తెలంగాణ బడ్జెట్ దారి తప్పింది
x
కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణ బడ్జెట్ దారి తప్పింది

బడ్జెట్ సైజు పెరిగింది. మన గ్రామం, మన తండా, మన నగర బస్తీ ల సమగ్ర అభివృద్ధికి తగిన నమూనా రూపొందించడం మన పాలకులకు చేత కావడం లేదంటున్నారు కన్నెగంటి రవి



2023 డిసెంబర్ 7 న తెలంగాణలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ను జులై 25 న అసెంబ్లీ లో ప్రవేశ పెట్టింది. లోక్ సభ ఎన్నికల ముందు ఫిబ్రవరి 10 న మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టిన రేవంత్ ప్రభుత్వం అప్పుడు ప్రతిపాదించిన బడ్జెట్ పరిమాణం కంటే ( 2,75,891 కోట్లు ) మరో 5.53 శాతం పెంచి, ఇప్పుడు 2,91,153 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించింది.

రాష్ట్ర పన్నుల ఆదాయం, కొత్తగా అప్పులు చేసేందుకు ఉండే పరిమితులు, కేంద్ర ప్రభుత్వ పన్నుల ఆదాయంలో వాటా, కేంద్రం అందించే గ్రాంట్ లు, పన్నేతర ఆదాయం పై వాస్తవిక అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ పరిమాణం ఉండాలని, అలా కాకుండా, బడ్జెట్ లో అంకెలు భారీగా పెంచి ప్రతిపాదించడం వల్ల, ఉపయోగం లేదని ,గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించేది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక అదే చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడుస్తున్నది. గత ప్రభుత్వం తనకు తోచినట్లుగా వ్యవహరించి, రాష్ట్రాన్ని అప్పల పాలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నమైన పాలన అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. రోజువారీ పాలన గానీ, బడ్జెట్ కేటాయింపులు కానీ అందుకు అనుగుణంగా ఉండాలి.

మొత్తం బడ్జెట్ లో నిధుల కేటాయింపుకు ప్రాధాన్యతలు ముందుగానే నిర్ణయించుకోవాలని, లేనట్లయితే, నిధుల కొరత పేరుతో, ప్రజల నిజమైన ప్రయోజనాలకు , సంక్షేమానికి కోత పడే అవకాశముందని కూడా హెచ్చరించినా, విద్య, వైద్యం, చేయూత, గృహ నిర్మాణం లాంటి కొన్ని కీలక రంగాలకు నిధులు పెద్దగా కేటాయించకుండా, రేవంత్ ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరం, మెట్రో, హైడ్రా , రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్ లాంటి తనవైన ప్రాధాన్యతలతో బడ్జెట్ కేటాయింపులు చేసింది.

మన గ్రామం, మన తండా, మన నగర బస్తీ ల అవసరాలకు అనుగుణంగా సమగ్ర అభివృద్ధి నమూనా రూపొందించడం మన పాలకులకు చేత కావడం లేదు. ఎంతసేపూ అరువు తెచ్చుకున్న విదేశీ నమూనాలే కనపడతాయి. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు తో మొదలైన ఈ పైత్యం ఇప్పుడు పరాకాష్ట కు చేరింది. అధికారంలోకి వచ్చాక అన్ని రాజకీయ పార్టీలదీ అదే దారిగా ఉంది. సింగపూర్ మోడల్, డల్లాస్ మోడల్, లండన్ థేమ్స్ నది మోడల్ – ఇవన్నీ అదే కోవలోకి వస్తాయి. గ్రామీణ మౌలిక సదుపాయాలు , మన స్కూలు , మన ఆసుపత్రి, పేద కుటుంబాలకు ఇల్లు, బలహీనులకు, సాధారణ ప్రజలకు జీవనోపాధి, ఆహార బద్రత, ఆదాయ బధ్రత, నిస్సహాయులకు పెన్షన్ లాంటి సామాజిక న్యాయ భాష ప్రభుత్వాల బుర్రలకు ఎక్కడం లేదని, ఈ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కూడా మరో సారి నిరూపించింది.

వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో అతి పెద్ద వాటా ( 72,000 కోట్లు) దక్కినట్లు కనిపిస్తుంది కానీ, తరచి చూస్తే, అందులో డొల్ల తనం కనిపిస్తుంది.

పంటల బీమా తిరిగి పునరుద్ధరణ , వ్యవసాయ కూలీలకు కూడా రైతు భరోసా, సన్న ధాన్యానికి బోనస్ లాంటివి తప్పకుండా మంచి ముందడుగులుగా చెప్పుకోవచ్చు.

కానీ, వ్యవసాయ రంగం బడ్జెట్ పరిధిలోకి సాగు నీటి ప్రాజెక్టులు, విద్యుత్ సబ్సిడీ లాంటి పథకాలు కలపడం సరైంది కాదు. గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటిని వ్యవసాయ రంగ బడ్జెట్ లో కలిపి చూపించే ప్రయత్నం చేశాయి కానీ అలాంటి ధోరణిని, ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు తప్పు పట్టింది. ఋణమాఫీ కూడా ప్రతి సంవత్సరం ఉండే, బడ్జెట్ కేటాయింపు కాదు.

కాబట్టి వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపును వాస్తవిక దృష్టితో చూడాలి తప్ప, భారీ అంకెను ప్రొజెక్టు చేయడం పెద్దగా ఉపయోగపడదు. నిజానికి వ్యవసాయ రంగంలో వివిధ పథకాలకు చేసిన కేటాయింపులు, మొత్తం రైతాంగానికి ఆ పథకాలను అందించడానికి సరిపోవు.

ఉదాహరణకు 25 లక్షల కుటుంబాలకు చెందిన 44 లక్షల మంది రైతులకు రెండు లక్షల వరకూ రుణాలను మాఫీ చేయడానికి 31,000 కోట్లు అవసరమవుతాయని అట్టహాసంగా ప్రకటించి, పథకం అమలును ప్రారంభించి, పాలాభిషేకాలు కూడా పూర్తి చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు తాజాగా బడ్జెట్ లో మాత్రం ఈ పథకానికి 26,000 కోట్లు మాత్రమే కేటాయించడం రైతులలో అనుమానాలకు తావు ఇస్తున్నది. నిజమైన రైతులనేకమందికి లక్షలోపు మొదటి విడత ఋణమాఫీ ఇంకా అమలు కాలేదని, జీవో లో పెట్టిన రేషన్ కార్డు నిబంధన వల్ల, ఋణమాఫీకి రేషన్ కార్డు అవసరం లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్నా, ఆచరణలో ఆయా కుటుంబాలలో సభ్యులను జోడించి, ఋణమాఫీ చేయడం సాధ్యం కావడం లేదనీ, అలాంటి కేసులలో రైతులు ఋణమాఫీ అమలు కాక నష్టపోయే ప్రమాదం ఉందనీ గ్రామాల నుండీ ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో, ఆ పథకం అమలు ముగిసేలోపు రైతుల నుండీ అనేక సమస్యలు తప్పకుండా వ్యక్తం కావచ్చు.

రైతు భరోసా పథకానికి కూడా ఇంతవరకూ విధి విధానాలు ఖరారు కాలేదు. ఎంతమంది రైతులకు, ఎంత విస్తీర్ణం భూమికి రైతు భరోసా సహాయం అందుతోందో స్పష్టత లేదు. కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో, ఎంతమందిని గుర్తిస్తారో స్పష్టత లేదు. ఆ విధి విధానాలను ఇప్పటికే ఖరారు చేసి ఉంటే, ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులపై ఒక స్పష్టత వచ్చేది .

సంవత్సరానికి ఎకరానికి 10,000 చొప్పున , 69 లక్షల మంది రైతులకు ఒక కోటీ 51 లక్షల ఎకరాలకు రైతు బంధు సహాయం అందించడానికి గత సంవత్సరం 15,075 కోట్లు కేటాయించారు. రైతు భరోసా సహాయం క్రింద ఎకరానికి 15,000 రూపాయలు అందిస్తామని ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం, ఈ సంవత్సర బడ్జెట్ లో మాత్రం అదే 15,075 కోట్లు మాత్రమే కేటాయించడం అనుమానాలకు తావు ఇస్తున్నది. రైతుల సంఖ్య ఎంత ఉన్నా, కేవలం కోటి ఎకరాలకు మాత్రమే ఈ నిధులు సరిపోతాయి.

ఆ మేరకు రైతు భరోసా అందుకునే రైతుల సంఖ్య, భూ విస్తీర్ణం తగ్గిపోవచ్చు. బయట ప్రాంతాలలో ఏడున్నర ఎకరాలకు , ఆదివాసీ ప్రాంతాలలో 10 ఎకరాల వరకూ రైతు భరోసా సహాయం అందిస్తే సరిపోతుందని రైతు స్వరాజ్య వేదిక లాంటి సంస్థలు భావించినా, పదెకరాల వరకూ సహాయం అందించాలని కొన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ప్రభుత్వానికి తమ అభిప్రాయంగా చెప్పాయి. కానీ ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు చూస్తే మాత్రం రబీ సాగు విస్తీర్ణం పట్ల , ప్రభుత్వం ఎటువంటి అభిప్రాయం కలిగి ఉంది అనేది ప్రశ్నార్ధకం. ఈ పద్దుకు బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయించారు అనే కంటే, ఆ కేటాయించిన నిధులు దుర్వినియోగం కాకుండా నిజమైన రైతులకు ఉపయోగపడేలా ఉండాలని మాత్రమే మనం కోరుకోవాలి.

సన్న ధాన్యానికి బోనస్ పథకానికి ప్రభుత్వం బడ్జెట్ లో 1800 కోట్లు మాత్రమే కేటాయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద సన్న బియ్యం పంపిణీకి , స్కూల్స్ లో మధ్యాహ్న భోజన పథకానికి, సంక్షేమ హాస్టల్స్ కు సన్న బియ్యం సరఫరా చేయడానికి కనీసం 20 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఇందుకోసం కనీసం 30 లక్షల టన్నుల సన్న ధాన్యం సేకరించాల్సి ఉంటుంది. వీటికి ప్రస్తుతం బడ్జెట్ లో కేటాయించిన నిధులు సరిపోతాయి. కానీ, రాష్ట్రంలో పండే మిగిలిన సన్న ధాన్యాన్నికూడా ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు 2800 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తే, ప్రభుత్వం పై ఒత్తిడి ఉండదు. ఒకవేళ ప్రైవేట్ వ్యాపారులు,ఆ పని చేయడానికి ముందుకు రాకపోతే, రైతులు పండించిన మొత్తం సన్న ధాన్యాన్ని ప్రభుత్వమే బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ నిధులు సరిపోవు. మొత్తం సన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతులకు అన్యాయం చేయడమే. రాజకీయంగా రైతుల వ్యతిరేకతను మూటగట్టుకోవడమే .

రైతు బీమా పథకానికి కూడా బడ్జెట్ లో 1590 కోట్ల నిధులు మాత్రమే కేటాయించారు. మానిఫెస్టో లో హామీ ఇచ్చినట్లుగా భూ యాజమనులతో పాటు, భూమి లేని కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను కూడా పూర్తి స్థాయిలో గుర్తించి, రైతు బీమా పథకం అమలు చేయాలంటే ఈ నిధులు సరిపోవు.

వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 చొప్పున రైతు భరోసా సహాయం అందిస్తామని ఇచ్చిన హామీకి బడ్జెట్ లో 1200 కోట్లు కేటాయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 60 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. అంటే కనీసం 15 లక్షల కుటుంబాలన్నమాట. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రైతు భరోసా సహాయం అందించాలంటే, కనీసం 1800 కోట్లు అవసరం . కానీ ప్రస్తుతం బడ్జెట్ లో కేటాయించిన నిధులు కేవలం 10 లక్షల కుటుంబాలకు మాత్రమే సరిపోతాయి.

పంటల బీమా పథకానికి బడ్జెట్ లో 1300 కోట్లు కేటాయించారు. 2020 నుండీ KCR ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపి వేసింది. ప్రస్తుతం ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించడం, రైతు వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పడం మంచి పరిణామాలు. కానీ, కేంద్రం తన ప్రీమియం వాటా కేవలం 30 శాతానికి తగ్గించుకున్న దశలో రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 70 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం కోటి ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకురావలనుకున్నా, ఎకరానికి ప్రీమియం కనీసం మూడు వేలు అయ్యే అవకాశం ఉంది. అంటే కనీసం ఒక్కో ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం గా 2,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ 65 లక్షల ఎకరాలకు మాత్రమే సరి పోతుంది. మరి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తుంది, ఎన్ని ఎకరాలకు ప్రీమియం చెల్లిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.

గత ప్రభుత్వానికి భిన్నంగా ఈ బడ్జెట్ లో విత్తన సబ్సిడీకి కనీసం 109 కోట్ల నిధులు కేటాయించడం మరో మంచి అంశం. మొత్తం విత్తన వ్యవస్థను పునరుద్ధరించడానికి ఈ నిధులు సరిపోవు కానీ , రాబోయే రోజుల్లో మరిన్ని నిధుల కేటాయింపుకు , ఈ సంవత్సరం వచ్చే అనుభవాలు దారి తీస్తాయని అనుకోవచ్చు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు కూడా కొన్నేళ్లుగా నిధులు ఖర్చు చేయడం లేదు. గత సంవత్సరం బడ్జెట్ లో 377 కోట్లు ఇందుకోసం కేటాయించినా, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఈ సారి కూడా అతి తక్కువే కేటాయించారు. బడ్జెట్ లో రైతు వేదికలకు 47.53 కోట్లు కేటాయించడం ఉపయోగకరమైనది. ఆ నిధులను ఎక్కువగా రైతులకు, గ్రామీణ యవతకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించడం మంచిది.

వ్యవసాయ రంగాన్ని కాసేపు పక్కన బెడితే, కీలకమైన విద్యా రంగానికి చేసిన కేటాయింపులు దారుణంగా ఉన్నాయి. విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల మానిఫెస్టో లో రాశారు. కానీ ఆచరణలో కేవలం 7.31 శాతం మాత్రమే ( 21,292 కోట్లు) కేటాయించారు. ఆ నిధులతో విద్యారంగ మౌలిక సమస్యలు పరిష్కారం కావు. పాత సమస్యలు కొనసాగి ఆ రంగం మరింత దిగజారే అవకాశమే ఉంది.

వైద్య , ఆరోగ్య రంగానికి కూడా ఈ సంవత్సరం బడ్జెట్ లో నిధులు ( 11,468 కోట్లు) గత సంవత్సరం (12,161 కోట్లు) కంటే తగ్గించారు. 2022-2023 లో వైద్య, ఆరోగ్య రంగానికి 4.37 శాతం , 2023-2024 లో 4.18 శాతం బడ్జెట్ కేటాయింపులు జరగగా, ఈ సంవత్సరం కేవలం 3.93 శాతానికి తగ్గించడం ఘోరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసుల ప్రకారం ఈ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర GDP లో, రాష్ట్ర GSDP లో 5 శాతం చొప్పున నిధులు కేటాయించాల్సి ఉండగా , కనీసం బడ్జెట్ లో అయినా ఐదు శాతం నిధులు కేటాయించక పోవడం అన్యాయం.

అన్నిటి కంటే అన్యాయం చేయూత పథకానికి నిధుల కేటాయింపు తగిన స్థాయిలో చేయక పోవడం. ఆసరా పెన్షన్ పేరును చేయూత గా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతమున్న 2016 రూపాయల పెన్షన్ ను 4000 రూపాయలకు, దివ్యాంగుల పెన్షన్ ను 3000 రూపాయలనుండీ 6,000 రూపాయలకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. దీని కోసం బడ్జెట్ లో భారీగా నిధులు అవసరమవుతాయి. పైగా 2023 సెప్టెంబర్ నుండీ పెన్షన్ దరఖాస్తులు కొత్తవి తీసుకోవడం లేదు. అనేకమంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఈ బడ్జెట్ లో కేవలం 14,861 కోట్లు మాత్రమే కేటాయించారు. గత సంవత్సరం ప్రకటించిన 12,000 కోట్ల బడ్జెట్ తో పోల్చితే, కొద్దిగా పెంచినా, ఈ అంశంలో ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి నిధులు సరిపోవు. 6 గ్యారంటీలలో భాగంగా, మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్న హామీకి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకానికి కూడా లక్ష్యానికి అనుగుణంగా నిధులు కేటాయించలేదు.

ముచ్ఛర్ల ఫార్మా సిటీ రద్ధు చేసినప్పటికీ, ఫార్మా విలేజెస్ నిర్మిస్తామని ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా బడ్జెట్ లో కొత్తగా ప్రకటించిన ఔషధ గ్రామాలలో భూసేకరణ కోసం 50 కోట్లు కేటాయించింది. ఇది అత్యంత ప్రమాదకరమైన నిధుల కేటాయింపు.

రీజనల్ రింగ్ రోడ్డు కూడా రాష్ట్రానికి అనవసర ప్రాజెక్టు . వేలాది ఎకరాల సాగు భూములను అది కబళిస్తుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహాయం చేస్తుండవచ్చు కానీ, నష్టపోయేది తెలంగాణ మాత్రమే. రింగ్ రోడ్లు, ఎక్స్ప్రెస్ హైవే లు, పారిశ్రామిక వర్గాలకు, కార్పొరేట్ సంస్థల సరుకుల రవాణాకు ఉపయోగపడినట్లుగా స్థానిక ప్రజలకు పెద్దగా ఉపయోగపడవు. మోడీ ప్రభుత్వం నిత్యం కార్పొరేట్ సంస్థల కోసమే పని చేస్తుంది కనుక, దానిని అర్థం చేసుకోవచ్చు, కానీ నిధుల కొరత ఉన్న దశలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్ నుండీ 1525 కోట్లు కేటాయించడం తప్పు.

అలాగే హైదరాబాద్ నగరానికి 10,000 కోట్లు కేటాయించడం కూడా వాయిదా వేసుకోగలిగిన పద్దు. కాళేశ్వరం లాగే, లక్షన్నర కోట్ల ఖర్చు ఆంచనా వేస్తున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్ లో 1500 కోట్లు కేటాయించడం కూడా అవినీతికి తొలి పునాది రాయి వేయడమే. గుజరాత్ సబర్మతి రివర్ ఫ్రంట్ పథకం , మోడీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక నమో గంగా పథకం అనుకున్న ఫలితాలు ఇవ్వడం లేదని ఇప్పటికే అనేక నివేదికలు వస్తున్న దశలో ఈ కేటాయింపులు సరి కావు.

మూసీ నదిని బాగు చేసుకోవాల్సిందే. మూసీలోకి కాలుష్యం వదులుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి. పరిసరాలను, నదులను కాపాడుకునే పర్యావరణ స్పృహను ప్రజలలోపెంచడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలను ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయాలి. అదేమీ చేయకుండా, భారీగా నిధులు కేటాయించి, కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేయడం ద్వారా మూసీని బాగు చేయడం అసాధ్యం.

దశాబ్ధాలు గడిచినా, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దగా నిధులు కేటాయించకుండా, చంద్రబాబు, KCR తరహాలోనే నగరాల చుట్టూ అభివృద్ధి కేంద్రీకరణ నమూనాలో రేవంత్ ప్రభుత్వం కూడా వెళ్ళడం ఏ మాత్రం సరైంది కాదు . కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అభివృద్ధి నమూనాను ముందుకు తీసుకు వెళ్ళడం, ప్రజా పాలన నుండీ దారి తప్పడమే.

Read More
Next Story