జగజ్జనని కాస్తా జగన్మోహినిగా ఎలా మారిపోయింది?
x
రాతి యుగం నాటి అమ్మదేవత, ఆమె ఆకారంలోనే కట్టిన గుడి

జగజ్జనని కాస్తా జగన్మోహినిగా ఎలా మారిపోయింది?

రామాయణంలో నిరుత్తరకాండ-36. పరిశోధకుడు కల్లూరి భాస్కరం చెబుతున్న రామాయణంలో చెప్పని కథలు

ప్రపంచంలోనే తొలి నాగరికతానిర్మాతలుగా సుమేరులు గుర్తింపుపొందారనుకున్నాం. ఇంతకీ వారు ఎవరో, ఎక్కడినుంచి వచ్చారో ఇక్కడొకసారి గుర్తుచేసుకుందాం. ప్రత్యేకించి మన పురాణ, ఇతిహాసకోణంలో అది మరింత ఆసక్తికరం అవుతుంది.

‘సుమేరుల ‘శివు’డే ఎంకి’ (30) అనే వ్యాసభాగంలో చెప్పుకున్న ప్రకారం; పది, పదకొండు వేల సంవత్సరాల క్రితం, అంటే మంచుయుగం ముగిసి, నేటి హలోసిన్ వాతావరణం స్థిరపడుతున్న సంధికాలంలో వివిధజాతులూ, రంగులూ, భాషలకు చెందినవారు మధ్యాసియాలోని కాస్పియన్ సముద్రప్రాంతంలో కొంతకాలంపాటు కలసి ఉన్నారు. కాస్పియన్ సముద్రాన్నే మనవారు కాశ్యపీసముద్రమన్నారు. మన పురాణ, ఇతిహాసాల ప్రకారం కశ్యపుడు ఒక ప్రజాపతి. దేవతలు, దైత్యులు, దానవులతో సహా అందరూ ఆయన సంతానం. ఆవిధంగా వారందరూ అన్నదమ్ములు. దైత్యులు, దానవులు, లేదా రాక్షసులను ‘పూర్వదేవు’లన్నారు.

ఈ పూర్వదేవుళ్ళకు, దేవుళ్ళకు మధ్య వైరం వచ్చింది. బలవత్తరులైన దేవుళ్ళు తరిమేస్తే పూర్వదేవుళ్లు మెసపొటిమియాలో, యూఫ్రటిస్-టైగ్రిస్ నదీప్రాంతాలలోని చిత్తడిభూముల్లోకి వచ్చిపడ్డారు. వారు అక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి వ్యవసాయాధారిత సంస్కృతినీ, నాగరికతనూ నిర్మించారు. వారినే సుబరులన్నారు. శంబరుల పేరుతో వారు మన పురాణాలకు ఎక్కారు. నామసామ్యాన్ని బట్టి ఈ సుబరులు, సుమేరులు ఒకరేనా, లేక వేర్వేరు జనాలా అన్న ప్రశ్న పుడుతుంది; దానినలా ఉంచి ప్రస్తుతానికి సుమేరులకు పరిమితమవుదాం.

ఈ వ్యాసపరంపరలోనే ఇంతకుముందు ప్రస్తావించుకున్న ప్రముఖపురాతత్త్వ, భాషావేత్త బెడ్రిక్ హ్రోజ్నీ తన ‘ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ వెస్ట్రన్ ఆసియా, ఇండియా, క్రీట్’(Ancient History of Western Asia India and Crete) అనే పుస్తకంలో రాసిన ప్రకారం, సుమేరియన్లు బాబిలోనియాకు, అంటే మెసపొటేమియా ప్రాంతానికి ఉత్తరంనుంచి వచ్చారు. వారు క్రీ.పూ. 6వ సహస్రాబ్దిలో, ఇంకా అంతకుముందునుంచీ టర్కిస్తాన్ లేదా కజక్ స్తాన్ లో ఉండేవారు; అక్కడినుంచి కాస్పియన్ సముద్రానికి నైరుతిగా ఉన్న ప్రాంతాలకు వచ్చి కొంతకాలం ఉండి ఆ తర్వాత మెసపొటేమియాకు చేరుకున్నారు. హ్రోజ్నీ చెప్పిన ఇలాంటి అనేక విషయాలనే రాంభట్ల కృష్ణమూర్తి తన ‘జనకథ’లో మన పురాణ, ఇతిహాస గాథలకు అన్వయిస్తూ పైన పేర్కొన్న దేవదానవుల వైరం గురించీ; పూర్వదేవుళ్ళైన దైత్య, దానవులూ, లేదా రాక్షసులూ మెసపొటేమియాలోని చిత్తడిభూముల్లోకి వలస వచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం గురించీ చెప్పుకుంటూ వచ్చారు.

విశేషమేమిటంటే, హ్రోజ్నీ, ఆయన వెలుగులో రాంభట్ల కృష్ణమూర్తీ సుమేరుల గురించి చెప్పిన విషయాలనే అమెరికాకు చెందిన ఎస్. ఎన్. క్రేమర్ (S. N. Kramer) అనే ప్రసిద్ధ అసీరియానిపుణుడు ధ్రువీకరించడం! విలియం ఇర్విన్ థామ్సన్ ఉటంకించిన ఆయన పరిశీలన ప్రకారం, సుమేరియన్లు ఎగువప్రాంతాలనుంచి క్రీ.పూ. 6వ సహస్రాబ్ది మధ్యనాటికి మెసపొటేమియా పల్లపు భూములకు వచ్చి స్థిరపడిన తొలి జనాలు. అంతకుముందు వెయ్యేళ్లపాటు నేటి ఇరాన్ లోని జగ్రోస్ పర్వతపాదాల దగ్గర, బహుశా ఖుజిస్తాన్ లో ఆదిమవ్యవసాయం, పశుపోషణ, వేట, కుండల తయారీలో ఉంటూ సాధారణగ్రామజీవనం గడుపుతూవచ్చిన జనాలకు వారసులే సుమేరియన్లు. జగ్రోస్ పర్వతప్రాంతాలలో ఉన్నప్పుడే వారు సేద్యపునీటి సాంకేతికతలో నైపుణ్యాన్ని సాధించారు. మెసపొటేమియాలోని సరస్సులు, చిత్తడిభూములు శత్రువుల దాడుల నుంచి వారికి రక్షణ కల్పిస్తూ ఉండేవి...

పైన చెప్పుకున్న దేవుళ్లు, పూర్వదేవుళ్ళైన దైత్య, దానవ, రాక్షసులు, వాళ్ళ మధ్య యుద్ధాలు, తొలి నాగరికతా నిర్మాణం; ఇంతకుముందు అనేకసార్లు చెప్పుకున్న అమ్మమతం, అమ్మదేవతారాధన, మాతృపారంపర్యం, మాతృస్వామ్యం, వాటి స్థానంలో పితృపారంపర్యం, పితృస్వామ్యాల స్థాపన-- ఇవన్నీ మన వేద, పురాణ, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు సహా అన్నింటిలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగమవుతున్నాయి. కాకపోతే, వాటిలోని ఇలాంటి సామాజిక, చారిత్రకాంశాలను కాకుండా; దేవుడు, మతం, మతపరమైన తంతులు వగైరాలను మాత్రమే చూడడానికి మనం అలవాటుపడ్డాం. ఈ నేపథ్యంలో ప్రాచ్య, పాశ్చాత్యపండితుల అధ్యయనాలు అనేకం, మన చూపులను అటకాయించే పై ముసుగులను తప్పించి వాటిలోని సామాజిక, చారిత్రకాంశాలను చూసే అవకాశం కల్పిస్తున్నాయి. ఆవిధంగా మన వేద, పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్రాలనే కాకుండా; ఇతర ప్రాంతాలకు చెందిన అలాంటి ప్రాచీనవాఙ్మయాన్ని కూడా అక్షరాలా పురాచరిత్రలోకీ, చరిత్రలోకీ తీసుకొస్తున్నాయి.

అలా తీసుకురావడంలో జరుగుతున్న మరో అద్భుతం ఏమిటంటే; భారత్, పశ్చిమాసియా, యూరప్ వగైరాల మధ్య నేడు కనిపించే అన్ని రకాల హద్దులూ చెరిగిపోయి, అవి ఇంచుమించు ఒకే విధమైన సామాజిక, సాంస్కృతిక, పౌరాణిక, చారిత్రక అనుభవంలో భాగమవుతున్నాయి! పశ్చిమాసియా వీటన్నింటి మధ్యా ఒక వారధి అవుతోంది!

రామాయణం గురించి మాట్లాడుకుంటూ, అంతలోనే పక్కకు వెళ్ళి, దానితో సంబంధం లేనివిగా కనిపించే అనేకానేక విషయాలను ఇంత సుదీర్ఘంగా ప్రస్తావించుకోవడానికి కారణం, రామాయణంలో వీటన్నింటి ప్రతిఫలనమూ స్పష్టంగా కనిపిస్తుంది కనుకనే!

తిరిగి రామాయణకథాభాగాలను అందుకుని ముందుకు వెళ్ళే క్రమంలో ఇవన్నీ పరిశీలనలోకి వస్తాయి.

“అసలు చరిత్రే సుమేరులో ప్రారంభమైం”(History begins at Sumer)దన్న ఎస్. ఎన్. క్రేమర్ మాటను ఉటంకించిన థామ్సన్, చరిత్రతోనే నాగరికతా, లిఖిత ఆధారాలూ, పురుషదేవుళ్ళ ప్రాబల్యం అడుగుపెట్టాయంటాడు. అక్కడినుంచి ‘ఎంకి ఏర్పరచిన ప్రపంచవ్యవస్థ’(Enki and the World Order) అనే సుమేరుపురాణగాథనుంచి ఇంతకుముందు చెప్పుకున్న ఎంకి ఉదంతాన్ని ఎత్తుకుంటాడు. ఆ తర్వాత అతను ప్రస్తావించిన మరో సుమేరుపురాణగాథ ఎంకి అనే ఘనత వహించిన పితృదేవుడికి(Great Father)కి, నిన్ హుర్ సగ్(Ninhursag)అనే భూమాతకు మధ్య జరిగిన ఘర్షణ గురించి చెబుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్న(26వ వ్యాసభాగం)బ్రహ్మపురాణకథనాన్ని అది గుర్తుచేస్తుంది.

దాని ప్రకారం, బ్రహ్మ ఒకానొక ప్రళయం తర్వాత స్వయంభువుగా అవతరించి నీటిని సృష్టించాడు.. అందులో తన బీజాన్ని నిక్షిప్తం చేశాడు... అది బంగారు అండం(గుడ్డు)గా రూపొందింది... దానినుంచి హిరణ్యగర్భుడనే పేరుతో తిరిగి తనే జన్మించి పురుషునిగానూ, స్త్రీగానూ తనను విభజించుకున్నాడు... ఆ తర్వాత ఆ ఇద్దరి ద్వారా ఒక విరాట్పురుషుని పుట్టించాడు... ఆ విరాట్పురుషుడు సకలలోకాలకూ సృష్టికర్త అయిన స్వాయంభువమనువును సృష్టించాడు... అయోనిజ అయిన శతరూప అనే కన్య పదివేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ స్వాయంభువమనువును భర్తగా పొందింది... వారిద్దరినుంచీ మానవసృష్టి జరిగింది...

థామ్సన్ ప్రస్తావించిన సుమేరుపురాణకథలో జలరూపంలోని ఎంకి వీర్యం భూమి అంతటా ప్రవహించింది. భూమాత అయిన నిన్ హుర్ సగ్ కూతుళ్లను, మనవరాళ్లను కూడా అది గర్భం ధరింపజేసింది. దీనిని ఆహారపు మొక్కల ఉత్పత్తికి కారణమైన భూమీ, జలాల కలయికగా చెప్పి వ్యవసాయానికి అన్వయిస్తాడు థామ్సన్. జలరూపంలోని ఎంకి వీర్యం భూమి అంతటినీ ఆక్రమించుకోవడం భూమాతకు చీదర పుట్టించింది. ఎంకి తన కూతురైన ‘ఉతు’(Utu)ను లోబరచుకున్నప్పుడు, ఆమె దేహం మీద పడిన ఎంకి వీర్యాన్ని భూమాత తొలగించింది. ఆ వీర్యం నుంచి ఎనిమిది ఆహారపు మొక్కలు పుట్టుకొచ్చాయి. ఎంకి వాటిని తిని గర్భం ధరించాడు. అతని గర్భంలో ఆ ఎనిమిది మొక్కలూ ఎనిమిదిమంది దేవతలయ్యాయి. ఎంకి దేహం గర్భధారణకు అనువైనది కాదు కనుక అతను అస్వస్థతకు గురయ్యాడు. భూమాత జాలిపడి, అతనిని తన యోనిలోకి తీసుకుంది. దానినుంచి అతనితోపాటు, అతనిలో ఉన్న ఎనిమిదిమంది దేవతలూ పుట్టుకొచ్చారు; ఆ ఎనిమిదిమందీ అతని శరీరభాగాలకు పేర్లు అయ్యారు.

పైన చెప్పుకున్న బ్రహ్మపురాణకథకూ, ఈ కథకూ ఉన్న పోలికలను గమనించండి. లోకాలనూ, ప్రాణులనూ సృష్టించడంలో పురుషుడి పాత్రను బ్రహ్మపురాణకథ ప్రముఖంగా చెబుతున్నట్టే; పురుషదేవుడైన ఎంకి కూడా గర్భం ధరించగలడని సుమేరుకథ చెబుతోంది. బ్రహ్మపురాణకథలో బ్రహ్మదేవుడే తనను పురుషుడిగానూ, స్త్రీగానూ కూడా విభజించుకోగలడు; ఆ స్త్రీతో కలసి మరో ప్రాణిని పుట్టించగలిగింది కూడా తనే. ఆవిధంగా ఒకవైపు స్త్రీని ప్రవేశపెట్టి, సృష్టి చేయడంలో ఆమెకు గల అనివార్యమైన పాత్రను గుర్తిస్తూనే, ఇంకోవైపు ఆ పాత్రను చిన్నబుచ్చి సృష్టిచేయడంలో తన పాత్రను అంతకన్నా ఉన్నతంగా చూపే పురుషుడి చాణక్యం ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సుమేరుకథలో కూడా జరిగింది అదే; ఒకవైపు పురుషుడైన ఎంకి కూడా గర్భం ధరించగలడని అది చెబుతూనే, ఇంకోవైపు అతనినీ, అతని గర్భంలోని ఎనిమిదిమంది దేవతలనూ కూడా భూమాత యోనినుంచి పుట్టించడం ద్వారా సంతానోత్పత్తిలో స్త్రీకి గల అనివార్యపాత్రనూ అది చెబుతోంది.

తిరిగి థామ్సన్ అధ్యయనానికి వస్తే, కొత్తరాతియుగానికి చెందిన మాతృపారంపర్య వ్యవస్థనుంచి పితృస్వామిక నాగరికతావ్యవస్థలోకి సమాజం మారేక్రమంలో స్త్రీ-పురుషుల మధ్య తలెత్తిన ఘర్షణను పై కథ నాటకీకరిస్తోందని ఆయన అంటాడు. అత్యంతశక్తిమంతుడుగా ఎదిగిన ఎంకి అనే పురుషదేవుని విజృంభణకు అడ్డుకట్టవేయలేని భూమాత నిస్సహాయతనే కాదు; పురుషుడు ప్రాకృతికమైన హద్దులను కూడా ఉల్లంఘించి, అంతవరకూ సంతానోత్పత్తిలో స్త్రీకి ఉన్న అధికారాన్ని చేజిక్కించుకోవడాన్ని సూచిస్తోందంటాడు. అదే సమయంలో, పురుషుడి గర్భధారణ ప్రకృతివిరుద్ధం కనుక, స్త్రీని ప్రవేశపెట్టడం అనివార్యమవడాన్నీ ఇది చెబుతోందంటాడు.

రామాయణంలో రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల జననమూ; మహాభారతంలో ద్రౌపది, ధృష్టద్యుమ్నుల జననమూ ఈ వివరణకు ఎంత అతికినట్టు సరిపోతున్నాయో గమనించండి... దశరథుడు తన ముగ్గురు భార్యలూ పక్కన లేకుండానే పుత్రకామేష్టి జరిపి, దానినుంచి పొందిన పాయసాన్ని భార్యలకు పంచి వారి ద్వారా సంతానాన్ని కంటాడు. ఈ కథనం సంతానోత్పత్తిలో స్త్రీపాత్రను చిన్నబుచ్చుతూనే దాని అనివార్యతను గుర్తించడం కనిపిస్తుంది. ద్రౌపదీ, ధృష్టద్యుమ్నుల జననం ఆపాటి స్త్రీపాత్రనే కాక, పురుషుడి పాత్రనూ నిరాకరిస్తూ; ఋత్విక్కుల మంత్రశక్తే సంతానాన్ని పుట్టించగలదని చెప్పి, మరో మార్గంలో పురుషుడి ఆధిక్యాన్ని స్థాపిస్తుంది.

ఘనత వహించిన అమ్మదేవత(Great Mother) యోని నుంచి పుట్టిన ఎంకి, తిరిగి తనే దేవతలను పుట్టించడం అనేది నాగరికతాకాలానికి చేరుకున్న స్త్రీ-పురుషుల మధ్య స్పర్థకు పౌరాణికమైన అభివ్యక్తి అంటాడు థామ్సన్. కొత్తరాతియుగపు అమ్మమతంనుంచి అనంతరకాలానికి చెందిన అయ్యమతంవైపు సాగడాన్ని ప్రకృతినుంచి సంస్కృతి (nature to culture)కి, లేదా నాగరికతకు మళ్ళడంగా అన్వయిస్తాడు. స్త్రీ ఆధిపత్యాన్ని కూలదోసి పురుషుడి ఆధిపత్యాన్ని స్థాపించడమే నాగరికతకు పునాది అయిందంటాడు. ప్రకృతిసిద్ధమైన స్త్రీ ఆధిపత్యం నుంచీ, ప్రభావాలనుంచీ- అంటే, ప్రకృతి నిర్బంధాలనుంచి తప్పించుకోడానికి ఇలా మొదలైన పురుషుడి ప్రయత్నం ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతూనే ఉందంటూ, భూమ్యాకర్షణశక్తిని దాటి వెళ్ళే రాకెట్లను, ప్రకృతిలో మార్పులు తేవడానికి ఉద్దేశించిన జన్యువిజ్ఞానాన్ని ఆయన ఉదహరిస్తాడు.

భూమితో తనకున్న సంబంధాన్ని మార్చడానికి పురుషుడికి సాయపడిన సాధనం, నాగలి. స్త్రీ అధీనంలో ఉన్న పెరటిసాగును పురుషుడు తన చేతుల్లోకి తీసుకుని వ్యవసాయంగా మలచడానికి ఈ కొత్త సాంకేతికసాధనం తోడ్పడింది. అమ్మమతంలో గర్భధారణకు కారణమైన యోనినీ, పురుషాంగాన్నీ కూడా అమ్మదేవతకే ఆపాదించడం కనిపిస్తుందనీ; ఆ రెండింటి మీదా హక్కును అమ్మదేవతే చెలాయించేదని- లస్కో గుహాచిత్రాలు, చాటల్ హ్యుయక్ గోడచిత్రాలు వగైరాల వెలుగులో ఇంతకుముందు చెప్పుకున్నాం. నాగరికతాకాలానికి చెందిన అయ్యమతానికి వచ్చేసరికి పౌరాణికకల్పనలు సంతానోత్పత్తిలో స్త్రీపాత్రను తక్కువ చేయడమే కాకుండా, పురుషాంగాన్ని పుంస్త్వానికి చిహ్నంగా మార్చి పురుషదేవుళ్ళకు బదిలీ చేయడం కనిపిస్తుంది. ‘ఎంకి ఏర్పరచిన ప్రపంచవ్యవస్థ’ అనే సుమేరుపురాణకథలో ఎంకి పరంగానూ, మన పురాణకథల్లో శివుడి పరంగానూ జరిగింది అదే. వ్యవసాయంతో కూడా ముడిపడి ఉన్న ఈ పౌరాణికకల్పనల్లో పురుషాంగానికి నాగలి ప్రతీక అయింది.

దీనితో స్త్రీ ఆధిపత్యం స్థానంలో పురుషుడి ఆధిపత్యాన్ని స్థాపించే ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. పైన పేర్కొన్న సుమేరుపురాణకథ ఒకానొక జలప్రళయం తర్వాత ఎంకి ప్రపంచాన్ని పునర్వ్యవస్థీకరించాడని చెప్పడంలో అసలు సూచన అదే. స్త్రీ ఆధిపత్యాన్ని పూర్తిగా కూలదోసి పురుషుడి ఆధిపత్యాన్ని స్థాపించిన వినూత్నప్రపంచం అది! ఈ పరిణామాన్ని స్త్రీ జీర్ణించుకోలేకపోయిందనీ, పురుషుని ఆధిపత్యాన్ని ప్రశ్నించిందనీ ఇంతే స్పష్టంగా ఇదే కథ చెబుతుంది. అంతవరకూ ఆధిపత్యాన్ని చెలాయించిన ఇనన్న అనే సుమేరుదేవత తన చేతినుంచి రాజదండా(royal scepter)న్ని ఎంకి తప్పించినందుకు దుఃఖించిందనీ, దేవదేవుడైన ఎన్ లిల్ మా భవిష్యత్తును నీ చేతుల్లో పెడితే ఎందుకిలా చేస్తున్నావనీ, మా హక్కులు ఏమయ్యాయని ప్రశ్నించిందనీ ఇంతకుముందు(27వ వ్యాసభాగం)చెప్పుకున్నాం. ఆధిపత్యం కోసం స్త్రీ-పురుషుల మధ్య జరిగిన ఈ పెనుగులాటనే పౌరాణికకథనాలు స్త్రీ-పురుష దేవుళ్ళ పరంగా చిత్రించాయి. సుమేరుపురాణాల్లోనే కాక, గ్రీకు, ఈజిప్టు, భారత్ సహా ప్రాచీనసంస్కృతులకు చెందిన అన్ని పురాణాల్లోనూ ఈ పెనుగులాట కనిపిస్తుంది. మన దగ్గర ‘దేవీభాగవతం’ మొదలైన వాటిలో దీని ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి.

ఈ పెనుగులాటలో స్త్రీ చివరికి ఓడిపోవడం గురించి కూడా అవే పురాణాలు, ధర్మశాస్త్రాలు చెబుతాయి. మొదట్లో వేట ప్రధానవ్యాపకంగా ఉన్న పురుషుడు ఆ తర్వాత వ్యవసాయదారుడిగా, పశుపాలకుడిగా మారాక వేటనైపుణ్యాన్ని యుద్ధాలవైపు మళ్ళించడం, అందులో భాగంగా భూముల ఆక్రమణ, పశువుల అపహరణ మొదలవడం, శత్రువులను చంపి వారి స్త్రీలను చెరబట్టి దాసీలను చేసుకోవడం, లొంగిపోయిన పురుషులను దాసులను చేసుకోవడం జరుగుతూవచ్చాయి. ఆవిధంగా దాసదాసీవ్యవస్థ పుట్టుకొచ్చింది. రామాయణ, మహాభారతాలతో సహా ప్రాచీనప్రపంచవాఙ్మయం అంతటా ఈ దాసదాసీవ్యవస్థ కనిపిస్తుంది.

ఈ పరిణామక్రమంలోనే స్త్రీ మరో కొత్త అవతారం ఎత్తడం గురించి థామ్సన్ రాస్తాడు. అమ్మమతంలో, అమ్మదేవతా ప్రాబల్యంలో స్త్రీ సంతానోత్పాదకసామర్ధ్యానికి మాత్రమే ప్రతీక అయింది. లస్కో గుహాచిత్రాలు, చాటల్ హ్యుయక్ గోడచిత్రాలతో సహా ఎగువరాతియుగంనుంచి, కొత్తరాతియుగం వరకూ కనిపించే చిత్రాలు స్త్రీని స్థూలదేహంతోనూ, పురుషుని ఆమె ఒడిలోని శిశువుగానూ చూపిస్తాయి. పురుషాధిపత్యం వచ్చాక స్త్రీ తను కోల్పోయిన అధికారాన్ని ఎంతో కొంత తిరిగి సాధించకోడానికి కొత్తరూపం ఎత్తవలసివచ్చింది. ఈసారి తన అంగాంగప్రదర్శనతో పురుషుని మోహపెట్టి తన చుట్టూ తిప్పుకోవడం ద్వారా పై చేయిని సాధించడానికి సిద్ధపడింది. అంటే, స్థూలదేహంతో కనిపించే స్త్రీ లావణ్య, సౌకుమార్యాలను సంతరించుకుని సౌందర్యరాశిగా మారుతూ వచ్చిందన్నమాట. సంతానశక్తిగా మాత్రమే కొలుపులందుకున్న స్త్రీ -పురుషునిలో మోహ, కామాలను పుట్టించే ఆకర్షణశక్తిగా మారిన ఈ క్రమాన్ని మన పౌరాణిక పదజాలంతో చెప్పుకుంటే- జగజ్జనని కాస్తా జగన్మోహినిగా అవతారం ఎత్తిందన్నమాట!

దాసిగా మారడంతో స్త్రీ పతనం ఆగలేదు; తన ఇష్టాయిష్టాలతో పని లేకుండా పురుషుడి భోగ్యవస్తువై పౌరాణికభాషలో అప్సరసగానూ, లౌకిక భాషలో వేశ్యగానూ కూడా మారింది. ఈ పతనానికి సంబంధించిన సమస్తసాక్ష్యాలూ ప్రాచీన ప్రపంచవాఙ్మయం అంతటా కనిపిస్తాయి.

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న రామాయణంలో కూడా!

మిగతా విశేషాలు తర్వాత...

Read More
Next Story