
భారత ఎన్నికల ప్రక్రియ మీద అన్ని అనుమానాలు ఎందుకు?
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ` సరికొత్త సవాళ్లు
అమెరికా అధ్యక్షులు, భారత ప్రధానమంత్రి అటు అమెరికాలో కానీ ఇటు భారతదేశంలో కానీ సమావేశమైన తర్వాత జరిగే విలేకరుల సమావేశంలోనూ, అనంతరం వచ్చే విశ్లేషణలూ, వ్యాఖ్యానాల్లోనూ ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశాల మైత్రి అని, ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని చెప్పుకుని సంబరిపడిపోతూ ఉంటాము. నిజానికి గత పన్నెండేళ్లుగా భారత ప్రజాస్వామ్యంలో కనిపిస్తున్న ధోరణులు గమనిస్తే కేంద్ర ప్రభుత్వం సొంతం చేసుకుందామనుకుంటున్న ప్రజాస్వామిక త్వం ఏమిటన్నది ప్రశ్నార్ధకమవుతోంది.
వర్తమానంలో ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు. భారతదేశంలో ఎన్నికలు జరపటానికి, జరిపించటానికి రాజ్యాంగబద్దమైన ఓ ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియను అమలు చేయటానికి స్వయంప్రతిపత్తి కలిగిన కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఉంది. దేశంలో ఎన్నికలకు సంబంధించి ఏమి జరిగినా అంతిమంగా కేంద్ర ఎన్నికల సంఘానికి బాధ్యత. ఎన్నికల క్రమంలో ఏ చిన్న ఆరోపణ వచ్చినా, పెద్ద అఘాయిత్యం జరిగినా అది కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యంగానే పరిగణించబడుతుంది.
గత పదేళ్లలో ఎన్నికల సంఘం అనుసరించిన విధి విధానాల గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల వివాదం నేటికీ అపరిష్కృతంగానే ఉంది. ట్యాంపరింగ్‌కు అవకాశం లేదని ఎన్నికల సంఘం ఘంటాపథంగా చెప్తున్నా చండీగర్ కార్పొరేషన్‌లో మెషిన్ ట్యాంపరింగ్ (EVM Tampering) చేస్తూ పట్టుబడ్డ ఎన్నికల అధికారి వీడియోలు మనం చూశాము. తయారైన ఈవిఎంలకూ, రవాణా చేసిన ఈవిఎంలకూ, ఎన్నికల సంఘం చేతికి చేరిన ఈవిఎంలకూ మధ్య లక్షల సంఖ్యలో తేడా ఉండటం కూడా స్వయంగా ఎన్నికల సంఘం సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానాలే వెల్లడిస్తున్నాయి. ఈవిఎంల విషయంలో పలు వివాదాలకు సమాధానంగా సుప్రీం కోర్టు వివిపాట్ (VVPAT)లను పోల్చి చూడాలని ఆదేశాలిచ్చి దాదాపు ఆరేళ్లు అవుతుంది. ఆ తర్వాత ఎన్నో రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికలు కూడా జరిగాయి. మధ్యంతర ఎన్నికల సంగతి సరేసరి. అయినా తర్వాత పలువురు సమాచార హక్కు కింద దాఖలు చేసుకున్న దరఖాస్తులకు ఎన్నిచోట్ల వివిపాట్‌లు లెక్కచూశారు, ఎంత మేర సరిపోయాయీ, ఎన్ని చోట్ల తేడాలు వచ్చాయి అన్న ప్రశ్నలకు ఇంతవరకూ సమాధానాలు లేవు.
తాజా ఎన్నికల సందర్భంగా ముందుకొచ్చిన అనేక కీలకఅంశాలు యావత్ ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థపైనే ప్రజలు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. అటువంటి తాజా సందర్భాల్లో ఒకటి 2024 లోక్ సభ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ మధ్య ఉన్న తేడా మోడరన్ రిగ్గింగ్‌ను సూచిస్తోంది.
దీనిపై పలు రూపాల్లో వస్తున్న ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానాలు దాటవేస్తోంది. పైగా కొన్ని కొన్ని పొరపాట్ల వలన ఒక్కో పోలింగ్ యూనిట్‌లో పోలైన ఓట్ల లెక్కింపులో తేడాలు వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషన్ తేలిగ్గా కొట్టిపారేయటం గమనిస్తే ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించటంలో కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వాలకూ అసలు నిబద్ధత ఉందా లేదా అన్న ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి.
పైగా ఎన్నికల బాండ్ల (Electoral Bonds) విషయంలో ప్రజలు రాజకీయ పార్టీలకు వస్తున్న చందాలు, ఎవరెంతిస్తున్నారన్న విషయాలు తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని స్వయంగా కేంద్ర అటార్నీజనరల్ సుప్రీం కోర్టుకు విన్నవించటం ఎన్నికల ప్రక్రియను ప్రజాతంత్రీకరించేందుకు గత మూడు దశాబ్దాలుగా సాగుతున్న పోరాటాన్ని కించపరటమే. విజయాలను తోసిపుచ్చటమే.
ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్ల నమోదు వివాదాన్ని, ఢల్లీలో ఓటర్ల నమోదు వివాదాన్ని పరిశీలించాలి. మహారాష్ట్రలో మొత్తం వయోజన జనాభా కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఢల్లీలో జాతీయ వయోజన జనాభా వృద్ధిరేటుకు రెట్టింపు సంఖ్యలో వయోజనులు ఓటు హక్కు పొందారు. ఈ ప్రశ్నలకు సమధానాలివ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ప్రశ్నలకు భవిష్యత్తులో కూడా సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఎన్నికల విధి విధానాల ప్రకటనలో సవరణలు ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదిత సవరణల ప్రకారం ఎన్నికలకు సంబంధించిన గణాంక వివరాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేద్నదే సారాంవం. ఎలక్ట్రొరల్ బాండ్స్ విషయంలో సుప్రీం కోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరికి, ఇప్పుడు విడుదలైన సవరణకూ పద్దె తేడా ఏమీలేద.
ఢిల్లీ ఎన్నికల్లో ప్రభుత్వాల తలరాతను మార్చిన ఓట్లసంఖ్య సుమారు రెండులక్షల లేపే. కానీ గత ఐదారునెలల్లో కొత్తగా చేరిన ఓట్ల సంఖ్య నాలుగ లక్షలు. జనాభాకంటే ఓటర్ల సంఖ్య ఎలా ఎక్కువవుతుంది, జాతీయ జనాభా వృద్ధిరేటు కంటే ఢల్లీలో జనాభా వృద్ధిరేటు ఎందుకు ఎక్కువగా ఉందన్న ప్రశ్నలకు సమాధానం దొరక్కుండా దేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం మనుగడ సాగించటం కష్టం.
ఈ దేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని మన్నికైనదిగా మార్చటం పౌరసమాజ లక్ష్యంగా ఉండాలి. ఈ దిశగా పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, సిటిజన్స్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్టొరల్ రిఫార్మ్స్ లాంటి పౌర సమాజవ్యవస్థలు, సంస్థలు కృషి చేయాల్సి ఉంది. ఈ దేశం ప్రజాస్వామిక దేశంలో మనుగడ సాగించాలని ఆశించే వారంతా ఈ ఎన్నికలకు సంబంధించిన పౌరచైతన్య ఉద్యమంలో భాగస్వాములు కావాలి.