
సెప్టెంబర్ 1 నుండి 'అశోక్ సార్’ ఆమరణ దీక్ష
నిరుద్యోగుల గొంతుక 'అశోక్ సార్' అరెస్ట్, విడుదల
తెలంగాణ నిరుద్యోగుల గొంతుక గా ఉండే ‘అశోక్ సార్’ ను ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేసిన పోలీసులు మధ్యానం విడుదల చేశారు. ఉద్యోగాల కల్పన లో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ చేసిన వీడియో తర్వాత ఈ చర్య చేపట్టినట్టు తెలుస్తోంది.
విడుదల తర్వాత ఫెడరల్ తో మాట్లాడిన పాలకూరి అశోక్ కుమార్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహిస్తోందని అధికారం లోకి వచ్చి 20 నెలలు కూడా కాకముందే ఇనుప కంచెల మధ్యన ఉస్మానియా ను దిగ్బంధం చేసి ఎందుకు ఆయన అక్కడ మాట్లాడాల్సి వచ్చిందో ఆలోచించుకోవాలి అని అన్నారు. తమ నిరసనకు కారణాలు చెబుతూ, “ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం డీఎస్సీ కి తాము చేర్చిన 5,089 కు, 6300 ఫార్మా ఉద్యోగాలు, గ్రూప్ 1 కు చేర్చిన మరో 60 ఉద్యోగాలకు తో 563 పోస్టులకు పరీక్ష, గ్రూప్ 2 లో 783, గ్రూప్ 3 లో 1368 కి పరీక్షలు నిర్వహించారు కానీ వీటిలో చాలా వాటికి నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం కేవలం రాజకీయ ప్రసంగం చేశారు తప్ప ఎటువంటి నిర్ధిష్ట హామీ ఇవ్వలేదు. 40,000 ఉద్యోగాలు అనేది ప్రకటన మాత్రమే ఏ ఉద్యోగాలు నింపుతారో చెప్పలేదు,” అని ఆయన ఆక్షేపించారు.
“నిన్నటి సీఎం ప్రసంగం ఆద్యంతం ఉస్మానియా ను పొగడటానికి వాడుకున్నారు. దాని గొప్పతనం గురించి కొత్తగా ఆయన చెప్పేది ఏముంది. వర్సిటీ లోని ఠాకూర్ ఆడిటోరియం కాంగ్రెస్ కార్యకర్తలతో నింపి సభ జరిపారు. మేము అన్ని ప్రతిపక్షాలను కలుపుకుని నిరసన కార్యక్రమాలు చేస్తాము. స్నానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత ఈ విషయాలను పట్టించుకోరు. అందుకే ఆగస్టు 30 తారీకు నుండి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిరసన తెలుపుతాము అందులో భాగంగా నేను సెప్టెంబర్ 1 నుండి ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటిస్తూ చేసిన వీడియో వలన నన్ను అదుపులోకి తీసుకుని మందలించి వదిలారు,” అని ఆయన చెప్పారు.
కాగా పిసిసి ప్రెసిడెంట్ గా ప్రస్తుత సీఎం రేవంత రెడ్డి రాష్ట్రం లో తెలంగాణ ఏర్పాటు తరువాత బిఆర్ఎస్ ప్రభుత్వం 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయి అని ప్రకటించింది, తదుపరి అది ఏర్పాటు చేసిన బిశ్వాల్ కమిటీ 1,91,738 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని తేల్చినట్టు తాము అధికారం లో కి వస్తే మొదటి సంవత్సరం లో నే నియామకాల చేస్తామని ఎన్నికల నేపద్యం లో వాగ్దానం చేశారు. అందుకు స్పందించిన ఎంతో మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికల ప్రచారం లో సహకరించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంలో కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు పోగొడితేనే మీకు వస్తాయని సీఎం పదే పదే చెప్పారు. దీన్నొక నినాదంగా మార్చి నిరుద్యోగులను యువకులను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించుకోగలిగారు.
నిన్న సీఎం ఉస్మానియా యూనివర్శిటీ లో చేసిన ప్రసంగం గురించి వ్యాఖ్యానిస్తూ, “రూ 1,000 కోట్లు యూనివర్సిటీ కి ఇస్తామని చెప్పిన సీఎం నిన్న కనీసం రూ 100 కోట్లు ఇవ్వచ్చు కదా. మేము ఎలా నమ్మాలి ఈ ప్రభుత్వాన్ని అనేది ఇక్కడ ప్రశ్న. ఒక యూనివర్సిటీ కి వచ్చి అదేదో గొప్ప విషయంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందో ఆయనే ఆలోచించుకోవాలి. ఎన్సీసీ గేటు దగ్గరి నుండి టాగోర్ ఆడిటోరియం వరకు ఇనుప కంచెలు వేసి సభ జరిపారు. అందుకే సెప్టెంబర్ 1 నుండి నేను ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను,” అని చెప్పారు.