సమాచార హక్కు చట్టానికి 20 ఏళ్లు, అమలులో చిత్తుశుద్ధి లోపం
x

సమాచార హక్కు చట్టానికి 20 ఏళ్లు, అమలులో చిత్తుశుద్ధి లోపం

కేంద్ర సమాచార కమిషన్ కూడా ప్రధాన సమాచార కమిషనర్ లేకుండా పనిచేస్తున్నది. ఇలా ఈ పోస్టు ఖాళీగా ఉండటం ఇదే 11 వ సారి.


-డా. పి. మోహన్ రావు

సమాచార హక్కు చట్టం ప్రభుత్వంలోని అవినీతిని, ఆలస్యంను (ఎర్ర టేపు విధానo) సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమాజానికి ఒక వజ్రాయుధంగా పనిచేస్తుంది. అక్టోబర్ 12వ తేదీతో 2005లో అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టానికి 20 సంవత్సరాలు. కేంద్రంలో అప్పట్లో అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అమలులోనికి తెచ్చిన ప్రముఖ చట్టాలలో ప్రధానమైనది సమాచార హక్కు చట్టం. ప్రభుత్వంలోని లొసుగులను బట్ట బయలు చేయడానికి, పాలనలో పారదర్శక తేవడానికి, పాలన లో సాధికారతకు ఈ చట్టం తోడ్పడుతుంది. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే సార్వభౌమ అధికారం కలిగి ఉంటారు. వారిచేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం చేత నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకంగా పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం తోడ్పడుతుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం దేశ, రాష్ట్రాల అభివృద్ధి కోసం పన్ను చెల్లింపుదారుల ద్రవ్యాన్ని ఖర్చు చేస్తాయి. ఈ ద్రవ్యాన్ని ఎందుకోసం ఏ రకంగా ఖర్చు చేశారో తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుంది. సమాచార హక్కు చట్టం చారిత్రాత్మక చట్టం. భారత ప్రజలందరికీ ప్రభుత్వం నుండి వారికి అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి లభించిన చట్టపరమైన హక్కు ఈ సమాచార హక్కు చట్టం.

ఏ సమాచారం పొందవచ్చు:

1923లో ఆనాటి ఆంగ్లేయు పాలకులు ప్రజా అణిచివేతకు సంబంధించిన ఎటువంటి సమాచారం ప్రజలకు అందకూడదని ప్రభుత్వ రహస్య చట్టాన్ని రూపొందించారు. సమాచార హక్కు చట్టం సకారాత్మకమైన చట్టం. అయితే ప్రభుత్వ రహస్యాలు చట్టం నకారత్మకమైనది. విశ్వవ్యాప్తంగా సుమారు 65 లక్షల మంది ప్రజలు ప్రభుత్వం నుండి వారికి అవసరమైన సమాచారాన్ని ఈ హక్కు చట్టం ద్వారా పొందుతున్నారు.

ప్రజలు వారి కనీస అవసరాల కు సంబందించిన రేషన్ పంపిణీ, పెన్షన్లకు సంబంధించిన సమాచారం పౌర విధులకు సంబంధించిన సమాచారాన్ని పొందడానికి సమాచార హక్కు తోడ్పడుతుంది. ఈ చట్టం వల్ల ప్రజలు, ప్రభుత్వ పనులను పరిశీలించవచ్చు. అవసరమైన సమాచారాన్ని టేపుల రూపంలో, ప్లాపీల రూపంలో, ప్రింట్ రూపంలో అవసరమైన సమాచారాన్ని నామమాత్ర ఫీజు చెల్లించి పొందవచ్చు.

ప్రముఖ పాత్ర పిఐఒ లది :

సమాచార హక్కు చట్టం అమలులో ప్రముఖ పాత్రను పోషించేది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు(PIO). ప్రతి ప్రభుత్వ యూనిట్లో ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారిని నియమిస్తారు. ఆ యూనిట్లో పనిచేస్తున్న అధికారులలో నుండి ఒకరిని పి ఐ ఒ గా నియమిస్తారు. ఈ బాధ్యతలు నిర్వహించినందుకు వారికి ఎటువంటి అదనపు భత్యం లభించదు. పైగా ప్రజలు అడిగిన సమాచారాన్ని నియమిత సమయంలోపు అధించాలి. తగిన కారణాలు లేకుండా సమాచారాన్ని ఇవ్వకపోయినా, తప్పుడు సమాచారం ఇచ్చిన, అర్థ సమాచారం ఇచ్చినా రూపాయలు 25 వేల వరకు జరిమానా (పెనాల్టీ) చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పి ఐ ఒ అధికారులుగా అదనపు బాధ్యతలను స్వీకరించడానికి ఇష్టపడడం లేదు . పి ఐ ఒ ఇచ్చిన సమాచారం సంతృప్తికరంగా లేదని భావిస్తే, అప్పిలెట్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ న్యాయం జరగలేదని భావిస్తే కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

చట్టం అమలులో లోపించిన చిత్తశుద్ధి:

గత 20 సంవత్సరాల సమాచార హక్కు చట్టం అమలు తీరును పరిశీలిస్తే ఈ చట్టంలో అమలులో ప్రభుత్వం విముకత స్పష్టంగా కనిపిస్తుంది. చట్టం అమలులోనికి వచ్చిన సంవత్సరంలోపే ఈ చట్టం సవరణకు ప్రయత్నం జరిగింది. ఈ ప్రతిపాదిత సవరణను అనుసరించి ప్రభుత్వ ఫైళ్ళపై చేసినటువంటి నోటింగ్ లను , కామెంట్లను, అభిప్రాయాలను సమాచార హక్కు చట్టం నుండి మినహాయించడానికి ప్రతిపాదనలు చేయడం పౌర సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఉపసంహరించుకోవడం జరిగింది. గమనార్హమైన అంశం ఏమిటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2019లో సమాచార హక్కు చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణను అనుసరించి కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్లు సర్వీస్ నిబంధనలను జీతభత్యాలను సవరించవచ్చు. ఈ సవరణ కమిషన్ నిర్వహణ సామర్థ్యం పై ప్రభావం చూపుతుంది అన్న విమర్శ ఉంది. 2023లో పార్లమెంట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని(Digital Personal Data Protection-DPDP) రూపొందించినది. ఈ సవరణ అనుసరించి పిఐఒ లు వ్యక్తిగత సమాచారాన్ని ప్రజలకు ఇవ్వవలసిన అవసరం లేదు. వ్యక్తిగత గోప్యత ను దృష్టిలో ఉంచుకొని ఈ సవరణ తెచ్చినట్లు బిజెపి ప్రభుత్వం చెబుతుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ సవరణను వ్యతిరేకించింది. ఈ సంవత్సరం జూన్ 30 తేదీ నాటికి నాలుగు లక్షల కంటే ఎక్కువ అప్పిళ్లు, ఫిర్యాదులు 29 సమాచార హక్కు కేంద్ర సమాచార కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్ ల పరిదిలో పెండింగ్ లో ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం ఆరు రాష్ట్ర సమాచార కమిషన్లు తమ విధులను నిర్వహించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర సమాచార కమిషన్లు ముఖ్య సమాచార కమిషన్ లేకుండా పనిచేస్తున్నాయి. కేంద్ర సమాచార కమిషన్ కూడా ప్రధాన సమాచార కమిషన్ లేకుండా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇలా పోస్టును భర్తీ చేయకుండ జాప్యం చేయడం ఇది పదకొండవ సారి. దురదృష్టవశాత్తు సమాచారం కోసం పోరాడి సుమారు 300 మంది పై బౌతిక దాడులు జరగగా, 108 మంది చంపబడ్డట్టు తెలుస్తుంది.

20 సంవత్సరాల సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన పెరిగిన కారణంగా ఎక్కువ మంది చట్టాన్ని ఉపయోగించి సమాచారం కోసం దరఖాస్తు చేయడంవల్ల నిస్సందేహంగా ప్రభుత్వ పనితీరులో కొంత జవాబుదారీతనం పెరిగింది. ఈ చట్టం ద్వారా సమాచారం పొందడం కోసం ప్రత్యేకంగా ఎటువంటి ఫారం రూపొందించలేదు. తెల్ల కాగితంపై తమకు కావలసిన సమాచారం కోసం ప్రతిపాదిత 10 రూపాయల చెల్లించి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారికి దరఖాస్తు చేసుకొని అవసరమైన సమాచారం పొందవచ్చు. సమాచార చట్టం నిస్సందేహంగా సామాన్యుడికి సాధికారతను కల్పించింది. బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చింది.

(డా. పి. మోహన్ రావు, మెంబర్, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ , హైదరాబాద్)

Read More
Next Story