
తెలంగాణలో ఇక సాంస్కృతిక ఉద్యమాలు రావాలి
దశాబ్ధాలుగా ప్రభుత్వాలు పని గట్టుకుని మన విద్యా వ్యవస్థను ధ్వంసం చేసిన ఫలితం ఇపుడు సర్వత్రా కనిపిస్తుంది.
రైతాంగ సాయుధ విప్లవాలు సాగిన తెలంగాణ నేలలో ఇప్పుడు రైతులు నిస్సహాయంగా ఆత్మహత్యలెందుకు చేసుకుంటున్నారు? ఒకప్పుడు సాయుధ గెరిల్లా దళాలకు రక్షణ ఇచ్చేంత దట్టమైన ఆడవులున్న తెలంగాణలో ఇప్పుడు అటవీ విస్తీర్ణం తగ్గిపోయి, ఆయా జిల్లాలలో కూడా ఉష్ణోగ్రతలు ఎందుకు పెరిగి పోతున్నాయి? సాయుధ గెరిల్లా దళాలకు మార్గ మధ్యంలో దూప తీర్చిన చెరువులు, వాగులు, వంకలలో నీళ్ళు ఎందుకు విషపూరితమై పోయాయి ?
ప్రభుత్వ రంగంలో పరిశ్రమలన్నీ మూతపడిపోయి, కాలుష్య కారక ప్రైవేట్ పరిశ్రమలు రాష్ట్రమంతా విస్తరిస్తుంటే, ప్రజలకు మేలు జరిగినట్లా? కీడు జరిగినట్లా ? యువతరం శిరమెత్తితే లోకమే మారిపోదా ? చీకటే మాసిపోదా ? అని చెరబండరాజు విశ్వాసం ప్రకటించిన నేలలో , ఇప్పుడెందుకు యువతరం మద్యం, డ్రగ్స్ కు బానిసగా మారుతోంది ? ఈ ప్రశ్నలకు జవాబులు వెతుక్కోకుండా, మనకు భవిష్యత్ కార్యాచరణ ఎట్లా రూపొందుతుంది ?
1928-40 మధ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా కొమురం బీమ్ నాయకత్వంలో సాగిన ఆదివాసీల సాయుధ తిరుగుబాటు. 1930-40 దశకాలలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమం, 1970-80 దశకాలలో మార్క్సిస్ట్ - లెనినిస్టు పార్టీల నేతృత్వంలో సాగిన నక్సలైట్ సాయుధ గెరిల్లా పోరాటాలను చరిత్ర రికార్డు చేసింది. ప్రభుత్వాల నిరంకుశ పాలన, భూస్వాముల దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా సాగిన ఈ సాయుధ ఉద్యమాలు జరిగిన ప్రాంతాలలో తప్పకుండా ప్రజలకు కొన్ని విజయాలు లభిస్తాయి. లభించాయి కూడా.1960 -2010 దశకాల మధ్య సుదీర్ఘ కాలం పాటు ప్రజాస్వామికంగా సాగిన ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం, రాష్ట్ర సాధనతోనే విజయవంతంగా ముగిసింది.
ప్రజా సంఘాలు, విప్లవ పార్టీలు నిర్మించిన బలమైన ఉద్యమాలు కాలక్రమంలో బలహీన పడొచ్చు . ప్రభుత్వాల నిర్బంధాలకు గురై చెదిరిపోవచ్చు. సమాజ ఆర్ధిక, సామాజిక స్థితిగతులలో వచ్చిన మార్పుల వల్ల ఆయా ఉద్యమాలలో ప్రజల భాగస్వామ్యం తగ్గిపోవచ్చు. పూర్తి కాలం నాయకుల , కార్యకర్తల పోషణ, ఉద్యమాల నిర్మాణానికి అవసరమైన ఆర్ధిక వనరులు అందుబాటులో లేకుండా పోవచ్చు.
ఉద్యమాలు బలహీన పడినప్పుడు, ఉద్యమాలపై నాలుగు రాళ్ళు విసిరే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కనీసంగా వినిపించే గొంతులను కూడా నొక్కేయాలని ప్రభుత్వాలు చూస్తుంటాయి. దీర్ఘ కాలం పాటు ఉద్యమాల నిర్మాణమే లక్ష్యంగా పని చేసిన నాయకులలో, కార్యకర్తలలో శారీరక, మానసిన అలసట వల్ల కనీస కార్యక్రమాలు కూడా చేపట్టలేని నిస్సత్తువ ఆవహించవచ్చు.
పాలకుల ప్రలోభాలకు గురై ప్రజల పక్షం వదిలేసి శత్రు పక్షం చేరిన వాళ్ళు కూడా మన కళ్ల ముందే ఉంటారు. ఏ దేశ, ఏ రాష్ట్ర ఉద్యమాల చరిత్రను అధ్యయనం చేసినా తరతమ స్థాయిలలో ఇదే కనపడుతుంది. దీనిని సానుభూతితో అర్థం చేసుకోవచ్చు.
దోపిడీ పీడనలు, వివక్ష లేని సమ సమాజం కోరుకునే వాళ్ళు సరిగ్గా, ఈ దశలోనే సమాజంలో కొత్తగా ఏర్పడిన పరిస్థితులపై లోతైన చర్చకు, కార్యాచరణ ప్రణాళికకు సిద్ధం కావాలి. ఇందుకు గత కాలపు ఉద్యమాలను, విజయాలను, ఓటములను, పొరపాట్లను, త్యాగాలను, ద్రోహాలను నిర్మొహమాటంగా సమీక్షించుకోవాల్సి ఉంటుంది.
ప్రజా ఉద్యమ కార్యాచరణ కోసం 1960 దశకాలలో రూపొందించుకున్న కార్యక్రమాలను, నడిచే మార్గాన్ని కూడా భేషజాలకు పోకుండా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ప్రజల పట్ల బాధ్యత, సమాజంలో మౌలిక మార్పు పట్ల నిబద్ధత మాత్రమే ఈ సమీక్షలకు ప్రాతిపదికగా ఉంచుకుంటే, అహంభావాలూ, ఆత్మ న్యూనతలూ మాయమైపోతాయి.
ఆయా రాజకీయ సంస్థలకు, ప్రజా సంఘాలకు నిర్మాణ క్రమ శిక్షణ తప్పకుండా అవసరమే కానీ, “మన నిర్మాణంలో ఉంటేనే మంచి వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా పనికి మాలిన వాళ్ళు “ అనే అవగాహనను పక్కన బెడితే, సమాజంలో వ్యక్తులూ, చిన్న చిన్న సంస్థలూ చేసే కార్యాచరణను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఆయా వ్యక్తులు, సంస్థలు రోజు వారీ మాట్లాడే భాష రాజకీయ సంస్థలు మాట్లాడే ఉద్యమ పరి భాషగా ఉండకపోవచ్చు, కానీ, వారి ఆలోచన ప్రజల పక్షంగా ఉందా, లేదా అనేది మన పరిశీలనకు ప్రాతిపదికగా ఉండాలి.
మనం వేసుకోవలసిన మరో ప్రశ్న, ప్రజా ఉద్యమాలు జరిగిన ప్రాంతాలలో, అక్కడి ప్రజలలో ప్రజాస్వామిక దృక్పథం దానంతటదే కలుగుతుందా ? అది ఎప్పటికీ నిలిచి ఉంటుందా ? ఎటువంటి బోధనా లేకుండా సాధారణ ప్రజలలో పౌర స్పృహ, శాస్త్రీయ దృక్పథం, పర్యావరణ చైతన్యం వాటంతటవే ఏర్పడి పోతాయా ?
అలా సాధ్యం కాదని ప్రస్తుత తెలంగాణ నిరూపిస్తున్నది.సామాజిక, రాజకీయ కార్యకర్తలు ఎదుర్కుంటున్న తక్షణ సవాల్ ఇదే. ఒకప్పుడు ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాలు సాగించిన చోట, ప్రజలకు ఇవన్నీ మళ్ళీ చెప్పాలా ? “ ప్రజలు స్వార్ధ పరులుగా మారిపోయారు, అవినీతికి అలవాటుపడ్డారు, వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు మన ధగ్గరకు వస్తారు, మిగిలిన సమయంలో తమను దోపిడీ చేసే వాడి వెంటే తిరుగుతారు, ఇలాంటి ఈ ప్రజలకు ఎంత చేసినా, బూడిదలో పోసిన పన్నీరే” .. ఇదే మాటల్లో కాకపోయినా, చాలామంది సామాజిక, రాజకీయ కార్యకర్తల మనసుల్లో ఉన్న భావన ఇది. నిజంగా మనసును క్షోభపెట్టే సవాళ్ళు ఇవి.
సమాజంలో చైతన్యం, ఉద్యమాలు, విప్లవాలు ఎప్పుడూ ఊర్ధ్వ ముఖం గానే సాగవు. ఒక్కో దశలో ఒక్కో రకంగా, ఒక్కో సారి ఉవ్వెత్తుగా, మరో సారి నీరసంగా సాగుతాయి. ప్రతి కదలికా, ప్రతి పోరాటమూ , ఈ ఒడిదుడుకుల మార్గం లోనే సమాజాన్ని ముందుకు నెడుతుంది. ప్రజలు కొన్ని విజయాలు పొందుతారు. కొన్ని విలువలు స్థిరపడతాయి. కొన్ని హక్కులు సాధిస్తారు. కొన్ని చోట్ల స్థిరపడతారు.
మళ్ళీ కొంత కాలానికి సమాజంలో కొత్త ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిణామాలు ముందుకు వస్తాయి . అసమానతలతో కూడిన సమాజం కనుక, అవి కూడా మెజారిటీ ప్రజలను తప్పకుండా ఇబ్బంది పెడతాయి. కొద్ది మందికి ఎక్కువ మేలు చేస్తాయి. సాధారణ ప్రజల లోనే ఒక సమూహానికి కొన్ని అవకాశాలు కూడా అందిస్తాయి.
స్థానికంగా మారిన పరిస్థితులను అర్థం చేసుకోవడం, ఆ పరిస్థితులు, ఎవరిపై ఎటువంటి ప్రభావాన్ని చూపించాయో పరిశీలించడం, కొత్త పరిస్థితులలో ఎక్కువ నష్టాలకు, మోసాలకు, దోపిడీ, పీడనలకు గురవుతున్న ప్రజా సమూహాలను గుర్తించడం, వారిని చైతన్య పరచడం, సంఘటితం చేయడం, వారిని ఉద్యమాలలోకి నడిపించడం , కొన్ని విజయాలు సాధించడం - ఈ క్రమాన్ని కార్యకర్తలు, సంస్థలు మళ్ళీ మళ్ళీ ఓపికగా ప్రారంభించ వలసే ఉంటుంది. ఇందుకు మరో దగ్గర మార్గమేదీ లేదు.
సాధారణంగా ఆర్ధిక, మిలిటరీ, టెక్నాలజీ రంగాలలో ప్రపంచ వ్యాపిత పరిణామాలు , దేశంలో వివిధ స్థాయి ఎన్నికలలో విజయం సాధించే ఆయా ప్రభుత్వాల పాలనా తీరులో వచ్చే మార్పులు కూడా మన కార్యాచరణను నిర్దేశించాలి. స్థానిక ప్రజల చైతన్య స్థాయి, ప్రజలలో పని చేస్తున్న సంస్థల నిర్మాణ స్థితి, మన పోరాట రూపాలను నిర్ణయించాలి. కానీ ఇవేవీ పట్టకుండా, పాత మూస ధోరణి లోనే పరిస్థితులను వ్యాఖ్యానించడం, కార్యాచరణ చేపట్టడం నష్టం చేస్తుంది.
గత కాలానికి భిన్నంగా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మన కార్యాచరణను, అవగాహనను మెరుగు దిద్దుకునే ఈ మధ్య కాలం అత్యంత కీలకమైనది. సమాజపు మౌలిక మార్పుల పట్ల మన నిబద్ధతపై , మన అధ్యయన, పరిశీలనా సామర్ధ్యంపై అది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పాత కాలం నుండీ కొత్తగా మారిన పరిస్థితులను అర్థం చేసుకోవడంలో, వాటిని గుర్తించడంలో, వాటిని ఆమోదించడంలో ఒక వ్యతిరేకత (రిజెక్షన్) ఉంటుంది. ముందస్తుగా ఏర్పరుచుకున్న అభిప్రాయాలతో కాకుండా, ఓపెన్ మైండ్ తో పరిస్థితులను పరిశీలించడం, పరిశీలించిన విషయాలను ఇతరులతో చర్చించడం వల్ల మనకు ఒక సమగ్ర దృష్టి వస్తుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజంలో ముందుకు వస్తున్న కొన్ని పరిణామాలను అర్థం చేసుకుని, ప్రజలలో వాటి పట్ల చైతన్యం కలిగించడానికి అనేక సాంస్కృతిక ప్రచార ఉద్యమాల నిర్మాణం అవసరం. నా దృష్టిలో సాంస్కృతిక ప్రచార ఉద్యమాలంటే - వివిధ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అందుకు మూల కారణాలను విశ్లేషించి ప్రజలకు చెప్పడం, ఈ పరిణామాలకు ప్రభుత్వ బాధ్యత ఎంతో విప్పి చెప్పడం,ప్రజలు సంఘటితంగా వీటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని గుర్తింప చేయడం.
వ్యక్తులుగా, సంఘాలుగా, సంస్థలుగా, ప్రజాపక్ష రాజకీయ పార్టీలుగా ఎక్కడికక్కడ , ఎప్పటికప్పుడు , తమదైన పద్ధతిలో, లేదా ఇతరులతో సమన్వయంతో ఈ సాంస్కృతిక ప్రచార ఉద్యమాలను సాగించగలిగితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. కుల, మత దూరహంకారాలకు గురి కాకుండా విచక్షణతో విషయాలను పరిశీలించేలా, సమాజంలో వ్యక్తుల, సమిష్టి సమూహాల ఆలోచనా శక్తిని పెంచడం, వ్యక్తులు, సమూహాలు, నిత్య జీవితంలో ఆచరించే తప్పుడు పద్ధతులను, దురలవాట్లను వదిలించుకోవడం, పర్యావరణంతో, మానవ సమాజంలోని ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఉంచుకోవాల్సిన వివక్షలేని సంయమనం, స్పృహ, సంస్కారం – ఇవన్నీ ఈ సాంస్కృతిక ప్రచార ఉద్యమాల ద్వారా మనం సాధించే ఫలితాలు.
ఈ సాంస్కృతిక ప్రచార ఉద్యమ యాత్రలను ప్రభుత్వాలు నిర్వహిస్తాయన్న భ్రమలో మనం ఉండకూడదు. ఎందుకంటే, ప్రజల చైతన్య మెప్పుడూ పాలకుల నైజాన్ని ప్రశ్నిస్తుంది.పెట్టుబడిదారుల వ్యాపార దోపిడీని వ్యతిరేకిస్తుంది. ప్రజలు చైతన్య వంతులు కాకుండా మద్యం, డ్రగ్స్ లేదా కులం, మతం మత్తులో మునిగి తేలాలనే ప్రభుత్వాలు కోరుకుంటాయి. వినియోగదారీ సంస్కృతిలో పరుగులు పెడుతూ వ్యక్తులు, కెరీరిస్టులుగా మారిపోవాలని వాళ్ళ కోరిక, అందుకే సూటిగా అడిగే ప్రశ్న, సమావోహ బలాన్ని పెంచే సంఘ చైతన్యం వాళ్ళకు నిషిద్ధం. ఈ కారణం చేతనే ప్రజా సమూహాలను చైతన్య పరిచే బాధ్యత ప్రజా సంఘాలు, పౌర సమాజ వేదికలే తీసుకోవాలి.
అందుకే సంస్థలు, వ్యక్తులు ఈ తరహా కొత్త కార్యాచరణకు తమను తాము సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక సారి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల గుర్తింపు జరిగితే, వాటి పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును గమనిస్తే, మన భవిష్యత్ కార్యాచరణ కోసం నిర్ధిష్ట డిమాండ్లు రూపొందుతాయి. ఉద్యమ కార్యాచరణ మొదలవుతుంది.
తెలంగాణ లో సాంస్కృతిక ప్రచార ఉద్యమం సాగాల్సిన ఒక ఐదు అంశాలను నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. ఇవి కాకుండా, మిగిలిన వాటిని కూడా ప్రాధమికంగా తమ పనిలో భాగం చేసుకోవడం ద్వారా, కొత్త కార్యాచరణకు సంస్థలు, పార్టీలు పూనుకోవడానికి అవకాశం ఉంది. నేను ప్రస్తావించిన క్రింది క్రింది అంశాలన్నీ ఫ్యూడల్ సమాజ సంస్కృతి,, పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ విష ఫలాలే.
1. తెలంగాణ లో వివిధ కారణాల వల్ల ఏదో ఒక మేరకు పెరుగుతున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తెలంగాణ యువత అందిపుచ్చుకోవడం లేదు. ఇతర రాష్ట్రాల నుండీ యువతీ,యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ ఉపాధి అవకాశాలను అందుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం , తెలంగాణ యువతలో అవసరమైన విద్యా సామర్ధ్యాలు, సాంకేతిక నైపుణ్యాలు లేకపోవడం ఒక ముఖ్య కారణం. దశాబ్ధాలుగా ప్రభుత్వాలు పని గట్టుకుని మన విద్యా వ్యవస్థను ధ్వంసం చేసిన ఫలితమిది.
దీనికంటే కీలకమైనది డిగ్నిటీ ఆఫ్ లేబర్ ను సరిగా అర్థం చేసుకోక పోవడంలో ఉన్న సమస్యలు. ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే కొన్ని పనులు నేర్చుకోవడానికి, పని చేయడానికి తెలంగాణ యువత ముందుకు రాకపోవడం మనం గమనిస్తున్నాం. వాటి పట్ల అ గౌరవం, కుల వ్యవస్థలో ఆయా పనులను చేసిన వారిని చిన్నచూపు చూడడం, సమాజంలో చదువుకుని, కంప్యూటర్ పై లేదా ఆఫీసులలో ఫ్యాన్ ల క్రింద పని చేసే ఉద్యోగులకు ఎక్కువ గౌరవం ఇవ్వడం, మొత్తంగా శారీరక శ్రమకు ఎక్కువ విలువ లేకుండా చేయడం ఇందుకు కారణం. కొందరు కొన్ని పనులను నేర్చుకుందామన్నా, గ్రామ స్థాయిలో, నగరాల బస్తీల స్థాయిలో వాటిని నేర్చుకోవడానికి తగిన అవకాశాలు కూడా వారికి లేవు. మరో వైపు ఆయా సంస్థల యాజమాన్యాలు కూడా చవక కూలీల కోసం చూస్తూ, ఇతర రాష్ట్రాల వారిని పనిలో నియమించుకుంటున్నారు.
స్థానికులకు ఉద్యోగాల కోసం యాజమాన్యాలపై ఒత్తిడి చేయాలన్నా, ముందుగా తెలంగాణ యువత పని చేయడానికి సిద్దంగా ఉండాల్సి ఉంటుంది.
వ్యక్తికి/ కుటుంబానికి ఆదాయాన్నిచ్చే స్వయం ఉపాధి పొందడానికీ, కార్మికుడిగా/ఉద్యోగిగా కనీస వేతనాలతో పాటు, హక్కులను పొందడానికి ఏ పనైనా చేయవచ్చు అనే అవగాహన , చైతన్యం తెలంగాణ యువతకు కల్పించడం తక్షణం జరగాలి. ఇందుకొక సాంస్కృతిక ప్రచార ఉద్యమం సాగాలి. అవసరమైన మేరకు ప్రభుత్వ జోక్యాన్ని నిర్ధిష్టంగా డిమాండ్ చేయాలి.
2. మద్యం వ్యసనంలో తెలంగాణ దేశం లోనే రెండవ స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం 35,000 కోట్ల విలువైన మద్యాన్ని తెలంగాణ మగవాళ్ళు వినియోగిస్తున్నారు. మనుషుల ఆరోగ్యాలు విధ్వంసమై పోతున్నాయి. శారీరక శ్రమ చేయాల్సిన పనులలో మగవాళ్ళు చేరలేకపోతున్నారు. మద్యం కారణంగా కుటుంబాలు హింసకు గురవుతున్నాయి. తమ చుట్టూ ఏమి జరుగుతుందో గుర్తించే ఆలోచనా శక్తి నశించి పోతున్నది. దీని నుండీ తెలంగాణ లో మెజారిటీ మగవాళ్లను బయట పడేయకుండా, రాష్ట్రంలో పేద కుటుంబాలు, మరింత సంక్షోభంలో కూరుకుపోకుండా కాపాడుకోవడం కష్టం. ఈ అంశంలో కూడా ఒక సాంస్కృతిక ప్రచార ఉద్యమం అవసరం ఉంది. ప్రజలలో మద్యం అలవాటు మంచిది కాదనే ప్రచారం సాగిస్తూనే, ప్రభుత్వం రాష్ట్రంలో బెల్టు షాపులను రద్ధు చేయాలనీ, మద్య నియంత్రణతో ప్రారంభించి, మద్య నిషేధం వైపు ప్రజలు చైతన్యంతో ముందుకు సాగేలా నిర్దేశిస్తూ, ఈ కార్యక్రమం ఉండాల్సి ఉంది.
3. తెలంగాణ లో పంటల విస్తీర్ణం, ఉత్పత్తి లో పెరుగుదల గురించి జరుగుతున్న ప్రచారం నిజానికి పంటల సాగు పద్ధతుల గురించి జరగడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ లో ఇప్పుడు జరుగుతున్న పంటల ఉత్పత్తి పద్ధతులు అత్యంత అస్థిరమైనవి. విషపూరితమైనవి. రైతులను అప్పుల ఊబిలోకి దించేవి. పర్యావరణాన్ని విధ్వంసం చేసేవి. ఈ ఉత్పత్తి పద్ధతుల నుండీ రైతులు బయట పడకుండా, రైతు కుటుంబాలకు నికర ఆదాయం పెరగదు.
విష రసాయనాలు, విత్తనాలు అమ్మే బహుళ జాతి సంస్థల ప్రలోభాలతో, ప్రభుత్వాలు రసాయన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికీ రైతు సంఘాల ఎజెండాలో ఈ వ్యవసాయ పద్ధతులపై చర్చ లేదు. పర్యావరాన్ని కాపాడి, రైతులకు మేలు చేసే సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ గురించి, రైతు సంఘాలు , రైతులు ఆలోచించడం లేదు. సామ్రాజ్యవాదం నశించాలి, బహుళజాతి సంస్థలు భారత దేశం నుండీ వెళ్లిపోవలని నినదించే రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా, తమ సభ్యులు, స్వయంగా తమ కార్యకర్తలు ఈ బహుళజాతి సంస్థల ఉత్పత్తులను వినియోగిస్తుంటే, ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం లేదు.
ఈ రంగంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం(CSA) , దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ (DDS) లాంటి సంస్థలు చేస్తున్న కృషిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు. ఇప్పటికైనా, ఈ విషయాన్ని ఒక అంశంగా గుర్తించి , తమ ఎజెండా లో భాగం చేసుకోవడం, తాము పని చేస్తున్న గ్రామాలలో దీనిని ఒక సాంస్కృతిక ప్రచార ఉద్యమంగా సాగించడం అవసరం.
4. తెలంగాణ కాలుష్య కారక పరిశ్రమల హబ్ గా మారిపోతున్నది. వివిధ జిల్లాలలో 30 ఇథనాల్ పరిశ్రమలు నిర్మాణమవుతున్నాయి. ఫార్మా పరిశ్రమలు రాబోతున్నాయి. గుట్టలు,కొండలు ధ్వంసం అయిపోతున్నాయి. నదీ జలాలు తాగడానికి పనికి రాకుండా పోతున్నాయి. ఇవి ఉపాధి ఏ మేరకు చూపిస్తాయో స్పష్టత లేదు కానీ, తప్పకుండా ఆయా ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యాలను, మొత్తంగా పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి. వివిధ ప్రాంతాలలో వస్తున్న థర్మల్ విద్యుత్ స్టేషన్ లు కూడా ఇంతే ప్రమాదకరం. పర్యావరణ విధ్వంసాన్ని ఇప్పటికే రాష్ట్రం చవి చూస్తున్నది. కానీ సామాజిక , రాజకీయ సంస్థలలో ఇది ఇంకా అజెండాగా మారలేదు. అనేక చోట్ల ఈ కాలుష్య కారక పరిశ్రమలలో ప్రమాదాలు జరిగి కార్మికులు, ఇతర చుట్టుపక్కల ప్రజలు మరణిస్తున్నారనే వార్తలు పెరుగుతున్నాయి. ఈ అంశాలు కూడా ఇంకా ప్రజా సంఘాల ఎజెండాలో చేరలేదు. ఇప్పటికైనా రాష్ట్రంలో కాలుష్య కారక పరిశ్రమలకు వ్యతిరేకంగా, ప్రజలలో అవగాహన కల్పిస్తూ ఒక సాంస్కృతిక ప్రచార ఉద్యమం ప్రారంభించాల్సి ఉంది.
5. ప్రభుత్వ రంగంలో విద్యా, వైద్యం ప్రజలకు ఉచితంగా అందాలనేది అందరం కోరుకుంటాం. కానీ ఇప్పటికే 60 శాతం విద్యా రంగం ప్రైవేట్ పరమయిపోయింది. వైద్య రంగం సంగతి చెప్పే పనే లేదు. కానీ కేవలం సేవ్ ఎడ్యుకేషన్ కమిటీలో ఉన్న కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్ధి సంఘాలు , MV ఫౌండేషన్ లాంటి అమ్మల సంఘం లాంటి కొన్ని సంస్థలు తప్ప, ఇతర ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలకు ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ ఇప్పటికీ తమ ఎజెండాలో అంశం కాలేదు. పేదల గురించీ , వారి పిల్లలకు కూడా నాణ్యమైన చదువు అందడం గురించీ నినదించే సంస్థలు కొన్ని ఉన్నాయి కానీ, అవి కూడా క్షేత్ర స్థాయిలో ప్రజలలో అవగాహన కల్పించడానికి ఇంకా ఒక కార్యక్రమం తీసుకోలేదు. ఇప్పటికైనా, ఇది ఒక ప్రచార ఉద్యమంగా మారాల్సి ఉంది. ప్రజలను సమీకరించాల్సి ఉంది.