గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం !
x

గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం !

8 గంటల పనిదినం ఎరుగని శ్రమజీవిలు.. నిత్యం టెన్షన్‌లే తప్ప మనశ్వాంతికి నోచుకోని బతుకులు.

పాత తరం పరిశ్రమల యాజమానుల గురించీ, ఆ పరిశ్రమలలో పని చేసే కార్మికుల గురించీ మనం వింటూ ఉంటాం. 8 గంటల పని దినం, వారాంతపు సెలవు, జాతీయ, పండుగ సెలవులు, అనారోగ్య సెలవులు, 20 రోజులకు ఒక వేతనంతో కూడిన సెలవు, బోనస్, ప్రావిడెంట్ ఫండ్, ESI, గ్రాట్యుటీ లాంటి కార్మిక, ఉద్యోగ హక్కుల భాష కూడా చాలా మందికి తెలుసు. నిర్ధిష్ట కాలపరిమితిలో జరిగే వేతన ఒప్పందాల గురించి, ధరల పెరుగుదలకు అనుగుణంగా కార్మికులకు, ఉద్యోగులకు చెల్లించే DA,VDA ల గురించి కూడా అందరికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కార్మిక సంఘాల ఏర్పాటు, కార్మిక సంఘాల గుర్తింపు కోసం కార్మిక శాఖ ఎన్నికలను నిర్వహించడం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సమ్మెలు, కార్మిక సంఘాలతో ఆయా సంస్థల యాజమాన్యాలు చేసుకునే వేతన ఒప్పందాలు గురించి కూడా మనం వింటాం.

1991 లో నూతన ఆర్ధిక, పారిశ్రామిక విధానాలు మొదలయ్యాక, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నినాదాలు ప్రజల ముందుకు వచ్చాక, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అవే విధానాలను, నినాదాలను ముందుకు తీసుకు వెళుతున్న కాలంలో మొత్తంగా కార్మికుల గురించీ, కార్మిక సంఘాల గురించీ, కార్మిక చట్టాల గురించీ, కార్మిక హక్కుల గురించీ, మేడే గురించీ, కార్మిక ఉద్యమాల గురించీ సమాజంలో వినడమూ, వాటి గురించి చర్చించడమూ , మీడియాలో వాటిపై కథనాలు రావడమూ పూర్తిగా కనుమరుగై పోయింది.

కార్మిక హక్కుల అమలు విషయంలో ఇతర యాజమాన్యాలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా ప్రైవేట్ పరం కావడం లేదా మూత పడడం ఎప్పుడో జరిగి పోయింది. రాష్ట్రంలో ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి లో పర్మినెంటు కార్మికుల కంటే , కాంట్రాక్టు కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ప్రభుత్వ రంగ రవాణా సంస్థ ఆర్టీసీ లో అసలు కార్మిక సంఘాలే ఉనికి లో లేకుండా పోయాయి.

ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, కార్మిక వర్గ స్పూర్తిని కోల్పోయి, వేతన శర్మ ల సంఘాలుగా మారిపోయాయి. మిగిలిన కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా కాంట్రాక్టు కార్మికులు పెరగిపోయి, అక్కడ ఉన్న పర్మినెంటు కార్మిక, ఉద్యోగ సంఘాలు కూడా, ఈ కాంట్రాక్టు కార్మికుల గురించి నోరు విప్పి మాట్లాడని పరిస్థితులు ఉన్నాయి.

వివిధ దేశాల నుండీ తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్న బహుళ జాతి సంస్థలలో, లేదా వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రైవేట్ పెట్టుబబడిదారులు ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ లలో, సర్వీస్ రంగ సంస్థలలో అసలు చట్ట బద్ధంగా కార్మిక, ఉద్యోగ సంఘాల ఏర్పాటుకు అవకాశమే లేకుండా పోయింది.

హైదరాబాద్ చుట్టూ విస్తరించిన సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో కూడా యూనియన్ల ఉనికి లేదు. ఈ సంస్థలలో పని చేస్తున్న వాళ్ళు, చట్ట విరుద్ధంగా రోజుకు 12 గంటలు కష్ట పడుతూ, శ్రమ దోపిడీకి , లే ఆఫ్ లకు, ఉద్యోగాల కోతకు, ఉద్యోగాల తొలగింపుకు బలవుతూ కూడా తమను తాము ఇంకా కార్మిక వర్గంలో భాగంగా చూసుకోని ఒక దుస్థితి ఆవహించింది . రాష్ట్రంలో తమ శ్రమను ధారపోస్తున్న వలస కార్మికుల దుస్థితి చెప్పనక్కర లేదు. ప్రభుత్వాలు, సమాజం వలస కార్మికులను ఇంకా మనుషులుగా కూడా చూడని ఒక అమానవీయ వాతావరణం రాష్ట్రంలో నెలకొన్నది.

తెలంగాణ రాష్ట్రంలో కార్మిక, ఉద్యోగ వర్గాలకు పూర్తిగా ఎదురు గాలులు వీస్తున్న ఇలాంటి ప్రత్యేక సందర్భంలో ఒక కొత్త కార్మిక వర్గం పురుడు పోసుకున్నది. వాళ్ళే గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ కార్మికులు. ఏదో ఒక మొబైల్ యాప్ ఆధారంగా పని చేసే ఈ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో కనీసం నాలుగు లక్షల మందికి చేరుకున్నారు. రవాణా, డెలివరీ , ఇతర సర్వీస్ రంగాలలో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.

ప్రభుత్వ రంగంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోవడం, కొత్త ఉద్యోగాల సృష్టి జరగక పోవడం, ప్రైవేట్ పరిశ్రమలలో అమానవీయ పరిస్థితులు, తక్కువ వేతనాలు, సర్వీస్, హాస్పిటాలిటీ రంగాలలో కొత్తగా ముందుకు వచ్చిన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర యువత కున్న మానసిక భావపరంగా కొన్ని అభిప్రాయాలతో వెనకడుగు, నగరంలో పని చేసుకోవడానికి వస్తున్న కొత్త అవకాశాలకుఅనుగుణంగా తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఎక్కువ మంది యువత ( చివరికి విద్యార్ధులు కూడా) ఈ గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికులుగా యాప్ ఆధారిత సంస్థలలో పని చేసుకుంటున్నారు.

8 గంటల పని దినం ఈ గిగ్ కార్మికుల డిక్షనరీ లోనే లేదు. ఈ యాప్ ఆధారంగా, ఏ రోజు పని చేసుకోగలమో, ఏదో ఒక కారణంగా ఏ రోజు బ్లాక్ లిస్టు లో పడతామో తెలియని భయానక పరిస్థితులలో యువత ( మహిళలు కూడా) ఈ పనులలో బతుకుతున్నది. శారీరకంగా, మానసికంగా అత్యంత ఒత్తిడికి గురయ్యే పనులు ఇవి. నెలకు 15,000 నుండీ 30,000 సంపాదించడానికి రోజుకు 12 గంటలు కష్ట పడుతున్న వాళ్ళే మెజారిటీగా ఉన్నారు.

ఈ సంస్థల/ కంపనీల యజమానులు ఎవరో , ఎక్కడ ఉంటారో, వాళ్ళ ఆఫీసు ఎక్కడ ఉంటుందో కూడా ఎక్కువ మందికి తెలియదు. వాళ్ళు సృష్టించిన యాప్ (APP)_పేరుతోనే ఈ సంస్థలు ఎక్కువమందికి పరిచయం.

వీటిలో పని చేసే వారిని ఆయా సంస్థలు తమ దగ్గర పని చేస్తున్న ఉద్యోగులుగా, కార్మికులుగా గుర్తించవు. వారిని పార్టనర్ గా చెప్పుకుంటాయి. తాము పరిశ్రమల యాజమానుల కాదని, ఒక ప్లాట్ ఫారం సృష్టించిన అగ్రిగేటర్స్ మాత్రమే అనీ వీళ్ళు చెప్పుకుంటున్నారు. తద్వారా, తమ సంస్థలు కార్మిక చట్టాల పరిధిలోకి రాకుండా చూసుకుంటున్నారు. తమను తాము రాష్ట్ర పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ దగ్గర రిజిస్టర్ చేసుకోకుండా, టెక్ కంపనీలుగా నమోదు చేసుకుంటున్నారు. వినియోగదారులకు ఈ కార్మికులు అందించిన సర్వీస్ ద్వారా వచ్చిన ఆదాయంలో మూడో వంతును కమిషన్ లాగా స్వీకరించడం, లేదా తాము అభివృద్ధి చేసిన ప్లాట్ ఫారం మీద పని చేసుకునే అవకాశం కల్పించినందుకు రోజుకు, 15 రోజులకు, నెలకు ఇంత రెంట్ అని వసూలు చేయడం ఈ కంపనీల ప్రధాన ఆదాయంగా ఉంటున్నది.

ఈ పరిస్థితులలో షేక్ సలావుద్దీన్ లాంటి హైదరాబాద్ యువకుల నేతృత్వంలో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫారం వర్కర్స్ యూనియన్ ఏర్పడింది. ఈ ప్లాట్ ఫామ్స్ లో పని చేసే వారిని సంఘటితం చేస్తూ, వారి హక్కుల కోసం ఈ యూనియన్ పోరాడుతున్నది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దృష్టికి తమ సమస్యలను తీసుకు వెళ్ళడం ద్వారా , కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ కార్మికుల కోసం ఒక చట్టాన్ని తెచ్చేలా యూనియన్ ప్రయత్నం చేసింది.

అలా మొదటి చట్టం కాంగ్రెస్ పాలిత రాజస్తాన్ లో వచ్చింది. కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ కార్మికిలను దృష్టిలో ఉంచుకుని ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. రూల్స్ కూడా రూపొందించింది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ కార్మికుల కోసం ఒక చట్టాన్ని తేవడానికి పూనుకుంది. ఒక సంవత్సర కాలంగా జరుగుతున్న చర్చలు, ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి. స్వయంగా గిగ్ కార్మికులతో, వల్ల సంఘాలతో, ఆ రంగంపై పరిశోధనలు చేసి వారితో , రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలలో ఈ చట్టం తేవడంలో కీలక పాత్ర పోషించిన MKSS లాంటి సంస్థలతో, తెలంగాణ పౌర సమాజ ప్రతినిధులతో చర్చించడం ద్వారా తెలంగాణ బిల్లు రూపొందింది. నవంబర్ 12 న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ బిల్లును చర్చించి ఆమోదిస్తామని, కార్మిక శాఖా మంత్రి జి. వివేక్ ఇప్పటికే ప్రకటించారు.

ఈ చట్టంలో ఉండబోయే ముఖ్యాంశాలు కొన్ని ఇలా ఇన్నాయి.

1. ఈ చట్టాన్ని తెలంగాణ గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ కార్మికుల (నమోదు, సామాజిక భద్రత మరియు సంక్షేమం) చట్టం, 2025 అని పిలుస్తారు.

2. ఈ చట్టం తెలంగాణ రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది.

3. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ గెజిట్‌లో ప్రచురించిన నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించిన తేదీ నుండీ ఈ చట్టం అమల్లోకి వస్తుంది.

4. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న లేదా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో లేదా విదేశాలలో పనిచేస్తూ షెడ్యూల్-I లో పేర్కొన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సేవలను తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్న అగ్రిగేటర్‌లు, ప్లాట్‌ఫారమ్‌లు లేదా ప్రాథమిక యజమానులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు.

5. సెక్షన్ 17 ప్రకారం ఈ చట్టం క్రింద ఏర్పడే సంక్షేమ బోర్డులో నమోదైన ప్రతి గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ కార్మికుడికి ఈ చట్టం వర్తిస్తుంది.

6. ఈ చట్టం ప్రకారం “అగ్రి గేటర్” ను గుర్తిస్తారు. ఒక సేవ కొనుగోలుదారుడిని లేదా వినియోగ దారుడిని అమ్మకందారుడితో లేదా సేవా ప్రదాత తో అనుసంధానం చేయడానికి ఏర్పాటు చేయబడిన డిజిటల్ ఇంటర్మీడియరీ లేదా మార్కెట్ స్థలాన్ని అగ్రిగేటర్ అంటారు. ఈ సేవలను అందించడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అగ్రిగేటర్‌లతో సమన్వయం చేసే ఏదైనా ప్రత్యేక సంస్థ కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది.

7. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన “అప్పీలేట్ అథారిటీ” ఉంటుంది.

8. సెక్షన్ 3 కింద తెలంగాణ గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటవుతుంది.

9. ఈ చట్టంలోని సెక్షన్ 18 లోని సబ్ సెక్షన్ (1) కింద స్థాపించబడిన తెలంగాణ గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమ నిధిని నిర్వహిస్తుంది.

10. సాంప్రదాయ యజమాని-ఉద్యోగి సంబంధానికి వెలుపల పని చేసే, పని అమరికలో పాల్గొనే, అటువంటి కార్యకలాపాల నుండి సంపాదించే వ్యక్తి, ని గయిగ్ వర్కర్ అంటారు. అలాంటి ఒక ఒప్పందంలో నిర్దేశించిన నిబంధనలు, షరతుల ఆధారంగా, ఇచ్చిన చెల్లింపు రేటును అంగీకరించి పనిచేసే వ్యక్తి అని అర్థం. అన్ని పీస్-రేట్ (piece-rate) పనులు కూడా ఈ పరిధిలోకి వస్తాయి.

11. సెక్షన్ 22 లోని సబ్-సెక్షన్ (1) కింద రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన “గ్రీవెన్స్ రిడ్రెస్సల్ ఆఫీసర్” ఉంటారు. ఈ కార్మికులకు, సంస్థలకు మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించానికి ఈ ఏర్పాటు.

12. “ప్లాట్‌ఫారమ్” అంటే ఒక సేవను స్వీకరించేవారి అభ్యర్థన మేరకు, ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా సేవను అందించే ఏదైనా అమరిక. ఇది నిర్దిష్ట ప్రదేశంలో వ్యక్తులు చేసిన పనిని చెల్లింపుకు ప్రతిగా నిర్వహిస్తుంది.

13. “ప్లాట్‌ ఫారమ్ కార్మికుడు” అంటే ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆ పనిని చేపట్టిన వ్యక్తి;

14. సెక్షన్ 10 లోని సబ్-సెక్షన్ (4) కింద నమోదైన గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు బోర్డు జారీ చేసిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య “ప్రత్యేక ఐడి (Unique ID)” ఉంటుంది.

15. రాష్ట్ర ప్రభుత్వం, ఈ చట్టం కింద తనకు అప్పగించిన అధికారాలను వినియోగించు కోవడానికి, విధులను నిర్వర్తించడానికి, తాను నియమించిన తేదీ నుండి, నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ కార్మికుల సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేస్తుంది. బోర్డు ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంటుంది.

16. బోర్డు ఈ క్రింది వారితో ఏర్పడుతుంది. సబ్-సెక్షన్ (1) లోని క్లాజ్ (x) మరియు (xi) కింద ప్రతి విభాగంలో కనీసం ఒక మహిళా ప్రతినిధిని నామినేట్ చేయాలి.

క్ర.సం. సభ్యుడు హోదా

(i) తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ ఇన్‌చార్జి మంత్రి ఎక్స్-అఫీషియో ఛైర్‌పర్సన్

(ii) భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎక్స్-అఫీషియో సభ్యుడు

(iii) తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా సెక్రటరీ ఎక్స్-అఫీషియో సభ్యుడు

(iv) తెలంగాణ ప్రభుత్వ సమాచార మరియు సాంకేతిక (ఐ.టి.) శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా సెక్రటరీ ఎక్స్-అఫీషియో సభ్యుడు

(v) ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్స్-అఫీషియో సభ్యుడు

(vi) తెలంగాణ ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్స్-అఫీషియో సభ్యుడు

(vii) తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్స్-అఫీషియో సభ్యుడు

(viii) తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ కమీషనర్ ఎక్స్-అఫీషియో సభ్యుడు

(ix) రాష్ట్ర ప్రభుత్వం నియమించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వీరు బోర్డు రోజువారీ కార్యకలాపాలకు కార్యనిర్వాహక బాధ్యత వహించి, బోర్డు తరపున విధులను నిర్వహిస్తారు. ఎక్స్-అఫీషియో మెంబర్ సెక్రటరీ

(x) గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ కార్మికుల నుండీ నలుగురు ప్రతినిధులు ఉంటారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. సభ్యుడు

(xi) అగ్రిగేటర్‌లు/ప్లాట్‌ఫారమ్‌ల నుండి నలుగురు ప్రతినిధులు ఉంటారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. . సభ్యుడు

(xii) గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ ఆర్థిక వ్యవస్థ రంగంలో పనిచేసిన అనుభవం ఉన్న లేదా ఆ రంగంలో నిపుణులైన పౌర సమాజాల (Civil Societies) నుండి ఇద్దరు ప్రతినిధులు ఉంటారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. సభ్యుడు

(xiii) డేటా సేకరణ, ఐటి వ్యవస్థలు లేదా అవసరమైనప్పుడు ఇన్‌పుట్‌లను అందించడానికి సంబంధించిన ఏదైనా ఇతర రంగంలో ఒక సాంకేతిక నిపుణుడు. ప్రత్యేక ఆహ్వానితుడు (Special Invitee)

17. బోర్డు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం నియామక తేదీ నుండి మూడు సంవత్సరాల కాలం వరకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సముచితంగా భావించినట్లయితే, ఈ పదవీకాలాన్ని మరో సంవత్సరం వరకు పొడిగించవచ్చు.

18. బోర్డులోని ఏ నామినేటెడ్ సభ్యుడైనా ఎప్పుడైనా, ప్రభుత్వానికి తన స్వదస్తూరీతో రాజీనామా లేఖను సమర్పించి తన పదవికి రాజీనామా చేయవచ్చు. అటువంటి రాజీనామా ఆమోదించబడిన తర్వాత, అతని పదవి ఖాళీ అవుతుంది.

19. గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ కార్మికులకు ఈ క్రింది హక్కులు ఉంటాయి. పని వ్యవధి ఎంత ఉన్నా, ఏదైనా ప్లాట్‌ఫారమ్‌ లో ఆన్‌ బోర్డ్ అయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవడానికి, అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వర్తించే ప్రత్యేక ఐడి (Unique ID) పొందడానికి అవకాశం ఉంటుంది.

20. బోర్డు నోటిఫై చేసిన విధంగా, ఒక త్రైమాసికంలో (quarter) ఏదైనా అగ్రిగేటర్ లేదా ప్లాట్‌ఫారమ్‌లతో గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికుడు చేపట్టిన కనీస సంఖ్యలో లావాదేవీలు/ గిగ్ పనికి లోబడి, వారు చేసిన విరాళాల (contributions) ఆధారంగా సాధారణ మరియు నిర్దిష్ట సామాజిక భద్రతా పథకాలను పొందడానికి అవకాశం ఉంటుంది.

21. సెక్షన్ 21లో పేర్కొన్న విధంగా ఆయా సంస్థలతో ఏదైనా సమస్య ఎదురైతే, గ్రీవెన్స్ రిడ్రెస్సల్ యంత్రాంగాన్ని (Grievance Redressal Mechanism) ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఆయా సంస్థల యజమానులు ఈ చట్టం ఉనికిలోకి రావడానికి , అమలు చేయడానికి అనుకూలంగా లేరు. ఫిక్కీ, CII లాంటి సంస్థలు కూడా ఈ చట్టం రాకుండా చేయడానికి తగినంత ప్రయత్నాలు చేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీ ప్రకారం , ఈ చట్టం లేదా ఆర్డినెన్స్ తేవాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే బిల్లు డ్రాఫ్ట్ పూర్తి అయింది.

ఈ బిల్లు ఈ నెల 12 న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందుతుందనీ, త్వరలోనే చట్టంగా మారుతుందనీ, ఆ తరువాత ఈ చట్టం అమలు కోసం రూల్స్ వేగంగా రూపొందుతాయనీ, చట్టం అమలులోకి వచ్చి గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికుల సంక్షేమానికి పునాదులు పడతాయనీ ఆశిద్దాం.

కొత్త యాజమాన్యాల కొత్త దోపిడీ పద్ధతులకు వ్యతిరేకంగా సాగే కార్మిక వర్గ పోరాటంలో ఒక అడుగు ఈ బిల్లు అని మనం గుర్తుంచుకోవాలి. గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికులను పూర్తి స్థాయి కార్మికులుగా గుర్తించని పరమితులు ఈ బిల్లుకు ఉన్నా, రాబోయే కాలంలో అటువైపు అడుగులు వేయడానికి మనం కార్మికులను సమీకరించి పోరాటాలను నిర్మించ వలసే ఉంటుంది.

Read More
Next Story