చిత్తునూర్ ఇథనాల్ ప్లాంట్ ఎత్తేయాల్సిందే... రైతుల పట్టు
పండ్ల రసాల ఉత్పత్తి పేరుతో తేరగా భూములు కొనుగోలు చేసి ఇథనాల్ ప్లాంట్ పెట్టారు. రైతులు వద్దంటున్నరు. దీని మీద పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి వాదన
-ఎం.రాఘవాచారి
గత మూడు సంవత్సరాలుగా చిత్తనూరు, ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామాల నడుమ ఏర్పాటు చేసిన ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ వారు పండ్ల రసాల ఉత్పత్తి పేరుతో చవకగా తేరగా భూములు కొనుగోలు చేసి పండ్ల తోటలు కాకుండా ఇథనాల్ ఉత్పత్తి కంపెనీ ఏర్పాటుకు పూనుకోవడంతో మనం నిరంతరం పోరాటంలో ఉన్నాం. ప్రజల జీవించే హక్కు రక్షణ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక వనరుల దురాక్రమణ నివారణ లక్ష్యాలతో మన జీవితాల బాగుకోసం పోరాడుతున్నాం.
కంపెనీ యాజమాన్యం స్థానిక ప్రజలకు, రెవెన్యూ, అటవీ, పర్యావరణ, కాలుష్య నియంత్రణ, పోలీసు, న్యాయ తదితర శాఖలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పింది. నిజా నిజాలను పరిశీలించవలసిన అన్ని శాఖలు, ప్రభుత్వం కంపెనీకి లోబడి పని చేశాయి. శాంతియుతంగా పోరాడుతున్న మనమీద అణచివేత,నిర్బంధం, కేసులు, రౌడీషీట్లు ప్రయోగించారు.
ఈ రెండేళ్లలో ఇథనాల్ కంపెనీ, ప్రభుత్వ శాఖలు చెప్పింది అబద్ధమని చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ, శాస్త్రవేత్తలు, రైతాంగం చెప్పిందే నిజమని రుజువు అయింది. కాలుష్యపు విషపు గాలులు కంపెనీ చుట్టూ ఉన్న 54 గ్రామాలను చుట్టు ముడుతున్నాయి. భూమి, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. జింకలు, నెమళ్లు చచ్చిపోయాయి. ఇతర జీవరాసులు చస్తున్నాయి. ఆ గాలి సోకిన,నీటిని తాగిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కూలి పనులు చేసుకునే పొరుగూరి వాళ్లు కంపెనీ పరిసర గ్రామాలకు పనికి రావడానికి భయపడుతున్నారు.
ఇంత వినాశకరమైన కంపెనీని మనం ఎందుకు భరించాలి. మన ఓట్లకు పుట్టిన ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఇథనాల్ పాలసీని తెచ్చాయని మనం అడుగుతూనే ఉన్నాం. ఈ కంపెనీ ఎత్తేసేదాకా పోరాటం నడపవలసిందే. పదేపదే ఈ ప్రశ్నలు అడగవలసిందే.
మన వ్యవసాయ విధానం ఎట్లుండాలె ? మన పారిశ్రామిక విధానం ఎట్లుండాలె ? మనం ఇతరుల మీద ఆధారపడకుండా మన బతుకులు మనం గౌరవంగా బతికేవిధంగా అంటే స్వావలంబన సాధించే విధంగా ఉండాలె. కానీ అట్ల లేదు. మనం రాష్ట్ర శాసనసభ కు, పార్లమెంటుకు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు మనకోసం కాకుండా కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారు.పోరాడి సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ కూరగాయలు, గింజ ధాన్యాలు పండిరచే ప్రణాళికలు చేయలేకపోతున్నది. కానీ తగిన వర్షపాతం లేదని తెలిసి కూడా పామాయిల్ పంటను ప్రోత్సహిస్తున్నది.
మన పరిశ్రమల శాఖ ఫార్మా కంపెనీలను, మైనింగును, లిక్కర్, ఇథనాల్ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నది. ఈ రెండు శాఖలు భూమి, నీరు, గాలి కాలుష్యమై, అడవులు అంతరించి పర్యావరణం పాడైపోయే పనులు చేస్తున్నాయి. ఈ పనులను అభివృద్ధిగా ప్రచారం చేస్తున్నాయి.ఈ కాలుష్య కారక ఉత్పత్తులకు దేశంలో మన తెలంగాణ రాష్ట్రం, రాష్ట్రంలో మహబూబ్ నగర్, హైదరాబాదు జిల్లా చుట్టూ వున్న ఇతర జిల్లాలు ప్రయోగశాలలైనాయి. వీటికి రియల్ ఎస్టేట్ రంగం తోడవ్వడంతో ప్రజలు తమ సర్వస్వం కోల్పోతూ పెద్ద ఎత్తున నిర్వాసితులవుతున్నారు. ప్రస్తుతం చిత్తనూరు ఇథనాల్ కంపెనీ పరిసర గ్రామాల ప్రజలు కూడా ఇలాంటి దశకు నెట్టబడ్డారు.
గత అనుభవాల దృష్ట్యా ఈ పరిస్థితులను ముందే అంచనా వేసిన మనం విజ్ఞాన శాస్త్రవేత్తలతో కలిసి ప్రపంచ అనుభవాలు తెలుసుకుంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిపాం. కరపత్రాల ప్రచారం, పాదయాత్రలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ధర్నాలు, వంద రోజులపాటు సత్యాగ్రహాలు జరిపాం. వేలాదిగా ప్రజలు ఈ ఉద్యమాలలో భాగమై న్యాయం కోసం గొంతెత్తారు. సోషల్ మీడియా ప్రజల వెంట నిలిచింది. కింది స్థాయిలోని అన్ని శాఖల ఉద్యోగులు, పోలీసులు ఈ పోరాటం న్యాయమైందన్నారు. పై అధికారులు, పై నాయకులు, అధికార పార్టీలు కంపెనీకి అండగా నిలిచి పనులు జరిపించారు.
ఇవాళ చిత్తనూరు ఇథనాల్ కంపెనీ ఉత్పత్తి కన్నా వందలు,వేల రెట్లు కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తున్నది. మన గాలిని, నీటిని, భూమిని, మన జీవితాలను నాశనం చేస్తున్నది. వాతావరణంలో కర్బన ఉధ్గారాలను తగ్గించే నెపంతో ఇథనాల్ పాలసీ తెచ్చి మన మీద ప్రయోగించారు. ఈ కంపెనీ కార్బన ఉద్గారాలను ఉత్పత్తి చేస్తూ మన మీద వదులుతున్నది. ఇలాంటి కంపెనీలు తెలంగాణలో 20 దాక ఏర్పాటు చేస్తే తెలంగాణ ఏమైపోవాలి ?
ఈ కలుగును తవ్విన కొద్దీ, చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాటం ముందడుగు వేసిన కొద్దీ అనేక నేరాలు, ఘోరాలు, నేరగాళ్లు బయటపడుతున్నారు. తొలుత తెలంగాణలో మన బతుకులతో రాజకీయాలు, వ్యాపారాలు చేసి అధికారం అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి,బండి పార్థసారథి రెడ్డి,దొడ్డ మోహనరావ్ కుటుంబాలకు అధికార పార్టీలమీద,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎంత పట్టున్నాదో తెలిసింది.
సంపన్న పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాద దేశాల బందీగా దేశభక్తి చాటున కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇథనాల్ పాలసీ రూపొందించి ప్రజాభిప్రాయ సేకరణ అవసరంలేని వెసులుబాటుతో,ఎఫ్.సి.ఐ సేకరించిన బియ్యంను సబ్సిడీకి అందించే హామీతో దేశాన్ని, ప్రత్యేకించి తెలంగాణను ఇథనాల్ పాలసీకి ప్రయోగశాల గా చేసిన వైనం మనకు తెలిసిందే. ఇవాళ ఇథనాల్ కంపెనీల యజమాన్యాలు ఒక ఫోరంగా ఏర్పడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దబాయించి తమ పనులు చేయించుకుంటున్నాయి.
చిత్తనూరు ఇథనాల్ కంపెనీ ముందు 22 అక్టోబర్ 2023న బాధిత రైతాంగం,ప్రజలు శాంతియుతంగా నిర్వహిస్తున్న ఉద్యమం మీద పోలీసులు పకడ్బందీ ప్రణాళికతో పెద్ద ఎత్తున దాడి చేశారు. తమ వాహనాలు తామే తగలబెట్టుకొన్నారు. పోలీసుల దాడికి గురైన మహ్మద్ ఖాసీం సాబ్ చనిపోయాడు.పోలీసులు తెగబడి ప్రభుభక్తి చాటుకున్నారు.ఉద్యమకారులను తరిమి తరిమి కొట్టారు.బాధిత గ్రామాలైన చిత్తనూరు,ఎక్లాస్పూర్,జిన్నారం ప్రజలను ఇండ్లలో ఉండనీయకుండా దాడులు చేశారు. పోలీసుల దాడులలో దాదాపు 100 మంది గాయపడ్డారు. 78 మంది కేసులకు గురై జైలు పాలయ్యారు.పోలీసులు పెట్టిన చిత్రహింసలకు గురైన బాధితులు తమ రోజువారీ పనులు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్ ) ప్రభుత్వం పై దాష్టికాలను కొనసాగిస్తే నేటి కాంగ్రేస్ ప్రభుత్వం ఎనిమిది మంది రైతుల మీద రౌడీషీట్లు తెరిచింది. రాష్ట్రంలో బారాస ప్రభుత్వం పోయి కాంగ్రేస్ ప్రభుత్వం వచ్చినా పోలీసుల దబాయింపులు, బెదిరింపులు ఆగలేదు.ఈ అణిచివేత వెనుక, ప్రణాళిక రచనలో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయిలో అధికారం చలాయించిన మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు యొక్క కీలక పాత్ర ఉన్నట్లు తెలిసింది.అప్పటి నుండి ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ హైదరాబాదులో సమావేశాలు జరిపినప్పుడల్లా ఇథనాల్ ఉత్పత్తి అనుకూల, కాలుష్య కంపెనీ అనుకూల కరపత్రాలు వదిలి పోతున్నారు. వారెవరో ప్రకటించుకోవడం లేదు.
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కేంద్రం స్థాయిలో ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం బట్టబయలు కావడంతో అధికార రాజకీయ నాయకులు,రాజకీయాధికారంతో అక్రమంగా సంపదను కొల్లగొట్టిన పెట్టుబడిదారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు, పార్టీల పైనాయకులు, సచివాలయ స్థాయి అధికారులు కుమ్మక్కై పేద,నిరుపేద, అణగారిన కుల వర్గాల ప్రజల బతుకులను కాలుష్యానికి ఎట్లా బలి చేస్తున్నారో, రైతాంగాన్ని ఎట్లా నిర్వాసితులను చేస్తున్నారో మరింత బాగా తెలిసింది.
మనం ఒకవైపు అనేక ఉద్యమాలతో ఇథనాల్ ఉత్పత్తి వల్ల కలిగే కష్టనష్టాలను, కాలుష్యాన్ని చర్చకు తెస్తూనే అన్ని మంత్రిత్వ శాఖలలో ప్రాతినిధ్యాలు చేశాము. జిల్లా స్థాయి అధికారులతో చర్చలు జరిపాము. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేయాలో చెప్పడమే కాక స్థానిక విపత్తును తెలియపరిచాము. అధికార పార్టీ తప్పిదాలను ప్రతిపక్ష పార్టీలకు వివరించాము. రాహుల్ గాంధీ గారికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖలు ఇచ్చాము. భారత రాష్ట్ర సమితి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పి దించేశారు. ఏ కారణాలతో భారాస ను ప్రజలు దింపేశారో ఆ కారణాలను అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అంతగా పట్టించుకోవడం లేదు.చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ బాధిత రైతాంగంతో వెళ్లి నూతనంగా గెలిచిన స్థానిక కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను కలిసి విన్నవించినా కంపెనీ కాలుష్యసమస్య ఆగలేదు. పోలీసుల బెదిరింపులు, నిర్బంధం కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు కోసం పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. కాలుష్యపు విషవాయువులకు తెలంగాణ బతుకులను బలి చేసే ఇథనాల్ పాలసీ తెచ్చిన భారతీయ జనతా పార్టీకి మరోసారి అధికారం అప్పగించటం అవసరమా ? ఎలక్టోరల్ బాండ్లతో, ఇతర మార్గాలతో అవినీతికి, అక్రమాలకు పాల్పడి ఇథనాల్ ఉత్పత్తికి తెలంగాణను ప్రయోగశాలగా మార్చిన భారాసకు మనం ఎందుకు ఓటేయాలి? రాజకీయ పార్టీలు వ్యక్తిగత స్థాయిలో సంపన్న వర్గాలు పాల్పడే నేరాలను వ్యవస్థాగతం చేస్తూ నేరాలకు కూడా కార్పొరేట్ స్థాయి కల్పిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, ఎన్నికలలో పోటీపడుతున్న ఎవరైనా, ఏ పార్టీ అయినా ఇథనాల్ పాలసీని సమీక్షిస్తారా ? ఇథనాల్ కంపెనీలు మూసేస్తారా ? అని అడగకుండా ప్రజలు ఎవరికి ఓటేయగలరు.ఎన్నికలలో పోటీపడే అభ్యర్థులను,పార్టీలను అడుగుదాం. నిలదీద్దాం.ఈ డిమాండ్లు సాధించుకుందాం.
చిత్తనూరు ఇథనాల్ కంపెనీ ఎత్తేయాలి. 22 అక్టోబర్ 2023న జరిగిన అక్రమ లాఠీ ఛార్జ్ పై జుడీషియల్ విచారణ జరిపి కారకులైన పోలీస్ అధికారుల పై చర్యలు తీసుకోవాలి.చిత్తనూరు ఇథనాల్ కంపెనీ దురాక్రమించిన 20.5 ఎకరాల అసైన్డ్ భూమిని తిరిగి బాధితులకు ఇచ్చివేయాలి.తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 20 ఇథనాల్ కంపెనీలను ఎత్తేయాలి.కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ పాలసీని ఉపసంహరించాలి.చిత్తనూర్, ఎక్లాస్పూర్, జిన్నారం, కన్మనూర్ తదితర గ్రామాల రైతాంగంపై, ఉద్యమ న్యాయకత్వంపై బనాయించిన అక్రమ కేసులను, రౌడీషీట్ ను ఎత్తివేయాలి.చిత్తనూరు ఇథనాల్ కంపెనీ దురాక్రమణ లో ఉన్న నక్షబాటలను విడుదల చేయాలి.
(ఎం.రాఘవాచారి,కన్వీనర్,పాలమూరు అధ్యయన వేదిక)
(The Federal seeks to present views and opinions from all sides of the spectrum. The information, ideas or opinions in the articles are of the author and do not reflect the views of The Federal.)