తెలంగాణకు పదేళ్లు, కేసీఆర్ ఓటమికి పది కారణాలు
x

తెలంగాణకు పదేళ్లు, కేసీఆర్ ఓటమికి పది కారణాలు

పదేళ్లలో తెలంగాణ - 6 బిఎస్ రాములు విశ్లేషణ: దళితబంధు పది లక్షలు అంటూ ఉద్యోగులకు కూడా ఇస్తామన్నారు. బీసీలు మాకేది అంటే లక్ష అంటూ లక్ష సర్టిఫికెట్లు అడిగారు.


తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా చంద్రబాబు నాయుడు హయాం నుండి సాగుతున్న రాజకీయాలే కొనసాగుతున్నాయి. చంద్రబాబు కాలం నుంచి రియల్ ఎస్టేట్ డబ్బులు, సినిమా డబ్బులు కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు అన్ని రంగాలకు ఆక్రమించి విస్తరిస్తున్నారు. రాజకీయాల్లో కూడా వాళ్ళే ప్రత్యక్షమయ్యారు.

తెలంగాణ ఉద్యమ చైతన్యంతో ఆయా సామాజిక వర్గాలను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా టిఆర్ఎస్ , కాంగ్రెస్ నిలబెట్టి ఉంటే ఈ స్వభావం , పరిణామం మలుపు తిరిగి ఉండేది. పేదలు, బీసీ, ఎస్టీలు అలా అధికారంలోకి రాకూడదని కేసిఆర్ భావించారు. అందువల్ల అదే దుస్థితి రాజకీయాలను శాసిస్తున్నది. ఈ దుస్థితి పోవాలంటే ఆర్థిక చైతన్యమే కాకుండా, ఉచిత పథకాలే కాకుండా రాజకీయ చైతన్యం, సామాజిక వర్గాల చైతన్యం పెంచడం, పెరగడం ఎంతో అవసరం.

భారత రాజ్యాంగ మౌలిక విలువలు, అభివృద్ధి ప్రణాళికను నిరంతరం ప్రజలకు తెలియజేయడం అవసరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చెరువుల పూడికతీత ద్వారా ఒక గొప్ప స్ఫూర్తి నింపింది. మిషన్ భగీరథ ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా ఒక ఉత్తేజాన్ని కలిగించింది. సకాలంలో వర్షాలు పడడం వల్ల టిఆర్ఎస్ పరిపాలనలో పంటలు సమృద్ధిగా పండాయి. అనుకున్నదానికన్నా ఎక్కువ దాన్యం పండింది. కేంద్ర ప్రభుత్వం కొనలేము అనే దశ దాకా అభివృద్ధి సాగింది.

అయితే ప్రాజెక్టుల సాగునీరు రాష్ట్రానికి మేలు చేసిందా? కీడు చేసిందా? ఎవరికి మేలు చేసింది? ఏ ఏ పంటలకు మేలు చేసింది? ఏ ఏ పంటలకు కీడు చేసింది? ఏ ప్రాంతానికి మేలు చేసింది? ఏ ప్రాంతానికి కీడు చేసింది? పరిశీలించడం అవసరం.
1.

గోదావరి నదిపై కట్టే ఆనకట్టలు కాలేశ్వరం ప్రాజెక్టు 220 కిలోమీటర్లు దూరం ఎత్తిపోతలతో తిరిగి నిజామాబాద్కు, మహబూబ్ నగర్ , నల్గొండకు సాగునీరు అందిస్తుందని భావించారు. భ్రమ పెట్టారు. ఒక టిఎంసి నీరు ఆరున్నరవేల ఎకరాలకు సాగునీరును అందిస్తుంది. కాగా ఒక టిఎంసి నీరు పదిహేను వేల ఎకరాలకు అందిస్తుందని తప్పుడు లెక్కలు చూపారు. ఆరు తడి పంటలకు కూడా అది సరిపోదు. అది అలా ఉండనీయి !

2.

దాని తాలూకు వేల కోట్ల అవినీతి, అశాస్త్రీయ నిర్మాణాలు సంగతి అలా ఉండనీయి! ఈ సాగునీటి ప్రాజెక్టులవల్ల వరి పంటకు ప్రాధాన్యత పెరిగింది. మక్కలు , జొన్నలు , నువ్వులు , మిర్చి , పసుపు , వేరుశనగ కంది, పెసలు , శనగ మొదలైన పంటలకు ప్రాధాన్యత తగ్గింది. ఈ పంటలు బోరుబావులతో , కరెంటు మోటర్లతో వ్యవసాయం చేయాల్సి వచ్చింది. దానికి ఎంతో పెట్టుబడి అవసరం.

నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు తొలిదశలో వరి కన్నా ఎక్కువగా చెరుకు పంటకు ప్రాధాన్యత ఇచ్చారు. ఒక కిలో చక్కెర కోసం వేల లీటర్ల సాగునీరు వెచ్చించాల్సి వచ్చింది. అదే ఆరుతడి పంటకైతే అది 20 రెట్ల పంటకు ఉపయోగపడేది. పైగా చక్కెర అనేది నిత్య అవసర సరుకు కాదు. పోషకాహారం కాదు. పోషకాహారమైన ఆహార ధాన్యాలకు వ్యవసాయ శాఖ గానీ, ప్రభుత్వం గానీ , ప్రాజెక్టు నిర్మాణంలో అంచనాలు గానీ , ప్రాధాన్యత ఇవ్వలేదు.

3.

స్థానిక పంటల, స్థానిక భూముల , భూసారాల , సంప్రదాయాల ప్రాధాన్యతను గుర్తించలేదు. అందువల్ల గంపగుత్తగా కొన్ని పంటలే పెరిగాయి. మిగతా పంటలు తగ్గిపోయాయి. తద్వారా వేల కోట్ల రూపాయలు వెచ్చించి కందిపప్పు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇలా వేల కోట్ల రూపాయల వంట నూనెలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు కాలక్రమంలో వరి పంట ఎక్కువై వరి తగ్గించండి , పామాయిల్ చెట్లు పెంచండి అంటూ వక్రమార్గం చూపారు. ఇది ఒక నష్టం.

4.

గత పదేళ్ళుగా ఈ నష్టం జరిగిపోతూ ఉంది. తద్వారా వ్యవసాయ కూలీలకు పని దినాలు తగ్గిపోయాయి. వరి , చెరుకు వంటి పంటల్లో యాంత్రికీకరణ పెరిగి కూలీల సంఖ్య తగ్గింది. దాంతో వ్యవసాయ కూలీలు , గ్రామీణ పేదలు , లక్షలాది మంది గల్ఫ్ బాట పట్టారు. మరోవైపు పప్పుదాన్యాలు , నూనె గింజల పంట తగ్గి లక్షల కోట్ల రూ. 2 దిగుమతులు చేసుకుంటున్నాము. ఈ అస్థవ్యస్థ ప్రణాళికను టిఆర్ఎస్ సవరించలేకపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సవరించడం అవసరం. ఇదొక అంశం.

5.

ప్రాంతాల వారీగా తీసుకుంటే గోదావరి మీద తలపెట్టిన ప్రాజెక్టులు ఆదిలాబాద్ జిల్లాను , మహారాష్ట్ర ప్రాంతాన్ని కాలక్రమంలో ఎడారిగా మహబూబ్ నగర్ వంటి కరువు ప్రాంతంగా మారే క్రమం మొదలైంది. ఈ ప్రశ్నను వేసినప్పుడు ఆ ప్రాజెక్టుల రూపకల్పనలో పాల్గొన్న ఇంజనీర్లు ఆదిలాబాద్కు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళిక ఉంది అని చెప్పారు. అది మొదలు కాలేదు. పైగా ఈ ఆరు లక్షలు అనే లెక్క టిఎంసీల ప్రకారం చూస్తే అది రెండు లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితం అవుతుంది.


ఆదిలాబాద్ ముందే దక్కన్ పీఠభూమిలో ఎత్తైన ప్రాంతం. గుట్టల మీదుగా వెళ్ళి కిందికి దిగుతాం అనుకుంటాం. కానీ గుట్టలమీదికి వెళ్లిన తర్వాత సమతలం ప్రారంభమవుతుంది. అక్కడ్నుంచి దిగడమంటూ ఉండదు. అంత ఎత్తైన ప్రాంతం నుండి పడ్డ నీరును పడ్డట్టుగా అక్కడే కాపాడుకోవాలి.


తెలంగాణ ప్రాంతంలో ఒక వెయ్యి మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం. తద్వారా పంటలు, అడవులు, వాతావరణం, అడవి జంతువులు, పక్షులు అందరు చల్లగా బతుకుతారు. అయితే ఒక వెయ్యి యాభై మిల్లిమీటర్ల వర్షపాతం మంచి వర్షాలు పడ్డప్పుడు నమోదవుతున్నది. కనుక ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పడే వర్షంలో 50 మిల్లీమీటర్లే మిగులు నీరు ఉంటుంది. మిగతా వెయ్యి మిల్లీమీటర్లు ఎక్కడికక్కడ స్థానికంగానే కాంటూర్ కందకాలు, చెరువులు, కుంటలు, అడ్డుకట్టలు, బ్యారేజీలతో ఎక్కడికక్కడ నిలుపుకోవాలి. అందుకు అనువుగా వర్షం పల్లపు ప్రాంతానికి పోకుండా అడ్డుకట్టలుగా అడవులు నిర్మించుకోవాలి. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక లెక్కన నీరు పల్లానికి ప్రవహించకుండా చూసుకుంటే అన్ని చెరువులు, వాగులు, కుంటలు నిండుగా ఉంటాయి. పచ్చని ప్రకృతి వెల్లివిరుస్తుంది. ఆ పని చేయలేదు. ఇప్పటికైనా ఆ పని చేయడం అవసరం.

6.

మహబూబ్ నగర్, నల్గొండలకు కాలేశ్వరం నీళ్ళు ఆశ చూపి నోరు మూయించారు. ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు లేకుండా చేశారు. ఇలా ఉత్తర తెలంగాణాకు , దక్షిణ తెలంగాణాకు రెంటికీ అన్యాయమే జరిగింది. అశాస్త్రీయంగా వాన నీళ్ళ గురించి ఆలోచించడమే అందుకు ప్రధాన కారణం.

7.

కృష్ణా నది మహబూబ్ నగర్ జిల్లాలో 170 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అయినా సగం జనాభా నేటికీ ఇతర ప్రాంతాల్లో ఉపాధి వెతుక్కుంటూ వలస పోతున్నారు. ఈ వలసలు ఆగిపోతాయని టిఆర్ఎస్ ప్రభుత్వం నమ్మబలికింది. కానీ ఆగిపోలేదు. ఆ సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయలేదు. బడ్జెట్ సరిగా కేటాయించలేదు. మరి ఆరు లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారో తెలియదు.

8.

మిషన్ భగీరథ పేరిట తాగునీరు అందించే కృషి ఎంతో గొప్పగా సాగింది. అయితే చాలాచోట్ల పైపులు వేసి నీళ్ళు ఇవ్వడం మరిచారు. నీళ్ళు ఇచ్చినట్లుగా బడ్జెట్లు ఎక్కడికక్కడ మింగేశారు. నీటి పైపులు నల్లాలు ఉన్న గ్రామాలు కూడా మళ్ళీ కొత్తగా పైపులు వేసి ఇచ్చారు. ఇది వృధా వ్యయం. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన తీర్మానాలు, ప్రపంచ బ్యాంకు వంటి వాటి సూచనల ప్రకారం చేశారని అలా కొత్త ప్రాజెక్టుగా చూపి ఏదో రూపంలో అప్పులు తెచ్చారని తెలిసింది.


సాగునీరు విషయంలో వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చారు. రైతుబంధు కూడా ఇచ్చారు. పండిన దాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా ఇచ్చారు. బ్యాంకు రుణాలు కూడా మాఫీ చేస్తామన్నారు. తొలిదశలో చేశారు. ఇవన్నీ వ్యవసాయదారులకు ఉపయోగపడ్డాయి. వాళ్ళేమీ వారి పంటను ఉచితంగా ప్రజలకు పంచలేదు. కానీ వారి అప్పులు, రైతుబంధు ప్రజల సొమ్ముతో చెల్లించారు. దానివల్ల ప్రజలకు ఏం వచ్చింది? దీన్ని ఎవరూ ఎందుకు ప్రశ్నించరు?

అసలు బ్యాంకుల్లో అప్పులు పేదలకు పుడతాయా? పైరవీలు చేస్తే అప్పులు పుడతాయి. రాజకీయ సంబంధీకులకు, సామాజికంగా ఎదిగిన అగ్రకులాలకు పెద్ద మొత్తంలో ఈ అప్పులు లభిస్తాయి. వీటిని ఎగబెట్టవచ్చు అనే ఉద్దేశంతోనే అప్పులు తీస్తుంటారు. ఎన్నికల ప్రణాళికలో దీన్ని భారీగా ప్రచారం చేస్తారు. ఇదంతా ఒక రకమైన ఓటు బ్యాంకు కోసం ఆయా సామాజిక వర్గాలకు , కులాలకు అందిస్తున్న సౌకర్యాలు. ఒక రకంగా అవినీతి కిందికి లెక్క ఈ మాట చాలామందికి కోపం తెప్పిస్తుంది.

9.

ఈ ఉచిత కరెంటు, ఈ రుణ మాఫీ గ్రామీణ, పట్టణ ఇతర వృత్తుల వారికి, ఇతర ఉత్పత్తుల వారికి ఎందుకు వర్తింపజేయడం లేదు? వారు చేసేది ఉత్పత్తి కాదా? అది ప్రజలకు ఉపయోగపడేది కాదా ? వారివి జీవితాలు కాదా? వారికి జీవన ప్రమాణాలు అక్కరలేదా? వారి పిల్లలు చక్కగా చదువుకోకూడదా? వారికెందుకు ఉచిత కరెంటు ఇవ్వడం లేదు? వారి రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదు? వారి వృత్తులకు ఎందుకు చేయూతనివ్వడం లేదు? అని బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.

దానికి బదులుగా ఆదరా బాదరగా కొందరిని ఓడించడానికి దళితబంధు అని ప్రవేశపెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పది లక్షలు ఇస్తామని, అందరికి ఇస్తామని ప్రకటన చేశారు. ఏమైంది? బీసీలు మాకేది అని అడిగితే లక్ష ఇస్తామన్నారు. అందుకు లక్ష అడ్డంకులు సర్టిఫికెట్లు అడిగారు. దళితులకు పది లక్షలు, మాకు లక్షనా అని వాపోయారు. మీ సంగతి చెప్తాము అని టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారారు.


ముందే అన్ని విధాలుగా బీసీల వ్యతిరేక పార్టీగా టిఆర్ఎస్ ముద్ర వేసుకుంది. బీసీ కార్పొరేషన్తో అభివృద్ధి కార్యక్రమాలకు, స్వయం ఉపాధికి లోన్లు ఇవ్వడం మానేసింది. వ్యవసాయ రంగంలో రైతుబంధు, రుణమాఫీ, ఉచిత కరెంటు, గిట్టుబాటు ధర, పైగా దానికి బోనస్ అంటూ ప్రచారం చేస్తే దానికి వ్యతిరేకంగా బీసీలు, బడుగు వర్గాలు స్పందించారు. వీరికి తాగునీరు, కరెంటు, ఉచితంగా డబుల్ బెడ్రూమ్ వంటివి ఇవ్వాలని ప్రణాళికలు ముందుకు వచ్చాయి. డబుల్ బెడ్రూమ్ యేటా లక్షలకొద్దీ కట్టి ప్రతి సంవత్సరం పంచాల్సింది. తొలుత అనుకున్నది అదే. కానీ, అందులో అవినీతికి ఆస్కారం లేదు. అందువల్ల ప్రాజెక్టుల పేరుమీద బడ్జెట్ తరలించి డబుల్ బెడ్రూమ్ పథకానికి ప్రభుత్వ పాఠశాల నవీకరణకు బడ్జెట్ ప్రాధాన్యత తగ్గించారు.


వ్యవసాయ రంగంలో ఉన్నవారికి పై మూడు నాలుగు విధాలుగా ప్రభుత్వం బడ్జెట్లు ఇస్తున్నదో. అంత బడ్జెట్ బీసీ, ఎస్సీ, సామాజిక వర్గాలకు డబుల్ బెడ్రూమ్ కోసం విద్యకోసం కేటాయించడం జరగలేదు. మరోమాటలో చెప్పాలంటే 63 శాతం జనాభా గల బీసీ సామాజిక వర్గాలకు మొత్తం బడ్జెట్లో 63 శాతం కేటాయించడం అవసరం. ప్రభుత్వ జీతభత్యాలు పోగా మిగిలిన బడ్జెట్లో కనీసం సగం బడ్జెట్ బీసీల అభివృద్ధికి కేటాయించినప్పుడే సామాజిక అభివృద్ధిలో సమతుల్యత సాధ్యమవుతుంది.

10.


ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ బద్దంగా 15, 7 శాతం చొప్పున బడ్జెట్లు రావాలి. వస్తాయి. సబ్ ప్లాన్లతో వాటిని వారి అభివృద్ధికి కేటాయించాలి. ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్లు కేటాయించినప్పుడు సగటు జీవన ప్రమాణాల్లో వారి అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. కాకతీయుల కాలంలో కట్టిన చెరువులు, ఆనకట్టలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

మనం కట్టినవి పని పూర్తి కాకుండానే కూలిపోతున్నాయి. కాంట్రాక్టర్లకు భయం లేదు. రాజకీయ నాయకులకు భయం లేదు. ఇంజనీర్లకు భయం లేదు. వంద కోట్ల ఎస్టిమేషన్ ను వెయ్యి కోట్లకు పెంచితే అడిగే దిక్కు లేదు. ఈ దుస్థితి, ఈ అక్రమాలు సరి చేయాలంటే కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వంటివి ప్రభుత్వ అధ్యయనంలో ప్రభుత్వ ఉద్యోగుల, ఉద్యోగ భద్రతతో నిర్మాణం చేపట్టడం అవసరం.

గతంలో ఇలానే నిర్మాణాలు సాగాయి. మధ్యలో కొందరు స్వార్థపరులు వాటిని రద్దు చేయించి, వాళ్ళు కాంట్రాక్టర్లుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ప్రభుత్వాలనే తలకిందులుగా మార్చుతున్నారు.

Read More
Next Story