
దక్షిణాదిలో నారాయణమూర్తి 'పని గంటలు'
కార్మికుల పని గంటలను పెంచడంలో దక్షిణాది పాలకులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.
మనమేదో, భారత దేశంలో ఉత్తరాది అనాగరికమైనది, అన్యాయమైనది, దక్షిణాది నాగరికమైనది, ఆధునికమైనది అనుకుంటాం కానీ, వాస్తవం అలా లేదు. ఉత్తరాదితో పోల్చినప్పుడు, దక్షిణాది లో కొన్ని ప్రగతిశీల భావనలు, ఆలోచనలు, ఉద్యమాలు ఉన్నమాట నిజమే కావచ్చు కానీ, పాలకుల స్వభావంలో ఉత్తరాదికీ , దక్షిణాదికీ ఏ మార్పూ కనిపించడం లేదు.
ముఖ్యంగా శ్రామిక వర్గ ప్రజల హక్కులను హరించడంలో , ప్రైవేట్,కార్పొరేట్ కంపెనీలకు ఎర్ర తివాచీ వేయడంలో దక్షిణాది పాలకులు కూడా దూకుడుగా ఉన్నారు. రైతుల నుండీ భూములను గుంజుకుని, కార్పొరేట్ కంపనీలకు కట్టబెట్టడంలో, ప్రత్యేక ఆర్ధిక మండళ్ల పేరుతో, కార్మికుల హక్కులను రద్ధు చేయడంలో, సరళ తర వాణిజ్యం పేరుతో, కార్మికుల పని గంటలను పెంచడంలో దక్షిణాది పాలకులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.
స్వాతంత్రోద్యమ కాలం నుండీ భారత దేశ కార్మిక వర్గం హక్కుల కోసం పోరాడుతూనే ఉంది. ఈ ఉద్యమాల ఫలితంగానే అనేక చట్టబద్ధ హక్కులను కూడా సాధించుకుంది. బ్రిటిష్ పాలన కాలంలోనే కార్మికులకు దక్కిన కొన్ని హక్కులు, 1947 తరువాత మరింతగా విస్తరించాయి. స్వాతంత్రానంతర తొలి 5 దశాబ్ధాలలో దేశంలో ప్రభుత్వ రంగం కూడా చురుకుగా ఉండడం తో, ఆదర్శ యాజమాన్య భావన ఉండి, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, కార్మికులు మరి కొన్ని హక్కులను, సౌకర్యాలను సాధించుకున్నారు.
ఈ కాలం లో కార్మిక సంఘాలు కూడా బలంగా ఉండడంతో, ప్రైవేట్ రంగంలో కూడా కార్మికులు కొన్ని హక్కులు సాధించుకునే అవకాశం ఉండింది. ముఖ్యంగా పని గంటలు, వివిధ రకాల సెలవులు, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్, ESI, గ్రాట్యుటీ, బోనస్ లాంటివి అమలులోకి తెచ్చుకోవడానికి కార్మికులు ఐక్యంగా, సమరశీలంగా అనేక ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ఈ ఉద్యమాలలో అనేకమంది కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల నిర్బంధానికి గురయ్యారు. యాజమాన్యాల గూండాల దాడులకు బలయ్యారు. ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికీ కార్మికులు, ఉద్యోగులు కొన్ని హక్కులను అనుభవిస్తున్నారంటే, ఈ ఉద్యమాల ఫలితమే.
ప్రతి సంవత్సరం కార్మిక వర్గం మేడే ను ఒక పోరాట దినోత్సవంగా జరుపుకుంటుంది. హక్కుల రక్షణ కోసం, కొత్త హక్కుల సాధన కోసం ప్రతిజ్ఞ తీసుకుంటుంది. వివిధ ప్రభుత్వాలు,ఆ ప్రభుత్వాలకు వంత పాడే కార్మిక సంఘాలు మాత్రం మేడే ను నిస్సారంగా మార్చేశాయి.
ప్రపంచ వ్యాపితంగా కార్మిక వర్గం మేడే ను జరుపుకోవడమే 8 గంటల పని దినం సాధనా స్పూర్తిని జ్ఞాపకం చేసుకోవడానికి. ఆ రోజు 8 గంటల పని దినం కోసం ఉద్యమించిన కార్మిక వర్గం ఇచ్చిన నినాదమే “ 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి , 8 గంటలు మా ఇష్టం.”
అంటే కంపెనీలు, కార్యాలయాలు, ఇతర పని స్థలాలలో కార్మికులను 8 గంటలకు మించి పని చేయించుకోకూడదని, మిగిలిన 16 గంటలలో 8 గంటలు విశ్రాంతి తీసుకుంటే మాత్రమే ఒక మనిషులు ఆరోగ్యంగా ఉండి , మళ్ళీ పని స్థలంలో శ్రమ చేయడానికి రాగలుగుతారని, మిగిలిన 8 గంటలలో తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆహ్లాదంగా, సంతొషంగా గడుపుతారని అర్థం. 1885 లో చికాగో లో మొదలైన ఈ నినాదం, ఉద్యమం ప్రపంచ వ్యాపితంగా కార్మికులను మేల్కొలిపింది. 8 గంటల పని దినాన్ని సాధించుకునేలా పురికొల్పింది.
కానీ ప్రైవేట్ యాజమాన్యాలెప్పుడూ, కార్మికులు 8 గంటల పని దినాన్ని సాధించుకోవడాన్ని మింగలేకపోయారు. ఏదో ఒక రకంగా ఆ హక్కును కాలరాయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. భారత దేశంలో 1948లోనే ఫ్యాక్టరీల చట్టంలో 8 గంటల పని దినం ఉండాలని స్పష్టంగా ఉన్నా, దానిని తూట్లు పొడవడానికి కొత్త మార్గాలు కనిపెట్టారు.
కార్మికుల అవసరాలకు సరిపడా కనీస వేతనాలు చెల్లించకుండా, కార్మికులు తమ కుటుంబాల నిర్వహణకు అవసరమైన అదనపు ఆదాయం కోసం ఓవర్ టైమ్ ( OT ) పని చేసే అనివార్య స్థితిని సృష్టించారు. యాజమాన్యాలు, కార్మికులతో, ఉద్యోగులతో 8 గంటలకు మించి పని చేయించుకున్నప్పుడు, అలా పని చేసిన అదనపు కాలానికి రెట్టింపు వేతనం చెల్లించాలని, చట్టం స్పష్టంగా నిర్దేశిస్తున్నా, దానిని అమలు చేయకుండా, అదే వేతనాన్ని చెల్లిస్తూ, కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ వచ్చారు.
1991 లో నూతన ఆర్ధిక పారిశ్రామిక విధానాలు ప్రారంభమయ్యాక , ఈ ధోరణి మరింత పెరిగింది. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నినాదాలతో ముందుకు వచ్చిన ఈ విధానాలు, కార్మికుల హక్కులపై మొదటి దాడి చేశాయి. ఎప్పటికప్పుడు పని స్థలాలను తనిఖీ చేసి, కార్మికుల హక్కులకు హామీ పడాల్సిన కార్మిక శాఖను పూర్తిగా చంపేశాయి. యాజమాన్యాల దోపిడీకి పట్టపగ్గాలు లేకుండా పోయింది. ఆయా పని స్థలాలలో కార్మికుల హక్కుల కోసం పని చేయకుండా కార్మిక సంఘాల ఉనికిని కూడా పూర్తిగా దెబ్బ తీశాయి. కొత్తగా ఎక్కడా కార్మిక సంఘాలు ఏర్పడకుండా ఆంక్షలు విధిస్తున్నాయి. ఆయా పని స్థలాలలో పర్మినెంటు లకార్మికులు, ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్, క్యాజువల్ కార్మికులను, ఉద్యోగులను నియమించుకుంటున్నారు. వారికి ఉద్యోగ బధ్రత లేకుండా చేసేశారు. కార్మికులు నిరసన వ్యక్తం చేస్తే, హక్కులను అడిగితే, సమ్మె చేస్తే ఉద్యోగాలు పోతాయన్న భయాన్ని సృష్టించారు. పని స్థలంలో కార్మికుల రికార్డులు, హాజరు పట్టికలు కనపడకుండా చేశారు.
కార్మికులను ఎన్ని విధాలుగా దోచుకున్నా, యాజమాన్యాల లాభాల దాహం తీరడం లేదు. ఈ నేపధ్యంలోనే ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి లాంటి వాళ్ళు బహిరంగంగా 8 గంటల పని దినానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. కార్మికులు, ఉద్యోగులు వారానికి 70 గంటలు పని చేయాలని, అప్పుడే కార్మికుల జీవితాలు మెరుగవుతాయని నీతో బోధలు చేస్తున్నారు.
దీనిపై తీవ్ర వ్యతిరేకత కార్మికులలో, కార్మిక సంఘాలలో వ్యక్తం అవుతున్నా, వాళ్ళు ఆ వాదనను వెనక్కు తీసుకోవడం లేదు. పైగా తమ వాదనలపై ప్రభుత్వాలను ఒప్పించే స్థితికి వచ్చేశారు. రాజ్యాంగ బద్ధ, చట్టబద్ధ హక్కులకు హామీ పడాల్సిన ప్రభుత్వాలు, దోపిడీ కార్పొరేట్ కంపనీల చెప్పు చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయాయడానికి, పని గంటల పెంపు విషయంలో వివిధ రాష్ట్రాలు, ముఖ్యంగా ఆధునికతకు మారుపేరుగా చెప్పుకునే దక్షిణాది రాష్ట్రాలు అనుసరిస్తున్న వైఖరి పెద్ద ఉదాహరణ.
భారతదేశంలోని పలురాష్ట్రాలు ఇప్పటికే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్‌ను సవరించి, పని గంటలను పెంచాయి, కొన్ని రాష్ట్రాలు రోజుకు గరిష్టంగా 12 గంటల వరకు నిర్దేశించాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత అస్సాం, గోవా, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్, ఆప్ పాలిత పంజాబ్ రాష్ట్రాలు 12 గంటల పనిదినాన్ని అనుమతించే నోటిఫికేషన్‌లను ఇప్పటికే జారీ చేశాయి. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ 11 గంటల పని గంటలను అనుమతించింది, ఇది నిరంతర ప్రక్రియ గా నడిచే పరిశ్రమలలో 12 గంటల వరకు అనుమతించే అవకాశాన్ని ఇచ్చింది.
కాంగ్రెస్ పాలిత తెలంగాణ, NDA కూటమి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 10 గంటల పని దినాన్ని అనమతిస్తూ జీవో లు జారీ చేశాయి. మరో కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాష్ట్రం 10 గంటల షిఫ్ట్‌లను ప్రతిపాదించింది.
తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల (లాబ్-I) శాఖ G.O.Rt.No. 282 ను 2025 జులై 5 న విడుదల చేసింది. ఈ జీవో విడుదల చేయడానికి గత BRS ప్రభుత్వ కాలంలో అప్పటి కమిషనర్ ఆఫ్ లేబర్, తెలంగాణ రాసిన లేఖలను ( C2/2566/2015, 22.05.2025 లేఖ ) ప్రాతిపదికగా పెట్టుకోవడం గమనార్హం. అంటే కార్మికుల హక్కులను హరించడంలో ఏ పార్టీ ప్రభుత్వమయినా ఒకే రకంగా పని చేస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి.
కమిషనర్ ఆఫ్ లేబర్, తెలంగాణ నివేదించిన పరిస్థితులలో, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్, 1988, సెక్షన్ 2(5) కింద నిర్వచించబడిన అన్ని వాణిజ్య సంస్థలను (దుకాణాలు తప్ప), సెక్షన్ 16 మరియు 17 నుండి మినహాయించడానికి కొన్ని షరతులకు లోబడి మార్పులు చేసింది. నోటిఫికేషన్ తెలంగాణ గెజిట్ యొక్క అసాధారణ సంచికలో ప్రచురించి, 08.07.2025 నుండీ అమలులోకి తెస్తారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం రోజుకు 10 పని గంటలను, వారానికి 48 గంటల పరిమితితో అనుమతిస్తారు. సులభ వ్యాపార వాతావరణం ప్రోత్సహించదనికి ఈ క్రింది షరతులతో ఈ నోటిఫికేషన్ అమలు లో ఉంటుందని ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ..
1. కార్మికులు 10 గంటలకు మించి మరియు వారానికి 48 గంటలు పనిచేయ కూడదు. 48 గంటలకు మించి చేసిన పనికి ఉద్యోగి ఓవర్‌టైమ్ వేతనాలకు అర్హుడు.
2. ఏ ఉద్యోగిని ఆరు గంటలకు మించి కంటిన్యూగా పని చేయించకూడదు. మధ్యలో తప్పనిసరిగా కనీసం 30 నిమిషాల విశ్రాంతి / విరామం ఇవ్వాలి.
3. ఒక సంస్థలో ఉద్యోగి పని వ్యవధులు, అతని/ ఆమె విశ్రాంతి విరామంతో సహా, ఏ రోజునైనా 12 గంటలకు మించి పెరగకుండా చూడాలి.
4. ఏ ఉద్యోగినైనా వారానికి 48 గంటలకు మించి ఒక సంస్థలో పనిచేయడానికి ఓవర్ టైమ్ వేతనాల చెల్లింపుపై అనుమతించవచ్చు. కాకపోతే ఇది ఏ ఏడాది త్రైమాసికంలో నైనా గరిష్టంగా 144 గంటల పరిమితికి లోబడి ఉండాలి.
5. పై షరతులని ఏ సంస్థ అయినా ఉల్లంఘిస్తే ఆ సంస్థకు జారీ చేయబడిన మినహాయింపు ఆదేశాలను ప్రభుత్వం ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేస్తుంది.
పై షరతులను పైపైన పరిశీలిస్తే, బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఈ షరతులకు అనుగుణంగా యాజమాన్యాలు నడుచుకుంటున్నట్లు ఎవరు నిర్ధారించాలి. నిజానికి కార్మిక శాఖ ఈ బాధ్యత చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే వివిధ సంస్థలు, కార్మికులకు, ఉద్యోగులకు ఎటువంటి ఓవర్ టైమ్ అలవెన్స్ చెల్లించకుండా 12 గంటలు, 10 గంటలు పని చేయించుకుంటుంటే, కార్మిక శాఖ ఏమి పట్టించుకున్నది? ఈ నోటిఫికేషన్ తరువాత మాత్రం ఏమి పట్టించుకుంటుంది? ? ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కార్మికులను మరింత దోచుకోవడానికి అవకాశం ఇస్తూ ఈ జీవో తీసుకు వచ్చిందని అర్థమవుతుంది.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1961లో సవరణ తీసుకు రావాలని ప్రతిపాదించింది. ఈ సవరణ ప్రకారం, ప్రస్తుతం ఉన్న రోజుకు తొమ్మిది పని గంటలను 10 గంటలకు పెంచడంతో పాటు, అదనపు ఓవర్‌టైమ్ గంటలను కూడా అనుమతించనుంది.
కార్మిక శాఖ ఈ ప్రతిపాదిత సవరణను పబ్లిక్ డొమైన్ లో పంపిణీ చేసి ప్రజల స్పందనను కోరింది. ఈ ప్రతిపాదన ప్రకారం, రోజుకు 10 గంటలు మరియు వారానికి 48 గంటల వరకు పని గంటలను పెంచవచ్చు. ఓవర్ టైమ్‌తో సహా మొత్తం పని గంటలను రోజుకు 12 గంటలకు పరిమితం చేస్తుంది, ఇది ప్రస్తుతం ఉన్న ఓవర్ టైమ్ 10 గంటల నుండి 12 గంటలకు పెరుగుతుంది.
కర్ణాటక రాష్ట్ర IT/ITeS ఉద్యోగుల సంఘం (KITU) ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది, దీనిని "ఆధునిక బానిసత్వం"గా అభివర్ణించింది. ఈ మార్పు ఉద్యోగుల, పని, జీవన పరిస్థితులను, ఉద్యోగ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, ఇప్పటికే ఉన్న మానసిక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరించింది. 2024 ఎమోషనల్ వెల్ బీయింగ్ రిపోర్ట్ ప్రకారం, 25 సంవత్సరాల లోపు 90 శాతం కార్పొరేట్ ఉద్యోగులు ఆందోళనతో(స్ట్రెస్) బాధపడుతున్నారని, పని ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు, మరణాలు పేరుగుతున్నాయని కూడా KITU నాయకుడు సుహాస్ అడిగా అంటున్నారు.
సోషల్ మీడియాలో ముఖ్యంగా రెడ్డిట్ లో, ఈ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక యూజర్ "10 గంటల పని, 4 గంటల రవాణా, 0 జీవనం" అని వ్యాఖ్యానించగా, మరొకరు కృత్రిమ మేధ (AI) ఉత్పాదకతను పెంచుతున్నప్పుడు,కార్మికులకు పని గంటలు ఎందుకు పెంచాలని ప్రశ్నించారు. ఈ పని గంటల పెంపు మహిళలపై మరింత ఎక్కువగా ప్రభావం చూప వచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది మహిళలు ఇళ్ళలో కూడా స్వయంగా పని చేసుకుని ఉద్యోగాలకు వస్తారు. ఎక్కువ పని గంటలు, రాత్రి షిఫ్ట్‌లు మహిళలపై ఈ ఒత్తిడిని మరింత పెంచుతాయి.
ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (FKCCI) మాత్రం పని గంటల పెంపు వ్యాపార అనుకూలంగా, యువ, డైనమిక్ శ్రామిక శక్తిని ప్రతిబింబించేలా ఉందని స్వాగతించింది. కార్మిక సంఘాలు మాత్రం ఈ మార్పులు కార్పొరేట్ లకు మరింత లాభాలను అందిస్తూ, కార్మికుల సంక్షేమంపై మాత్రం ప్రాధాన్యత తగ్గిస్తున్నాయని స్పష్టం చేశాయి.12 గంటల షిఫ్ట్‌లు చట్ట బద్ధం కావడం వల్ల రెండు షిఫ్ట్ ల వ్యవస్థకు మార వచ్చని, దీని వల్ల మూడవ వంతు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని KITU హెచ్చరించింది. 2024లో లో కర్ణాటక ప్రభుత్వం తీసుకు వచ్చిన 14 గంటల పనిదినం ప్రతిపాదనకు KITU నుండీ, ఉద్యోగుల నుండి వచ్చిన తీవ్ర వ్యతిరేకత కారణంగా ప్రభుత్వం అప్పుడు దానిని వెనక్కి తీసుకున్నది. కర్ణాటక లో తెచ్చిన పని గంటల పెంపు ప్రతిపాదనను "నారాయణ మూర్తి గంటలు" గా సెటైర్ చేస్తున్నారు. 2023లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి 70 గంటల పని వారాన్నిసమర్ధిస్తూ వ్యాఖ్యలు చేశారు.
NDA కూటమి నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ తన తాజా సమావేశంలో, 1948 ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్లు 54, 55, 56, 59, 64, 65, 66 లను సవరించే ప్రతిపాదనలను ఆమోదించింది, ఇవి కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, మరియు బీమా వైద్య సేవలకు సంబంధించినవి. అలాగే, ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ (1988) లో సెక్షన్లు 9, 10, 16, 17, 73 లలో కూడా సవరణలను ఆమోదించింది.
సమాచార మరియు ప్రజా సంబంధాల (I&PR) మంత్రి కొలుసు పార్థసారథి, ఈ సవరణలు వ్యాపార సౌలభ్యం (Ease of Doing Business) సంస్కరణలలో భాగంగా పెట్టుబడిదారులకు మరింత అనుకూలంగా ఉండేలా చేయబడు తున్నాయని ఏ మాత్రం సిగ్గు పడకుండా తెలిపారు.
మహిళలను రాత్రి షిఫ్ట్‌లలో పనిచేయడానికి అనుమతించే నిర్ణయం, పారిశ్రామిక రంగంలో లింగ వివక్షతను తొలగించడం, సాధికారతను ప్రోత్సహించడంలో భాగమని కూడా ఆయన అన్నారు.
కనీస వేతనాలను పెంచి, పని గంటలను తగ్గించడం , విశ్రాంతి సమయాన్ని పెంచడం మహిళల ఆరోగ్యానికి మంచిదని గుర్తించకుండా, రాశ్రీ షిఫ్టులు వేసి, పని గంటలను పెంచి, దానిని మహిళలకు సాధికారతగా మాట్లాడడం అన్యాయం కదా ?
ఈ సవరణల వల్ల కార్మికుల పని గంటలు కూడా పెరుగుతాయి. గతంలో ఆచరణాత్మక పనిదినం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటలకు మారినప్పటికీ, తాజా క్యాబినెట్ నిర్ణయం దీనిని మరింత పెంచి 10 గంటలకు చేసింది.
ప్రస్తుతం, కార్మికులు ప్రతి ఐదు గంటల పని తర్వాత 30 నిమిషాల విశ్రాంతి సమయానికి అర్హులు. కొత్త నియమం ప్రకారం, వారు విశ్రాంతి సమయాన్ని పొందడానికి ఆరు గంటలు పనిచేయాలి. గతంలో, కార్మికులను ఒక త్రైమాసికంలో 50 నుండి 75 గంటల ఓవర్ టైమ్ పనిచేయడానికి అనుమతించేవారు. ఇప్పుడు ఆ పరిమితిని 144గంటలకు పెంచారు. వాస్తవానికి, ఓవర్‌టైమ్ అనేది స్వచ్ఛంద అదనపు పనిగా ఉండాలి, కానీ ఆచరణలో, ఇది యజమానులు నిర్దేశించే తప్పనిసరి భారంగా మారింది. ఈ కొత్త నిర్ణయంతో, కార్మికులపై ఓవర్‌టైమ్ ఒత్తిడి మరింత పెరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రాత్రి షిఫ్ట్‌లను తప్పనిసరి చేసింది. కార్పొరేషన్‌లు CCTV కెమెరాలు, లైటింగ్, భద్రత వంటి సౌకర్యాలను అందించాలని క్యాబినెట్ సిఫార్సు చేసింది, తద్వారా మహిళలు రాత్రి సమయంలో పనిచేయ గలరని వల్ల భావన. అయితే, పిల్లలున్న మహిళలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఎటువంటి ప్రస్తావన క్యాబినెట్ చేయలేదు. రాత్రి పని మహిళలకు తప్పనిసరా లేదా స్వచ్ఛందమా అనే విషయంపై కూడా క్యాబినెట్ స్పష్టత ఇవ్వలేదు.
ఇవన్నీ చూస్తే, మనం ఆధునిక విలువలతో కూడిన 21 వ శతాబ్ధం లోకి కాకుండా మేడే ముందు నాటి 18 వ శతాబ్ధంలోకి వెనక్కు పోతున్నట్లు కనిపిస్తున్నది. ప్రభుత్వాలు కార్పొరేట్ కంపనీల దళారీలుగా మారిపోయిన స్థితిలో, ఐక్య కార్మిక ఉద్యమాలు మాత్రమే మళ్ళీ కార్మికుల హక్కులకు రక్షణ ఇవ్వగలవు.