అభ్యర్థి విజయాన్ని పూర్తి గా పార్టీ ఖాతాలో వేసుకోవడం సబబా?
x

అభ్యర్థి విజయాన్ని పూర్తి గా పార్టీ ఖాతాలో వేసుకోవడం సబబా?

అభ్యర్థి శక్తి సామర్థ్యాలు, కులం, మతం అతని పట్ల ప్రజల విశ్వాసాలను గెలుపు విషయంలో విస్మరించరాదని చెబుతున్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకుడు బిఎస్ రాములు.


ఇటీవల పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టంపై విభిన్న కోణాల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి. సీనియర్ వ్యాఖ్యత పెంటపాటి పుల్లా రావు అనేక మౌలిక ప్రశ్నలను లేవనెత్తారు.

‘ది హిందూ’ దిన పత్రికలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్ ) మాజీ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాల గురించి రాస్తూ వాటిని పటిష్ట పరచాలని సూచనలు చేశారు. మంచి సూచన. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. 2014లో అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్, బిఆర్ ఎస్ మునుపటి పేరు) పార్టీయే ఫిరాయింపులను ప్రోత్సహించి బలపడింది. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఏం జరిగింది? 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంత భారీగా ఫిరాయింపులు చేయించారో మనం చూల్లేదా!

అభ్యర్థి గెలుపు పార్టీ గెలుపు అవుతుందా?

అపుడంతా ఇదేమి రాజకీయం అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయాలేమయిన ఉమ్మడి రాష్ట్రం కంటే భిన్నంగా మారాయా? మళ్లీ టిఆర్ ఎస్ కూడా అదే పని చేసింది. ఒక అభ్యర్థి గెలుపు కేవలం పార్టీ గెలుపవుతుందా అనేది ప్రశ్నార్థకం. అదే నిజమయితే, అభ్యర్థి ఓటమి మొత్తం పార్టీ కావాలి. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి, గజ్వేల్ లో బిజెపి తరఫున ఎన్నికల్లోకి దిగిన ఈటల రాజేందర్ ఇద్దరూ ఓడిపోయరు. కామారెడ్డి లో బిజేపి అభ్యర్థి గెలిచారు. అక్కడ ఓడిపోయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అభ్యర్థి శక్తి సామర్థ్యాలు, కులం, మతం అతని పట్ల ప్రజల విశ్వాసం వల్ల ఎన్నికల్లో గెలుస్తారు.

కాగా అక్కడ పార్టీ మాత్రమే గెలిచిందనుకుంటే ఓడిన చోట సంగతేమిటి? కనక గెలిచిన వారి ప్రతిష్ట వల్లనే అక్కడ పార్టీ గెలిచిందన్నమాట! కనక గెలిచిన అభ్యర్థివల్లనే , ఆయన పలుకుబడి కారణంగా కూడా పార్టీ గెలిచింది. అందువల్ల అది ఒక నియోజకవర్గంలో పార్టీ విజయం అభ్యర్థి వ్యక్తిగత విజయం కూడా! ఏదైనా అభ్యర్థి గెలుపును పూర్తిగా పార్టీ ఖాతాలోకి వేసుకోరాదు. ఇలాంటివి కీలకమయిన అంశాలను పెంటపాటి పుల్లారావు ఆ మధ్య ప్రజలకు ముందుకు తెచ్చారు.

పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం (Anti-defection Act) వల్ల భారత ప్రజాస్వామ్యం 25 కుటుంబాల చేతుల్లో బందీ అయిపోయింది అని పుల్లారావు చక్కగా వివరించారు. చాలా పార్టీలు కుటుంబ పార్టీల ఆస్తి అధికారంగా కొనసాగుతున్నాయి. అన్ని పార్టీలకు సంస్థాగ ఎన్నికలు ఒకే విధంగా ఉండాలి. అవి ఎన్నికల కమిషన్ ద్వారా నిర్వహించబడాలి. రెండేళ్లకోసారి పార్టీలో ఎన్నికలు జరగాలి. జీవితం నాలుగేళ్లకు మించి పార్టీ అధ్యక్షులు వుండకూడదు. తద్వారా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నపుడే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో గెలుపులో ప్రజాస్వామ్యం వెల్లి విరుస్తుంది.

పెంటపాటి పుల్లారావు పరిశీల చక్కని విషయాలు ముందుకు చెప్పింది. నాస్తిక గోరా పార్టీ రహిత ప్రజాస్వామ్యం (Partyless Democracy)ఉండాలని 1960 లలో రాసాడు. ఆ సిద్ధాంతంతో దేశమంతా తిరిగాడు. గ్రామ పంచాయతీలను స్థానిక సంస్థలను పార్టీ రహితంగా నిర్వహించాలనే విధానమే ఇది. ఈ విధానం దేశంలో ప్రత్యక్ష ఎన్నికలకు దారి తీస్తుంది. ప్రధానిని ముఖ్య మంత్రిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటే పార్టీల చేతుల్లో ప్రజాస్వామ్యం బందీ అవుతున్న పీడా విరగడ అవుతుంది అనే వాదన కూడా వుంది. ఇలా ఫిరాయింపుల నిరోధక చట్టంలో అనేక పరిణామాలు ఇమిడి వున్నాయి.

పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ప్రజాస్వామ్యాన్ని హరిస్తుందా? బలోపేతం చేస్తుందా అనే ప్రశ్న జటిలమైనది. ఎన్నికల్లో గెలిచిన తరువాత పార్టీ ఫిరాయింపుల వల్ల ప్రభుత్వాలు పడిపోతున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయిస్తుంటారు. చట్టం ప్రకారం పార్టీ తరఫున గెలిచిన తరువాత ఫిరాయించకూడదు. విప్ ఉల్లంఘిస్తే , పార్టీ అవగాహనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఫిరాయించినట్టు లెక్క. కనక 15 రోజుల్లో వారి ఎన్నికను రద్దు చేసి వెంటనే ఎన్నికలు జరపాలి. పార్టీలో మూడవ వంతు ఫిరాయిస్తే అది ఫిరాయింపు కాదు . అది చీలిక అవుతుంది. మరొక పార్టీగా గ్రూపుగా గుర్తింపు పొందుతుంది అని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిర్వచించింది.

పార్టీ ఫిరాయింపుల నిరోధక. చట్టం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలం రూపొందించబడింది. స్వాతంత్రం తర్వాత ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ 400 పైగా లోక్ సభ యంపీ సీట్లను గెలుచుకుంది. 31 అక్టోబర్ 1984 న ఇందిరా గాంధీ హత్యకు గురైన సానుభూతితో ఇన్ని సీట్లలో ప్రజలు గెలిపించారు. 1969 లో వివి గిరి (VV Giri) రాష్ట్రపతిగా ఎవ్నికైనపుడు ఇందిరాగాంధీ (Indira Gandhi) ఆత్మ ప్రబోదం నినాదం ఇచ్చిపార్టీ అభ్యర్థి నీలం సంజీవ రెడ్డి (Neelam Sanjeev Reddy) ని ఓడించి వివి గిరిని గెలిపించింది.

1984లో నాలుగింట మూడువంతులు మెజారిటీ ఉన్నపుడు ఈ చట్టం ఎందుకు అవసరమైంది? ఈ చట్టానికి మూలం భింద్రన్ వాలే, ఇందిరను హత్య చేసిన అంగరక్షకులు. ఆ సానుభూతితో ఎన్నికైన వారు జారి పోకుండా కట్టడి చేయడంలో కోసమే ఈ చట్టం ముందుకు వచ్చింది. తద్వారా పార్టీ నాయకత్వానికి ఎనలేని అధికారాలు సంక్రమించాయి. ప్రజల చేత ఎన్నికైన సభ్యులు పార్టీ నియంత్రణలో , నియంతృత్వం లో బందీలయ్యారు.

ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేలే గెలుపు కోసం స్థానికంగా ఎన్నో హామీలిస్తారు. స్థానిక అభివృద్ధి గురించి ఎన్నో డిమాండ్లను ఆమోదించి ఓట్లు సంపాదించుకుంటారు. పార్టీని వాటి గురించి ఒత్తిడి చేసే హక్కు ఫిరాయింపుల నిరోధక చట్టంతో కోల్పోయారు. స్థానిక అభివృద్ధి స్థానికుల అభివృద్ధి బదులు బడా పారిశ్రామిక వేత్తలకు, విదేశీ కార్పోరేట్ సంస్థలకు యవనరులను గనులను ఖనిజాలను అడవులను అప్పగిస్తారు. అప్పగించారు. ఫార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వల్ల ఇలా స్థానిక అభివృద్ధి కుంటుపడి అంతర్గత వలసవాదం, బడా పారిశ్రామిక వేత్తలకు పావుగా పార్టీ నాయకత్వాలు మారి పార్టీకి తమకు విరాళాలు దండుకుంటున్నాయి. అనేక ప్రయోజనాలు పొందుతున్నాయి. పార్టీ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నందునే ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయి. కేంద్రంలో కూడా కుటుంబ పార్టీలుగా మారి కొనసాగుతున్నాయి.

మరోవైపు ఎవరైతే పార్టీని నిర్మించారో వారిని బహిష్కరించి వేరొకరు ఆ పార్టీ అసలు దారులుగా గుర్తింపు పొందుతుండటం ఇపుడు చూస్తున్నాం. మహారాష్ట్రలో శివసేన పార్టీ ఈ స్థితిని ఎదుర్కొంటున్నది. బిజేపీ మద్దతుతో శివ సేన పార్టీని చీల్చి ముఖ్యమంత్రి అయి తమదే అసలైన శివ సేన పార్టీ గా గుర్తింపు పొంది, పార్టీ సంస్థాపకుడి వారసులను చీలిక పార్టీగా గుర్తించడం జరిగింది. బిజేపీ మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పని చేసింది.

కేంద్రం ఒకవైపు జంట ఎన్నికలు జరపాలని ముందుకు కదులుతున్నది. రాష్ట్రానికి కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరిపించే రాష్ట్రాల ఫెడరల్ స్వభావం అంతరిస్తుందని వాదనలున్నాయి. ప్రాంతీయ పార్టీలు మాయం చేసి కనుమరుగు చేయడం కోసమే జంట ఎన్నికలు అంటున్నారని వాదన ఉంది.

ఎన్నికయ్యాక వెనక్కి పిలిచే ఏర్పాటు లేనందున ఐదేళ్లకు బదులుగా మూడేళ్ల కొకసారి ఎన్నికలు జరపడం అవసరం. ప్రధాని ముఖ్యమంత్రి తన జీవితంలో 6 ఏండ్లకు మించి అధికారంలో ఉండరాదు. ప్రతి రెండేళ్లకు లేదా వీటితో పాటే స్థానిక ఎన్నికలకు కూడా ఎన్నికలు నిర్వహించాలి. అమెరికా చైనా రష్యా ఆస్ట్రేలియా ఇంగ్లాండు ఫ్రాన్సు జర్మనీలో లో వలే నిష్పత్తి ప్రకారం లోక్ సభ సీట్లు 3200 లకు పెంచవలసిన వుంటుంది. అలాగే అసెంబ్లీ సీట్లు నాలుగు రెట్లు పెంచవలసిన వుంటుంది. స్థానిక అభ్యర్థులు ఇచ్చిన హామీలు ఆయా పార్టీల గ్యారెంటీలుగా కలుపుకొని ప్రకటించినప్పుడు గెలిచిన అభ్యర్థిపై పార్టీకి హక్కుంటుంది.

( బి ఎస్ రాములు, సామాజిక విశ్లేషకులు, హైదరాబాద్)

Read More
Next Story