
‘ఫ్యూచర్ సిటీ’ సరే, తెలంగాణా గ్రామాల ఫ్యూచర్ ఏమిటి ?
బీజేపీ మోదీ, తెలుగుదేశం చంద్ర బాబు బాటలో మరో అడుగు వేసిన రేవంత్ రెడ్డి...
మొత్తంమ్మీద తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ మోదీ, తెలుగుదేశం చంద్ర బాబు బాటలో మరో అడుగు వేశాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుండీ అనేక సార్లు ప్రకటిస్తూ వచ్చిన సెప్టెంబర్ 28 న భారత్ ఫ్యూచర్ సిటీ కి మీర్ ఖాన్ పేటలో శంఖుస్థాపన చేశాడు.
మోదీ ప్రభుత్వం ఇండియా అనే ముద్రని ప్రజల మనసుల నుండీ వేగంగా తొలగించే అన్ని పథకాలకు భారత్ అనే పేరు పెట్టడం చాలా కాలంగా చేస్తున్నది. తానే చెప్పుకున్నట్లు RSS మోదీ స్కూల్ లో చదువుకున్న రేవంత్, తెలంగాణా అస్తిత్వ స్పృహ ఏ మాత్రం లేకుండా, ఇప్పుడు హైదరాబాద్ పక్కన నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ కి కూడా భారత్ పేరు తగలించి , మోదీ బాటలో అడుగులు వేశాడు.
మరో వైపు చంద్ర బాబు , హైదరాబాద్ నగరాన్ని తానే అభివృద్ధి చేశాననీ, సైబరాబాద్ నగరాన్ని తానే నిర్మించాననీ, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని కూడా లక్ష ఎకరాలలో తానే అట్టహాసంగా నిర్మిస్తున్నాననీ , నిరంతరం గొప్పలు చెప్పుకోవడం చూస్తున్నాం.చంద్రబాబు కాలేజీలో చదువుకున్నానని చెప్పుకున్న రేవంత్ , అయన బాట లోనే 35,000 ఎకరాలలో నిర్మించాలనుకుంటున్న ఫ్యూచర్ సిటీ శిలా ఫలకంపై తన పేరు రాయించడానికి సిద్ధమయ్యాడు.
మనం గమనిస్తే, ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య అనేక భావ సారూప్యతలు ఉన్నాయి. ముగ్గురికీ, విదేశీ పర్యటనలు ప్రీతి పాత్రం. ప్రపంచ ఆర్ధిక సంస్థ సమావేశాలకు వెళ్ళడమంటే అదో మోజు. బహుళ జాతి కార్పోరేట్ సంస్థలంటే వల్ల మాలిన అభిమానం. అందుకే స్వదేశీ అని నిత్యం ప్రవచించే మోదీ సంవత్సరానికి సగం రోజులు విదేశాలలోనే గడుపుతాడు. చంద్రబాబు, రేవంత్ లకు కూడా ఏ సమయం చిక్కినా, విదేశాలకు పరుగెత్తడం, అక్కడి కంపనీల CEO లతో మీటింగులు పెట్టడం, వాళ్ళకు మా రాష్ట్రానికి రండీ అంటూ రెడ్ కార్పెట్ పరవడం అలవాటైపోయింది. 2047 దాకా ముగ్గురికీ అధికారంలో తామే రాజులుగా కొనసాగాలని అంతు లేని ఆశ కూడా ఉంది.
ఈ ముగ్గురికీ గ్రామాలలో ప్రజలకన్నా, వాళ్ళ చేతుల్లో ఉన్న భూమి అంటే మక్కువ ఎక్కువ. ఈ ముగ్గురికీ గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందడం, గ్రామీణ వ్యవసాయ కుటుంబాలు ఆర్ధికంగా బాగు పడడం నచ్చదు.
మీరే చూడండి, వ్యవసాయ కుటుంబాల ఆదాయాలు పెంచడానికి కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతులు అడుగుతుంటే, ఆ వైపు ఆలోచించాలని కూడా మోడీకి అనిపించదు. గ్రామీణ ప్రజలందరినీ నగరాలకు వలస పోయేలా చేయకుండా, గ్రామాలలో కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరమని వీళ్ళు చచ్చినా ఒప్పుకోరు. వ్యవసాయం దండగని చంద్రబాబు అంటే, వ్యవసాయ భూములంటే రియల్ ఎస్టేట్ ప్లాట్లు అని రేవంత్ భావన. గ్రామాల మధ్యలో రైతులకు మేలు చేసేలా పొలాల మధ్య రహదారులు, గ్రామాలలో పంటలు దాచుకోవడానికి గిడ్డంగులు, శీతల గిడ్డంగులు , డ్రయింగ్ యార్డ్ లు, నిర్మించడం చేత కాలేదు కానీ, నగరాలలో విమానశ్రయాలు, నగరాల చుట్టూ రింగ్ రోడ్లు వేయడం మాత్రం బాగా వచ్చు.
అందుకే శాస్త్రీయ పంటల ప్రణాళికను రూపొందిస్తామని ప్రకటించిన రేవంత్, తన తప్పుడు విధానాలతో, రాష్ట్రానికి అవసరమైన అన్ని వ్యవసాయ ఉత్పత్తులనూ, ఇతర రాష్ట్రాల నుండీ, ఇతర దేశాల నుండీ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితికి నెడుతున్నాడు. కూరగాయలు, పండ్లు లాంటి అద్భుతమైన పంటలు పండే భూములను చంద్రబాబు అమరావతి పేరుతో కాజేస్తున్నాడు. కేవలం ఇథనాల్ లాంటి పరిశ్రమల కోసమే పంటలు పండించేలా మోదీ విధానాలు రూపొందిస్తున్నాడు.
ఈ ముగ్గురికీ , 2013 భూ సేకరణ, నష్ట పరిహారం, పునరావాస చట్టం అంటే గిట్టదు. మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వచ్చిన వెంటనే ఈ చట్టానికి తూట్లు పొడుస్తూ ఆర్డినెన్స్ తెచ్చాడు. చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ అధికారం చేపట్టగానే, 2013 భూ సేకరణ ప్రకారం భూ సేకరణకు వెళ్ళకుండా, భూ సమీకరణ పేరుతో, ఈ చట్టానికి తూట్లు పొడిచాడు. తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి KCR కూడా 2016 లోనే ఈ చట్టానికి తూట్లు పొడిచి, కొత్త భూ సేకరణ చట్టాన్ని తెచ్చాడు. దానినే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు.
దేశ వ్యాపితంగా మోదీ ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో , రైతుల నుండీ, ఆదివాసీల నుండీ భూములు లాక్కుని కార్పోరేట్ కంపనీలకు అప్ప చెబుతున్నది. అమరావతిలో ఎకరం భూమి ఒక్క రూపాయికి కేటాయిస్తూ, కంపనీల సేవలో చంద్రబాబు తరిస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా రైతుల భూములను లాక్కుని, ప్రపంచంలో ఉన్న ఫార్చూన్ కంపనీలకు కట్టబెడతానని రేవంత్ వీరంగం ఆడుతున్నాడు.
ముగ్గురికీ నదులన్నా, నీళ్ళన్నా, నీటి ప్రాజెక్టులన్నా ప్రాణం. ఆయా నదుల అనుసంధానానికి మోదీ పథకాలు రచిస్తుంటే, గోదావరిపై పోలవరం పేరుతో ఆదివాసీలను ముంచడానికి చంద్రబాబు సిద్దమయ్యాడు. సాబర్మతి పునరుద్ధరణ పేరుతో మోదీ ప్రభుత్వం అవినీతికి తెర తీస్తే, మూసీ పునరుద్ధరణ పేరుతో రేవంత్ అదే పనికి సిద్ధమయ్యాడు.
తెలంగాణా లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకోవడం రాలేదు కానీ, అన్ని జిల్లాలలో ఫార్మా, ఇథనాల్ లాంటి కాలుష్య కారక పరిశ్రమలను నెలకొల్పడానికి ఉత్సాహంగా ఉన్నారు. మోదీ దేశమంతా 600 ఇథనాల్ పరిశ్రమలకు అనుమతులు ఇస్తే, తెలంగాణా లో 30 , ఆంధ్ర ప్రదేశ్ లో 30 ఇథనాల్ పరిశ్రమలను నిర్మించడానికి ఇక్కడి ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి.
కార్మిక చట్టాలన్నా, కార్మికుల సంక్షేమం అన్నా, ముగ్గురికీ వ్యతిరేకమే. అందుకే కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేస్తే, చంద్రబాబు , రేవంత్ ప్రభుత్వాలు అదే మార్గం లో కార్మికుల పని గంటలను పెంచాయి. పరిశ్రమల యాజమాన్యాలు పర్మినెంటు పని స్థలాలలో కూడా కాంట్రాక్టు కార్మికులను పెట్టుకుంటుంటే, చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయి. అతి తక్కువ దినసరి కూలీ ఇచ్చి వలస కార్మికుల శ్రమను అన్ని రంగాలలో యాజమాన్యాలు దోచుకుంటుంటే, ముగ్గురూ మౌనంగా చూస్తున్నారు.
గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలు, నగరాలలో పేదలున్న బస్తీలలో గృహ నిర్మాణం సహా, ఇతర మౌలిక సౌకర్యాలు, ప్రభుత్వ రంగంలో స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, లాంటి రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడే పనులకు మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం సహకరించదు కానీ, ఆయా రాష్ట్రాలలో, ప్రధానంగా బడా కార్పోరేట్ కంపనీల సరుకుల రవాణాకు అవసరమైన 8,12 వరసల జాతీయ రహదారులు, రింగ్ రోడ్లు, రైల్వే లైన్ల నిర్మాణాలకు మాత్రం వేగంగా అనుమతులు ఇస్తుంది. ఆర్ధికంగా కూడా సహకరిస్తుంది. వీటిలో ఆయా రాజకీయ పార్టీల కాంట్రాక్తర్ లు భారీగా లబ్ది పొందుతారు. వాటిలో నుండీ భారీ వాటాలు రాజకీయ నాయకులకు కూడా అందుతాయి. ఎలక్టోరల్ బాండ్ ల కుంభ కోణం మనం చూసిందే కదా. అందుకే రోజూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఆడి పోసుకునే మోదీ ప్రభుత్వం, తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ కోరుకున్న ప్రాజెక్టులకు మాత్రం అనుమతులు మంజూరు చేస్తున్నది. భుజం కలిపి నడుస్తున్నది.
నేను ఈ వ్యాసంలో KCR కుటుంబం పేరు రాయలేదంటే, వాళ్ళేదో ఈ రాష్ట్రాన్ని గతంలో ఉద్దరించారు అని అర్థం కాదు. వాళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు కనుక, వాళ్ళ పేర్లు ప్రస్తావించలేదు కానీ, నిజానికి ఈ ముగ్గురి అభివృద్ధి నమూనా భవంతికి ఆ కుటుంబమే నాలుగవ స్థంభం.
కాసేపు, మోదీ, చంద్రబాబులను పక్కన బెడితే, పదేళ్ళ పాటు విధ్వంస అభివృద్ధి నమూనాతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన KCR ను ఓడించి అధికారంలోకి వచ్చిన రేవంత్, నిజంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటుంటే, రాహుల్ మాట్లాడుతున్న ఆలోచనలకు అను గుణంగా రాష్ట్రంలో పరిపాలన సాగించాలనుకుంటే ఇప్పుడు ముందుకు నెడుతున్న అభివృద్ధి నమూనాను రద్దు చేయాలి.
రీజనల్ రింగ్ రోడ్డూ , ఫ్యూచర్ సిటీ ల నిర్మాణ ఆలోచనలు మానుకోవాలి. న్యూయార్క్ మనకు ఆదర్శం కాదు, కాబోదు, కారాదు. మూసీ పునరుద్ధరణ పేరుతో సాగించాలను కుంటున్న రియల్ ఎస్టేట్ దందా మానుకోవాలి. రాష్ట్రంలో నగరాల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మూసీని బాగు చేసుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై పౌర సమాజంతో లోతుగా చర్చించాలి. మూసీ అంటే నది మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న ప్రజలు కూడా అనేది ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. మూసీని వివిధ రకాలుగా కాలుష్య మయం చేస్తున్న వారిపై, సంస్థలపై కటిన చర్యలు తీసుకోవాలి.
వరదలతో , భారీ వర్షాలతో, ఇతర ప్రకృతి వైపరిత్యాలతో, నష్టపోతున్న రైతులను, నగరాల ప్రజలను ఆదుకోవడానికి, వాళ్ళు జీవితాలను మళ్ళీ నిలబెట్టుకోవడానికి అవసరమైన పెట్టుబడులు ప్రభుత్వం పెట్టాలి. పంటల బీమా తో పాటు, గ్రామీణ, నగరాల పేదలకు రైతు బీమా లాంటి పథకాలు కూడా ప్రవేశ పెట్టాలి. అసంఘటిత కార్మికుల, వలస కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించాలి. రాష్ట్రంలో కాలుష్య కారక , ఇథనాల్ ఫార్మా పరిశ్రమలను మూసేయాలి. మోదీ తెచ్చిన లేబర్ కోడ్ లకు అనుగుణంగా రాష్ట్ర కార్మిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ లను రద్దు చేయాలి. రాష్ట్రంలో కార్మిక చట్టాలను అమలు చేయాలి.
రాష్ట్ర పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే, రాష్ట్రంలో వరి సాగు తగ్గించి, ఇతర పంటలను ప్రోత్సహించాలి. ఇతర పంటల ప్రోత్సాహానికి ఆయా పంటల సేకరణ సహా, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ కుటుంబాల ఆదాయాల పెంపుకు వీలుగా గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులు పెట్టాలి. నగరాల మధ్య భారీ రహదారుల నిర్మాణం కంటే ముందు, గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల మౌలిక వసతుల కల్పనపై పెట్టుబడులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి.
రాష్ట్రంలో పశుపోషణ పునాదిగా పాలు, మాంసం ఉత్పత్తుల పెంపు వేగంగా జరగాలి. అమూల్ లాంటి కార్పోరేట్ సహకార సంస్థలను అదుపు చేసి, రాష్ట్రంలో పాల, ఇతర పశు పెంపకం దారుల,మత్స్యకారుల సహకార సంఘాలను అభివృద్ధి చేయాలి. గజ్వేల్ ప్రాంతంలో గ్రామాలను ముంచి తెచ్చిన కొండ పోచమ్మ సాగర్ నీళ్ళను కోకో కోలా లాంటి కంపనీలకు ఇవ్వడం మానుకోవాలి.
గండిపేట, హిమాయత్ సాగర్ లకు మల్లన్న సాగర్ నుండీ నీళ్ళను ఎత్తి పోయడం కంటే, హైదరాబాద్ నగరం లో, నగరం చుట్టూ చెరువులను అభివృద్ధి చేసుకోవడం, వర్షపు నీళ్ళను పట్టుకుని , నగరంలో భూగర్భ జలాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. హామీ ఇచ్చినట్లుగా జీవో 111 పునరుద్ధరించాలి. ప్రజల తాగునీరు పేరుతో నదీ జలాలను తెచ్చి , బడా పరిశ్రమలకు, నగరాల విలాసాలకు ప్రాధాన్యత ఇచ్చి కేటాయించే ప్రభుత్వాల పన్నాగాలు అన్ని రాష్ట్రాలలో చూస్తున్నవే. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వాటిని మానుకోవాలి.
చివరి మాట , తెలంగాణా లో అవసరమైన మేరకు భూసేకరణ చేయాలంటే 2016 చట్టం కాకుండా, 2013 భూసేకరణ చట్టాన్ని తప్పకుండా అమలు చేయాలి. నగరాలూ, పరిశ్రమలూ పేరుతో రైతుల నుండీ భూములు గుంజుకోవడం మానుకోవాలి. నిజంగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికను, రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల వివరాలను గ్రామీణ ప్రజల ముందు ఉంచాలి. కాలుష్య కారక పరిశ్రమలకు ఏ ప్రాంతం లోనూ, ఎట్టి పరిస్థితులలో అనుమతులు ఇవ్వకూడదు.
గ్రామీణ ప్రజలతో చర్చించి, వారి అభిప్రాయాలను సేకరించి, నిజంగా భూమి అవసరమైతే, ప్రజలకు నచ్చ చెప్పి, వారిని కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. ఆయా నగరాల, పరిశ్రమల అభివృద్ధిలో గ్రామీణ రైతు కుటుంబాల భూమిని వారి వాటాగా పరిగణించాలి. నగరాలూ, పరిశ్రమలూ అభివృద్ధి అయ్యే వరకూ ఆయా భూములకు కౌలుగా భావించి, రైతులకు కౌలు చెల్లించాలి. రైతుల నుండీ భూమిని లాక్కుని TGIIC పేరుతో యాజమాన్య హక్కులు బదలాయించడం మానేయాలి. భూమి టైటిల్ రైతుల పేరుతోనే ఉంచాలి.
వివిధ ప్రాజెక్టుల పేరుతో, భూసేకరణ చేస్తున్న గ్రామీణ ప్రాంతంలో భూమి లేని కుటుంబాలలో యువతకు ఆయా ప్రాంతాలలో వస్తున్న పరిశ్రమలు, సంస్థలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు పొందేలా అవసరమైన శిక్షణలు వేగంగా ఇవ్వాలి., స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించేలా , ఆయా సంస్థలు, కంపనీలతో TGIIC ఒప్పందాలు చేసుకోవాలి. అప్పుడే అది నిజమైన రాష్ట్ర అభివృద్ధి అవుతుంది.
Next Story