
తెలంగాణ సగటు ఆదాయం vs నిజ జీవనం
తెలంగాణలో GSDP, తలసరి ఆదాయం పెరుగుతున్నా, గ్రామీణ రైతులు, అసంఘటిత వేతన కార్మికుల వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్ధిక నివేదిక 2026 ను ప్రజల ముందు ఉంచింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (GSDP) 2025-2026 ఆర్ధిక సంవత్సరంలో 10.7 శాతం వృద్ధి రేటుతో 17,82,198 కోట్లుగా నమోదైంది. రాష్ట్ర సగటు తలసరి ఆదాయం 4,18,931 రూపాయలకు చేరింది.
గత సంవత్సర GSDP 16,09,902 కోట్లు కాగా, తలసరి ఆదాయం 3,80,031 రూపాయలు. దేశ సగటు తలసరి ఆదాయంతో (2,19,575 రూపాయలు) పోల్చిననప్పుడు , తెలంగాణ సగటు తలసరి ఆదాయం సుమారు రెట్టింపు అన్న మాట . రాష్ట్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం GSDP పెరుగుదలను, వృద్ధిరేటు ను, తలసరి ఆదాయాలను చూస్తే, రాష్ట్రం శీఘ్రగతిన అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నట్లు మనకు కనిపిస్తుంది. అసలు ఈ అంకెలను ఎలా అర్థం చేసుకోవాలి ?
రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి, తలసరి ఆదాయం పెరుగుదల నిజంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని సూచిస్తాయా ? సాధారణ ప్రజల నిజ జీవిత ప్రమాణాలను సూచిస్తాయా ? ఈ పెరుగుదల లు రాష్ట్రంలో ప్రజల మధ్య ఆర్ధిక సమానతలను పెంచుతున్నాయా ? అంతరాలను మరింత పెంచుతున్నాయా ? ఈ ప్రశ్నలకు జవాబు వెతుక్కోవలసిన అవసరం ఉంది.
రాష్ట్ర గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలకు పని దినాలు తగ్గిపోతున్నాయి. స్వంత భూమి లేని, లేదా అతి తక్కువ సాగు భూమి మాత్రమే ఉన్న స్థితిలో కౌలు రైతుల సంఖ్య పెరుగుతున్నది. పంటల ఉత్పత్తి ఖర్చులు బాగా పెరిగిపోతూ, పంటలు పండించే రైతులకు నికర ఆదాయాలు తగ్గిపోతున్నాయి. అన్ని ప్రాంతాలలో రోజు రోజుకూ పెరుగుతున్న రియల్ ఎస్టేట్ వల్ల, పశువులకు మేత భూములు తగ్గిపోతూ, పశు పోషకులు ఇబ్బందిపడుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో చేతి వృత్తులు దాదాపు మాయమైపోతున్నాయి. గ్రామీణ ప్రాంతం నుండీ నగర, పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగిపోతున్నాయి. 92 శాతం గ్రామీణ వ్యవసాయ కుటుంబాలు అప్పులలో ఉన్నాయని NSSO నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర ఆదివాసీ ప్రాంతాల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు.
మరి పరిస్థితి ఇలా ఉంటే, ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి, తలసరి ఆదాయాలు బాగా పెరుగుతున్నాయని ప్రభుత్వాలు చంకలు గుద్దుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి ? పైగా ప్రకటించుకుంటున్న GSDP వృద్ధిలో కూడా ఆయా రంగాల మధ్య, వివిధ జిల్లాల మధ్య అంతరాలు విపరీతంగా పెరుగుతున్నాయి.
ఈ అంతరాలను తగ్గించడానికి, అన్ని రంగాల స్థూల జాతీయోత్పత్తి విలువలు పెరగడానికి, అన్ని ప్రాంతాల ప్రజల నికర ఆదాయాలు పెరగడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయా ? ఆయా రంగాలపై, ప్రాంతాలపై ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధి కేంద్రంగా నిజంగా దృష్టి పెట్టి అవసరమైన పథకాలు రచిస్తున్నాయా ? రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని బాగు చేయకుండా, కేవలం పారిశ్రామిక, సేవా రంగాలపై దృష్టి పెడితే, రాష్ట్ర ప్రజల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయా? రాష్ట్ర ప్రజల నిజ ఆదాయలు పెరుగుతాయా ? ఇవన్నీ ప్రశ్నలుగా మనం ఆడగా వలసినవి. ఈ ప్రశ్నలు అడగడానికి GSDP లో, తలసరి ఆదాయంలో ఆయా రంగాల మధ్య, జిల్లాల మధ్య వ్యత్యాసాలు కారణంగా పని చేస్తున్నాయి.
ప్రభుత్వం ప్రకటించే తలసరి ఆదాయం లెక్కింపులో సమస్యలు :
ప్రభుత్వం ఆర్ధిక పరి భాషలో వాడే "గిని కోఎఫీషియంట్" (Gini Coefficient) అనే పదాన్ని పక్కన పెట్టి, "సగటు ఆదాయం వర్సెస్ అసలు ఆదాయం" అనే కోణంలో చూస్తే మనకు ఒక స్పష్టత వస్తుంది.
ఒక ఉదాహరణ: ఒక గ్రామంలో 10 మంది ఉన్నారనుకుందాం. వారిలో ఒకరు పెద్ద వ్యాపారి, ఆయన ఆదాయం నెలకు రూ. 9,10,000. మిగిలిన 9 మంది కూలీలు, వారి ఆదాయం నెలకు కేవలం రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 90,000. ఇప్పుడు ఆ ఊరి మొత్తం ఆదాయం రూ. 10 లక్షలు. ఆ ఊరి సగటు (Per Capita) ఆదాయం లెక్కిస్తే... 10 లక్షలను 10 మందితో భాగిస్తే రూ. 1 లక్ష వస్తుంది. ఇక్కడే అసలు సమస్య ఉంది: కాగితం మీద చూస్తే ఆ ఊరిలో ప్రతి ఒక్కరి ఆదాయం రూ. 1 లక్ష ఉన్నట్లు కనిపిస్తుంది (దీనినే మనం GSDP లేదా తలసరి ఆదాయం పెరుగుదల అంటాం). కానీ నిజానికి ఆ ఊరిలో 90% మంది (9 మంది) నెలకు కేవలం రూ. 10 వేలతోనే బతుకుతున్నారు.
అందుకే తెలంగాణ రాష్ట్ర GSDP, తలసరి ఆదాయం (Per Capita Income) దేశ సగటు కంటే వేగంగా పెరుగుతున్నప్పటికీ, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు, లబ్ధిదారుల సంఖ్య పెరగడం అనేది ఒక ముఖ్యమైన సామాజిక-ఆర్థిక వైరుధ్యం.
తలసరి ఆదాయం vs ఆదాయ అసమానతలు (Income Inequality) :
తలసరి ఆదాయం అనేది కేవలం ఒక గణిత సగటు. (Average = {Total Income} / {Population}). అంటే మొత్తం ఆదాయాన్ని మొత్తం జనాభాతో భాగించడం అన్నమాట.
రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో ఎక్కువ భాగం హైదరాబాద్, దాని చుట్టు పక్కల జిల్లాల నగరాల్లోని ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల నుండి వస్తోంది. దీనివల్ల రాష్ట్ర సగటు గణాంకాల్లో తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలుగా కనిపిస్తున్నది.
కానీ క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలు, సన్న, చిన్న కారు, మధ్యతరగతి రైతుల ఆదాయం ఆ స్థాయిలో పెరగడం లేదు. అలాగే పట్టణ, నగర ప్రాంతాలలోని అసంఘటిత కార్మికుల, ఇతర స్వయం ఉపాధి శ్రామికుల ఆదాయాలు కూడా ఆ స్థాయిలో పెరగడం లేదు. అంటే ఉత్పత్తి అవుతున్న సంపద కేవలం కొంత మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండటం వల్ల, రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఇంకా ప్రభుత్వ పథకాలపైనే ఆధారపడుతున్నారు.
ఈ కారణం చేతనే రాష్ట్ర ప్రజలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తుంటారు. ఈ ఎదురు చూపు కేవలం ప్రతి నెలా ప్రతి మనిషికీ ఇచ్చే ఆరు కిలోల బియ్యం కోసం మాత్రమే కాదు. రాష్ట్రంలో రేషన్ కార్డు ఇప్పుడు బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు గా మారిపోయింది. ఆరోగ్యశ్రీ క్రింద ఉచిత వైద్యం పొందాలన్నా, కొత్తగా ప్రకటించిన రూ. 5 లక్షల 'ఇందిరమ్మ బీమా' పొందాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. గృహలక్ష్మి / ఇందిరమ్మ ఇళ్లు పథకం క్రింద సొంత ఇల్లు లేని వారు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం పొందడానికి రేషన్ కార్డే ప్రామాణికం. ఆసరా పెన్షన్లు పథకం క్రింద కొత్తగా పెన్షన్ కావాలనుకునే వారికి తెల్ల రేషన్ కార్డు ప్రాథమిక అర్హత. ఉచిత విద్యుత్ (గృహజ్యోతి) పథకం క్రింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందడానికి కూడా రేషన్ కార్డు అవసరం. ఈ కారణం చేతనే , ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉన్నవారు కూడా భవిష్యత్తులో ప్రభుత్వ ప్రయోజనాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారు.
ఒక వైపు రాష్ట్ర GSDP పెరుగుతున్నా, సృష్టించబడుతున్న ఉపాధిలో ఎక్కువ భాగం ఇప్పటికీ అసంఘటిత రంగంలోనే ఉంది. అక్కడ వేతనాలు స్థిరంగా ఉండవు. ఉద్యోగ, సామాజిక భద్రత (PF, ESI) కూడా ఉండదు.
మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు, వైద్యం, విద్య ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల, రాష్ట్ర సగటు తలసరి ఆదాయం పెరిగినప్పటికీ సామాన్యుడి 'కొనుగోలు శక్తి' (Purchasing Power) మాత్రం బాగా తగ్గింది. ఈ కారణం చేతనే నెలకు మనిషికి 6 కిలోల ఉచిత బియ్యం కూడా పేద కుటుంబానికి పెద్ద ఊరటగా మారుతోంది.
పెరుగుతున్న GSDP అనేది సంపద పెరుగుదలను సూచిస్తే, పెరుగుతున్న రేషన్ కార్డుల సంఖ్య సంపద పంపిణీలో లోపాలను, ప్రజల ఆర్థిక అనిశ్చితిని సూచిస్తుంది. అందుకే ప్రభుత్వం కేవలం గణాంకాల వృద్ధిని కాకుండా, ఆదాయ అసమానతలను తగ్గించే విధంగా క్షేత్రస్థాయిలో ఉపాధి కల్పనపై దృష్టి పెడితే తప్ప ఈ వ్యత్యాసం తగ్గదు.
ఇప్పుడు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా వల్ల ధనికులు ఇంకా ధనికులవుతున్నారు. హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వల్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ (GSDP) భారీగా పెరుగుతోంది. కానీ ఆ పెరిగిన సంపద అందరికీ సమానంగా అందడం లేదు.
మరో వైపు ఒక వ్యక్తి ఆదాయం నెలకు రూ. 10 వేల నుండి రూ. 15 వేలకు పెరిగి ఉండవచ్చు. కానీ అదే సమయంలో గ్యాస్, పప్పులు, నూనె, పిల్లల చదువులు,వైద్య ఖర్చులు అంతకంటే ఎక్కువగా పెరిగాయి. ఫలితంగా ఆదాయం పెరిగినా, చేతిలో మిగిలేది ఏమీ ఉండటం లేదు. అందుకే ప్రభుత్వ పథకాలపై ప్రజలు ఆధారపడటం తగ్గడం లేదు. అంటే రాష్ట్రం ధనికమైంది కానీ, ప్రజలందరూ ధనికులు కాలేదు. అందుకే ఒక పక్క సగటు తలసరి ఆదాయం పెరుగుతున్నా, మరో పక్క రేషన్ కార్డుల కోసం క్యూలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వ తలసరి ఆదాయం vs NSSO కుటుంబ ఆదాయం :
ప్రభుత్వం లెక్కించే తలసరి ఆదాయం (Per Capita Income) అనేది రాష్ట్ర మొత్తం ఆదాయాన్ని జనాభాతో భాగించగా వచ్చే సగటు. కానీ జాతీయ నమూనా సర్వే సంస్థ (NSSO) లెక్కించే Monthly Per Capita Expenditure (MPCE) అనేది ఒక వ్యక్తి నెలకు వాస్తవంగా ఎంత ఖర్చు చేస్తున్నాడో చెబుతుంది. 2026-2027 ప్రభుత్వ గణాంకాల ప్రకారం సగటు వార్షిక ఆదాయం 4,18,931 రూపాయలకు పెరిగింది. అంటే నెలకు 34,910 రూపాయలన్నమాట. అదే సమయంలో 2024-2025 NSSO గణాంకాల ప్రకారం సంవత్సర ఆదాయం 65,000 నుండే 85,000 మధ్య మాత్రమే ఉంది. అంటే నెలకు 5500 నుండీ 7200 లోపు అన్న మాట.
అంటే ప్రభుత్వం లెక్కించే ఆదాయంలో పెద్ద కంపెనీల లాభాలు, ఐటీ ఎగుమతులు అన్నీ కలిసి ఉంటాయి. కానీ NSSO సర్వేలో సామాన్య ప్రజలు తమ చేతి నుండి పెడుతున్న ఖర్చును మాత్రమే లెక్కిస్తారు. దీనిని బట్టి చూస్తే, కాగితం మీద కనిపించే సంపదలో చాలా తక్కువ భాగం మాత్రమే సామాన్య కుటుంబాల చేతికి అందుతోందని అర్థమవుతుంది.

