అభివృద్ధి పేరుతో సాగించే విధ్వంసం దైవ కార్యమా ?
x

అభివృద్ధి పేరుతో సాగించే విధ్వంసం దైవ కార్యమా ?

దానిని అడ్డుకునే వాళ్ళు రాక్షసులా ?

“తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి దైవ కార్యంగా కొనసాగుతుంటే, కొంత మంది రాక్షసుల్లా అడ్డు పడుతున్నారని, అయినా తమ యజ్ఞం ఆగదని ” రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.

“అమెరికా,సింగపూర్, జపాన్, దక్షిణ కొరియాలలో పర్యటించి దాదాపు 2.25 లక్షల కోట్లు పెట్టుబడులు సమీకరిస్తే, ప్రాజెక్టులు ముందుకు వెళ్ళకుండా పానకంలో పుడకలా అడ్డుకుంటున్నారని” ఆయన అన్నారు.

“మెట్రో, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్ – ఈ మూడూ ఇస్తే హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడుతుందని” కూడా ఆయన స్పష్టం చేశారు.

“కంచ గచ్చిబౌలీ లో 400 ఎకరాలను అభివృద్ధి చేస్తామనీ , నాలెడ్జ్ పార్క్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ తరహాలో, ఇక్కడ కూడా 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామనీ” ఆయన ప్రకటించారు.

“న్యూయార్క్ వాళ్ళు కూడా , హైదరాబాద్ లో నివాసం ఏర్పాటు చేసుకుంటాం, ఫ్యూచర్ సిటీ లో వ్యాపారం చేసుకుంటాం అని వస్తారని” కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. హాలీవుడ్ ను , బాలీవుడ్ ను కూడా హైదరాబాద్ కు తీసుకు వస్తామని ఆయన ప్రకటించారు (ఆంధ్ర జ్యోతి , 29-06-2025).

“నేను మోదీ గారి స్కూల్ లో చదువుకున్నాను, చంద్రబాబు గారి కాలేజీ లో చదివాను, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నాను “ అని గత కొన్ని రోజుల క్రితం రేవంత్ చేసిన ప్రకటన నిజమైన అర్థం ఇప్పుడు గోచరిస్తున్నది. నిజానికి మోదీ , చంద్రబాబు ల సిలబస్ ప్రజా వ్యతిరేకమైనది , ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది అని ఎప్పుడో నిరూపితమైన అంశం. కొత్తగా తెలంగాణ మళ్ళీ మళ్ళీ ప్రయోగాలు చేయాల్సిన అవసరమే లేదు. ఈ ప్రకటనల ద్వారా కొత్తగా మనకు తెలిసింది- ఇప్పటి కంటే మంచి ప్యాకేజీ దొరికితే, రాహుల్ గాంధీ గారి దగ్గర ఉద్యోగం ఎప్పుడైనా వదిలేసే విషయం మాత్రమే.

ఇటీవల రేవంత్ మాట్లాడిన “ దైవ కార్యం, రాక్షసులు, యజ్ఞం” అనేవి కూడా నిజానికి ఆధునిక భాష కాదు, అది పచ్చి ఫ్యూడల్, హిందుత్వ ఫాసిస్టు భాష. పేదల పిల్లలు చదువుకునే ప్రభుత్వ స్కూల్స్ కంటే, మత సంస్కృతితో ఆవులకు ఆశ్రయమిచ్చే గోశాలలకు ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి గారి నుండీ ఇంతకు మించిన భాషను ఆశించలేము.

హైదరాబాద్ ,సైబరాబాద్,సికింద్రాబాద్ –మూడు నగరాల పక్కన ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగవ నగరం అవసరమా ? హైదరాబాద్ చుట్టూ ఒక ఔటర్ రింగ్ రోడ్డు ఉండగా , రాష్ట్రంలో లక్షలాది ఎకరాల సాగు భూములపై రియల్ ఎస్టేట్ ప్రభావం చూపే మరో రీజనల్ రింగ్ రోడ్డు అవసరమా ? అర్హులైన పేదలకు ఆసరా పెన్షన్ లు ఇవ్వడానికి నిధులు కూడా ఒక వైపు ఏడుస్తూ, మరో వైపు మూసీ రివర్ ఫ్రంట్ , మెట్రో విస్తరణ లాంటి లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల చుట్టూ ప్రభుత్వం చర్చలు కొనసాగించడం అవసరమా ? గత ప్రభుత్వం భూ సేకరణ పేరుతో రెండు లక్షల ఎకరాలకు పైగా రైతుల నుండీ గుంజుకున్న భూమిని ఎలా వినియోగించారో చెప్పకుండా, తాము అభివృద్ధికి “ఎంచుకున్న” ప్రాంతంలో మరో లక్ష ఎకరాలను రైతుల నుండీ గుంజుకోవడం అవసరమా ?

ఈ ప్రశ్నలు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) చాలా కాలంగా అడుగుతోంది. కానీ ప్రభుత్వం నోరు తెరిచి ఇప్పటి వరకూ జవాబు చెప్పలేదు.

కానీ, తాజాగా ముఖ్యమంత్రి గారి ఈ ప్రకటనలు చూసిన వారికి తెలుగుదేశం అధినేత, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ CEO చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణ లో రేవంత్ రూపంలో ముందుకు వచ్చాడనీ, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రజలకు జీవనోపాధి, తెలంగాణ ప్రజల సమగ్ర అభివృద్ధి కేంద్రంగా కాకుండా, కార్పొరేట్ ఎజెండాను కొనసాగిస్తున్నాడనీ అర్థం కావడం లేదూ ?

గత పదేళ్లుగా తెలంగాణ లో KCR ఇదే ఎజెండాను ముందుకు నెట్టాడు. కేంద్రం లో నరేంద్ర మోదీ కూడా దేశ వ్యాపితంగా ఇదే అజెండాను ముందుకు తోస్తున్నాడు. మోదీ పాలన కేవలం అంబానీ, ఆదానీ ల కోసమే సాగుతున్నదని, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేస్తున్న ప్రకటన సారాంశం , రాహుల్ దగ్గర ఉద్యోగం చేస్తున్న రేవంత్ కు అర్థం కావడం లేదని అనుకోవాలా ?

1991 నుండీ గత మూడున్నర దశాబ్ధాలలో అమలైన ఈ అభివృద్ధి నమూనా సృష్టించిన విధ్వంసాన్ని తెలంగాణ ఇప్పటికే చవి చూసింది. ఈ అభివృద్ధి నమూనా ఫలితంగా ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రభుత్వ విద్యా,వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరమై పోయాయి. తెలంగాణ ప్రాంతంలో 30,000 మంది రైతులు,కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వేతన బధ్రత, ఉద్యోగ బధ్రత లేని అసంఘటిత రంగం కార్మికుల సంఖ్య పెరిగిపోయింది, రాష్ట్ర పర్యావరణం పూర్తిగా కలుషితమై పోయింది.

ఈ విషయాలు ఏమీ పట్టించుకోకుండా, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అభివృద్ధి గురించి భీకర ప్రకటనలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికారానికి వచ్చి రెండేళ్ళు కావస్తున్నా, కొన్ని ప్రజా సంబంధిత అంశాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారో కూడా స్పష్టం చేయాలి.

మూడున్నర కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడు కోట్ల మందికి ఇప్పటికీ ప్రతి నెలా మనిషికి 6 కిలోల ఉచిత బియ్యం ఎందుకు సరఫరా చేయవలసి వస్తుందో, 16 లక్షల కోట్ల జీ ఎస్ డీ పీ ఉన్న రాష్ట్రంలో, GSDP ఆధారిత సగటు తలసరి ఆదాయం మూడు లక్షలకు పైగా ఉన్న రాష్ట్రంలో మెజారిటీ కుటుంబాల సగటు ఆదాయం నెలకు 10,000 రూపాయలు గా మాత్రమే ఎందుకు ఉండి పోయిందో, ప్రభుత్వం చెప్పదు.

లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది పరిశ్రమలు, సంస్థలు రాష్ట్రంలోకి తరలి వస్తున్నాయని గొప్పగా చెప్పుకుంటున్న కాలంలో రాష్ట్రంలో ఇప్పటికీ లక్షలాది మంది నిరుద్యోగ యువత ఖాళీగా ఎందుకు తిరుగుతున్నదో , కొద్దిపాటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం కూడా ఎందుకు ఎదురు చూస్తున్నదో ప్రభుత్వ పెద్దలు చెప్పరు. తెలంగాణ లో ఏర్పడుతున్న సంస్థలు, పరిశ్రమలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతమందికి ఉపాధి లభిస్తున్నది? ఇతర రాష్ట్రాల వాళ్ళకు ఎంత మందికి ఉపాధి లభిస్తున్నది ? అనే వివరాలు ఎందుకు బయట పెట్టరో మనకు తెలియదు.

గిడ్డంగులు పట్టకుండా ధాన్యం పండిస్తున్న రాష్ట్రంలో, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో గిదనగులు, శీతల గిడ్డంగులు, డ్రయ్యింగ్ యార్డులు లాంటి మౌలిక వసతులు ఎందుకు అభివృద్ధి కాలేదో , కోట్ల రూపాయల విలువ చేసే పంటలు వర్షాలకు తడిచి ఎందుకు పాడైపోతున్నాయో ఎవరూ మాట్లాడరు. వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ సహాయం ఎక్కువగా అందిస్తున్నాం అని ప్రభుత్వాలు సంబరాలు చేసుకునే కాలంలో, ఇప్పటికీ ప్రతి సంవత్సరం 400 మందికి పైగా రైతులు అప్పుల పాలై ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో (ఇతర రంగాలలో ఉపాధి పొందుతున్న వాళ్ళు కూడా సగటున ఇంత మంది మరణిస్తున్నారా ? ) ప్రభుత్వం మాట్లాడదు.

విద్యుత్ సరఫరా శాఖలో గ్రామీణ ప్రాంతంలో కనీస జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు లేక ప్రతి సంవత్సరం కనీసం 500 మంది సాధారణ ప్రజలు విద్యుత్ షాక్ కు గురై ఎందుకు మరణిస్తున్నారో ఎవరూ చెప్పరు. రాష్ట్ర వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తూ, మొత్తం రైతులలో 36 శాతంగా ఉన్న కౌలు రైతులకు ఎందుకు గుర్తింపు లేదో, వారికి సహాయం ఎందుకు అందదో, ప్రకృతి వైపరిత్యాలు పెరుగుతున్న , వర్షాభావ పరిస్థితులు కమ్ముకుంటున్న కాలంలో రైతులు నష్టపోతున్నా, పంటల బీమా పథకానికి ఎందుకు నిధులు లేకుండా పోయాయో ప్రభుత్వం మాట్లాడదు. హామీ ఇచ్చినట్లుగా, భూమిలేని వ్యవసాయ కూలీలకు కూడా రైతు బీమా తరహా పథకం ఎందుకు అమలు కాదో ఎవరూ మాట్లాడరు. అంతెందుకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ధాన్యం సేకరణ కమిషన్ డబ్బులు సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు మంజూరు చేయడం లేదో ముఖ్యమంత్రి జవాబు చెప్పరు.

ఇప్పటికీ వ్యవసాయం కీలకమైన తెలంగాణ రాష్ట్రంలో అర్బన్, పెరీ అర్బన్ , రూరల్ క్లస్టర్స్ పేరుతో అభివృద్ధి నమూనా రచిస్తూ, మొత్తం నిధులన్నీ, విధానాలన్నీ, అర్బన్, పెరి అర్బన్ చుట్టూ కేంద్రీకరిస్తూ, ఈ ప్రాంతంలో రైతుల చేతుల్లో ఉన్న విలువైన కొద్దిపాటి భూములను కూడా తక్కువ నష్ట పరిహారంతో బలవంతంగా లాక్కుంటూ, ఆందోళన చేస్తున్న, అడ్డుకుంటున్న, కోర్టుకు వెళుతున్న రైతులపై అభివృద్ధిని అడ్డుకుంటున్న రాక్షసులని ముద్ర వేస్తూ “ఇదే అభివృద్ధి” అని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

రాష్ట్రానికి అవసరమైన అనేక వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర రాష్ట్రాల నుండీ దిగుమతి చేసుకుంటున్నామని తెలిసీ, రాష్ట్ర సరిహద్దులకు నెట్టేసిన రూరల్ క్లస్టర్ కు కనీసం ఒక వ్యవసాయ విధానం, పంటల ప్రణాళికా లేకుండా కాలయాపన చేస్తూ ఉండడం పై ప్రశ్నిస్తే మౌనం వీడి జవాబు చెప్పరు.

రాష్ట్రంలో కోటి మందికి పైగా ఉన్న అసంఘటిత కార్మికులకు దశాబ్ధాలు గడుస్తున్నా, కనీస వేతనాలు ఎందుకు పెరగడం లేదో, రైతు బీమా తరహాలో,వారికి కూడా బీమా సౌకర్యం ఎందుకు లేదో, రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న గృహ కార్మికులు , హమాలీ కార్మికులకు రెండేళ్ళు కావస్తున్నా సంక్షేమ బోర్డులు ఎందుకు ఏర్పాటు కావడం లేదో ముఖ్యమంత్రి చెప్పరు.

రాష్ట్రంలో కాలుష్య కారక పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమల శాఖ సింగిల్ విండో ద్వారా గబగబా అనుమతులు మంజూరు చేస్తుంటే, పట్టించుకోవలసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) ఎందుకు స్పందించడం లేదో, ఆయా సంస్థలలో ప్రతి సంవత్సరం వందలాదిమంది కార్మికుల మరణాలకు, గాయాలకు కారణమవుతూ , తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నా, అక్కడి కార్మికుల స్థితి గతుల గురించి కార్మిక శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదో, రాష్ట్రంలో ఇథనాల్ పాలసీని సమీక్షించాలని ప్రజలు కోరుతున్నా, “మేము ముందుకే వెళతామని” క్యాబినెట్ మంత్రులు ప్రకటించడంపై ప్రభుత్వ పెద్దలు మాట్లాడరు.

ప్రభుత్వ విద్యా రంగం పూర్తిగా ధ్వంసం అయిందని తెలిసినా, విద్యారంగానికి కనీసం 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదో ముఖ్యమంత్రి మాట్లాడరు. ఒక్కో స్కూల్ కు కనీసం 50 లక్షలు కేటాయిస్తే వాటిలో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పడతాయని తెలిసినా ఎందుకు నిధులు మంజూరు చేయరో, కానీ తమకు ఇష్టమైతే 20 స్కూల్స్ కే 4000 కోట్లు ఎందుకు మంజూరు చేయవలసి వచ్చిందో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వరు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు తీర్చకపోవడం వల్ల, నష్టపోతున్న లక్షలాది మంది విద్యార్ధుల గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడరు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అభివృద్ధిని ఒకరకంగా నిర్వచిస్తున్నారు. తెలంగాణ ప్రజానీకం, పౌర సమాజం మరో రకంగా నిర్వచిస్తున్నది. ఈ రెండు అభివృద్ధి నమూనా ల మధ్య చర్చ అవసరం. ఆ చర్చలు ప్రజాస్వామికంగా సాగాలి. ప్రజల భాగస్వామ్యంతో జరగాలి. అలా కాకుండా, ప్రజల,ప్రజల పక్షాన మాట్లాడుతున్న వాళ్ళ నోర్లు మూయించీ , ప్రజల కదలికలపై, సమావేశాలపై ఆంక్షలు పెట్టీ తమ అభివృద్ధి నమూనాను ముందుకు తీసుకు వెళ్లాలని ముఖ్యమంత్రి గారు భావించడం సమంజసం కాదు. అది ప్రజా పాలన అనిపించుకోదు, రాజ్యాంగ బద్ధ పాలన అనిపించుకోదు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న మోదీ ప్రభుత్వం నిరంకుశంగా సాగిస్తున్న కార్పొరేట్ అభివృద్ధి నమూనానే , తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తే అప్పుడు దానిని ఇండియా కూటమి ప్రవచిస్తున్న ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా అనరు. ఆచరణలో పేదలకు హాని చేసే అభివృద్ధి నమూనా అమలు చేస్తూ, మాటల్లో సామాజిక న్యాయం గురించి ప్రవచిస్తే అస్సలు ఉపయోగం ఉండదు.

Read More
Next Story