తెలంగాణకు ప్రత్యేక భూవినియోగ విధానం అవసరం
x

'తెలంగాణకు ప్రత్యేక భూవినియోగ విధానం అవసరం'

తెలంగాణలో భూసేకరణపై చర్చ పెరుగుతోంది. 2013 భూ సేకరణ చట్టం అమలు చేసి, స్పష్టమైన భూమి వినియోగ విధానం రూపొందించాలని తెలంగాణ పీపుల్స్ జేఏసీ డిమాండ్.


తెలంగాణ రాష్ట ప్రభుత్వం 2025 డిసెంబర్ 9 న విడుదల చేసిన తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లో కోర్ అర్బన్, పెరి అర్బన్, రూరల్ ఎకానమీ పేరుతో రాష్ట్రాన్నిమూడు భాగాలుగా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని ప్రకటించారు. హైదరాబాద్ నగరం నుండీ ఔటర్ రింగ్ రోడ్డు వరకూ కోర్ అర్బన్ గా ఉంటుందనీ, ఔటర్ రింగ్ రోడ్డు నుండీ రీజనల్ రింగ్ రోడ్డు వరకూ పెరీ అర్బన్ గా ఉంటుందనీ, రీజనల్ రింగ్ రోడ్డు నుండీ , రాష్ట్ర సరిహద్దుల వరకూ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థగా ఉంటుందనీ నిర్వచించారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి ప్రభుత్వాలు ఆలోచించడంలో తప్పు లేదు కానీ, సమాజంలో అన్ని వర్గాల ప్రజలతో అందుకు అవసరమైన చర్చ , సహజ వనరుల వినియోగంలో శాస్త్రీయత, వాతావరణ మార్పులకు అనుగుణంగా పర్యావరణ స్పృహతో ఆయా రంగాల అభివృద్ధి ప్రణాళికలు అవసరమవుతాయి. ఇవేవీ పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, రహదారుల చుట్టూ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను విభజించడం అత్యంత అపసవ్యమైనది. అర్థం లేనిది.

రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికకు సహజ వనరుల వినియోగం అత్యంత కీలకం. ఇందులో భూమి, నీరు, అడవులు, ఖనిజ సంపద ముఖ్యమైన సహజ వనరులు అనుకుంటే, వీటి వినియోగం ఎంత బాగా చేసుకుంటామన్నది, స్థానిక ప్రజల దృష్టి కోణం నుండీ మాత్రమే ఆలోచించాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల జీవనోపాధుల రక్షణ, కల్పన ఇందుకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ఉండాలి. మనుషులకు, ఇతర జీవులకు ప్రాణాధారమైన గాలి, నీరు, ఆహారం, విష పూరితం కాకుండా కాపాడుకోవడం కూడా ఈ అభివృద్ధి ప్రణాళికలో, వనరుల వినియోగంలో అత్యంత కీలక భాగంగా ఉండాల్సి ఉంటుంది.

ఇప్పుడున్న వృద్ధి రేటు ప్రకారం 2047 సంవత్సరం నాటికి తెలంగాణ రాష్ట్ర జనాభా 5 కోట్లకు పైబడి ఉంటుందని అంచనా. ఆవులు, గేదెలు, ఎడ్లు, దున్నపోతులు, మేకలు, గొర్రెలు, పందుల లాంటి పశువుల జనాభా( కోళ్ళు కాకుండా) కూడా ఐదు కోట్లు దాటే అవకాశం ఉంటుంది. ఈ మనుషులకు, పశువులకు, కోళ్లకు అవసరమైన ఆహార బధ్రత కోసం పంటల, ఉత్పత్తికి తగినంత భూమి అవసరమవుతుంది. అందువల్ల సాగు భూములను కాపాడుకోవాలి.

రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు,సేవా రంగాలు,మైనింగ్, చేపల పెంపకం లాంటి రంగాలు సమగ్రంగా, సమతులంగా అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటాం. కానీ వీటికి కావలసిన వనరులను కేటాయించడానికి , సహజ వనరుల వినియోగ విధానం, ముఖ్యంగా భూమి, నీరు వినియోగ విధానం ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ స్పష్టంగా రూపొందించలేదు. రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఇదే ధోరణి భవిష్యత్తులో కొనసాగితే, వనరుల వినియోగంలో రాష్ట్రం తీవ్రమైన అస్థిరతను ఎదుర్కుంటుంది. ఒకసారి కోల్పోయిన ప్రకృతి వనరులను మళ్ళీ వెనక్కు తీసుకు రావడం అసాధ్యం. వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ, వనరులు శాశ్వతంగా ధ్వంసం అయిపోతే, రాబోయే కాలంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కునేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఇతర ప్రాణులు మాత్రమే.

రాష్ట్రం ఇప్పటికే కొన్ని సహజ వనరుల పరిమితులలో ప్రయాణం చేస్తున్నది. ప్రపంచ వ్యాపితంగా సంభవిస్తున్న వాతావరణంలో మార్పుల కారణంగా మన వానాకాలం, చలికాలం, ఎండాకాలం సీజన్ లు పూర్తిగా అదుపు తప్పాయి. అకాల వర్షాలు, భారీ వర్షాలు, వర్షాభావ పరిస్థితులు, వరదలు, తీవ్రమైన ఎండలు, ఈదురు గాలులు, అత్యల్ప ఉష్ణోగ్రతలు, వడగండ్లు, అడుగంటుతున్న భూగర్భ జలాలు, ప్రజల, పశువుల ప్రాణాలకు, పంటలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి.

రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు, నేలల స్వభావానికి అనువు కాని పంటల పొందిక కారణంగా వ్యవసాయంలో భారీగా పెరుగుతున్న నీటి వినియోగం, విష రసాయనాల వినియోగం భూ సారాన్ని దెబ్బతీయడమే కాదు, రాష్ట్రంలో ఉద్గార వాయువులను మరింతగా పెంచుతున్నాయి. నీటి వనరులను కూడా విష పూరితం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఆహారం కూడా అత్యంత విష పూరితంగా తయారై , మనుషుల, పశు సంపద ఆరోగ్యాలకు చేటు తెస్తున్నది. సహజంగా తెలంగాణ భౌగోళిక స్వభావం రీత్యా, నీటి వనరుల వినియోగం కోసం అనివార్యంగా అత్యధిక విద్యుత్ వినియోగం జరుగుతున్నది. రాష్ట్రంలో తలసరి విద్యుత వినియోగం పెరగడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటాయి కానీ, రాష్ట్ర సుస్థిర , పర్యావరణ హితమైన అభివృద్ధి నమూనాకు అది సూచిక ఎంత మాత్రం కాదు.

రాష్ట్రంలో నగరాల విస్తరణ , నగరాల అభివృద్ధి పేరుతో, విచ్చలవిడిగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం,పెద్ద సంఖ్యలో రాష్ట్ర స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి సిద్దపడని కృత్రిమ మేధ, కంప్యూటరీకరణ, రోబోట్స్ ఆధారిత అంతర్జాతీయ స్థాయి సేవా రంగ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, వాటిలో వివిధ రాష్ట్రాల నుండీ తరలి వస్తున్న వలస కార్మికులు, అతి తక్కువ వేత్తనాలతో దోపిడీకి గురవుతూ ఉపాధి పొందడం, ఎలాంటి విచక్షణ లేకుండా వివిధ రకాల కాలుష్య కారక పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించడం – ఇవన్నీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి పట్ల దీర్ఘ దృష్టి లేని, రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలనే బయట పెడుతున్నాయి.

ఏ కోణంలో చూసినా రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగపడని ఈ బడా కార్పొరేట్ సంస్థల కోసం ఇస్తున్న పన్ను రాయితీలు, ఆయా పారిశ్రామిక ప్రాంతాలకు ప్రభుత్వ నిధుల నుండీ మౌలిక వసతుల కల్పన, కార్మిక చట్టాల మినహాయింపులు, శ్రామికుల పని గంటల పెంపు, కార్మిక సంఘాల ఉనికిని గుర్తించక పోవడం, మొత్తంగా కార్మిక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి లాంటి సంస్థలను నిర్వీర్యం చేయడం -ఇవన్నీ కొత్త అభివృద్ధి నమూనాలో భాగంగా ఉన్నాయి. నిజంగా 2047 విజన్ ఇదే అయితే, దీనిని రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర వనరులకు అన్యాయం చేసే విజన్ గానే మనం నిర్ధారించుకోవాలి.

ఈ అభివృద్ధి నమూనా కోసం , రాష్ట్రంలో ప్రభుత్వం సాగిస్తున్న భూ సేకరణ పద్ధతి కూడా మరింత అన్యాయంగా ఉంది. పరిశ్రమలకు, సేవా రంగ సంస్థల ఏర్పాటుకు, రహదారుల విస్తరణకు నిజంగా భూమి అవసరమవుతుందనుకున్నా,భూమి వినియోగ విధానం లేకుండా, అడ్డగోలుగా లక్షలాది ఎకరాల భూమిని సేకరించడం సరైంది కాదు. పైగా కార్పొరేట్ సంస్థల సరుకుల వేగవంతమైన రవాణాకు తప్ప రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని రీజనల్ రింగు రోడ్డు కోసం, లేదా ఏ మాత్రం ప్రజా ప్రయోజనం లేని కొన్ని బడా సంస్థలకు భూమి కేటాయించడానికి కొత్తగా నిర్మించాలని తలపెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం భూములను రైతుల నుండీ సేకరించడం అన్యాయమే అవుతుంది.

రాష్ట్రంలో దూకుడుగా కొనసాగిస్తున్న భూ సేకరణ అంశంలో చర్చకు వస్తున్న కొన్ని కీలక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. వాటిపై ప్రజలకు కూడా జవాబు చెప్పాలి. గత మూడు దశాబ్ధాలలో రాష్ట్రంలో వివిధ పార్టీల ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో సేకరించిన భూమిని నిజంగా వినియోగించారా? ఆ భూమిలో ఏయే సంస్థలు పెట్టుబడులు పెట్టాయి? వాటిలో తెలంగాణ స్థానికులకు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి? ఈ భూసేకరణ ప్రక్రియ లో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఎంతమందికి గౌరవ ప్రదమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయా అనేది స్పష్టంగా ప్రజల ముందు ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి.

గ్రామీణ ప్రజల హక్కులను హరిస్తూ, BRS ప్రభుత్వ పాలనా కాలంలో 2017 లో KCR తెచ్చిన భూసేకరణ చట్టాన్ని రద్ధు చేసి, 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం మానిఫెస్టో లో హామీ ఇచ్చినట్లుగా 2013 భూసేకరణ చట్టాన్ని( సోనియా గాంధీ నేతృత్వంలో అప్పటి UPA ప్రభుత్వం తీసుకు వచ్చిన) పూర్తి స్థాయిలో అమలు చేయాలి.

ఈ చట్టం ప్రకారం భూసేకరణకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ తప్పకుండా చేయాలి. సామాజిక ప్రభావ మదింపు తప్పకుండా చేయాలి. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చే ముందే మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల రిజిస్టర్డ్ ధరలను సవరించాలి(ఎక్కువ వ్యత్యాసం లేకుండా). రెండు పంటలు పండే భూములను ఎట్టి పరిస్థితుల లోనూ సేకరించకూడదు. అసైన్డ్ భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాలి. కేవలం భూ యాజమానులనే కాకుండా ప్రాజెక్టు ప్రభావిత బాధిత ప్రజలకు కూడా నష్ట పరిహారం చెల్లించాలి.

ఒక అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో భూమి సేకరించే ముందు, నిజంగా అది ఎంత ప్రజా ప్రయోజనకరమో ప్రజలకు క్షేత్ర స్థాయిలో వివరించాలని, వారిని ఒప్పించి మాత్రమే భూమిని తీసుకోవాలి. నిజంగా పరిశ్రమలు, రోడ్లు లాంటి ప్రాజెక్టుల కోసం అవసరమైన భూమిని, రైతుల నుండీ పూర్తిగా లాక్కోకుండా, వారి భూములపై వారికి ఉండే పట్టా హక్కులు మార్చకుండా, ఆయా భూముల యాజమనుల నుండీ భూమిని దీర్ఘ కాలానికి లీజుకు ( కౌలుకు) తీసుకుంటే మంచిది. అలా కొన్ని దేశాలు, కొన్ని రాష్ట్రాలలో ఈ విధానం అమలవుతున్నది.

అలా కాకుండా, వచ్చే పరిశ్రమలు, సంస్థలకు సంబంధించి స్పష్టత లేకుండా, ఎలాంటి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు లేకుండా, ఆ ప్రత్యేక పారిశ్రామిక జోన్ లోకి నిజంగా వస్తాయో లేదో తెలియని పరిశ్రమల కోసం, ముందుగానే, వేలాది ఎకరాల భూములను రైతుల నుండీ బలవంతంగా సేకరించడం, పైగా ఆ భూములకు అతి తక్కువ నష్ట పరిహారం చెల్లించడం అన్యాయం. ఇప్పటికే అలా సేకరించిన భూముల్లో, వచ్చిన పరిశ్రమలు చాలా తక్కువనీ, వచ్చిన కొద్ది పాటి పరిశ్రమలు, సంస్థలలో కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు.

ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త భూ సేకరణ పూర్తిగా ఆపేయాల్సిన అవసరముంది. ఇప్పటికే భూ సేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ లను కూడా రద్ధు చేయాలి. రాష్ట్ర భూ వినియోగ విధానం రూపొందించి, నిజంగా అవసరమైన సందర్భంలో మాత్రమే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అన్ని నిబంధనలు అనుససరించి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణకు వెళ్లాల్సిన అవసరముంది.

Read More
Next Story