
తిట్లకు, వ్యక్తిగత దూషణకు హేట్ స్పీచ్ బిల్లు వర్తిస్తుందా?
“తెలంగాణ హేట్ స్పీచ్ & హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు – 2026”
తెలంగాణా రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఎక్కువ. తిట్లు ఎక్కువ. ఈ మాటల యుద్ధం రోజు రోజుకూ ప్రమాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మతం, కులం, వర్గం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే మాటలకు చెక్ పెట్టే లక్ష్యంతో తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026ను మంత్రివర్గం ఆమోదించింది. శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు. మత సామరస్యాన్ని భంగం కలిగించే సోషల్ మీడియా పోస్టులు, అల్లర్లు ప్రేరేపించే ప్రసంగాలపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లు రూపొందించారు. బహిరంగ సభలు, సోషల్ మీడియా పోస్టులు, డిజిటల్ కంటెంట్, మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ఏ చర్యైనా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.
ఈ బిల్లుతో ప్రధాన లక్ష్యం ఏమిటంటే, మతం, కులం, వర్గం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులను పూర్తిగా అరికట్టడం.
మొదటి తప్పు: ₹50,000 జరిమానా + 7 సంవత్సరాల జైలు
రెండోసారి తప్పు చేస్తే: ₹1 లక్ష జరిమానా + 10 సంవత్సరాల జైలు
కొన్ని సందర్భాల్లో జరిమానా ₹10 లక్షల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఈ బిల్లు తర్వాత తెలంగాణ రాజకీయాలు ప్రక్షాళన అవుతాయా, గౌరవ ప్రదం అవుతాయా. ఈ తిట్లకు వ్యక్తిగత దూషణకు ఈ బిల్లు వర్తిస్తుందా? అంటే, "ప్రతిపక్ష సోషల్ మీడియాపై నియంత్రణ సాధించడానికి ఈ బిల్లును ఉపయోగించే అవకాశముందని" బీఆర్‌ఎస్ సీనియర్ నేత గట్టు రాంచంద్రరావు వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ చట్టం ప్రధానంగా అధికార పార్టీ తమ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ఉపయోగపడే అవకాశం ఉంది గానీ, రాజకీయ నాయకుల మాటతీరు మాత్రం మారే పరిస్థితి కనిపించడం లేదని ఫెడరల్‌తో చెప్పారు.
తెలంగాణ హేట్ స్పీచ్ & హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026, గతంలో అమల్లో ఉన్న చట్టాల మధ్య ప్రధాన తేడా, అమలు విధానంలోనే ఉందని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎం.డి. అబ్దుల్ ముజీబ్ తెలిపారు. గత చట్టాల్లో ఉన్న లొసుగుల కారణంగా హేట్ స్పీచ్ చేసిన వ్యక్తులు సులభంగా తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా, ఆడియో లేదా వీడియో ఆధారాలను కోర్టులో నిర్ధారించడం కష్టమవడంతో, నిందితులు “అది నా వాయిస్ కాదు”, “ఆ వీడియో నాది కాదు” అంటూ బాధ్యత నుంచి తప్పించుకునేవారని ఆయన వివరించారు.
కానీ కొత్త బిల్లులో డిజిటల్ ఆధారాల ప్రామాణికతను బలపరచడం, సాంకేతిక సాక్ష్యాలను చట్టపరంగా మరింత స్పష్టంగా అంగీకరించే విధానాలు ఉండటం వల్ల నేరాన్ని చేసిన వ్యక్తిని ఖచ్చితంగా గుర్తించి బాధ్యతను నిర్ధారించేందుకు వీలు కలుగుతుందని ఆయన చెప్పారు. ఈ విధంగా, కొత్త చట్టం నిందితులను స్పష్టంగా గుర్తించి శిక్షించేందుకు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్నికల సమయంలో సభల్లో రాజకీయ నాయకులు ఉపయోగించే అభ్యంతరకరమైన భాష, వ్యక్తిగత దూషణలు ఇవి కూడా హేట్ స్పీచ్‌గా పరిగణిస్తే, రాజకీయాల్లో మాటల దూకుడు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. "రాజకీయ పార్టీలు పరస్పర సమన్వయంతో వ్యవహరించకుండా ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా, వాటి వల్ల నాయకుల ప్రవర్తనలో మార్పు రావడం కష్టమేనని" సీనియర్ జర్నలిస్టు చలసాని నరేంద్ర పేర్కొన్నారు.
"ఇప్పటికే దేశంలో బలమైన చట్టాలు ఉన్నాయని, కొత్త చట్టాల కంటే వాటిని కట్టుదిట్టంగా అమలు చేయడమే ముఖ్యం" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరహా చట్టాల ప్రవేశం అసలు సమస్యలకు పరిష్కారం కాదని, ఇవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకొచ్చే గిమ్మిక్‌లుగా మిగిలిపోతాయని అన్నారు. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం, మీడియా స్వేచ్ఛను, ప్రజాసంఘాల కార్యకలాపాలను అణచివేయడం కోసం ఇవి ఉపయోగపడే ప్రమాదం ఉందని చలసాని చెప్పారు. గతంలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన నేతలపై ఏ రాజకీయ పార్టీ కూడా కఠిన చర్యలు తీసుకోకపోవడం ఈ పరిస్థితికి ఉదాహరణగా నిలుస్తుందని ఆయన గుర్తు చేశారు.
1) తెలంగాణ రాజకీయాల్లో దూషణలు కొత్తేమీ కాదు! కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టం నిజంగా రాజకీయాల్లో హేట్ స్పీచ్‌ను తగ్గిస్తుందా?
2) ఈ చట్టం మాట స్వేచ్ఛను పరిమితం చేస్తుందా? లేక సమాజంలో శాంతి భద్రతలకు నిజంగా సహాయపడుతుందా?
3) ప్రతిపాదిత తెలంగాణ విద్వేష ప్రసంగాల చట్టం రాష్ట్ర రాజకీయాల్లో దూషణలను తగ్గిస్తుందా?
4) రాజకీయ నాయకులు బహిరంగ సభల్లో ఉపయోగించే అభ్యంతరకరమైన భాషకు కూడా ఇది వర్తిస్తుందా? నేతలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ఇలాంటి బిల్లును కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. అయితే అది ఇంకా చట్టంగా మారలేదు. గవర్నర్ దానిని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. మొత్తానికి ఈ కొత్త చట్టం తెలంగాణ రాజకీయాల్లో భాషను మార్చగలదా? లేక కేవలం కాగితాల మీదే మిగిలిపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి.

