
తెలంగాణ రైతుల మీద ‘విత్తనాల’ దాడి
ములుగు జిల్లాలో మొక్కజొన్న రైతులకు న్యాయం చేసిన రైతు కమిషన్
పంటలను సాగు చేసే రైతులు అనేక విధాలుగా నష్టపోతుంటారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వాల విధానా;లు రైతులకు ప్రతి సంవత్సరం నష్టం కలిగిస్తున్నాయి. రైతులకు నష్టం చేస్తున్న వాళ్ళలో మరొక ముఖ్యమైన వర్గం – విత్తన కంపనీల యాజమాన్యాలు –కూడా చేరింది. ఈ విత్తన కంపెనీల వల్ల ప్రతి సంవత్సరం ఈ కంపనీల కోసం విత్తనాలను ఉత్పత్తి చేసే రైతులు, ఈ కంపనీల విత్తనాలను వినియోగించే రైతులు కూడా నష్టపోతున్నారు. ప్రతి సంవత్సరం విత్తనాల కారణంగా రైతులు లక్షలాది ఎకరాలలో పంటలను కోల్పోతున్నారు. ఇలాంటి ఒక ఘటనే ఈ సంవత్సరం ములుగు జిల్లాలో బయట పడింది.
ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తన పంట వైఫల్యం పై మీడియా కథనాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ కథనాలతో రైతులు తమ పొలాల్లో మొక్క జొన్న కంకులకు గింజలు పూర్తి స్థాయిలో నిండక పోవడం వల్ల కలిగిన నష్టాన్ని వివరించారు. ఈ చర్చలో ఈ పంటలో వాడుతున్న పురుగు విషాల కారణంగా తలెత్తుతున్నఆరోగ్య సమస్యలు వివరించారు. ఈ విత్తనోత్పత్తి కారణంగా తమపై పడుతున్న రుణభారం, ఫలితంగా ఈ ప్రాంతంలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు వంటి ఆందోళనకర విషయాలు కూడా ఈ కథనంలో హైలైట్ అయ్యాయి. ఈ మొక్క జొన్న విత్తనోత్పత్తిలో రైతులు జన్యుపరంగా సవరించిన (GM) రకాల ను కంపెనీలు సాగు చేస్తున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.
ఎం. కోదండ రెడ్డి అధ్యక్షతన ఉన్న తెలంగాణ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ కమిషన్ ములుగు జిల్లాలో మొక్క జొన్న రైతుల పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ మరియు సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ ఎక్స్‌పర్ట్ కమిటీ (FISEEC) ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ అధ్యక్షుడుఎస్. అన్వేష్ రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జి.వి. రామాంజనేయులు, విత్తన సంబంధిత సమస్యలపై రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న వ్యవసాయ ఆర్థికవేత్త డా. దొంతి నరసింహా రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
2025 మార్చి 13 న ఈ బృందం ములుగు జిల్లాలోని వెంకటాపురం మరియు వాజేడు మండలాల్లోని ప్రభావిత గ్రామాలను సందర్శించింది. విత్తన వైఫల్యం, రైతుల జీవనోపాధి, ఆరోగ్యంపై దాని విస్తృత, ప్రత్యక్ష ప్రభావాన్ని నమోదు చేసింది.
ఈ సందర్భంగా ప్రభావిత కుటుంబాలను కలసి కమిటీ వివరాలను సేకరించింది. రైతులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
చిరుతపల్లి గ్రామానికి చెందిన కచ్చలపు సత్యం (65) గత ఆరు సీజన్లుగా వివిధ కంపెనీల కోసం హైబ్రిడ్ విత్తనాలను సాగు చేస్తున్న మొక్కజొన్న ఈ విత్తన రైతుకు ఎకరానికి 4 టన్నులు దిగుబడి వస్తుందని కంపనీ చెప్పిన దానికి భిన్నంగా 1.0 – 1.5 టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది. అతని భార్య కచ్చలపు రాజమ్మ (60), గత సంవత్సరం పొలంలో పని చేస్తుండగా తీవ్రమైన పురుగు విషం ప్రభావానికి గురై, చేతులు, కాళ్లు చచ్చుబడి పోయి మంచం పట్టింది. ఈ సంవత్సరం కూడా దిగుబడి ఒక టన్ను కంటే తక్కువకు పడిపోయి, ఈ కుటుంబాన్ని మరింత రుణభారం లోకి నెట్టింది. ఆర్థిక భారాన్నితట్టు కోలేక వారి కుమారుడు, కచ్చలపు చంద్రరావు (35) కొద్ది రోజుల క్రితం ఆత్మ హత్య చేసుకున్నాడు.
సుదీపాక గ్రామానికి చెందిన అల్లెం కృష్ణ రావు (50) సింజెంటా కోసం ఐదు ఎకరాలు మొక్క జొన్న విత్తనాలు సాగు చేసి, 5,274 కిలోల దిగుబడిని పొందాడు. మొక్క జొన్న కిలోకు ₹36 ధరకు అమ్మి, మొత్తం 1,89,864 రూపాయలు సంపాదించాడు. అయితే, విత్తన కంపనీ నుండి తీసుకున్న రుణం పై సంవత్సరానికి 60 శాతం వడ్డీ రేటు (నెలకు 100 కు 5 రూపాయలు ) చెల్లించడం వల్ల అ మొత్తం 1,25,460 రూపాయలు అయింది. విత్తనోత్పత్తి ఖర్చులు 1,23,860 రూపాయలు, రవాణా ఛార్జీలు కలిపి 1,845 మొత్తం ఖర్చు 2,51,165 రూపాయలకు చేరింది.
కూలీ ఖర్చు, భూమి సిద్ధం చేయడానికి అయ్యే అదనపు ఖర్చులు మినహా, అన్ని విత్తన సంస్థల ప్రతినిధులు ఇలాంటి వడ్డీ రేట్లను రైతుల నుండీ వసూలు చేస్తారు.
ఇదే గ్రామానికి చెందిన నాగుల ప్రవీణ్ అనే రైతు అయిదెకరాలు, పాయం రాంబాబు అనే రైతు నాలుగు ఎకరాలు హైటెక్ సీడ్ కంపనీ కోసం సాగు చేశారు. వారి పంటలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి.
నాగుల సమ్మయ్య (50) అనే వ్యక్తి పురుగు విషాలు, కలుపు మందులు చల్లే కార్మికులను పర్యవేక్షించే కార్మిక మేస్త్రీగా పని చేస్తాడు. పురుగు విషాలతో దీర్ఘ కాలం పాటు వ్యవహరించడం వల్ల విష ప్రభావానికి గురయ్యాడు. సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ (CVA )తో మంచం పట్టాడు. అతని వైద్య ఖర్చుల కోసం కుటుంబం తమ ఏకైక ఆస్తి అయిన 40 సెంట్ల భూమిని అమ్ముకున్నది.
మొత్తంగా కమిటీ అధ్యయనంలో హైబ్రిడ్ మొక్కజొన్న విత్తన ఉత్పత్తి చేస్తున్న 3,500 ఎకరాలలో 938.46 ఎకరాలలో పంట వైఫల్యం చెందినట్లు బయట పడింది. అధిక పురుగు విషాల వినియోగంత రైతులు, వ్యవసాయ కూలీలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఈ విష ప్రభావం తో మహిళలకు గర్భస్రావాలు అవుతున్నాయి. ఒక ఛత్తీస్‌గఢ్ కార్మికుదు మరణించాడు.
రైతులు , విత్తన ఆర్గనైజర్లు / కంపెనీల మధ్య ఎలాంటి రాతపూర్వక ఒప్పందాలు కమిటీ కి కనపడలేదు. దీనిని స్థానికంగా “ ఒప్పంద వ్యవసాయం” అని పిలుస్తారు.
విత్తన ఆర్గనైజర్లు 60 శాతం వార్షిక వడ్డీ రేటుతో రైతులకు రుణంపై వ్యవసాయ ఉపకరణాలను అందించి రైతులను రుణ చక్రంలో బంధిస్తారు.
ఈ ప్రాంతంలో గోదావర్తి నరసింహ మూర్తి అనే ఆర్గనైజర్ సింజెంటా కోసం పని చేస్తాడు. ఈ వ్యక్తి పరిధిలో 273.90 ఎకరాలలో పంట విఫలమైంది. సుంకర ప్రసాద్ అనే ఆర్గనైజర్ కూడా సింజెంటా కోసం పని చస్తాడు. ఈయన పరిధిలో 273.84 ఎకరాలలో పంట విఫలమైంది. మన్యం సురేష్ బాబు అనే ఆర్గనైజర్ హైటెక్ సీడ్స్ కంపనీ కోసం పని చేస్తాడు. ఈయన పరిధిలో 340.89 ఎకరాలలో పనర్త విఫలమైంది. నాగరాజు గన్నపనేని అనే ఆర్గనైజర్ బేయర్ క్రాప్ సైన్సెస్ కోసం పని చస్తాడు. ఈ వ్యక్తి పరిధిలో 49.78 ఎకరాలలో పంట విఫలమైంది.
విత్తనోత్పత్తి పర్యవేక్షణ తీవ్రమైన లోపం కనిపిస్తున్నది. విత్తనోత్పత్తిపై సరైన నియంత్రణ లేదు, రైతులతో కంపనీలకు రాతపూర్వక ఒప్పందాలు లేకపోవడం, ఎక్కడా నమోదు కాని కాంట్రాక్ట్ వ్యవసాయం తదితర విషయాలన్నీ తెలంగాణ మార్కెట్స్ యాక్ట్, 1966ని ఉల్లంఘిస్తున్నాయి.
విత్తన కంపెనీలు విత్తన చట్టాలను కూడా ఉల్లంఘిస్తున్నాయి. తమ కోసం విత్తనాలను ఉత్పత్తి చేసే రైతుల వివరాలను వ్యవసాయ/ మార్కెటింగ్ శాఖ ధృవీకరణ కోసం సమర్పించడంలో కంపనీలు విఫలమవుతున్నాయి, విత్తనాలకు సరైన లేబులింగ్ ఉండడం లేదు. ఇవన్నీ సీడ్ యాక్ట్, 1966, సీడ్ కంట్రోల్ ఆర్డర్ 1983 ని ఉల్లంఘిస్తున్నాయి.
రైతులకు సరఫరా చేసే ఉపకరణాలపై అదుపు లేదు. ఈ ఉపకరణాలకు ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా సరఫరా చేస్తున్నారు. తరచుగా గరిష్ట రిటైల్ ధర (MRP) కంటే ఎక్కువ ధరలకు రైతులకు అమ్ముతున్నారు. ఈ వ్యవహారాలపై వ్యవసాయ శాఖ నుండి ఎటువంటి పర్యవేక్షణ లేదు. విత్తన ఆర్గనైజర్లు 60 % వార్షిక వడ్డీని రైతుల నుండీ వసూలు చేస్తున్నారు. ఇది తెలంగాణ మనీ లెండర్స్ యాక్ట్ కింద నిషిద్దం. ఈ చట్టాన్ని వెళ్ళు అసలు పట్టినంచుకోవడం లేదు. నియంత్రణ లేకుండా ఉంది.
మెటోలాక్లోర్, అట్రాజిన్, టోప్రమెజోన్ వంటి ప్రమాదకర పురుగు విషాల అధిక వినియోగం ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పర్యావరణం కూడా క్షీణిస్తున్నది. పరాగ సంపర్క తేనె తీగల క్షీణతకు కూడా దారి తీసింది.
మొక్క జొన్న విత్తనోత్పత్తిలో ట్రాన్స్‌జెనిక్ విత్తనాల అనుమానాలను రైతులు వ్యక్తం చేశారు. ఈ కోణంలో కమిటీ సేకరించిన కొన్నిశాంపిల్స్ ను పరీక్షకు పంపారు.
కమిటీ కొన్ని ముఖ్యమైన సిఫారసులు చేసింది. వాటిలో కొన్ని..
1. విత్తనోత్పత్తి పై చట్టబద్ధ తనిఖీలు ఎప్పటికప్పుడు జరగాలి. వీటిలో విత్తన వివరాలు, నోటిఫికేషన్ జారీ చేయడం, ఆమోదిత రకాలు, తదితర విషయాలను జాతీయ రిజిస్టర్‌లో నమోదు చేయాలి.
2. పంట నష్టాలు, పురుగు విషాల ప్రభావం, పశువుల ఆరోగ్యానికి నష్టానికి ఆర్థిక పరిహారం, వైద్య పరిహారం అందించాలి.
3. విత్తన ఆర్గనైజర్లకు రైతులు చెల్లించాల్సిన రుణాలను మాఫీ చేయాలి.
4. వ్యవసాయ శాఖ అధికారుల సామర్ధ్యాలను పెంచాలి. విత్తనోత్పత్తి నియంత్రణలో వారి పాత్ర, బాధ్యత, జవాబుదారీతనంపై వ్యవసాయ శాఖ అధికారులకు శిక్షణ ఇవ్వాలి.
5. విత్తనోత్పత్తి లో ఉన్న రైతులను తప్పనిసరి గా నమోదు చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విత్తనోత్పత్తి ఒప్పందాలు, ఇతర కాంట్రాక్ట్ వ్యవసాయ కార్యకలాపాలు వ్యవసాయ మార్కెట్ కమిటీల వద్ద నమోదు చేయించాలి.
6. విత్తనోత్పత్తిలో విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలను నియంత్రించాలి. కల్తీ, అక్రమ వ్యవసాయ రసాయనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. వాటికి సరైన బిల్లింగ్ ఉండేలా చూడాలి. అమలు.
7. స్థానిక ఆరోగ్య కేంద్రాలలో పాయిజన్ రిలీఫ్ సెంటర్ల ను ఏర్పాటు చేయాలి. పురుగు విషాల ప్రభావానికి గురైన వారికి వైద్యం చేయడానికి సరైన యాంటీ డోట్‌లతో కూడిన కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
8. రసాయన ఆధారిత విత్తనోత్పత్తి కారణంగా పర్యావరణ, ఆర్థిక ప్రభావంపై నిరంతరం అధ్యయనాలు సాగించాలి.
9. రైతులకు అందించే సంక్షేమ పథకాలు, సబ్సిడీల పై నిరంతరం సమీక్ష నిర్వహించాలి.
10. గిరిజన, ఆదివాసీ రైతులకు పారదర్శక యంత్రాంగం ద్వారా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణాలను అందించాలి.
11. వ్యవసాయంలో, విత్తనోత్పత్తిలో ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని తగ్గించడానికి సేంద్రీయ, సహజ వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించాలి.
12. కమిటీ నివేదిక ఫలితంగా రాష్ట్ర వ్యవసాయ కమిషన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా నష్ట పోయిన రైతుల వివరాలను సేకరించి, కంపనీలతో నష్ట పరిహారం ఇప్పించారు.
మొత్తం 959 మంది రైతులు 2178.68 ఎకరాలలో పంటఅలౌ నష్ట పోయారు. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కారణంగా సింజెంటా కంపనీ రైతులకు ఒక్కో ఎకరానికి 70,000 రూపాయలు, హై టెక్ కంపనీ ఎకరానికి 50,000 రూపాయలు, నష్ట పరిహారం చెల్లించాయి. బేయర్, నూజివీడు కంపనీలు తాము హామీ ఇచ్చిన పంట దిగుబడికి అనుగుణంగా నష్ట పరిహారం చెల్లించడానికి ముందుకు వచ్చాయి.