగ్' నిర్వహించడం చట్టరీత్యా తప్పనిసరి అయింది.
ఆచరణ ఎలా ఉంది ?
సాధారణంగా ఈ ప్రక్రియను నిజాయితీగా కొనసాగించడంలో ప్రభుత్వానికి ఆసక్తి లేదు. బడా పెట్టుబడి దారులు, వ్యాపార వేత్తలు, భూస్వాములు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులుగా మారి, ఆయా పార్టీలలో కీలక పాత్ర పోషిస్తున్న దశలో, వాళ్ళే ఎన్నికలలో కోట్లు గుమ్మరించి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతున్న స్థితిలో , ప్రధాన ప్రాజెక్టులపై ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వడం,సాధారణ ప్రజలను, పౌరులను అభివృద్ధి చర్చలో, నిర్ణయాలలో భాగస్వాములను చేయడం, పర్యావరణ న్యాయం అందించడంలో, అంతర్జాతీయ ఒప్పందానికి కట్టుబడడం అనే ప్రక్రియ సాఫీగా సాగించడానికి వాళ్ళకు మనసు రావడం లేదు. అనివార్యమైన స్థితిలో మొక్కుబడిగా ఈ ప్రక్రియను ముగించడానికి పూనుకుంటున్నారు.
కంపనీలు వెదజల్లే కాసులకు కక్కుర్తిపడే అధికార గణం కూడా ఈ ప్రక్రియను పాదర్శకంగా నిర్వహించడానికి సిద్ధంగా లేదు. అడుగడుగునా దాపరికం, మోసం, నిర్బంధం, ఆంక్షలు, ప్రజల గొంతు నొక్కడానికి ఆర్ధిక ప్రలోభాలు లాంటివి మనకు కనపడుతున్న దుర్లక్షణాలు.
పబ్లిక్ హియరింగ్ లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (SPCB) పాత్ర
పబ్లిక్ హియరింగ్‌ను నిర్వహించే ప్రధాన బాధ్యత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (State Pollution Control Board) పై ఉంటుంది.
ప్రకటన జారీ చేయడం: పబ్లిక్ హియరింగ్ నిర్వహించడానికి కనీసం 30 రోజుల ముందు స్థానిక ప్రాంతంలో బాగా ప్రాచుర్యం ఉన్న రెండు వార్తా పత్రికలలో (ఒకటి ప్రాంతీయ భాషలో, మరొకటి ఆంగ్లంలో) ప్రకటన ఇవ్వాలి.
ఆచరణ : కాలుష్య నియంత్రణ మండలి ఈ ప్రకటన ఇస్తుంది కానీ, వాణిజ్య ప్రకటన రూపంలో ఉండే ఈ నోటిఫికేషన్ ను సాధారణంగా ప్రజలు పట్టించుకోవడం లేదు. ఆయా జిల్లాలలో ఏదైనా ఒక పత్రికలో జిల్లా ఎడిషన్ లో వచ్చే ఈ ప్రకటన ప్రజల దృష్టికి రావడం లేదు. కొన్నిసార్లు ఈ నోటిఫికేషన్ కాలుష్య నియంత్రణ మండలి వెబ్ సైట్ మీద కూడా కనపడడం లేదు. ప్రజల పట్ల బాధ్యతతో ఆలోచించే పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు , తమ దృష్టికి వచ్చిన ఈ నోటిఫికేషన్ విషయంలో ప్రజా సంఘాలకు సమాచారం ఇస్తే మాత్రమే ప్రజలకు తెలుస్తున్నది. మోమిన్ పేట, న్యాలకల్ , భిక్కనూరు లో ఇటీవల జరిగిన పబ్లిక్ హియరింగ్ ల నోటిఫికేషన్ ల పరిస్థితి కూడా ఇంతే. మిగిలిన రెండూ దొరికాయి కానీ, చివరికి మాకు పత్రికలో వచ్చిన భిక్కనూరు పబ్లిక్ హియరింగ్ నోటిఫికేషన్ దొరకనే లేదు.
సమాచారం ఇవ్వకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా విచారణ జరిపితే మెంబర్ సెక్రటరీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (PCB), జిల్లా కలెక్టర్ (జిల్లా మేజిస్ట్రేట్), పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రిత్వ శాఖ (MoEFCC) ప్రాంతీయ కార్యాలయం కు ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు.
ప్రజలకు ప్రాజెక్టుపై సమాచారం : ప్రాజెక్ట్ ముసాయిదా నివేదిక (Draft EIA Report), దాని సారాంశాన్ని జిల్లా కలెక్టర్ , జిల్లా పరిషత్, పంచాయతీ కార్యాలయం తో పాటు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాల్లో కూడా ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచాలి.
ఆచరణ: గత మూడు పబ్లిక్ హియరింగ్ లలో ఎక్కడా ,ముఖ్యంగా పబ్లిక్ హియరింగ్ జరిగే ప్రాంతాల కార్యాలయాలలో ఈ నివేదికలు ఉంచలేదు. ప్రజలకు లా ఉంచుతారన్న సమాచారం కూడా తెలియదు. స్థానిక గ్రామ పంచాయితీ సర్పంచ్, గ్రామ పంచాయితీ కార్యదర్శి, కారోబార్ లకు కూడా వాటిపై సమాచారం లేదు.
TPJAC లాంటి సంస్థలు గ్రామీణ ప్రాంతంలో ఈ పబ్లిక్ హియరింగ్ గురించి చెప్పి, EIA సారాంశాన్ని , దానిపై విమర్శను , ప్రజల ముందు ఉంచే వరకూ స్థానిక మండల స్థాయి అధికారులకు, స్థానిక జర్నలిస్టులకు కూడా తెలియదు.
వీడియో రికార్డింగ్: విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయించి, ఆ రికార్డింగ్‌ను నివేదికతో పాటు పంపాలి. అన్ని చోట్లా దీనిని పాటిస్తున్నారు కానీ, ఆ వీడియో ప్రజలకు అందుబాటులో ఉండేలా, కాలుష్య నియంత్రణ మండలి వెబ్ సైట్ పై ఉంచడం లేదు.
జిల్లా మేజిస్ట్రేట్ లేదా కలెక్టర్ పాత్ర
పబ్లిక్ హియరింగ్‌కు అధ్యక్షత వహించే బాధ్యత జిల్లా కలెక్టర్ లేదా వారి ప్రతినిధిపై ఉంటుంది. జిల్లా కలెక్టర్ లేదా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM) స్థాయికి తగ్గని అధికారి విచారణకు అధ్యక్షత వహించి, దానిని పర్యవేక్షించాలి. విచారణ సమయంలో ప్రజలు లేవనెత్తిన అంశాలు, అభ్యంతరాలు, ప్రాజెక్ట్ నిర్వాహకుల వివరణలను ఒక మినిట్స్ (Minutes of Meeting) రూపంలో నమోదు చేయాలి. దీనిపై కలెక్టర్ అక్కడే సంతకం చేయాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప, పబ్లిక్ హియరింగ్ కోసం ఒకసారి నిర్ణయించిన తేదీని వాయిదా వేయకూడదు.
ఈ విషయంలో మోమిన్ పేట, న్యాలకల్ లో అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారులు కొంత ఓపికగా ఈ ప్రక్రియను నిర్వహించారు. ఎక్కువ మంది మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. సాధారణ ప్రజలను కూడా ప్రోత్సహించి మాట్లాడించారు. అయితే మోమిన్ పేట లో కంపనీ యాజమాన్యమే ప్రజల వ్యతిరేకత దృష్ట్యా , తాము కంపనీ పెట్టబోమని అక్కడే ప్రకటించారు. న్యాలకల్ లో మాత్రం కలెక్టర్ ఎలాంటి ప్రకటన చేయకుండా, మినిట్స్ చదివి వినిపించకుండా, దానిపై సంతకం చేయకుండా అక్కడి నుండీ వెళ్లిపోయారు.
భిక్కనూరు లో మాత్రం అదనపు జిల్లా కలెక్టర్ కొంత అసహనంగా వ్యవహరించారు. తానే అధ్యక్షత వహించకుండా, కాలుష్య నియనత్రణ మండలి అధికారులకు బాధ్యత అప్పగించారు. చివరికి, పేర్లు ఇచ్చిన అందరినీ మాట్లాడించకుండానే, స్లీప్ లపై అభిప్రాయాలు రాశి ఇవ్వాలని ప్రకటించారు. ప్రజలు కంపనీ ఏర్పాటును ఏకగ్రీవంగా వ్యతిరేకిండంతో, చివాటికి మినిట్స్ వినిపించకుండానే, ప్రజలు ఏకగ్రీవంగా కంపనీ ఏర్పాటును తిరస్కరించినట్లు,అదే నివేదికగా కేంద్రానికి పంపుతామని వేదిక నుండీ ప్రకటించి వెళ్లిపోయారు.
ప్రాజెక్ట్ నిర్వాహకుల (Project Proponents - యాజమాన్యం ) పాత్ర
ఏదైనా ఒక ప్రాంతంలో కంపనీ పెట్టాలని అనుకున్న యాజమాన్యం పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకోవాలి.
పబ్లిక్ హియరింగ్ రోజున ప్రాజెక్ట్ వల్ల కలిగే లాభాలు, పర్యావరణంపై పడే ప్రభావం, దానిని తగ్గించడానికి తీసుకునే చర్యల గురించి స్థానిక భాషలో ప్రజలకు వివరించాలి. పబ్లిక్ హియరింగ్ నిర్వహణకు అయ్యే పూర్తి ఖర్చును ప్రాజెక్ట్ నిర్వాహకులే భరించాలి.
కానీ, ఇక్కడే ఆయా కంపనీల యాజమాన్యాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. కంపనీకి సంబంధించి అవసరమైన చాలా అంశాలను పర్యావరణ ప్రభావ నివేదికలో రాయడం లేదు. రాసినా, ప్రజలకు అర్థమయ్యేలా బయటకు చెప్పడం లేదు.
నివేదికలో వినియోగినహకే, ఉత్పత్తిలో వెలువడే పూర్తి స్థాయి విష రసాయనాల వివరాలను విడివిడిగా పేర్కొని, వాటి వల్ల వచ్చే దుష్ఫలితా లను ప్రజలకు వివరించకుండా, గుండు గుత్తగా చెప్పే పద్ధతి అనుసరిస్తున్నాయి.
పైగా పోలీసు అధికారులను డబ్బులతో మచ్చిక చేసుకుని, భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రజలు సునాయాసంగా వేదిక వద్దకు చేరకుండా, చాలా దూరం నుండీ బారికేడ్లు పెట్టేలా చూస్తున్నారు. నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా అవసరం లేకపోయినా పబ్లిక్ హియరింగ్ కు వస్తున్న ప్రజలను ఆధార్ కార్డులు అడిగి చెక్ చేస్తున్నారు. స్థానికులయితేనే పంపిస్తున్నారు. మంగ్లీ పబ్లిక్ హియరింగ్ లో ఈ ధోరణి ఎక్కువ కనపడింది.
లక్షలు, కోట్లు వెదజల్లి స్థానిక రాజకీయ నాయకులను,ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయాలని చూడడం, పౌర సమాజ ప్రతినిధులకు కూడా లక్షల రూపాయల ఆఫర్ ఇచ్చి, నోరు మూయించాలని చూడడం ఒక పెడ ధోరణి గా ఈ ప్రాంతంలోనే ముందుకు వచ్చింది.
పబ్లిక్ హియరింగ్ కోసం అనుసరించాల్సిన ప్రాధమిక విషయాలు :
1. పబ్లిక్ హియరింగ్ ఎప్పుడూ ప్రాజెక్ట్ జరిగే ప్రాంతంలో లేదా దానికి అతి దగ్గరలో ఉన్న ప్రాంతంలోనే జరగాలి.
2. ప్రభావిత ప్రాంత ప్రజలు, పర్యావరణ వేత్తలు, ఆసక్తి కలిగిన వ్యక్తులు ఎవరైనా తమ అభిప్రాయాలను నేరుగా వచ్చి మాట్లాడవచ్చు. లేదా లిఖితపూర్వకంగా అధికారులకు తెలియ జేయవచ్చు.
3. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల లోపు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ విచారణను పూర్తి చేయాలి. ఒకవేళ SPCB విఫలమైతే, కేంద్ర ప్రభుత్వం (MoEFCC) మరొక ఏజెన్సీ ద్వారా దీనిని నిర్వహిస్తుంది.
పబ్లిక్ హియరింగ్ గురించి నియమాలు ఇంత స్పష్టంగా ఉన్నా, ప్రభుత్వాలు, అధికారులు ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించడం లేదు. పౌర సమాజం ఇందులో క్రియాశీలంగా జోక్యం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ లో ప్రజల భాగస్వామ్యం పెరుగుతున్నది. ఆంధ్ర ప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలో రానున్న రెండు ఇథనాల్ పరిశ్రమల విషయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, ముందుగానే స్థానిక ప్రజా సంఘాల నాయకులను కేసులు పెట్టి, ముందస్తు అరెస్టులు చేసి, ఆటంకాలు కల్పించారు. దీనికి భిన్నంగా తెలంగాణ పౌర సమాజం అన్ని రకాల మెలకువలతో , పబ్లిక్ హియరింగ్ జరిగేలా చూసింది. ప్రజల గొంతు వినిపించింది.
(సశేషం)

