
సింగమనేని నారాయణ కధ ‘తరగతి గదిలో తల్లి’
‘ఉపాధ్యాయ దినోత్సవం’ సందర్బంగా ఒక మంచి కథ
-చెంగల్వ రామలక్ష్మి
మహాకవి గురజాడ, బోధన ఒక కళ అన్నారు. ఉపాధ్యాయులకు తప్పనిసరిగా ఉండవలసిన కళ ఈ బోధన కళ. ఈ కళ లో నైపుణ్యం సాధించిన వారు ఉత్తమ ఉపాధ్యాయులుగా, విద్యార్థులను మంచి దారిలో నడిపించేవారుగా రాణిస్తారు.
ఉపాధ్యాయుల వ్యక్తిత్వం ఉన్నతమైనదైతే విద్యార్థులు వారి ననుసరిస్తూ తమ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకుంటారు. ఉపాధ్యాయుడు కేవలం పాఠ్య పుస్తకాలలోని పాఠాలనే కాదు, జీవితంలో పాటించవలసిన నైతికవిలువలను బోధిస్తూ రేపటి పౌరులను తయారు చేయాలి. అటువంటి ఒక మంచి ఉపాధ్యాయుని గురించిన కథ సింగమనేని నారాయణ గారి “తరగతి గదిలో తల్లి “.
ప్రభాకరం అనే టీచర్, బదిలీపై వెళ్ళిపోయిన సుశీలమ్మ అనే టీచర్ స్థానం లో ఆ తరగతికి వస్తాడు. అది ఏడవ తరగతి. అరవై మంది ఉన్న తరగతి లో ముఫ్ఫయి మందిపైగా ఆడపిల్లలే ఉండటం విశేషం.
సుశీలమ్మ టీచర్ ముఖంలా చిరుబురులాడకుండా కొత్త మాస్టారి ముఖం ప్రసన్నంగా, నవ్వుతూ ఉండటం పిల్లలకు నచ్చింది. అంతేకాదు,ప్రభాకరం తనను పరిచయం చేసుకోవటం,, పిల్లలందరినీ ఒక్కొక్కరినీ వరసగా పేర్లు చెప్పమనటం వాళ్లకు కొత్తగా ఉంది. ప్రభాకరం,రవి అనే విద్యార్థిని పేరుతో పిలిచి ప్రశ్న అడగటం పిల్లలందరికీ సంతోషాన్నిచ్చింది. అంతకు ముందున్న సుశీల టీచర్ అరే, ఒరే అనటమే తప్ప పేరుతో పిలిచింది లేదు.అలా కొత్త మాస్టారు వచ్చి రావటం తోనే పిల్లల మనసులో మంచి స్థానం పొందారు.
ప్రభాకరం చిన్న చిన్న ప్రశ్నలతో మొదలుపెట్టి ఆసక్తికరంగా తరగతిని నిర్వహిస్తాడు. పిల్లలలో ఉన్న జ్ఞానాన్ని ప్రశ్నల ద్వారా ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి. ప్రశ్న జ్ఞానార్జనకు, జ్ఞాన వికసనానికి దోహదం చేస్తుంది.
మనం మాట్లాడే భాషను ఏమంటారు? అని మాస్టారు అడిగితే, ఒక విద్యార్థిని మాతృభాష అని చెపుతుంది. మాతృభాషను తల్లిభాష అని కూడా అంటారని ఇంకో విద్యార్థిని చెపుతుంది. తల్లిభాష అని ఎందుకంటారని మాస్టారు అడిగితే అమ్మ దగ్గరే మొట్టమొదట మాటలు నేర్చుకుంటాం కాబట్టి అని ఒక విద్యార్థి సమాధానం. కాబట్టి, అమ్మకు అందరం ఋణపడి ఉండాలని చెపుతూ మాస్టారు, ఇంట్లో తల్లి చేసే పనులను గురించి చెప్పమంటారు. ప్రతి విద్యార్థి, తమ ఇంట్లో తల్లే అన్ని పనులు చేస్తుందని చెపుతారు. సుభాషిణి అనే విద్యార్థిని అయితే, తన తల్లి,పసి తమ్ముడికి కాళ్లపై పడుకోబెట్టుకుని స్నానం ఎలా చేయిస్తుందో తన్మయత్వం తో దృశ్యం చూపిస్తున్నంత బాగా చెపుతుంది. పిల్లల భావవ్యక్తీకరణ సామర్ధ్యన్ని తెలుసుకుంటూ, అది తక్కువగా వున్నవారిలో ఉపాధ్యాయుడు పెంపొందించాలి.
ప్రభాకరం మాస్టారు మాతృభాష ప్రాముఖ్యాన్ని, ఇంట్లో తల్లి ప్రాముఖ్యాన్ని చెపుతూ, విద్యార్థులతో, “మీ అమ్మంటే మీకు ఇష్టమైతే ఇప్పటినుంచి మీ పనులన్నీ మీరే చేసుకోవాలి. మీ పరుపు మీరే పరుచుకోవాలి. నిద్ర లేవగానే మీరే చుట్టి పెట్టాలి. పొద్దున్నే చీపురు తీసుకుని ఇల్లంతా శుభ్రం చేయాలి “అని చెప్పారు. మగ పిల్లలకు ఇది మాత్రం మింగుడు పడలేదు. అప్పుడు ప్రభాకరం ’ మగపిల్లలు కూడా ఈ పని చేయవచ్చు.ఇంకా అన్నం వండటం, గిన్నెలు తోమటం, అన్నీ చేయాలి. అమ్మ పనిభారం తగ్గించి ఆమె మెప్పు పొందాలి, అని చెపుతుంటే పిల్లల మనసులలో కొత్త తలుపులు తెరుచుకున్నాయి.
ఇలా చేయటం వల్ల ఆడపిల్లలు గౌరవంగా చూస్తారు. మగపిల్లలు కూడా ఆడపిల్లలు, ఆడపని అనే బేధ భావం పోయి వారిని సమానంగా, గౌరవంగా చూడటం అలవాటు చేసుకుంటారు, అని ప్రభాకరం చెపుతాడు. ప్రభాకరం చెప్పిన మాటలు, చెప్పిన తీరు పిల్లల మనసులపై చెరగని ముద్ర వేసాయి. వాళ్ళు ఇంటి పనులు చేస్తామని వాగ్దానం చేసారు. వాళ్లలో మార్పు మొదలైంది.
ఇది ఎంత గొప్ప సందేశం!ఎంత గొప్ప కథ!తరగతి గదిలో, కుటుంబ నిర్వహణ లో అమ్మ ప్రాముఖ్యతను చెప్పారు. మాతృభాష గొప్పదనాన్ని చెప్పారు. ఇంటింటా పిల్లలకు చిన్నతనం నుంచి ఆడ, మగ తేడా లేకుండా అన్ని పనులు చేయటం నేర్పాలని చెప్పారు. ఇలా చేయటం వల్ల పురుషాధిక్యత అనేదే ఉండదు. బాల్యం లోనే పునాది పడితే పెద్దయ్యేకొద్ది స్త్రీ పురుషుల పనులు వేరువేరుగా ఉండవనే భావన బలపడి,ఇల్లు ఊడ్చటం దగ్గర నుంచి అన్నిపనులు ఇరువురు సమానంగా చేసుకోవటం అలవాటవుతుంది. స్త్రీ పురుష వివక్ష లేని ఆదర్శ సమాజ నిర్మాణానికి ఇది దోహదం చేస్తుంది.
ఒక మంచి ఉపాధ్యాయుడు, తరగతి గదిలో తన బోధన కళ ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎలా దోహదం చేయాలో ఈ కథ తెలుపుతుంది.
(డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గురజాడ రచనలపై పరిశోధన చేసారు. 'చెంగల్వ పూలు 'అనే కథా సంపుటాన్ని, 'గురజాడ అప్పారావు ', జాషువా జీవితం --సాహిత్యం ', అనే పుస్తకాలను ప్రచురించారు.ప్రస్తుతం సాహిత్య వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, కథలు, కవితలు వివిధ పత్రికలలో రాస్తున్నారు.)
Next Story