తెలంగాణలో సర్కార్ ఆస్పత్రులు పెరుగుతున్నాయ్, ఆరోగ్యం భారమౌతూ ఉంది
ప్రజల వైద్యావసరాలను ప్రభుత్వ వైద్యశాలలు 34% మాత్రమే తీరుస్తున్నాయి. మిగతా 66 శాతం వైద్యావసరాలకు ప్రైవేటు వైద్యశాలలే దిక్కు. అందుకే తెలంగాణలో వైద్యం భారం.
తెలంగాణ రాష్ట్రంలో వైద్య , ఆరోగ్య రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నది. ఆరోగ్యానికి ప్రాతిపదికలైన శుభ్రమైన నీరు, పుష్టికరమైన ఆహారం, కాలుష్య రహితమైన గాలి, గౌరవ ప్రదమైన జీవనోపాధి, వివక్షలేని సామాజిక జీవనం అందరికీ ముఖ్యంగా సమాజంలో అట్టడుగున వున్న కులాలకు, వర్గాలకు లభించడం లేదు. ఆరోగ్యం అంటే రోగ రాహిత్యం మాత్రమేనని చాలామంది భావిస్తున్నారు. ఆరోగ్యం శారీరక, మానసిక, ఆర్థిక, సాంస్కృతిక అంగాలను కలిగి వుంటుందన్న విషయం మరుగున పడి పోతున్నది. ప్రభుత్వ లెక్కలలో ఇన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రారంభించామని, ఇన్ని ఆసుపత్రి పడకలను పెంచామని గణాంకాలు ఉంటున్నాయి కానీ, ఆరోగ్యానికి గల శాస్త్రీయమైన నిర్వచనాన్ని దాటవేసి ,ప్రభుత్వం చేయవలసిన కర్తవ్యాలను మరిచి పోతున్నది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) స్థూల జాతీయాదాయంలో 8% ఆరోగ్య రంగంపై ఖర్చు చేయాలన్న సిఫారసును మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలెప్పుడూ అమలు పర్చలేదు. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం 2022- 23 సంవత్సరానికి ఆరోగ్య రంగానికి మొత్తం 2,40,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో 10,954 (దాదాపు 4.5%) కోట్ల రూపాయలు కేటాయించింది. 2023-24 కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి 89,155 కోట్ల రూపాయలు అంటే బడ్జెట్ లో 2.66 శాతం, స్థూల జాతీయాదాయంలో 0.1 శాతం మాత్రమే కేటాయించారు. ఇదే సంవత్సరం తెలంగాణ బడ్జెట్ లో 12,161 కోట్లు మాత్రమే కేటాయించారు.
ప్రజానీకం తమ వైద్యావసరాలను తమ జేబు నుండి డబ్బులు ఖర్చు పెట్టి తీర్చుకోవాల్సి వస్తున్నది. ప్రజల వైద్యావసరాల్లో ప్రభుత్వ వైద్యశాలలు కేవలం 34% మాత్రమే తీరుస్తున్నాయి. మిగతా వైద్యావసరాలను ప్రైవేటు వైద్యశాలలు తీరుస్తున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజల ఋణగ్రస్తతకు, అనుకోని వైద్య ఖర్చులు కూడా ఒక ప్రధాన కారణమని ఆర్థికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
ఈ నేపధ్యంలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ బృందం అక్టోబర్ 23 న తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యులను కలసి తెలంగాణ వైద్య, ఆరోగ్య సమస్యలపై వివరంగా చర్చించింది ఈ బృందంలో TPJAC రాష్ట్ర నాయకులు డాక్టర్ రవీంద్ర నాథ్ సూరి, డాక్టర్ ఎం . వేణు గోపాల్, ఎస్. సుధాకర్ , కన్నెగంటి రవి ఉన్నారు.
తెలంగాణ లో గత కొన్ని సంవత్సరాలుగా హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (HRDA) ప్రజా రోగ్య వైద్య రంగం,లో డాక్టర్స్ సమస్యలపై సీరియస్ గా పని చేస్తున్నది. ఈ సంఘం సభ్యులు ఒక ప్యానల్ గా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ( TSMC ) కు జరిగిన ఎన్నికలలో ఇటీవల మొత్తం 25 స్థానాలకు గాను 13 స్థానాలను గెలిచారు. ఈ కౌన్సిల్ లో మిగిలిన 12 మంది ప్రభుత్వ నామినీలు ఉంటారు.
తెలంగాణ వైద్య రంగంలో ప్రభుత్వ రంగం అభివృద్ధి చెందాలని మెజారిటీ డాక్టర్స్ మద్ధతుతో గెలిచిన ఈ సభ్యులు కోరుకుంటున్నారు. TPJAC బృందంతో జరిగిన వివరమైన చర్చలో, తాము కూడా ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
TPJAC ముందుకు తెచ్చిన డిమాండ్లలో ముఖ్యమైనది - ఆరోగ్య పరిరక్షణ ప్రజల ప్రాథమిక హక్కు గా ప్రభుత్వం గుర్తించి, ప్రైవేటు వైద్యం, వైద్య విద్య సంస్థలను అంతిమంగా జాతీయం చేయాలనేది. విశ్వజనీన ఆరోగ్యంలో భాగంగా అందరికి అన్ని చోట్లా అత్యున్నత స్థాయి ఆరోగ్యం అందించే విధంగా ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయాలి. నేడు ఇస్తున్న విదంగా చికిత్సా విధానానికి కాకుండా సామాజిక నివారక (social and preventive) వైద్యానికి ప్రాధాన్యత కల్పించాలీ. శుభ్రమైన తాగునీరు, పౌష్టిక ఆహారాన్ని పొందగలిగి గౌరవ ప్రదమైన జీవనోపాది, కాలుష్య రహితమైన వాతావరణం, ఆరోగ్యకరమైన అలవాట్లు మొదలగు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ చికిత్సా , ఆరోగ్య విధానాలను రూపొందించాలి.
పెరుగుతున్న రాష్ట్ర జనాభాను, గ్రామాలకూ, పట్టణాలకూ, అటవీ గూడేలకూ మధ్య ఉండే భౌగోళిక దూరాన్ని దృష్టిలో పెట్టుకొని రోగులు వీలైనంత త్వరగా చికిత్సాలయానికి చేరుకోవడానికి అనువుగా ప్రతి అయిదు కిలోమీటర్ల దూరానికి ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని- అర్హతలు కలిగిన వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండే విదంగా, సరిపడినంత మంది సిబ్బందితో ఏర్పాటు చేయాలి. నిబ్బందికి నివాస వసతి కేంద్రం ఆసుపత్రి ప్రాంగణం లోనే ఏర్పాటు చేయాలి. అవసరమైతే వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేయాలి. అన్ని రోజులు లభ్యమయ్యేలా అన్ని రకాల టీకాలు ఇచ్చే సదుపాయం ఈ కేంద్రాలలో కల్పించాలి. పేషంట్లను తరలించేందుకు వాహన సౌకర్యం కల్పించాలి.
ప్రతి 25 కిలోమీటర్లకు సాధారణ స్పెషాలిటీలలో, రోగ నిర్ధారణ సౌకర్యాలతో (పాథాలజీ, , ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, CT స్కాన్ ) కమ్యూనిటి చికిత్సా కేంద్రాలు / ప్రాంతీయ ఆసుపత్రులు/ జిల్లా ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి. ఆసుపత్రి ప్రాంగణం లోనే సిబ్బంది అందరికీ నివాస వసతి కల్పించాలి. ఈ ఆసుపత్రులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (DNB నర్సింగ్, టెక్నిషియన్) శిక్షణ సంస్థలను కూడా ఏర్పాటు చేయవచ్చు. ఈ స్థాయి ఆసుపత్రులు-25 కి. మీ. దూరంలో ఏర్పాటు చేయడం వలన గ్రామీణ ప్రజలు చికిత్స కోసం ఎక్కువ దూరాలు ప్రయాణించనవసరం ఉండదు. ఆసుపత్రులపైన పని ఒత్తిడి కూడా తగ్గుతుంది.
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రభుత్వ విధానం కనుక ఆ అసుపత్రులను తృతీయ స్థాయిట ఆసుపత్రులుగాను, స్పెషాలిటీ -తృతీయ స్థాయి బోధన, శిక్షణా కేంద్రలుగా తీర్చి దిద్దవచ్చు. కాలేజీ/ ఆసుపత్రి ప్రాంగణం లోనే నిబ్బందికి, డాక్టర్లకు, విద్యార్థి వైద్యులకు నివాస వసతి, భోజన వసతి కల్పించాలి. ఆసుపత్రులలో డాక్టర్లు , నిబ్బంది అవినీతిని రూపుమాపాలి. వైద్యులకు, నర్పులకు, పారామెడికల్ సిబ్బందికి కేంద్ర సంస్థలలో ఇచ్చే జీతాలు, ఇతర సదుపాయాలను ఇచ్చి వారి ప్రైవేటు ప్రాక్టీస్ ను రద్దు చేయాలి. వైద్య వృత్తిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతులలో నియామకాలు చెయ్యరాదు. అన్ని స్థాయిలలో ప్రభుత్వమే నేరుగా నియామకాలు చేయాలి.
రిజిస్ట్రేషన్ పొందిన ప్రతి వైద్యుడు ప్రభుత్వ వైద్యాలయాలలో కొంతకాలం పని చేయడాన్ని తప్పనిసరి చేయాలి. గ్రామీణ ప్రాథమిక చికిత్సా కేంద్రాలలో పని చేసిన వైద్యులకు ఒక మేరకు పీజీ స్థాయిలో రిజర్వేషన్లు కల్పించాలి. ప్రైవేటు రంగంలో వైద్య కళాశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వైద్య విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పాలి. సరియైన మానవ వనరులు, ప్రాథమిక సౌకర్యాలు, పరికరాలు లేకుండా కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించరాదు.
ఆరోగ్యానికి హాని చేకూర్చే పంటలను, అలవాట్లను నిరుత్సాహ పరచాలి. పొగాకు విస్తీర్ణం పై నియంత్రణ విధించాలి. పొగాకు పండించే ప్రాంతాలలో ప్రత్యామ్నాయ పంటలను, ప్రత్యామ్నాయ వృత్తులను ప్రొత్సహించాలి. మత్తు పదార్థాల ఉత్పత్తిని, పంపిణీని అరికట్టాలి. ఆల్కహాల్ ఉత్పత్తి, పంపిణి, వ్యాపారం లాభ సాటి కాని పరిస్థితులు కల్పించాలి.. గంజాయి లాంటి మత్తు పదార్థాల పంటను పూర్తిగా నిర్మూలించాలి. వాటి అమ్మకాలపై ఉక్కు పాదం మోపాలి.
ఆరోగ్యానికి హాని కలిగించే శీతల పానియాలను నిషేధించాలి. పౌష్టిక పదార్థాలను కలిగి ఉండే పానియాలను ప్రత్యామ్నాయంగా అభివృద్ధి పరచాలి. వ్యవసాయ రంగంలో, అనుబంధ రంగాలలో, మానవ ఆరోగ్యానికి ప్రమాద కరమైన విష రసాయనాలకు ప్రత్యామ్నాయాలను అమలు చేయాలి. అందుకు ఒక విధానం రూపొందించాలి.
ఔషధాల వ్యాపార ప్రకటనలను నిషేధించాలి. ఔషధాల చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు పర్చి, వైద్యుల చిట్టి లేకుండా ఔషదాల విక్రయాన్ని పూర్తిగా నిషేధించాలి. నకిలీ వైద్యుల బెడదను అరికట్టాలి. పారంపరిక ఔషధాల వితరణను ప్రోత్సహించకూడదు. వైద్య, ఆరోగ్య రంగాలలో అశాస్త్రీయ పద్ధతులను నిషేధించాలి. ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్ ల లైసెన్సింగ్ ను కట్టుదిట్టం చేయాలి, లైసెన్సింగ్ లో అదికారుల అవినీతిని అరికట్టాలి. తరుచూ పర్యవేక్షణ జరిపి, నిబంధనలు పాటించని ఆసుపత్రులను మూసి వేయించాలి..ప్రైవేటు ఆసుపత్రుల చార్జీలపై ప్రభుత్వ నియంత్రణను అమలు చేయాలి.
ఒక వైద్య విధానంలో డిగ్రీ సంపాదించినవారు అదే వైద్య విధానంలో ప్రాక్టీస్ చేయాలి. వేరే వైద్య విధానంలో ప్రాక్టీస్ చేయడాన్ని నిషేధించాలి. అర్హత లేని వారిని డాక్టర్లుగా నియమించే కార్పొరేట్ హాస్పిటల్సు పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. రోగులపై అధిక రుసుములు వసూలు చేసి, ఆ మొత్తంలో కొంత భాగాన్ని రిఫర్ చేసే వైద్యులకు ఇచ్చే కార్పొరేట్ వైద్యశాలలను, యాజమాన్యాలను శిక్షించాలి. వాటి లైసెన్సులను రద్దు చేయాలి.
విపరీతమైన వ్యాపారికరణ కారణంగా మానవ శరీరాన్ని సమగ్రమైన ఒక ప్రాణంగా కాకుండా లాబాలను తెచ్చిపెట్టి రోగ గ్రస్త అంగాల కూడికగా చూసే అస్త వ్యస్త ధోరణిని శాస్త్రీయంగా తిప్పికొట్టాలి. మనిషిని ప్రాణం కలిగిన సమగ్రమైన జీవిగా చూసి, అన్ని అంగాలను సమగ్రంగా చూసి, అన్నిటిమధ్య నుండే సంబంధాన్ని సజీవంగా చూసే వైద్య వ్యవస్థను పునఃస్థాపించాలి.రోగాలను, అత్యవసర పరిస్థితులను ఎదుర్కునేందుకు సమగ్ర దృష్టితో రూపొందించిన పాధారణ ప్రొటోకాల్పును అన్ని వైద్య విభాగాలలో అమలులోకి తేవాలి.
ఔషదాల పరిశ్రమలో ఉత్పత్తి పేటెంటు (Product patent)ను అమలు చేయరాదు. ప్రక్రియ పేటెంటును (Process patent) అమలు చేయాలి. ప్రజాపయోగ పరిశ్రమయైన ఔషధ పరిశ్రమలో రిసెర్చ్ ను ప్రోత్సహించాలి. ఐ.డి.పి.ఎల్ ను పునరుద్ధరించాలి ప్రాణాన్ని కాపాడే ఔషధాలను చవకగా సామాన్య ప్రజలకు అందేలా చూడాలి. కాన్సర్ ఔషదాలను చవకగా ప్రభుత్వమే అందించాలి.
అల్లోపతి విధానమే కాకుండా ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి, నాచురోపతి వైద్య విధానాలను కూడా శాస్త్ర ప్రాతిపదిక పైన అభివృద్ధి చేయాలి. ఆ వైద్య విధానాలను కార్యాకారణ సంబంధం ప్రాతిపదిక మీదికి తీసుకొని రావాలి. ఆయా విధానాలలో వాడే ఔషధాలను రసాయనికంగా విశ్లేషించి, ఏ రసాయనం ఏ శరీర భాగంపై పని చేస్తుందో పరిశోధన చేసి, ఆ ఫలితాలకు అనుగుణంగా ఆయా ఔషధాలను వినియోగించాలి.
వైద్య వృత్తిలో నానాటికి పెరుగుతున్న అవినీతి, వ్యాపార తత్వం, జవాబుదారి తనం లేక పోవడం వలన సామాన్య ప్రజల హక్కులను పరిరక్షించేందుకు వినియోగ దారుల ఫోరం లను పటిష్టం చేయాలి. వైద్యులపై, వైద్య నిబ్బంది పైన జరిగే దాడుల పట్ల చట్ట పరంగా వ్యవహరించాలి. హాస్పిటల్ యాజమాన్యాలు సేవా లోపాలు లేకుండా, డాక్టర్లకు పేషంట్లకు మధ్యన సరియైన సంబంధాలను పెంపొందించాలి. ప్రస్తుతం ప్రభుత్వాలు వైద్యానికి కేటాయిస్తున్న మొత్తాన్ని స్థూల జాతీయోత్పత్తిలో 8 శాతానికి పెంచాలి. ప్రభుత్వ ఆరోగ్య, వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఉచిత వైద్యాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా మార్చే క్రమంలో అర కొరగా అమలవుతున్న ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాలకు కేటాయించే మొత్తాలను తగ్గించవచ్చు.
Next Story