‘సమిధ’ పుస్తక సమీక్ష
సబ్ ఇన్స్పెక్టర్ మోటూరి శ్రీనివాసరావు రాజీలేని జీవితం ‘సమిధ’ అయితే, చిన్నవయసులోనే ఆత్మ హత్య కు పూనుకోవడం అర్థం కాని మలుపు.
-అలజంగి మురళీధర రావు
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ మోటూరి శ్రీనివాసరావు గారి జీవిత కథ సమిధ . ఇందులో ఆయన ఆత్మహత్య చేసుకునే చివరి ఘట్టం చదువుతుంటే నా కళ్ళ వెంబడి ఒకటే కన్నీటి ధారలు ! అంతటి ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ ని ఎప్పుడూ చూడబోము. ఆదర్శాలు అందరం వల్లిస్తాం. కథలు, నవలలు రాస్తాం, ఉపన్యాసాలు ఇస్తాం, కానీ నిజంగా మనమంతా ఆచరణలో అలా ఉంటున్నామా ? లేదు. చెప్పేది ఒకటి చేసేది వేరొకటి. ఎస్సై శ్రీనివాసరావు ఎందుకు గొప్పవాడు అవుతున్నాడు అంటే ఆయన ఎక్కడా నీతులు వల్లించడు, ఎక్కడ మోరల్ డిస్కోర్సెస్ ఇచ్చే పరిస్థితులు అరుదు. కానీ చెయ్యాలనుకున్న ప్రజాసేవ, నీతి నిజాయితీలను ఆచరణ ద్వారానే చూపించారు. గొప్ప గొప్ప గ్రంథాలను చదివేయండి అని, మేధావులుగా మారి ప్రజా సేవ చేసెయ్యండి అని, ఎవరికి ఏ విధమైన ప్రబోధాలు చేసిన వాడు కాదు.
తానొక సగటు మనిషి, ఉద్యోగంలో చేరి ఉద్యోగ ధర్మాన్ని తూ.చా. తప్పకుండా చేసుకుపోయిన మనిషి. తాను ఏది నమ్మాడో అదే ఆచరించారు. నీతికి, నిజాయితీకి నిలబడ్డారు. ఎక్కడ పని చేస్తే అక్కడ రౌడీలకి, సంఘ వ్యతిరేక శక్తులకి, దొంగలకి, దోపిడీదారులకి, చివరికి అవినీతి మకిలిని లాగేఒళ్లంతా పూసుకున్న ఉన్నతాధికారులకి, రాజకీయ నాయకులకి కూడా సింహ స్వప్నమయ్యారు.
అనంతపురంలో పోలీస్ ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పాతపట్నం, గజపతినగరం, ఎల్విన్ పేట, సాలూరు, పోలీస్ రిక్రూట్మెంట్ స్కూల్ విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం, కాశీబుగ్గ, ఇచ్చాపురం మొదలైన పోలీస్ స్టేషన్లలో ఉద్యోగం చేసి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గా శ్రీకాకుళం, విజయనగరం ఏసీబీ సిఐగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు.ఎల్విన్ పేట అటవీ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు మారువేషంలో మావోయిస్టులను కలిసి, వాళ్ల కూఫీ లాగే సన్నివేశం చదువుతుంటే మన ఒళ్ళు గగుర్పాటుకు లోనవ్వక తప్పదు.స్వయానా పోలీస్ అధికారులే ఔరా శ్రీనివాస్ అని ముక్కు మీద వేలు వేసుకున్న అద్భుత సన్నివేశం ఇది!!
కాశీబుగ్గ రౌడీల పీచమణచాలన్నా, ఇచ్చాపురం చెక్కు గేటు వ్యవహారాలను చేధించాలన్న అది ఒక్క శ్రీనివాసరావుకే సాధ్యమనిపిస్తుంది. పై అధికారులు ఏరి కోరి సమస్యాత్మక స్టేషన్లలో శ్రీనివాసరావుని నియమించే వారంటే అతని కమిట్మెంట్, ఉద్యోగ నిబద్ధత, ధైర్యం, ధీరత్వం ,ఆచరణ శీలత అర్థం కావడం లేదూ !!
మొదటి భార్య ప్రభావతి అంటే ఎంతో ప్రేమ, ఆమెకు కూడా అంతే. అనుకోని పరిస్థితులలో ఆమె మరణించినప్పుడు శ్రీనివాసరావు ఏడ్చిన ఏడుపు, కార్చిన కన్నీరు, ఆమె మరణానంతరము అతను అనుభవించిన వ్యధ ఈ పుస్తకంలో చదువుతుంటే ఎంతటి కఠినాత్ముడికైనా హృదయం ద్రవించక మానదు.
40 సంవత్సరాల వయసుకే అసువులు బాసే పరిస్థితులు ఎలా తలెత్తాయో, ఈ సున్నిత మనస్కుడైన, నిజాయితీపరుడైన వ్యక్తిని ఎంతలా గాయపరిచాయో, ఆ సందర్భాలన్నింటిని చదువుతున్నప్పుడు ఒక ఆవేదన, నిర్వేదం, కోపము, ఆగ్రహంతోమనం ఊగిపోతాం. సమిధను ప్రతి ఒక్కరూ చదవాలి. ఒక నిబద్ధత కలిగిన అధికారి జీవితాన్ని ఆకళింపు చేసుకోవాలి. ఆచరణే ఊపిరిగా, నిబద్ధతే తన ఉద్యోగ ధర్మంగా బ్రతికి, నీతి, నిజాయితీలకు తన జీవితాన్నే ఒక ఉదాహరణగా చూపించిన శ్రీనివాసరావు ఒక గాంధీకి, ఒక నెహ్రూకి కూడా తక్కువేమీ కానే కాడు .
ప్రజాభిమానం వెల్లువెత్తిన సందర్భం,కింది నుంచి పై స్థాయి వరకు పొలీసు అధికార గణం ముక్త కంఠం తో ప్రశంసించిన సందర్భం బహుశా ఒక్క శ్రీనివాసరావు ఎస్ఐ విషయంలో తప్ప మరి ఎక్కడ జరిగి ఉండదు. ఈ ప్రజా వెల్లువ చాలు శ్రీనివాసరావు గారి వ్యక్తిత్వం ఎంతటిదో తెలిచేయడానికి.
మరణించిన నాటికి అతనికి భార్య, అయిదుగురు పిల్లలు. ఇల్లు లేదు, ఆస్తి లేదు. కడు పేదవానిగా బతికిన ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క శ్రీనివాసరావు మాత్రమె అని ఘంటాపథంగా చెప్పవచ్చు. పుట్టింది ఉత్తరాంధ్ర, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించింది కూడా ఉత్తరాంధ్రయే అయినప్పటికీ తన ఆసమాన నైపుణ్యంతో , దీక్షా దక్షతులతో ప్రజా వ్యతిరేక శక్తులను అణగ ద్రొక్కి, ధర్మాన్ని నిలిపి, ఒక ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు యావత్ ప్రపంచానికే ఒక రోల్ మోడల్ గా శ్రీనివాసరావు ఎస్సై నిలుస్తారంటే అందులో ఇసుమంతా అయినా అతిశయోక్తి లేదు. ఒక సందర్భంలో ఎవరో “ఉద్యోగమా, సంసారమా ఏది ముఖ్యం?” అని అడిగితే కించిత్ ఆలోచన లేకుండా “నాకు ఉద్యోగమే ముఖ్యం” అనగలిగిన ఒకే ఒక్కడు శ్రీనివాసరావు ఎస్సై.
సమిధ పుస్తకాన్ని రచించి, ఎం శ్రీనివాసరావు ఎస్ఐ గొప్ప స్ఫూర్తివంతమైన జీవితాన్ని అందరికీ తెలియజేస్తున్న ఈ పుస్తక రచయిత అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా ఉద్యోగ విరమణ చేసిన శ్రీ కరణం సత్యనారాయణ గారు నిజంగా ఎంతో అభినందనీయులని చెప్పక తప్పదు. సమిధ ఇతర భారతీయ భాషలలోకి మరియు ఆంగ్లంలోకి కూడా తర్జుమా కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అనిపిస్తుంది.ఎందుకంటే మంచి ఏ కొద్దిగా ఉన్నా అది మరుగున పడక నలుగురికి తెలియాలి. గురజాడ వారు అన్నట్లు “బ్రతికి చచ్చియు ప్రజలకెవ్వడు మేలు గూర్చునో వాడే మనిషి ఆ మనిషి”!! అట్టి ఆ మనిషి మన శ్రీనివాస్ . ప్రతులకు విశాలాంధ్ర బుక్ హౌస్ ,విజయవాడ ను సంప్రదించవచ్చు.
(అలజంగి మురళీధర రావు అర్థ శాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాడేరు, ఆంధ్ర ప్రదేశ్ )
Next Story