ఇథనాల్  ఇండస్ట్రీ బాధితులకు దారి చూపిన దిలావర్ పూర్
x

ఇథనాల్ ఇండస్ట్రీ బాధితులకు దారి చూపిన దిలావర్ పూర్

ప్రజా వ్యతిరేకతతో ఇథనాల్ ప్లాంట్ పనులు ఆపేసిన తెలంగాణ సర్కార్

గత మూడు దశాబ్ధాలుగా భారత దేశంలో రాజకీయ పార్టీలు ఏవైనా, ఆయా పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుళ జాతి సంస్థలకు, బడా పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా, ప్రజలకు, పర్యావరణానికి వ్యతిరేకంగా నూతన ఆర్ధిక , పారిశ్రామిక విధానాలను అమలు చేస్తూ వస్తున్నప్పుడు, వాటికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు పోరాడుతున్నప్పుడు,ఆయా ప్రజా ఉద్యమాలలో ప్రజలు సాధిస్తున్న విజయాలు తక్కువగానే ఉంటున్నాయి.

పాక్షిక విజయాలతో, అర కొర డిమాండ్ల సాధనతో ముగుస్తున్న ఉద్యమాలు కొన్నయితే, ప్రభుత్వాలు సాగించిన తీవ్ర నిర్బంధ పద్ధతులతో అణచివేతకు గురైన ఉద్యమాలు మరెన్నో. ఆయా ఉద్యమాలకు నాయకత్వం వహించిన వ్యక్తుల ఒంటెత్తు పోకడలు, అవినీతి, అహంభావం కూడా కొన్ని ఉద్యమాల వైఫల్యానికి కారణాలుగా కనపడతాయి. కేవలం ఒక రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో నడిచిన ఉద్యమాలు, మిగిలిన రాజకీయ పార్టీల మద్ధతును పూర్తిగా పొందలేక , ప్రజలు ఓడిపోయిన ఘటనలు కూడా చరిత్రలో రికార్డయి ఉన్నాయి.

ఈ నేపధ్యంలో నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల ప్రజలు, స్థానికంగా తమ నివాస గ్రామాలు, పచ్చని పొలాల మధ్యలో ఏర్పాటవుతున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా సంవత్సర కాలం పాటు నిరంతరం ఉద్యమించి మంచి విజయాన్ని సాధించారు. ఈ ఉద్యమ ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 27 న ఫ్యాక్టరీ నిర్మాణ పనులను నిలిపి వేయించింది. ఫ్యాక్టరీని అక్కడి నుండీ తరలించడం కానీ, ఫ్యాక్టరీకి ఇచ్చిన అనుమతులు పూర్తిగా రద్ధు చేయడం కానీ చేస్తామని కూడా ప్రకటించింది.

దిలావర్ పూర్ మండల ప్రజలు సాధించిన ఈ విజయానికి జేజేలు. ముఖ్యంగా దిలావర్ పూర్, గుండంపల్లి గ్రామాల ప్రజలకు ప్రత్యేక అభినందనలు. ప్రజలు డిమాండ్ చేసినట్లుగా, ఫ్యాక్టరీకి ఇచ్చిన అనుమతులు రద్దయి, ఇది పూర్తి విజయంగా ఇంకా మారనప్పటికీ, ప్రస్తుతానికి ఆ ప్రాంత ప్రజలకు లభించిన గొప్ప విజయం ఇది. ప్రజలు సమస్య పట్ల సంపూర్ణ అవగాహనతో, చైతన్యవంతులై, ఏ స్థాయి పోరాటాలకయినా సిద్దమయి ఉన్న దశలో , ఈ పాక్షిక విజయం తప్పకుండా సంపూర్ణ విజయానికి కూడా దారి వేస్తుందనడంలో సందేహం ఉండనక్కర లేదు.

ఈ ఉద్యమం నుండీ, విజయం నుండీ నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అవి రాష్ట్రంలో ప్రజా పోరాటాలకు, ప్రజాస్వామిక ఉద్యమాలకు తప్పకుండా ఉపయోగ పడతాయి. నేను పరిశీలించిన కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఇంకా దీనిపై లోతయిన అధ్యయనం అవసరం.

తాము ఎదుర్కుంటున్న సమస్య తీవ్రతపై ప్రజలకు లోతైన అవగాహన అవసరం. ఒక సమస్య తమ గ్రామాల మధ్యలోకి వచ్చినప్పుడు ఎవరికీ దానిపై సరైన సమాచారం, అవగాహన ఉండక పోవచ్చు. దానిని ఒక సాధారణ అంశంగా చూసి, తేలికగా తీసుకోవచ్చు. పైగా స్థానిక రాజకీయ నాయకులు, లేదా ఆయా రాజకీయ పార్టీలలో ముఖ్యమైన వ్యక్తులు, దానిని ప్రజల మధ్యకు తోస్తున్నప్పుడు, ప్రజలు ఆయా నాయకుల మీద విశ్వాసంతో, ప్రమాదాన్ని సరిగా గుర్తించకపోవచ్చు. ఆయా నాయకులు కూడా తమకు అవగాహన ఉన్నా, లేకపోయినా, దాని గురించి స్థానిక గ్రామాల ప్రజలకు సమాచారం ఇవ్వక పోవచ్చు. ప్రజలను, స్థానిక కార్యకర్తలను, స్థానిక ప్రజా ప్రతినిధులను నయానో, భయానో మేనేజ్ చేయవచ్చు అనే భరోసా కూడా ఆయా నాయకులకు ఉండవచ్చు.

దిలావర్పూర్, గుండంపల్లి మధ్యలోకి ఇథనాల్ కంపనీ ఇలాగే వచ్చి పడింది. ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత నిర్మల్ బీజేపీ శాసన సభ్యుడు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఈ కంపెనీ యజమానులకు ఈ ఇథనాల్ కంపనీ కోసం భూములు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించాడు. మిగిలిన నాయకులు సహకరించారు.

రాజకీయ పార్టీల నాయకులు, పెట్టుబడి దారుల కోసం పని చేయవచ్చు కానీ, స్థానికంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి, ప్రజల పట్ల బాధ్యతగా ఆలోచించే ఉపాధ్యాయులు కూడా అన్ని చోట్లా ఉంటారు. సుదీర్ఘ కాలం ప్రజాస్వామిక ఉద్యమాలతో వారికి ఉన్న అనుబంధం కూడా ఇథనాల్ పరిశ్రమ గురించి విని, దాని వల్ల వచ్చే ప్రమాదాన్ని గురించి, స్థానిక ప్రజలతో, ముఖ్యంగా స్థానిక యువతతో ఈ అంశంపై చర్చకు పెట్టడమే ఈ గ్రామాల మధ్య చల్లిన తొలి విత్తనాలు. స్థానిక ఉపాధ్యాయుడు, నిర్మల్ జిల్లా TPJAC ఛైర్మన్ ఆరేపల్లి విజయ్ కుమార్ సార్ సామాజిక బాధ్యతతో, తనకున్న ప్రాధమిక పౌర హక్కుతో చేసిన కృషి ఆ కోవకు చెందినదే.

అప్పటికే నారాయణ పేట జిల్లా, మరికల్ మండలం చిత్తనూరు లో ఏర్పాటయి ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభించిన కంపనీ వెదజల్లుతున్న కాలుష్యం గురించి కూడా విని ఉన్నందున, ఆ కంపనీకి వ్యతిరేకంగా పోరాడుతున్న చిత్తనూరు ఇథనాల్ కంపనీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకత్వం హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశానికి ఈ గ్రామాల నుండీ యువకులు వెళ్ళి, ఇథనాల్ పరిశ్రమపై అవగాహన పెంచుకోవాలని చెప్పి ప్రోత్సహించి పంపడంతో మరో అడుగు ముందుకు పడింది.

ఇక్కడే ప్రజా శాస్త్రవేత్తల కృషి కీలకమవుతుంది. సైన్స్ చదవడం వేరు. ఆ సైన్స్, ప్రజల కోసం, పర్యావరణ హితంగా ఉపయోగ పడాలి తప్ప, పర్యావరణ విధ్వంసానికి, పెట్టుబడి దారుల దోపిడీకి ఉపయోగపడకూడదని రాజకీయ అవగాహన కలిగి ఉండడం వేరు. అలా నమ్మే ప్రజా పక్ష శాస్త్ర వేత్తలలో డాక్టర్ కలపాల బాబూరావు సార్ ముందు వరసలో ఉంటారు. ఆయన IICT లో సీనియర్ శాస్త్రవేత్తగా పని చేసి రిటైర్ అయ్యారు. మానవ హక్కుల వేదిక నాయకులుగా, సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ సంస్థ వ్యవస్థాపకులుగా ఉన్న డాక్టర్ బాబూరావు ఇవాళ తెలుగు రాష్ట్రాలలో కాలుష్య వ్యతిరేక, పర్యావరణ ఉద్యమాలకు పెద్ద దిక్కుగా ఉన్నారు.

ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఫార్మా, ఇథనాల్, సిమెంట్ పరిశ్రమలు, బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్లు సృష్టించే కాలుష్యాన్ని , విధ్వంసాన్ని అర్థం చేసుకుని ప్రజలు పోరాడడానికి ఆయన సాధారణ ప్రజలకు, ప్రజా సంఘాల కార్యకర్తలకు, రాజకీయ పార్టీలకు అందిస్తున్న సమాచారం, విజ్ఞానం, హక్కుల స్పృహ అత్యంత కీలకమైనవి. శ్రీకాకుళం జిల్లాలో సోంపేట ప్లాంట్ వ్యతిరేక ఉద్యమ కాలం నుండీ, చిత్తనూరు, ఇప్పుడు దిలావర్ పూర్ ఇథనాల్ వ్యతిరేక ఉద్యమాల వరకూ ఆయన అందించిన అవగాహన ప్రజలను చైత్యన్య పరచడానికి కీలకంగా పని చేసింది.

హైదరాబాద్ సమావేశంలో విన్న విషయాలు, చిత్తనూరు ప్రాంత నాయకత్వంతో ఏర్పడిన పరిచయాలు, ఆ యువకులను ఈ అంశంపై మరింత అధ్యయనానికి పురికొల్పాయి. దిలావర్ పూర్, గుండంపల్లి గ్రామాల నుండీ మరి కొంత తో మందిని పోగు చేసుకుని, చిత్తనూరు ప్రాంత గ్రామాలకు వెళ్ళి, అక్కడి ప్రజలతో మాట్లాడడం, ఆ ప్రాంత వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని స్వయంగా చూడడం వల్ల ప్రమాద తీవ్రత వారికి స్పష్టంగా అర్థమైంది. అలాగే కరీంనగర్ జిల్లా పర్లపల్లి ప్రాంత ఇథనాల్ ప్లాంట్ సృష్టిస్తున్న విధ్వంసాన్ని కూడా వాళ్ళు చూసి వచ్చారు.

తాము విన్న, చూసిన విషయాలను తమ గ్రామాల మధ్యలో చర్చకు పెట్టారు. స్థానిక విలేజ్ డెవెలప్ మెంట్ కమిటీ (VDC) తో కూడా చర్చించారు. గ్రామాల మధ్యలో నిర్మాణం ప్రారంభించిన ఇథనాల్ కంపనీకి వ్యతిరేకంగా పోరాడాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు.“దిలావర్ పూర్ ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ” ఏర్పాటు చేసుకున్నారు. “వద్ధురా నాయనా! ఇథనాల్ కంపనీ “ పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామస్తులు ఐక్యంగా పోరాడాలని కూడా నిర్ణయించుకున్నారు. ఎవరూ ఉద్యమం లోకి పార్టీల జండాలు తీసుకు రాకూడదని కూడా నిర్ణయించుకున్నారు. స్థానిక ప్రజా ప్రతి నిధులు కొందరు గ్రామస్తుల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. కొందరు మౌనంగా , ఉద్యమానికి దూరంగా ఉన్నారు. ఆయా పార్టీల స్థానిక నాయకులు కొందరు ఉద్యమానికి దూరంగా ఉన్నా, ఎక్కువమంది మాత్రం గ్రామస్తుల నిర్ణయాలతో కలసి ప్రయాణం చేశారు. ఇథనాల్ వ్యతిరేక ఉద్యమ నాయకత్వంతో ఏర్పడిన కొత్త VDC లు అన్ని విధాలా ఉద్యమానికి పూర్తి స్థాయి నాయకత్వం అందించాయి.

ఈ ఉద్యమంలో యువత పాత్ర గురించి ఇక్కడ ప్రత్యేక ప్రస్తావన అవసరం. సాధారణంగా గ్రామీణ యువత ఊరికి దూరంగా వెళ్ళి బతకడం, ఇతర ఉపాధి అవకాశాల గురించి ఆలోచించుకోవడం, స్థానిక సమస్యలపై దృష్టి సారించకపోవడం మనం గమనిస్తాం. కానీ ఇక్కడి యువత, తాము ఏ పని చేసుకుంటున్నా, ఎక్కడ నివసిస్తున్నా, స్థానికంగా ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న వాళ్ళుగా గ్రామస్తులకు అవగాహన కల్పించడంలో, పెద్దలను ఒప్పించడంలో, మహిళలను ప్రత్యేకంగా కూడ గట్టడంలో, కులాల వారీగా మాట్లాడి అందరినీ ఒప్పించి ఉద్యమంలోకి తీసుకు రావడంలో విజయం సాధించారు. రాజకీయ పార్టీల ప్రస్తావన లేకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. కేసులను ఎదుర్కున్నారు. సాహసం అవసరమైన చోట ధైర్యంగా నిలబడ్డారు. నిధులు అవసరమైన చోట, నిధులను వేగంగా స్థానిక ప్రజల నుండీ సమీకరించుకున్నారు. యువత ఎప్పుడూ విచక్షణ కోల్పోలేదు. సంయమనం కోల్పోలేదు. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా అసహనంతో దూకుడు ఘటనలకు పాల్పడలేదు. ఓపికగా ఉండి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా కార్యక్రమాలు రూపొందించుకుని, అమలు చేసి అందరినీ ఏకతాటి పై నడిపారు.

స్థానిక యువత కొందరు సోషల్ మీడియా ను విస్తృతంగా వినియోగించారు. నిత్యం ప్రజలను ఉత్తేజ పరిచే పాటలతో క్యాంపైన్ చేశారు. ఉగాది, దసరా, హోలీ, దీపావళి, బతుకమ్మ – ఇలా ప్రతి పండుగను ఉద్యమ బలోపేతానికి ఉపయోగించుకున్నారు. ఆయా రోజులలో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించుకుని అమలు చేశారు.

కులాల వారీగా అన్ని కులాలు, ఉద్యమానికి మద్ధతుగా మండల స్థాయిలో ప్రకటనలు చేశాయి. భూమి లేని వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వాళ్ళు సహా, అందరూ ఐక్యంగా ఉద్యమంలో పాల్గొన్నారు. స్థానిక వ్యాపారులు, ప్రైవేట్ స్కూల్స్ యజమానులు కూడా మొదటి నుండీ ఉద్యమంలో భాగంగా ఉన్నారు.

ప్రజల మధ్య చీలికలు తెస్తూ, బీజేపీ ప్రచారం చేసే విద్వేష రాజకీయాలకు చెంప పెట్టులాగా, స్థానిక గ్రామాలలో నివసించే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతస్తులు కూడా దీక్షలు సహా, అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, ఉద్యమం బలంగా మారడానికి కారణమయ్యారు.

ఉద్యమ తొలి దశలో ఆయా గ్రామాల మహిళలలో ఇథనాల్ పరిశ్రమపై అవగాహన పెంచడానికి ప్రత్యేక ప్రయత్నం జరగలేదు. స్థానికంగా మగవాళ్ళలో ఉండే పురుషాధిక్య భావజాలమే ఇందుకు కొంత కారణం. అందువల్ల మహిళలు ఆయా కార్యక్రమాలలో తొలి దశలో తక్కువ మందే పాల్గొన్నారు.

కానీ, మహిళలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, వారిని భాగస్వాములను చేయకపోతే, ఉద్యమం విజయం సాధించడం కష్టమని గ్రహించిన యువత , వారిపై ప్రత్యేక దృష్టి సారించి, సమావేశాలు నిర్వహించారు. ప్రమాద తీవ్రతను గ్రహించిన మహిళలు ఇంకా వెనుతిరిగి చూడలేదు. అక్టోబర్ 18 న జరిగిన బహిరంగ సభలో వేలాది మంది మహిళలు పాల్గొని ఉద్యమాన్ని మరో మలుపు తిప్పారు. ఈ సభ తరువాత , స్థానిక శాసన సభ్యుడు, బీజేపీ నాయకుడు మహేశ్వర రెడ్డి, ఈ ఇథనాల్ విధానాన్ని తమ పార్టీనే తీసుకు వచ్చింది కనుక, తాను ఉద్యమానికి మద్ధతు ఇవ్వలేనని స్పష్టం చేయడంతో, ప్రజలలో కొంత నిరాశ ఆవరించిన సమయంలో, గుండంపల్లి , దిలావర్ పూర్ ,మహిళలు ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళే బాధ్యత తమ మీద వేసుకున్నారు. స్వయంగా మహిళలు ఒక బృందంగా ఏర్పడి అన్ని గ్రామాలకు వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేశారు. ఇతర గ్రామాలలో కూడా ఉద్యమం విస్తరించడానికి కారణమయ్యారు. రోజూ కిలో మీటర్ల కొద్దీ గ్రామాల మధ్య నడిచి తిరిగారు. మహిళలను మరో ఉద్యమానికి సిద్దం చేశారు.

నవంబర్ 26, 27 తేదీలలో జరిగిన రోడ్డు దిగ్బంధనం కార్యక్రమం విజయవంతం కావడం కావడం వెనుక, యువత, విలేజ్ డెవలప్ కమిటీల పాత్రతో పాటు, ఈ మహిళల పాత్ర అత్యంత కీలకమైనది. ఈ రెండు రోజులలో దిలావర్ పూర్ మండల మహిళలు చూపించిన సాహసం రాష్ట్రమంతా చూసింది. ప్రభుత్వం ఇథనాల్ పరిశ్రమ పనులు ఆపేసేలా నిర్ణయం తీసుకోవడానికి మహిళల, గ్రామస్తుల ఈ పట్టుదలతో కూడిన ఉద్యమం తిరుగులేని ఉదాహరణ.

దిలావర్ పూర్ స్థానిక ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేయడానికి తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ( TPJAC ) కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు సమస్య పై ప్రజలలో అవగాహన పెంచడానికి కృషి చేసింది . ఇథనాల్ పరిశ్రమపై నిరంతరం సరైన సమాచారం అందించడానికి పూనుకుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న ప్రజా వాణి కార్యక్రమంలో ఇథనాల్ సమస్యను మొదటి సారి లేవనెత్తడానికి చిత్తనూరు, దిలావర్ పూర్ ఇథనాల్ వ్యతిరేక కమిటీలను సమీకరించింది. అలాగే హైదరాబాద్ లో కిసాన్ మిత్ర, ఇతర సామాజిక సంస్థలు కొన్ని వివిధ సమస్యలపై పబ్లిక్ హియరింగ్ నిర్వహించినప్పుడు కూడా ఈ రెండు ప్రాంతాల సమస్యను మళ్ళీ చర్చకు తెచ్చింది. ప్రజా వాణి నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ గారి చొరవతో , నిర్మల్ జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గ్రామస్తులు, అధికారులు, కంపనీ ప్రతినిధులతో రెండు సార్లు చర్చలు నిర్వహించడానికి సమన్వయం చేసింది.

రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇథనాల్ పరిశ్రమ –పర్యావరణ సమస్యలు అనే అంశం పై ఒక చర్చ జరగడానికి సమన్వయం చేసింది. పరిశ్రమల యజమానులు, అధికారులు, రైతుల ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో ఈ పరిశ్రమల పని తీరుపై క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తామని కమిషన్ ఛైర్మన్ గారు స్వయంగా ప్రకటించేలా చేయగలిగింది. అక్టోబర్ లో దిలావర్ పూర్ లో ప్రజా గళం పేరుతో బహిరంగ సభ నిర్వహించాలని స్థానిక ప్రజలు నిర్ణయించుకున్నప్పుడు, దానికి జిల్లా పోలీస్ అధికారులు అనుమతులు ఇవ్వకపోతే , రాష్ట్ర హైకోర్టులో కేసు దాఖలు చేసి అనుమతులు పొందడానికి TPJAC సహకారం అందించింది.

మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు దిలావర్ పూర్ ప్రాంత ప్రజలకు అండగా నిలబడింది. తెలంగాణ విద్యావంతుల వేదిక, ప్రగతిశీల మహిళా సంఘం, న్యూ డెమొక్రసీ రాష్ట్ర నాయకులు కూడా అక్టోబర్ 18 న స్థానిక బహిరంగ సభకు హాజరై ఇచ్చిన మద్ధతు ప్రజలకు మరింత బలాన్ని అందించాయి.

కాంగ్రెస్, బీజేపీ , BRS పార్టీలు ఇథనాల్ పరిశ్రమల యాజమాన్యాలకు అండగా ఉన్నప్పుడు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు, MLC ప్రొఫెసర్ కోదండ రామ్ ఈ గ్రామాల మధ్య , భారీ బహిరంగ సభకు హాజరై ప్రజలకు మద్ధతు ప్రకటించడంతో , స్థానిక ప్రజలకు పెద్ద నైతిక బలం దొరికింది. నవంబర్ 26, 27 లలో జరిగిన రోడ్డు దిగ్బంధనం సందర్భంగా, ప్రజలకూ, ప్రభుత్వానికీ మధ్య అనుసంధాన కర్తగా ఆయన ప్రభుత్వంతో చేసిన చర్చలు కూడా ఫ్యాక్టరీ పనులు నిలివేసేలా చేయడంలో తోడ్పడ్డాయి.

స్థానికంగా రైతులకు అండగా నిలబడుతున్నాడనే కారణంగా ఆరేపల్లి విజయ్ కుమార్ సార్ ను ప్రభుత్వం నవంబర్ 2 న విధుల నుండీ సస్పెండ్ చేసినప్పుడు, వెంటనే స్పందించి హైదరాబాద్ లో ప్రొఫెసర్ హరగోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించి, ప్రభుత్వం ఇలాంటి అప్రజాస్వామిక ఘటనలకు పాల్పడితే , తాము ప్రజల లోకి వెళతామని చేసిన హెచ్చరిక, విజయ్ కుమార్ సస్పెన్షన్ వెంటనే ఎత్తేయాలని, రాష్ట్రంలో మొత్తం ఇథనాల్ పాలసీని సమీక్షించాలని ప్రొఫెసర్ శాంతా సిన్హా , ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ పద్మజా షా, మానవ హక్కుల వేదిక నాయకులు జీవన్ కుమార్, బాలరాజు, సామాజిక కార్యకర్త బ్రధర్ వర్గీస్, సీనియర్ పాత్రికేయులు కె. రామచంద్ర మూర్తి, MV ఫౌండేషన్ నాయకులు ఆర్. వెంకట రెడ్డి. తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్య, భారత్ జోడో అభియాన్ రాష్ట్ర సమన్వయ కర్త విస్సా కిరణ్ కుమార్, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు బి. కొండల్ రెడ్డి లాంటి తెలంగాణ ప్రజాపక్ష మేధావులు చేసిన డిమాండ్, TPTF సంస్థ కొన్ని జిల్లాలలో చేసిన నిరసన ప్రదర్శనలు కూడా దిలావర్ పూర్ ప్రజలకు భరోసా ఇచ్చాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. ఒక స్థానిక ఉద్యమ విజయానికి, బయట నుండీ ఇలాంటి సంఘీభావం చాలా అవసరమని ఈ ఉద్యమం మరోసారి రుజువు చేసింది.

వికారాబాద్ జిల్లా లగచర్ల లో భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం కూడా దిలావర్ పూర్ ప్రజల ఉద్యమానికి తక్షణ స్పూర్తిని ఇచ్చింది. లగచర్ల లో పోలీసులు అత్యుత్సాహంతో సాగించిన నిర్బంధం కూడా, ఆ సందర్భంగా దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ట కూడా, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో రోడ్డెక్కిన ప్రజల పైకి పోలీసులు దూకుడుగా పోకుండా ఆగడానికి కారణమైంది. వివిధ రాజకీయ పార్టీల మధ్య వైషమ్యాలు, ప్రభుత్వాల రాజకీయ బలహీనతలు, ఏ మేరకు ప్రజా ఉద్యమాల బలోపేతానికి తోడ్పడినా , ఆ మేరకు ప్రజల హక్కులకు రక్షణే .

ప్రస్తుతం దిలావర్ పూర్ మండల ప్రజలు సాధించిన పాక్షిక విజయం, పూర్తి విజయానికి దారి తీయాలంటే, రాష్ట్ర వ్యాపితంగా ఇథనాల్ పరిశ్రమలకు వ్యతిరేకంగా, మొత్తంగా కేంద్రం తెచ్చిన ఇథనాల్ పాలసీకి వ్యతిరేకంగా విజయం సాధించాలంటే, ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు సాగించే ఉద్యమాల మధ్య సమన్వయం అవసరం. అలాగే రాష్ట్రాన్ని కాలుష్య కుంపట్లోకి నెట్టే , ఫార్మా సిటీకీ, ఫార్మా గ్రామాలకూ, సిమెంట్ పరిశ్రమలకూ,థర్మల్ విద్యుత్ ప్లాంట్లకూ వ్యతిరేకంగా కూడా స్థానికంగా ముందుకు వచ్చే ఉద్యమాల మధ్య సమన్వయం అవసరం. ఆ బాధ్యతను ఎక్కడికక్కడ సామాజిక కార్యకర్తలు తీసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పర్యావరణహితమైన పారిశ్రామిక విధానం మాత్రమే అమలు చేయాలని, డిమాండ్ చేస్తూనే, స్థానిక ప్రజా ఉద్యమాలకు సంఘీభావం కూడగట్టాలి.

Read More
Next Story