బహుజనుల రాజ్యాధికార జెండా కాన్షీరామ్
x

బహుజనుల రాజ్యాధికార జెండా కాన్షీరామ్

2025 మార్చి 15 కాన్షీరామ్ 91వ జయంతి సందర్భంగా కృపాకర్ మాదిగ వ్యాసం


-కృపాకర్ మాదిగ


భారతదేశంలో కులం పేరుతో అణగదొక్కబడిన ఎనభయైదు శాతం మెజారిటీలను బహుజనులుగా సంఘటితం చేసి, రాజ్యాధికారం తీసుకురావడానికి మాన్యశ్రీ కాన్షీరామ్ పూనుకున్నారు.అతి తక్కువ జనాభా సంఖ్యతో పదిహేను శాతంగా ఉన్న, హిందూ ఆధిపత్య కులాలను " రూలింగ్ మైనారిటీలు " గా కాన్షీరామ్ గుర్తించారు.వీరి రాజకీయ దోపిడీని నివారించడానికి ' ఓట్లు మావి - సీట్లు మీవా? చెల్లదు ఇకపై చెల్లదు! ' అని కాన్షీరామ్ చేసిన నినాదం దేశమంతా మార్మోగింది.అణగారిన కులాల వారికి కులం పునాది గా జనాభా దామాషా ప్రకారం అధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి జీవిత కాలం శ్రమించిన బహుజన విప్లవ నాయకుడు కాన్సిరామ్.షెడ్యూల్ కులాల వారు స్వతంత్ర రాజకీయాలు చేసి,ఓబీసీలు మత మైనారిటీలతో ఐక్య సంఘటన నిర్మించి,ఎలా అధికారంలోకి రావచ్చునో కాన్షీరామ్ నిరూపించారు.


ఏ కమ్యూనిటీకి అధికారంలో భాగస్వామ్యం ఉండదో,ఆ కమ్యూనిటీ అంతరించిపోతున్నట్టేనని కాన్షిరామ్ అన్నారు.తాత్కాలికి సామాజిక న్యాయం వద్దనీ,దాని స్థానంలో మొత్తం సామాజిక,ఆర్థిక,రాజకీయ పరివర్తన కావాలన్నారు.అధికారమే విజయానికి ముఖ్య తాళం చెవి అన్నారు.బహుజనులు అధికారంలోకి రావాలంటే రాజకీయ ప్రజా ఉద్యమం అవసరం అని కాన్షీరామ్ గుర్తించారు.ఆ ఉద్యమం ఓట్లను సంఘటితం చేసేదిగా, ఓట్లని సీట్లుగా మార్చేదిగా,సీట్లు రాష్ట్రాల్లో అధికారాన్ని స్థాపించేవిగా,అంతిమంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చే గురుతర రాజకీయ లక్ష్యం బహుజనులదని కాన్షీ రామ్ ప్రకటించారు.

కులం ఉన్నంత వరకు దానిని అణగారిని కులాల వారి ప్రయోజనాల కోసం వాడాలి.అందుకు ఆటంకం ఏర్పడితే కుల నిర్మూలన కోసం పోరాడుదామని కాన్షీ రామ్ పిలుపునిచ్చారు.బ్రాహ్మణవాదం విజయవంతం అవుతున్నంత కాలం ఇతర వాదాలు యేవీ విజయవంతం కాలేవని,దేశంలో ప్రాథమికమైన, నిర్మాణాత్మకమైన సామాజిక మార్పు బహుజనులకు ఎంతో అవసరం అని కాన్షీరామ్ అభిప్రాయం." వ్యవస్థ తలుపుల దగ్గర నిలబడి న్యాయం అడగడానికి మనం ఎంతో కాలం నుంచి తడుతూనే ఉన్నాం.కానీ, న్యాయం పొందలేకపోయాము.ఇప్పుడు తలుపులు బద్దలు కొట్టడానికి సమయం వచ్చిం " దని కాన్షీరామ్ బహుజనులకు పిలుపునిచ్చారు.

దేశంలో బహుజనులకు రాజ్యాధికారం సాధించాలంటే జనరంజకమైన పద్ధతుల్లో ప్రజల్ని సమీకరించాల్సిన అవసరం ఉందని కాన్షీరామ్ గుర్తించారు.అందుకోసం తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి,బ్యాక్ వర్డ్స్ అండ్ మైనార్టీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (బాంసెఫ్) ని కాన్షీ రామ్ 1978లో స్థాపించారు.అలాగే, దళిత్ సోషిత్ సమాజ్ సంఘర్ష సమితి (డిఎస్ - 4) ని 1981 లో కాన్షీరామ్ స్థాపించారు.తన అనుయాయులతో కలిసి బహుజన్ సమాజ్ పార్టీ ( బిఎస్పీ) ని 1984 లో కాన్షి రామ్ స్థాపించారు.కొంతమంది అనుచరులతో,కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో నలభై రోజుల పాటు మూడు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రను కాన్షీరామ్ నిర్వహించారు.ఈ సందర్భంగా కాన్షీరామ్ కొన్ని నినాదాలు సృష్టించారు అవి; కులాన్ని నిర్మూలిద్దాం - బహుజన సమాజాన్ని స్థాపిద్దాం. స్వతంత్ర భారతదేశంలో బహుజనులు ఎందుకు బానిసత్వంలో ఉన్నారు? ' మండల కమిషన్ ని అమలు చెయ్యి - లేకుంటే గద్దె దిగిపో! ఏ భూమి ప్రభుత్వానిదో - ఆ భూమి బహుజనది! 'ఎవరిది ఎంత జనాభాయో - వారిది అంత భాగస్వామ్యం', 'పార్లమెంటుకు నడు - నీ కాళ్ళ మీదే నిలబడు', ' ఓట్లు మావి సీట్లు మీవా? చెల్లదు! ఇకపై చెల్లదు!తిలక్,తరాజ్,తల్వార్ లను తరిమికొట్టండి! అధికారులు,ఉద్యోగులు,విద్యావంతులారా! పే బ్యాక్ టు ది సొసైటీ.బహుజనుల అంతిమ లక్ష్యం - ఈ దేశాన్ని పరిపాలించడం! ' బహుజనుల విజయానికి ముఖ్యమైన తాళం చెవి - రాజ్యాధికారం' మొదలగు నినాదాలు,రాజకీయ జాతీయాలు, ప్రశ్నలను,కొత్త రాజకీయ భాషను బహుజన రాజకీయాలకు కాన్షీరామ్ నేర్పించారు.

వర్తమాన భారతదేశ రాజకీయ పర్యావరణంలో బహుజనుల పొలిటికల్ విజన్,పొలిటికల్ ప్రోగ్రామ్ పై కాన్షీరాం చెరగని ముద్ర వేశారు.భారత దేశ కుల సమాజంలో ఇప్పటి రాజకీయాలకు తగినట్లుగా అధికారంలో కమ్యూనిటీ భాగస్వామ్యం పునాదిగా ఉండే,రాజకీయ కార్యక్రమాన్ని ఒక సరికొత్త రాజకీయ వ్యాకరణాన్ని,వ్యూహాన్ని దేశ రాజకీయాల్లో కాన్షీరామ్ ప్రవేశపెట్టారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 1995లో మొదటిసారి,1997లో రెండోసారి, 2002లో మూడోసారి,2007 లో నాలుగో సారి - బీఎస్పీ నాయకురాలు,చర్మకార సామాజిక వర్గానికి చెందిన మహిళ,బహెన్ జీ కుమారి మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి,చరిత్ర సృష్టించారు.ఈ నేపథ్య సృష్టికర్త మాన్యశ్రీ కాన్షీరామ్.1999లో బీఎస్పీకి 14 మంది ఎంపీలు పార్లమెంట్లో ఉండేవారు.అలాగే, కాన్షీరామ్ 1991 నుంచి 96 వరకూ ఇటావా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి,1996 నుంచి 98 వరకూ హోషియార్ పూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. బహుజనుల స్వయం గౌరవం, సమానత్వం,విముక్తి ,కుల నిర్మూలన కోసం,అత్యాచారాలు అంటరానితనాలకు ప్రతిఘటన మొదలగు లక్ష్యాల సాధన కోసం భారతీయ కిసాన్ మజ్దూర్ ఆందోళన్,సఫాయీ మజ్దూర్ ఆందోళన్, చేతివృత్తిదారుల ఆందోళన్,శరణార్థుల ఆందోళన్, భాగస్వామ్య హక్కుల (భాగీదారి) ఆందోళనలన్ లను కాన్షీరామ్ దేశవ్యాప్తంగా నిర్వహించారు.ఎనిమిది శాతం ఓట్లను పొందిన చోట,ఏ పార్టీ అయినా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేక,మనపై ఆధారపడే పరిస్థితులను సృష్టించాలి.ఇరవై శాతం ఓట్లను సాధించుకున్నకాడ, మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే స్పష్టమైన ఎరుకతో కాన్షీరామ్ రాజకీయ పావులను కలిపేవారు.మనువాద మనీ,మాఫియా,మీడియాలను ఎదుర్కొనే విధంగా కాన్షీరామ్ బహుజనులను తయారు చేశారు.

అంబేద్కర్ అనంతరం,అంబేద్కర్ రాజకీయ కార్యక్రమాన్ని సృజనాత్మకంగా ముందుకు తీసుకుపోయిన గొప్ప నాయకుడు కాన్షీరామ్. అంబేద్కర్ బాట చూపించగా,కాన్షీరామ్ నడిచి చూపించారు.బహుజన రాజకీయ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించి రాజకీయ పార్టీగా సంఘటితం చేసి, పటిష్టపరిచిన ఘనత కాన్షీరామ్ గారిది. అప్రెస్డ్ ఇండియన్ పత్రిక,బహుజన నాయక్, బహుజన సంఘటన పత్రికలను కాన్షీరామ్ స్థాపించి, సంపాదకునిగా వాటిని నడిపించారు. అలాగే,చెంచా యుగం అనే గ్రంథాన్ని కాన్షీరామ్ రాశారు. డాక్టర్ అంబేడ్కర్ - గాంధీల మధ్య 1932 సెప్టెంబర్ 24న పూనా ఒడంబడిక జరిగింది.ఈ ఒప్పందం ద్వారా దళితులు,రాజకీయ స్వయం ప్రతిపత్తిని కోల్పోయారు. గాంధీ ఆధిపత్య కులాల రాజకీయాలకు ప్రతినిధిగా, ఈ సాంఘిక అన్యాయానికి వొడిగట్టారు.ఈ ఒప్పందం ద్వారా, దళితులు రాజకీయ బానిసత్వ చట్రంలో ఎలా నెట్టివేయబడినారో ఈ గ్రంథంలో కాన్షీరామ్ వివరంగా విశ్లేషించారు. 1934 మార్చి 15వ తేదీన పంజాబీ రాష్ట్రం రోపార్ జిల్లా ఖవాస్ పూర్ గ్రామంలో కాన్షీరామ్ జన్మించారు.2006 అక్టోబర్ 9 వ తేదీన తన డెబ్భైరెండో ఏట తీవ్ర అనారోగ్యంతో,కాన్షీరామ్ తనువు చాలించారు.రాజకీయాల్లో కాన్షీరామ్ సృష్టించిన నినాదాలు లేవనెత్తిన ప్రశ్నలు,వాడిన భాష తాత్విక దృష్టి,బహుజనుల రాజకీయ వ్యాకరణం అయింది. బహుజనుల రాజకీయ కార్యక్రమం అయింది.ఇది ఎప్పటికప్పుడు రాజకీయ సైరన్ అయ్యి,బహుజనుల గుండెల్లో మోగుతూనే ఉంటుంది.



Read More
Next Story