తెలంగాణ రాష్ట్రం వేగంగా ఎదుగుతోంది కానీ ప్రజల ఆరోగ్య స్థితి ఆ వేగానికి తగ్గట్టు లేదు. ఒక రాష్ట్రంలో రోడ్ల కంటే, ఫ్లైఓవర్ల కంటే పౌరుల రక్తం, శ్వాస, పోషకత ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉండాలి. ఆసుపత్రుల సంఖ్య పెరగడం ముఖ్యం కాదు, ఆ ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం తగ్గడమే అభివృద్ధి.
ప్రభుత్వం బడ్జెట్‌లో ఆరోగ్యానికి కేటాయింపు మనం గొప్పగా చెప్పుకునే జీడీపీ(Gross Domistic Product) లెక్కల కంటే ముఖ్యం.తెలంగాణలో ప్రతి గృహం కరెంటు వెలుగుతో పాటు ఆరోగ్యంతో నిండాలి. GDP పెరగడం ఆర్థిక సూచీ మాత్రమే — జీవన ప్రమాణాలకు ప్రతిబింబం కాదు. GDP సంఖ్యలు మనసును తృప్తిపరచవు,అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు — బలమైన మనుషులు కావాలి. ఆరోగ్యవంతమైన ప్రజలే అసలైన అభివృద్ధికి బలం.ప్రతి కుటుంబంలో ఆరోగ్య సంతోషం లేకుంటే రాష్ట్ర వృద్ధి కేవలం గణాంకం మాత్రమే. “వృద్ధి” అనే పదానికి “వెలుగు” రావాలంటే ప్రజల శరీరంలో బలం ఉండాలి.
నేడు తెలంగాణ పల్లెలు పట్టణాలలో ఇంటి పొయ్యి దగ్గర నుండి వచ్చే బువ్వ వాసనలో ఇప్పుడు ఒక విచిత్రమైన బాధ దాగి ఉంది. అన్నం ఉడుకుతోంది, పప్పు పులుసు మరిగుతోంది, ఇంట్లో “ఇంకో కడిగెన్నం పెట్టు రా!” అని చప్పుళ్లు వినిపిస్తున్నా — ఆ సువాసన వెనుక ఆరోగ్యం కాదు, అలసట ఉంది. కడుపు నిండే భోజనం ఉన్నా, బలం లేని శరీరాలు కనిపిస్తున్నాయి.మహిళల ముఖాల్లో రక్తహీనత, పిల్లల కన్నుల్లో వెలుగు తగ్గిపోవడం, వృద్ధుల నడకలో అలసట — ఇవి తెలంగాణ ఇంటి కొత్త దృశ్యాలు. మనం తింటున్నాం, కానీ శక్తిని ఇవ్వడం లేదు, అసలు ఏమీ జరుగుతోంది. అన్నం కడుపు నింపుతుంది కానీ శరీరానికి బలాన్ని ఇవ్వడం లేదు, ఇంత తిన్నను శరీరానికి తాకట్టు ఎందుకు ఇవ్వడం లేదు ? ఈ ప్రశ్న Telangana భవిష్యత్తు గుండెను తాకుతోంది.ఇది కేవలం ఆహార సమస్య కాదు , ఇది మన భోజన సంస్కృతి క్షీణత, మన శరీర బలహీనత, మన సమాజం మౌన రోదన, ఈ వ్యాసం ఆ మౌన వ్యథకు అర్థం చెప్పే ప్రయత్నం.
తెలంగాణ సంస్కృతి, మారుతున్న పంథా
గతంలో తెలంగాణ ఆహారం పొలాల పంటలతో మిళితమై ఉండేది. జొన్న, సజ్జ, రాగి వంటి మిల్లెట్లు ప్రధాన ఆహారం. పప్పు, కూరగాయలు, పచ్చళ్ళు, చెరకు రసం వంటి పదార్థాలతో సమతుల్యత ఉండేది.
కానీ పట్టణీకరణ, పచ్చదనం తగ్గిపోవడం, మార్కెట్ ఆధారిత ఆహారం పెరగడంతో ఆ సాంప్రదాయం క్రమంగా నశించింది. ఇప్పుడు రాగి అంబళం, జొన్న రొట్టె స్థానంలో బిర్యానీ, తెల్లబియ్యం, ఫ్రైడ్ ఫుడ్లు వచ్చాయి. ఫలితం: “అన్నం ” ఎక్కువ, కానీ “ శక్తీ ” ఇచ్చే పోషక విలువ తక్కువ.
ఆహార భద్రత ఏదీ ?
భారతదేశం “ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్” ద్వారా తిండి అందిస్తోంది. తెలంగాణలో దాదాపు 85% కుటుంబాలు రేషన్ ద్వారా బియ్యం, గోధుమలు పొందుతున్నాయి. కానీ ఇది కేవలం “ఫుడ్ సెక్యూరిటీ,” పోషక భద్రత కాదు. రేషన్ బియ్యంలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్‌లు తక్కువగా ఉంటాయి. కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు లేకపోవడంతో శరీరంలోని అవసరాలు నెరవేరవు. దీని ఫలితంగా రక్తహీనతలు,మైక్రోన్యూట్రియంట్ లోపం,ఎముక బలహీనతలు, పిల్లల్లో ఎదుగుదల మందగించడం లాంటివన్నీ సాధారణమైపోతున్నాయి.
ప్రభుత్వ పథకాల్లో లోపాలు...
అన్నపూర్ణ భోజన పథకం, మిడ్డే మీల్, అంగన్వాడీ సప్లిమెంటరీ న్యూట్రిషన్ — ఇవన్నీ ఆకలి తీర్చడంలో సహకరిస్తున్నా, పోషక విలువపై దృష్టి తక్కువ.మిడ్డే మీల్‌లో గుడ్డు ఒక్కటే — అది కూడా ప్రతిరోజూ అందడం లేదు. ఐదు రూపాయల భోజనంలో కేలరీలు ఉన్నా, ప్రోటీన్ పరిమితం. Telangana Health Survey (2024) ప్రకారం, 5 ఏళ్లలోపు పిల్లల్లో 35% బరువు తక్కువ, 30% రక్తహీనతలు, 25% స్టంటింగ్ (height delay), NIN (Hyderabad) అధ్యయనం ప్రకారం గ్రామీణ తెలంగాణలో ప్రోటీన్ ఇన్టేక్ 30% తక్కువ. మహిళలు, కూలీలు తరచుగా అలసట, తలనొప్పి, కండరాల బలహీనతతో బాధపడుతున్నారు.
ప్యాకెట్ తరం - పంటల నుంచి ప్లాస్టిక్ దాకా...
పాత తరం పంటలు పండించి తినేది. ఇప్పటి తరం ప్యాకెట్ ఫుడ్, కార్బొనేటెడ్ డ్రింక్స్ తింటోంది. తాతల చేతిలో జొన్న రొట్టె — మనవళ్ల చేతిలో ఇన్‌స్టంట్ నూడుల్స్ ! NIN (2023), తెలంగాణ పిల్లల్లో విటమిన్ లోపం 60% పెరిగింది.మహిళల్లో రెండు విరుద్ధ ధోరణులు —పల్లె మహిళల్లో పోషక లోపం, పట్టణ మహిళల్లో ఓబేసిటీలు, రెండింటికీ మూలం ఒకటే — సమతుల్య ఆహారం లోపం. మహిళల్లో ఐరన్, కాల్షియం లోపం వల్ల రక్తహీనత, మసిల్ వీక్‌నెస్, తలనొప్పి, డిప్రెషన్ పెరుగుతున్నాయి.
వ్యాధుల దిశగా ...
ఒకవైపు పేదలకు రక్తహీనత, మరోవైపు మధ్యతరగతికి డయాబెటిస్ — ఇది “డబుల్ బర్డన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్. పేదలు తక్కువ ఖర్చుతో బియ్యం, పచ్చడి తింటారు — కడుపు నిండుతుంది కానీ పోషణ ఉండదు.తాజా నివేదికల ప్రకారం —ప్రతి 3 మహిళల్లో ఒకరికి రక్తహీనతలు, ప్రతి 5 పిల్లల్లో ఒకరికి ఎదుగుదల ఆలస్యం, ప్రతి 10 పెద్దల్లో నలుగురికి ఓబేసిటీ లేదా డయాబెటిస్ లు, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ వంటి పట్టణాల్లో యువతలో “స్పీడ్ లైఫ్”తో ఫాస్ట్ ఫుడ్ డిపెండెన్స్ పెరిగింది. ప్రోటీన్ వనరులు ఖరీదుగా మారడంతో అవి అందుబాటులో లేవు. ఇలా “కాలరీలు రిచ్ కానీ న్యూట్రియంట్ పూర్” జనాభా తయారవుతోంది. విటమిన్ D లోపం — ఎముక బలహీనతలు, విటమిన్ B12 లోపం — న్యూరోలాజికల్ సమస్యలు, ఐరన్ లోపం — రక్తహీనత, ఐయోడిన్ లోపం —థైరాయిడ్ వ్యాధులు , ఇవన్నీ “హిడెన్ హంగర్” లక్షణాలు.విటమిన్ D, B12, ఐరన్ లోపం నేరుగా న్యూరోకెమికల్ అసమతుల్యతకు కారణమవుతుంది — దీని వల్ల అలసట, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ పెరుగుతాయి.
పోషక తెలంగాణ...
తెలంగాణ అభివృద్ధిని GDPతో కాదు — ప్రజల ఆరోగ్యంతో కొలవాలి. ప్రభుత్వం,పప్పు–గుడ్డు–పాలు రొటేషన్ , రాగి, జొన్న, సజ్జ వాడకం పెంచడం, పచ్చి కూరగాయలు, పండ్లు ప్రతిరోజూ తీసుకోవడం,తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్ ఆహారం, పాఠశాలల్లో “న్యూట్రిషన్ ఎడ్యుకేషన్” తప్పనిసరి చేయడం, మీడియా, విద్యాసంస్థలు కలసి “పోషక తెలంగాణ” అనే లక్ష్యంతో పని చేయాలి. ప్రతి గ్రామంలో “పోషక మేళా” నిర్వహించాలి. పాఠశాలల్లో పిల్లలకు పోషక విద్య తప్పనిసరి చేయాలి. మిల్లెట్లు, పప్పులు, పండ్లు, పాలు — తిరిగి మన భోజనంలో స్థానం సంపాదించాలి. బువ్వతో జీవనం సాగుతుంది —కానీ సమతుల్య బువ్వతోనే అసలు జీవనం నిలుస్తుంది.ఆరోగ్యం, బలం, మానసిక సమతుల్యత — ఇవన్నీ మన తినే ఆహారంలోనే దాగి ఉన్నాయి.తెలంగాణ భూమి బలం తిరిగి ప్రజల రక్తంలోకి రావాలి. కడుపు నిండటం కాదు,శరీరానికి బలం రావడం — అదే నిజమైన అభివృద్ధి. ట్రిల్లియన్ల GDP కన్నా, ఆరోగ్యమైన Telangana విలువైనది. ప్రజలు బలంగా, సంతోషంగా ఉంటే — ఆ రాష్ట్రం స్వయంగా అభివృద్ధి చెందుతుంది.