
హెచ్ సియు విద్యార్థుల భూపోరాటానికి అంత మద్దతు ఎలా వచ్చింది?
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో సాధించుకున్న భూమిని, ప్రత్యేక తెలంగాణ రాస్ట్రంలో ప్రభుత్వం గుంజుకోవడం సరికాదన్నది యావత్ తెలంగాణ సమాజ భావన.
-రమణాచారి
సేవ్ హెచ్ సి యు ల్యాండ్స్. ఇది గత కొద్ది రోజులుగా విశ్వవిద్యాలయాల్లో మార్మోగుతున్న నినాదం. అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు విద్యార్థుల న్యాయమైన డిమాండ్ కు బాసటగా నిలిచిన సందర్భం. 50ఏళ్ల క్రితం తెలంగాణలో వెనుకబాటుతనాన్ని గమనించి, విద్యారంగ అభివృద్ధిలో భాగంగా కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపన కోసం 2,300 ఎకరాల భూమిని కేటాయించారు.
ప్రధానంగా విద్యార్థుల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను శాంత పరుస్తూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ రూపొందించిన ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఈ కేటాయింపు జరిగింది. తర్వాత కాలంలో వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ గురుభక్ష్ సింగ్ యూనివర్సిటీ భూమి అన్యాక్రాంతం కాకుండా 2 కోట్ల రూపాయలతో ప్రహరీ గోడ కట్టించారు. యూనివర్సిటీ భూమిని విద్యారంగానికి కాకుండా వేరొక అవసరానికి వాడకూడదని స్పష్టం చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం 680 ఎకరాలు వివిధ కార్యాలయాలకు ఇచ్చింది. ఇప్పుడు మరో 400 ఎకరాలు TGIIC కి కేటాయించి బహుళజాతి కంపెనీలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.
దీంతో యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విద్యార్థుల నిరసనలు, ర్యాలీలు, నినాదాలతో యూనివర్సిటీ అట్టుడికి పోయింది. ఆగ్రహించిన ప్రభుత్వం పోలీసు క్యాంప్ ఏర్పాటు చేసింది. శాంతియుత నిరసనపై లాఠీ విరిగింది. అక్రమ కేసులు నమోదయ్యాయి. నిర్బంధం యధావిధిగా కొనసాగింది. ఇటు విద్యార్థులు, అటు పౌర సమాజం తీవ్రంగా నిరసించాయి. పర్యావరణ పరిరక్షణలో భాగమే కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళన. విద్యార్థుల మనోభావాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు, యూనివర్సిటీలో అక్రమంగా ప్రవేశించి బుల్డోజర్లతో జరుపుతున్న చెట్ల కొట్టివేతను నిలుపుదల చేసింది.
ఆ 400 ఎకరాలలో పలు రకాల పక్షులు, జంతువులు (కుందేళ్లు, నెమళ్ళు తదితర..) తోపాటు ఆక్సిజన్ పంచే వృక్షాలు ధ్వంసమై కాలుష్యం పెరుగుతుందన్న ప్రకృతి ప్రేమికుల ఆవేదన కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. యూనివర్సిటీలో ఉండాల్సిన ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందన్న విద్యార్థుల అభిప్రాయాన్ని గుర్తించింది. ఎట్టకేలకు పరిష్కార దిశగా అడుగులు వేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గం పలు వర్గాలతో చర్చించి విద్యార్థులపై మోపిన కేసులను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే.
మాభూమి మాకే, మావే అన్నది హెచ్ సియు విద్యార్థుల ప్రధాన నినాదం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో సాధించుకున్న భూమిని, ప్రత్యేక తెలంగాణ రాస్ట్రంలో ప్రభుత్వం గుంజుకోవడం సరికాదన్నది యావత్ తెలంగాణ సమాజ భావన. ఇది శాస్త్రీయమైన ఆలోచన కూడా. ఇతర దేశాలలో భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని విశ్వవిద్యాలయాలకు వేలాది ఎకరాల భూమి కేటాయించి రక్షిస్తున్నారు. మన దేశంలో మాత్రం వాటిని తెగనమ్మి సొమ్ము చేసుకోవాలనుకోవడం ఆనవాయితీగా మారుతొంది. చెట్లు లేకుండా, అడవులు లేకుండా, జలాశయాలు లేకుండా భూములన్ని కార్పొరేట్లకు కట్టబెడుతూ కాంక్రీట్ జంగల్ ఏర్పాటుకు పరుగులు తీస్తున్నారు. వాతావరణ కాలుష్యం, భూ తాపం పెరిగితే భూఖండంపై ఏర్పడబోయే ఉపద్రవాల పరిస్థితి ఏమిటన్నది పాలకులకు అర్థం కావడం లేదు. ఏర్పడబోయే విపత్తుతో భవిష్యత్ తరాలు ఎలాంటి ప్రళయాలను ఎదుర్కోవలసి వస్తుందో అంచనా వేయడం లేదు. పర్యావరణవేత్తల సూచనలను పెడచెవిన పెడుతున్నారు. ఇది కేవలం విశ్వవిద్యాలయాల భూములకే పరిమితం కాదు. ప్రభుత్వ భూములను, కొండలను, జలాశయాలను, నదుల పరిరక్షణను దీక్షగా స్వీకరించాల్సిన సమయం. పాలకులు గుర్తెరగాలి. పర్యావరణ రక్షణ స్పృహతో నడుచుకోవడం చారిత్రక కర్తవ్యం కూడా.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల విషయంలో ప్రభుత్వం పట్టుదలకపోవడం సరైనది కాదు. కోర్టు చివాట్లు పెడుతున్నా పట్టించుకోనట్టు ప్రవర్తించడం మంచిది కాదు. ప్రభుత్వం చెబుతున్నట్లు దీనికి బదులుగా వేరొక చోట తాము కేటాయించినట్లు చెబుతున్న భూమిని వారి అవసరాలకు వాడుకోవచ్చు. యూనివర్సిటీ భూములనే ఆక్రమించి తీరుతామని పంతం పట్టడం అవివేకమైనది. యూనివర్సిటీ నుంచి పోలీసు క్యాంపు ఎత్తివేయడం, అక్రమంగా యూనివర్సిటీలో ప్రవేశించిన బుల్డోజర్లను బయటకు పంపించేయాలి.
అప్పుడే యూనివర్సిటీలో కొంత శాంతియుత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. చరిత్రను తిరగ రాయగల శక్తిమంతులు విద్యార్థులు. అందునా కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు చాలా తెలివైన వారు, చురుకైన వారు. వీరికి అండగా నడుస్తున్న ఉస్మానియా కాకతీయలే కాక అన్ని విశ్వ విద్యాలయాలు ఒకటై కదిలి రోడ్డెక్కితే రాష్ట్ర ప్రభుత్వానికి అవమానమే.
యూనివర్సిటీలోని వందలాది అధ్యాపక బృందం ఇప్పటికే విద్యార్థులతో కలిపి అడుగులేస్తున్నది. ప్రభుత్వం తాత్సారం చేయకుండా విద్యార్థుల, అధ్యాపకుల, బుద్ధి జీవుల, ప్రజా సంఘాల, పలు రాజకీయ పార్టీల విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుని యూనివర్సిటీ భూములను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం ఎంతైనా సమంజసం.