కౌలు రైతులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్
బీఆర్ఎస్ పార్టీ బాటలోనే కాంగ్రెస్ వెళుతున్నదా? రైతు స్వరాజ్య వేదిక కన్నెగంటి రవి ఏమంటున్నారంటే...
బీఆర్ఎస్ పార్టీ తరహాలోనే కౌలు రైతులను కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేసింది. రైతు భరోసా చెల్లింపు విషయంలో జనవరి 4 న రాష్ట్ర క్యాబినెట్ చర్చించి చేసిన నిర్ణయం ఈ విషయాన్ని రుజువు చేసింది. దశాబ్ధాలుగా అన్యాయానికి గురైన లక్షలాదిమంది రాష్ట్ర కౌలు రైతులు, మరోసారి ఈ ప్రభుత్వ మోసానికి కూడా గురయ్యారు.
వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా సహాయం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ ఏక వాక్య తీర్మానం ద్వారా , రైతు భరోసా సహాయానికి సాగు భూమిపై పరిమితి విధించబోవడం లేదని, వ్యవసాయ యోగ్యమైన భూమిలో తప్పకుండా పంటలు సాగు చేయాలనే రూలేమీ లేదని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. వాస్తవ సాగు దారులను గుర్తించే విషయంలో, కౌలు రైతులకు కూడా రైతు భరోసా సహాయం అందించే విషయంలో మౌనం దాల్చింది. కాకపోతే కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్ లు ఉన్న చోట, ఆ భూములకు రైతు భరోసా సహాయం చేయబోమని మాత్రం ప్రకటించింది. ఒక్క మాటలో KCR ప్రభుత్వ మార్గంలోనే ఈ ప్రభుత్వం కూడా కౌలు రైతులకు అన్యాయం చేస్తూ ముందుకు వెళ్ళ దలుచుకున్నది.
తాను ఇచ్చిన హామీలను అమలు చేయలేని స్థితిలో ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రభుత్వం , ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకుని, ముందుగా సంబంధిత ప్రజలకు క్షమాపణ చెప్పుకుని , మిగిలిన విషయాలు మాట్లాడాలి. కానీ తాము ఇచ్చిన హామీ గురించి మాట మాత్రం ప్రస్తావించకుండా మౌనంగా ఉండి , ప్రభుత్వ పెద్దలు తాము అనుకున్న విధాన ప్రకటనను మాత్రమే బయటకు చెప్పి వెళ్ళిపోవడం అన్యాయమే కాదు, అనైతికం కూడా.
ఈ అన్యాయాన్నే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేసింది. రైతులకు రైతు భరోసా చెల్లింపు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన చేస్తూ , క్యాబినెట్ సమావేశం తరువాత జనవరి 4 న ప్రెస్ మీట్ లో వ్యవహరించిన తీరు అత్యంత అభ్యంతరకరం. తాము చెప్పాల్సింది చెప్పేసి, జర్నలిస్టుల ప్రశ్నలను ఎదుర్కునే ధైర్యం లేక పారిపోయినట్లుగా స్పష్టంగా కనిపించింది.
ఒక రాజకీయ పార్టీని , ఒక ప్రభుత్వాన్ని ఎవరైనా ఎందుకు నమ్ముతారు ? ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా, గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రజలతో వ్యవహరిస్తారని.
కానీ భారత దేశ పార్లమెంటరీ వ్యవస్థ లో రాజకీయ పార్టీలు ప్రజలతో వ్యవహరించడంలో, హామీల అమలు విషయంలో ఏ మాత్రం భిన్నంగా వ్యవహరించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరించడంలో కూడా అన్ని రాజకీయ పార్టీలూ ఒకే తాను ముక్కలు. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రజలను మోసం చేయడంలో అందరి కందరూ జగత్ కిలాడీ లుగా మారిపోయారు.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతున్నది. 2014 జూన్ నుండీ 2023 డిసెంబర్ వరకూ రాష్ట్రంలో అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ , KCR నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిరంకుశత్వం తో వ్యవహరించిందో రాష్ట ప్రజలకు అనుభవమే. ఏక పక్ష నిర్ణయాలతో, పేదలకు కాకుండా, ధనవంతులకు ఎక్కువ ప్రయోజనం చేసే విధానాలతో ఆ ప్రభుత్వం పాలన సాగించింది కనుక రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పాలనుకున్నారు. మార్పు పేరుతో ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని నమ్మి, ఓట్లేసి అధికారం కట్ట బెట్టారు.
కానీ గత ప్రభుత్వాలకు భిన్నంగా విధాన నిర్ణయాలు తీసుకోవాలంటే కొత్త ప్రభుత్వాలకు సాహసం కావాలి. ఆ సాహసం తమ ధగ్గర కూడా లేదని అనేక విషయాలలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ నిరూపించుకుంటోంది. ముఖ్యంగా గ్రామీణ పేదలు , రైతులు, వ్యవసాయ కూలీల విషయంలో ఏ పార్టీ అయినా, ప్రభుత్వమయినా , తీసుకునే విధాన నిర్ణయాలు, ఆ పార్టీ నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తాయి. మిగిలిన సమాజంతో కూడా వాళ్ళు ఎలా ఉంటారు అన్నది దీనిని బట్టి చెప్పవచ్చు.
గ్రామాలలో రాజకీయంగా, సామాజికంగా , ఆర్ధికంగా భూస్వాముల, ధనిక రైతుల పట్టు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వీళ్ళు ఆధిపత్య కులాలకు కూడా చెందిన వాళ్ళై ఉంటారు. గ్రామంలో ఎక్కువ భూములు వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. గ్రామాలలో పదవులన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ప్రధాన రాజకీయ పార్టీలలో వీళ్ళు కీలక స్థానాలు ఆక్రమించుకుని ఉంటారు. రాజకీయ పలుకుబడి తో తమకు కావాల్సిన వాటిని సాధించుకునే స్థితిలో ఉంటారు.
తాజాగా నగరాల నుండీ మిగులు డబ్బుతో, నల్ల డబ్బుతో వచ్చి గ్రామాలలో భూములు కొనుగోలు చేస్తున్న వాళ్ళు కూడా గ్రామంలో పరోక్ష భూస్వాములుగా మారుతున్నారు. వీరికి గ్రామం పట్లా, వ్యవసాయం పట్లా ఎటువంటి ఆపేక్ష ఉండదు. ప్రతి రోజూ పెరిగే భూముల ధరలు చేకూర్చే ఆర్ధిక లాభం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి అందించే సహాయాలు, ముఖ్యంగా నగదు బదిలీ పథకాల పేరుతో అందే సహాయాలు, కౌలు తో పాటు వీరికి అదనపు ఆర్ధిక లాభాలను అందిస్తుంటాయి. తమవి కాని నిధులను తాము అప్పనంగా పొందుతున్నామన్న నైతిక భీతి కూడా వీళ్ళకు ఉండదు.
వ్యవసాయ కూలీలు, సన్న చిన్నకారు రైతులు , కౌలు రైతులు సంఖ్య రీత్యా పెద్ద సంఖ్యలో ఉన్నా, వీరికి ఉండే ఆర్ధిక, సాంఘిక, రాజకీయ బలం తక్కువే. వీళ్లలో అత్యధికులు వెనుకబడిన వర్గాలు , లేదా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వాళ్ళై ఉంటారు. మన వ్యవస్థలో వీరి పాత్ర, ఎక్కువలో ఎక్కువగా ఎన్నికల సమయంలో ఓటర్ల పాత్రకు పరిమితమవుతుంది. వీళ్ళను మభ్య పెట్టడానికి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అనేక హామీలు ఇచ్చనప్పటికీ, ఆచరణలో, వీరి సంక్షేమం కోసం, వీరి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు అతి తక్కువ. లేదా ఆయా సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా అడిగే వాళ్ళు ఉండరనే ధైర్యం కూడాప్రభుత్వాలకు కనిపిస్తుంటుంది. అట్టడుగు వర్గాల ప్రజల పక్షాన నిజంగా నిలబడి పోరాడాల్సిన, వామపక్ష, విప్లవ పార్టీలు బలహీన పడడం, మోసం చేసే ప్రభుత్వాలకు భరోసా ఇస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న రైతులలో 36 శాతం కౌలు రైతులేనని 2022 లో రైతు స్వరాజ్య వేదిక విస్తృతంగా సాగించిన అధ్యయనంలో బయట పడింది. ఈ కౌలు రైతులలో కూడా అత్యధికులు అట్టడుగు వర్గాలకు, కులాలకు చెందిన వారే. ఈ కౌలు రైతూయలో సవనఘ భూమి ఉన్న వారు కొందరైతే , అసలు ఒక్క సెంటు కూడా సాగు భూమి లేని కౌలు రైతులు కూడా ఉన్నారు. ఈ కౌలు రైతులకు ప్రభుత్వాల నుండీ ఎలాంటి గుర్తింపు, సహాయం అందడం లేదు. పైగా ప్రతి సంవత్సరం కౌలు ధరలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా కష్టపడి పంటలు పండిస్తున్న కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల బాట పడుతున్నారు.
2000 దశకం లోనే ఈ సమస్య తీవ్రతను గుర్తించిన రైతు సంఘాలు, అప్పటి ప్రభుత్వాల ముందు కౌలు రైతుల సమస్యను లేవనెత్తడంతో, ఉద్యమాలు సాగించడంతో, 2011 లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అప్పటి కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం భూ అధీకృత సాగు దారుల చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం గ్రామ సభలలో కౌలు రైతులను గుర్తించి ఋణ అర్హత కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్డుల ఆధారంగా కౌలు రైతులకు, పంట రుణాలు, ఇతర వ్యవసాయ రంగ సహాయ పథకాలు అందించాల్సి ఉంటుంది. ఈ కార్డు జారీ చేయడానికి భూ యాజమానుల అనుమతి అవసరం లేదు. ఈ చట్టం ఉమ్మడి రాష్ట్రంలో, 2012, 2013 సంవత్సరాలలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2015 సంవత్సరం లో అమలైంది. వేలాది మంది కౌలు రైతులకు ఈ చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇచ్చారు. కొద్దిమండికి పంట రుణాలు కూడా అందాయి.
2016 లో అప్పటి KCR ప్రభుత్వం ఏకపక్షంగా ఈ చట్టం అమలును నిలిపి వేసింది. నిజానికి ఇప్పటికీ ఈ చట్టం రాష్ట్రంలో ఉనికిలో ఉంది. చేయాలసిందల్లా చట్టం అమలును ప్రారంభించడమే.
2022 సెప్టెంబర్ లో కౌలు రైతులకు బహిరంగ లేఖ రాసిన అప్పటి PCC అధ్యక్షుడు, ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందనీ, తాను అధికారంలోకి వస్తే 2011 చట్టం అమలు చేసి కౌలు రైతులను గుర్తిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసిన వరంగల్ డిక్లరేషన్ లో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో కూడా కౌలు రైతులకు సహాయం గురించి మాట్లాడారు. రాహుల్ గాంధీ, జైరాం రమేష్ లాంటి జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఏడాది తిరిగే సరికి, హామీనిఊ అమలు చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కౌలు రైతుల ఊసు లేకుండా, వారికి సహాయం చేయాల్సిన అవసరాన్ని గుర్తించకుండా మౌనం దాల్చింది.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న భూస్వాములు, ధనిక రైతులు , కౌలు రైతుల విషయంలో ప్రభుత్వాన్ని ముందుకు కదలనీయకుండా కట్టడి చేశారని అర్థం చేసుకోవాలి. తెలంగాణ సాయుధ పోరాట సమయం లోనూ, ఆ తరువాత నక్సలైట్ ఉద్యమ సమయంలోనూ కూడా ఇదే భూస్వాములు, ధనిక రైతులు, సన్న కారు ,చిన్నకారు, కౌలు రైతుల, వ్యవసాయ కూలీల ప్రయోజనాలు నెరవేరకుండా అడ్డుపడ్డారని గుర్తుంచుకోవాలి. 1950 హైదరాబాద్ కౌలు రైతుల చట్టాన్ని, 1973 భూ గరిష్ట పరిమితి చట్టాన్ని ప్రభుత్వాలు అమలు చేయకుండా అడ్డు పడింది కూడా ఈ ఫ్యూడల్ శక్తులే.
నిజానికి బీజేపీ, బీఆర్ఎస్ లాంటి ప్రతిపక్ష పార్టీలు కౌలు రైతులకు ఎప్పుడూ వ్యతిరేకమే. వాళ్ళ నాలుకలు రెండంచుల కత్తులు . ప్రభుత్వం వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు సహాయం చేస్తామని ప్రకటిస్తే, భూ యజమానుల పక్షం తీసుకుని, వాళ్ళకు అన్యాయం జరిగిందని విమర్శిస్తాయి. ఒక వేళ ప్రభుత్వం భూ యజమానుల పక్షం తీసుకుని , కౌలు రైతులను వదిలేస్తే, కౌలు రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని ఇవే పార్టీలు విమర్శిస్తాయి. ఈ పార్టీలు సాగించే దుష్ప్రచారానికి భయపడే , కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు న్యాయం చేయడానికి వెనకడుగు వేసింది. ఇదొక పిరికి వైఖరి.
సామాజిక న్యాయం గురించి మాట్లాడే రాజకీయ పార్టీ, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, నిజమైన బాధితుల పక్షం తీసుకోవాలి. మిగిలిన ప్రజలను ఒప్పించడానికి, మొత్తం పార్టీని సన్నద్ధం చేయాలి. కానీ, ప్రతిపక్షాలకు భయపడి పాలన సాగిస్తే , గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఆచరణలో ఏ మాత్రం తేడా ఉండదు. ఈ మాత్రం దానికి, మార్పు పేరుతో, ప్రజా పాలన పేరుతో డాంబికాలు పలకడమెందుకు ? ప్రజలను మోసం చేయడమెందుకు ?
పైగా ఎన్నికల మానిఫెస్టో లో సంవత్సరానికి ఎకరానికి 15,000 ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం దానిని 12,000 రూపాయలకు తగ్గించి అమలు చేస్తామనీ చెప్పడం కూడా హామీ ఉల్లంఘనే. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెబుతున్నా, దాని విధి విధానాల గురించి జనవరి 4 ప్రెస్ మీట్ లో అసలు ప్రస్తావించలేదు.
పెట్టబడి సహాయం అందించడానికి వీలుగా, వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను గుర్తించి సహాయం చేయడానికి భయపడే ప్రభుత్వానికి , రైతు భరోసా పథకం పేరుతో రాష్ట్ర బడ్జెట్ నుండీ నిధులు దుర్వినియోగం చేసే హక్కు లేదు. తన ప్రభుత్వ కాలంలో ఒక పథకానికి కొత్త మార్గదర్శకాలు రాయలేని ప్రభుత్వం, రాబోయే కాలం లోనూ రాస్తుందన్న గ్యారంటీ లేదు. రాబోయే ఐదేళ్ళూ ఇదే ధోరణితో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే రాబోయే కాలం లోనూ కౌలు రైతులకు న్యాయం జరగదన్న మాట. అంటే, మరో మాటలో రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతాయని అర్థం. ఇలా రైతులను బలవంతమగా చంపే హక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.
ఇచ్చిన హామీని అమలు చేయలేని నిస్సహాయత కంటే, రాష్ట్ర ప్రభుత్వం, రైతు భరోసా విషయంలో కొత్త విధాన నిర్ణయం తీసుకుంటే మంచిదని మేము అభిప్రాయ పడుతున్నాం. వాస్తవ సాగు దారులను గుర్తించకుండా, వ్యవసాయం చేసినా, చేయకపోయినా, కేవలం భూమి యజమానులకు మాత్రమే సహాయం చేస్తున్న, తప్పుడు మార్గ దర్శకాలతో అమలవుతున్న రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేయడమే మంచిది. దీనికి బదులుగా , ఎవరు సాగు చేసి మార్కెట్ కు పంట తెస్తారో, వారికి ధరపై బోనస్ రూపంలో సహాయం చేయడం మంచిది. కేవలం వరికే బోనస్ కాకుండా, అన్ని పంటలకు బోనస్ ప్రకటించి అమలు చేస్తే, సాగు చేసిన రైతులకు మేలు జరుగుతుంది. ఇదే 15,000 లేదా 12,000 రూపాయలను అప్పుడు నిజమైన సాగుదారులకు అందించిన వాళ్ళవుతారు. మార్కెట్ కు తేగలిగిన మిగులు పంట ఉండని, లేదా కుటుంబ అవసరాలకు మాత్రమే వాడుకుని, మార్కెట్ కు పంట తేలేని సన్నకారు రైతులను గుర్తించి ఈ ధర బోనస సహాయాన్ని అందించడం అంత కష్టమైన పనేమీ కాదు.
ఇందుకోసం రైతు భరోసా సహాయంతో సంబంధం లేకుండా, 2011 చట్టం ప్రకారం కౌలు రైతులను గుర్తించి, గుర్తింపు కార్డు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాల్సి ఉంటుంది.. ఈ గుర్తింపు కార్డు ఆధారంగా విత్తన సబ్సిడీ, పంటల బీమా పథకం, యాంత్రీకరణ సబ్సిడీ, పంటల కొనుగోలు , ప్రకృతి వైపరిత్యాల పరిహారం లాంటివి వాస్తవ సాగు దారులకు అందించడానికి వీలవుతుంది. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించి, ఈ యాసంగి నుండే కొత్త పథకాన్ని అమలు చేయవచ్చు వ్యవసాయ రంగంలో నిధులు దుర్వినియోగం కాకుండా ఉండడానికి ఇదొక్కటే సరైన మార్గం.
Next Story