
‘పునర్విభజన’పై చెన్నై శంఖారావం
చెన్నై ప్రతిపక్ష పార్టీల సమావేశం ఎందుకు సక్సెసయిందో తెలకపల్లి రవి విశ్లేషణ
లోక్‌సభ నియోజవకర్గాల పునర్విభజన ‘డీలిమిటేషన్’ (Delimitation)సమస్యపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకెస్టాలిన్ నిర్వహించిన సమావేశం వందశాంతం జయప్రదమవడమే గాక కొన్ని పరిష్కారాలను కూడా సూచించగలిగింది.
నలుగురు ముఖ్యమంత్రులు, ఒక ఉపముఖ్యమంత్రితో సహా అయిదు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు ఒక చోట సమావేశం కావడం,మరెన్నొ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాలుపంచుకోవడం ఈ సమావేశానికి గొప్ప రాజకీయ ప్రాధాన్యత తెచ్చిపెట్టింది. చెప్పాలంటే బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ మరోసారి బిజెపి శిబిరంలోకి దూకకముందు పాటలీపుత్రలో జరిగిన ఇండియా వేదిక సన్నాహక స మావేశాల తర్వాత ఇంత కీలకమైన విస్త్రతమైన రాజకీయ సమ్మేళనం దేశం చూసింది లేదు.
నియోజకవర్గాల పునర్విభజన సమస్య కారణాలు దాని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ప్రధానంగానూ బెంగాల్ పంజాబ్ వంటి రాష్ట్రాలకు కూడా గణనీయంగానూ కలిగే నష్టాన్ని ఈ సమావేశం సూటిగా దేశ ప్రజల ముందుంచగలిగింది. 2026లో తలపెట్టిన ఈ పునర్విభజన ప్రక్రియను పాతికేళ్ల పాటు వాయిదా వేయాలన్న వాస్తవిక ప్రతిపాదన చేసింది. ఈ అంశాన్ని ఆయా రాష్ట్రాల శాసనసభల్లో కూడా చర్చించి తీర్మానాలు ఆమోదించేందుకు అలాగే పార్లమెంటులో లేవనెత్తడంపై సమన్వయం చేసుకోవడానికి ఎంపిల కమిటీ ఏర్పాటుచేస్తోంది. అన్ని పార్టీలూ ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి దీనిపై విజ్ఞప్తి పత్రం సమర్పించాలని తమ కోర్కెలు ముందుంచాలని కూడా ఈ సమావేశం నిర్ణయించింది. ఇవన్నీ చేయడానికి గాను సక్రమమైన పునర్విభజన ఉమ్మడి కార్యాచరణ సమితి(ఫెయిర్ డీ లిమిటేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ)ని ప్రకటించింది. బహుశా స్టాలిన్‌గానీ, ఆ సమావేశంలో పాల్గొన్న కీలక నేతలుగానీ ఇంతకన్నా ఏమీ ఆశించివుండరు.
పరస్పరం విభేదించే పోట్టాడుకునే పార్టీలు అక్కడ వున్నా ఈ మొత్తం చర్చల్లో నిర్ణయాల్లో ఒక్క అపశ్రుతి గానీ, భిన్న స్వరం గానీ లేకపోవడం అరుదైన విశేషం,ఇందుకు స్టాలిన్ సహా ఆ పార్టీ నాయకులు అలాగే బిజెపి విధానాలపై ఏకపక్ష దాడిపై పోరాటానికి ఏదైనా ఒక రూపం రావాలని కోరుకునే వారు ఎంతైనా సంతోషిస్తారు.
తదుపరి సమావేశం హైదరాబాద్ లో...
జెఎసి తదుపరి సమావేశం దక్షిణాదిన రెండో కీలక నగరమైన హైదరాబాద్‌లో జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించడం కూడా ఒక ముఖ్య సంకేతం.
స్టాలిన్ తన ప్రారంభోపన్యాసంలోనే దక్షిణాదికి జరగబోయే నష్టాన్ని సూటిగా వెల్లడిరచారు. హిందీ ఇంగ్లీషులో కాకుండా తమిళంలోనే ప్రసంగించడం ద్వారాతమ దృష్టికోణాన్ని తేటతెల్లం చేశారు. బిజెపిదక్షిణాదిపై కుట్ర చేస్తున్నదంటూ స్వయానా మోడీ తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో వందసీట్లు తగ్గు తాయని మాట్లాడిరని గుర్తు చేశారు. కేరళముఖ్యమంత్రి సీనియర్ సిపిఎం నాయకుడు పినరాయి విజయన్ నియోజవకర్గాల తగ్గుదలతో పాటు రాష్ట్రాల హక్కులపైన, నిధుల పైనా కేంద్రం పెత్తనం పెరిగిపోతున్న తీరును బిజెపితో విభేదించే ప్రభుత్వాలపై కక్షసాధింపును దృష్టికి తెచ్చారు. కేరళ రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు వివరాలు కూడా పంచుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయం గురించి చెప్పడంతో పాటు తప్పకుండా పునర్విభజన చేసేట్టయితే పెరిగే సంఖ్యలో వాటి వాటా 33శాతం అదనంగా చేర్చాలన్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ మాట్లాడుతూ దేశం కోసం జనాభా తగ్గించినందుకు దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గించడమంటే అది రాజ్యాంగ ద్రోహమని స్పష్టం చేశారు. దీనిపై కోర్టులలోనూ పార్లమెంటులోనూ కూడా పోరాడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే తాము దీనిపై శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు చెప్పారు. ఆమ్‌ఆద్మీపార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ తమ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాలేదు గనక సీట్లు పెంచడంపై ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. ఇప్పుడున్న 2.4శాతం సీట్ల నిష్పత్తి కొనసాగాలంటే తమకు 23 సీట్లకు పెంచాలని చెప్పారు.
సమావేశంలో ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విడియో సందేశం పంపించారు.సేమావేశానికి హాజరైన బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కూడా సుముఖత వ్యక్తం చేస్తూనే తదుపరి నిర్ణయాలు అధినేత కెసిఆర్‌కు నివేదించాక ఆయన నిర్ణయం ప్రకారం జరుగుతాయని చెప్పారు.జిడిపిలో రాష్ట్రం వాటాను బట్టి సీట్లవాటా నిర్ణయం కావాలని కొత్త ప్రతిపాదన తెచ్చారు.
33 శాతం సీట్లు తెలంగాణకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ అడిగితే కెటిఆర్ 36శాతం పెంచాలన్నారు. సుదీర్ఘ కాలం ఒరిస్సా ముఖ్యమంత్రిగా పనిచేసిన బిజెడి అధినేత నవీన్ పట్నాయక్ కూడా కేవలం జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేస్తే తప్పన్నారు. టిపిసిసి అద్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో సహా వివిద రాష్ట్రాల నుంచి 14 ó పార్టీ ల నేతలు పాల్గొన్నారు. డిఎంకె ఎంపి స్టాలిన్ సోదరి కనిమొళి నిర్ణయాలను మీడియాకు చెప్పారు..ఇక మొదటిసారి బిజెపి వ్యతిరేక శక్తుల నుంచి ఒక అహ్వానం అందుకున్న ఎపి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరుకాలేదు గానీ మద్దతునిస్తూమోడీకి లేఖ రాస్తానని తెలిపారు.
అదే సమయంలో బిజెపి నేతలు కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్,కిషన్‌రెడ్డి, బండిసంజయ్ వంటివారు ఈ సమావేశానికి రాజకీయ ఉద్దేశాలు ఆపాదిస్తూ తీవ్రంగా దాడి చేశారు, నిజానికి సభకు ముందే ఈ తంతు మొదలై దాంతోపాటు నడిచి తర్వాత కూడా కొనసాగింది. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ స్పందిస్తూ ఈ పునర్విభజన ఏ ప్రాతిపదికన జరిగేది తెలియకపోయినా అనవసరంగా గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. నిజానికి దక్షిణాది నాయకులు అంటున్నదే అది. గేదెను నీళ్లలో పెట్టి బేరమాడినట్టు ఏం చేసేది చెప్పకుండా పునర్విభజన అంశం లేవనెత్తుతున్నారనేదే వారి విమర్శ. సీట్లు తగ్గబోవని హొంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీని చెబుతున్నారే గానీ అందుకు ఆధారం ఏమిటన్నది చెప్పడం లేదు. పైగా మీకు తగ్గబోవంటున్నారే గాని వారికి భారీగా పెరగబోవని చెప్పడం లేదు. ఈ గజిబిజి మొత్తం సృష్టించింది కేంద్ర బిజెపి కాగా దానిపై స్పందించిన దక్షిణాది రాష్ట్రాలపై విచ్చిన్నముద్ర వేయడం ఏం న్యాయం?
పునర్విభజన వాయిదా కొత్తేమీ కాదు
పాతికేళ్ల వాయిదా వేయాలన్న ప్రతిపాదన అ ర్థవంతమైందే. ఎందుకంటే జనాభా తగ్గించిన రాష్ట్రాలకు నష్టం జరగకూడదనే 1976లో,2002లో 42,82,87 రాజ్యాంగ సవరణల ద్వారా పునర్విభజన ప్రక్రియను వాయిదా వేశారు. ఉత్తరాదిరాష్ట్రాలలో ఆ లక్ష్యం ఇప్పటికీ నేరవేరవకపోవడం వల్లనే సమస్య తలెత్తింది.వెంటనే చక్కదిద్దగల అవకాశాలూ లేవు. పైగా 2021 జనాభా లెక్కలు కూడా తీసింది లేదు. పార్లమెంటులో ఇప్పుడున్న పరిస్థితికి ఆమోదం, ఆచరణలో అనుభవం కూడా వున్నాయి గనక ఆ ప్రక్రియను వాయిదా వేసి యథాతథ స్తితిని కొనసాగించడం వాస్తవికంగా వుంటుంది.
ఉదాహరణకు ఎస్‌సి ఎస్‌టి రిజర్వేషన్లను పదేళ్ల తర్వాత సమీక్షించాలని రాజ్యాంగ నిర్మాతలు ప్రతిపాదించినా రాజకీయ పాలనా కారణాల వల్ల ఆ తరగతుల అభ్యున్నతి ఇంకా దూరంగానే వుంది. కనుకనే ప్రతి పదేళ్లకు దాన్ని పొడగించుకుంటూ వస్తున్నాం.అస్సాం కాశ్మీర్ వంటి చోట్ల కూడా సవాళ్లు పరిష్కారం కానప్పుడు గడువును కొనసాగించడమే జరిగింది.
నిజానికి ఈ సమయంలో శాసనసభల పరిధిలో పెంపుదలకు అవాంతరాలేమీ లేవు. కానీ కేంద్ర నేతలు లోక్‌సభ గురించే మాట్లాడుతున్నారంటే రాజకీయం మాత్రమే. ఎపి తెలంగాణ విభజన హామీలలోనూ ఈ సీట్ల పెంపు అంశం వుందని బిఆర్‌ఎస్ నేతలు గుర్తు చేశారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఈ దామాషా పెరుగుదలను వదిలేసి మహిళా రిజర్వేషన్ల వల్ల పెరుగుతాయనేది చెబుతున్నారు. అలాటి నిర్దిష్ట ప్రకటనేది ఇంతవరకూ వచ్చింది లేదు.
పునర్విభజన సమస్యే కాదంటున్న చంద్రబాబు
వాస్తవానికి ఈ సమావేశంలో ప్రాతినిధ్యం లేకుండా పేలవమై పోయింది ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితే. పునర్విభజనపై ఇంత తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంటే చంద్రబాబు మాత్రం ఇది వూహాజనిత సమస్య అని తీసిపారేశారు.ాఈ సమావేశం దేశ విచ్చిన్నానికి కారణమన్నట్టు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడ్డం బిజెపిని మించి పోయింది.హిందీ సమస్యపైనా ఆయన ఎదురు దాడి చేశారు. ఇక వైసీపీ అధినేత జగన్ సమావేశానికి రాకున్నా ఎవరైనా ఎంపిని పంపిస్తారనే వూహాగానాలు నిజం కాలేదు, సరిగ్గా నిన్ననే మోడీకి లేఖ రాయడం ద్వారా తాము ఈ సమస్యను గుర్తిస్తున్నామని వైసీపీ చెప్పినట్టయింది.దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండాచర్య తీసుకోవాలని ఆయన మోడీని కోరడంతో ఆగలేదు.ఈ సమయంలో మీ నాయకత్వం,మీ మార్గదర్శకత్వం చాలా అవసరమని మీరు జోక్యం చేసుకోకపోతే విచ్చిన్న కర వాదనలకు వూతమిచ్చినట్టవుతుందని ముక్తాయించారు.
జగన్ లేఖలో భాష భావం చెన్నైసమావేశం సందేశం ఒకటేనా అంటే కాదనే చెప్పాలి. ఎన్టీఆర్ వుండగా తెలుగుదేశం వామపక్షాలు జాతీయ ప్రాంతీయ పార్టీలతో పాటు ప్రత్యామ్నాయ చర్చల్లో సమావేశాల్లో కీలక పాత్ర వహించేది. నిజానికి 1983లో తెలుగుదేశం తొలి మహానాడు వేదికగానే దేశ చరిత్రలో అతిపెద్ద ప్రతిపక్ష శిఖరాగ్రసమావేశం లాటిది జరిగింది. తర్వాత కాలంలో ఆయన నేషనల్ ఫ్రంట్ అద్యక్షుడుగా వున్నారు. 1991లోక్‌సభ ఎన్నికల,1994శాసనసభ ఎన్నికలలో బిజెపితో విడగొట్టుకున్నారు. ఆ తరహాలో చంద్రబాబు కూడా యునైటెడ్ ప్రంట్ కన్వీనర్ పాత్ర నిర్వహించినా 1998 తర్వాత ఒక్కసారిగా బిజెపి వైపు దూకారు. ఇప్పటికి మూడు సార్లు ఆయన బిజెపి దోస్తుగానే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కనుక ఇప్పుడు పునర్విభజన అయినా హిందీ రుద్దడమైనా ఫెడరలిజం రక్షించుకోవడానికైనా టిడిపి పాలు పంచుకోవడం జరగనిపనే.
తెలుగునేతలు రాకపోయినా పోరాటం మొదలైంది
సతాతన దండధారి పవన్ కళ్యాణ్ దీనిపై దాడిచేయడంలో నిమగ్నమై వున్నారు. వైసీపీ నేత జగన్ కూడా మోడీకి పూర్తి విధేయుడుగానే వుండిపోదల్చారు గనక ఆయనకు లేఖలు రాయడం, పార్లమెంటులో ప్రస్తావనలు తప్ప మరేమీ చేయకపోవచ్చు. వారు కలసి రా కున్నా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీలూ ప్రభుత్వాలు మాత్రం పునర్విభజన హిందీ విధింపు సమాఖ్య విధానం రక్షణపై కలసి పోరాడేందుకు చెన్పై సమావేశం నాంది పలికింది.