ఆరు నెలలు దాటినా కార్మికుల ఉసే ఎత్తని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
ఎన్నికలప్పుడు మాత్రమే నేతల అజెండాగా మారతారా? అయితే మరోసారి మోసపోయినట్లే. నాయకులు మారినా పద్ధతులు ఎందుకు మారడం లేదని ప్రశ్నిస్తున్నారు కన్నెగంటి రవి
తాము ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ ప్రభుత్వం పట్టించుకోవాలని ప్రజలు కోరుకుంటారు. ఎన్నికల సమయంలో తమ చుట్టూ తిరిగిన నాయకులు, అధికారంలోకి వచ్చాక, కనీసం తమను కలవడానికి సమయం ఇవ్వకపోతే, రోజువారీ ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఎక్కడా కనపడకపోతే, వినపడకపోతే తాము మరోసారి మోసానికి గురయ్యామని భావిస్తారు.
సంఘటిత రంగ కార్మికులుగా, ఉద్యోగులుగా ఉన్న ఆర్టీసీ, సింగరేణి, ఇతర పారిశ్రామిక ప్రాంతాల కార్మికులు కావచ్చు, అసంఘటిత రంగంలో ఉన్న లక్షలాది బీడీ,హమాలీ, గృహ, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు – రాష్ట్రంలో సంఖ్య రీత్యా అత్యధికులుగా ఉన్న తాము, పాలనా రంగంలో అజెండా మీదకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వాలకూ, ప్రస్తుత ప్రభుత్వానికీ ఈ విషయంలో తేడా ఏమిటని కూడా అనుకుంటున్నారు.
వేతన ఒప్పందాల చర్చల్లోనూ కార్మికులు..
స్వాతంత్రోద్యమ కాలం నుండీ 1980 దశకం వరకూ పారిశ్రామిక రంగం అంటే, పరిశ్రమ యజమానులు, కార్మికులు కూడా చర్చలో ఉండేవారు. లక్షలాది మంది సభ్యులు కలిగిన కార్మిక సంఘాలు ఉనికిలో ఉండేవి. ప్రతి పారిశ్రామిక వాడ లోనూ కార్మిక సంఘాల జండాలు రెపరెపలాడేవి. తమ సమస్యల పరిష్కారం కోసం, వేతన ఒప్పందాల కోసం కార్మికుల సమ్మెలు జరిగేవి. కార్మిక శాఖలో లేబర్ అధికారుల సమక్షంలో చర్చలు జరిగి, వేతన ఒప్పందాలు కూడా ఫైనల్ అయ్యేవి. బీడీ తయారీ రంగం లాంటి అసంఘటిత రంగం లోనూ యూనియన్లు బలంగా ఉండేవి. కనీస వేతనాలు సాధించుకునే వరకూ సమ్మెలు జరిగేవి. ప్రభుత్వ రంగ కార్మికుల ,ఉద్యోగుల సంఘాలు, వార పోరాటాలు, ప్రైవేట్ రంగ కార్మికులకు కూడా స్పూర్తిని అందించేవి.
మారిన విధానాలు.. బలహీనపడ్డ యూనియన్లు
1990 దశకం ప్రారంభంలో మొదలైన నూతన ఆర్ధిక, పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ రంగాన్ని బలహీన పరిచాయి. ఆయా రంగాలలో యూనియన్లను బలహీనపరిచాయి. ప్రైవేట్ పారిశ్రామిక యాజమాన్యాలు, స్థానిక కార్మిక సంఘాలను గుర్తించడం,చర్చలు జరపడం మానేశాయి.
సమ్మెలు జరిగితే యూనియన్ నాయకత్వాలను సస్పెండ్ / డిస్మిస్ చేయడం, కంపెనీలకు లాకవుట్, లే ఆఫ్ ప్రకటించడం, పర్మినెంటు కార్మికులను విధుల నుండీ తొలగించి, కాంట్రాక్టు కార్మికులను నియమించుకోవడం సాధారణంగా మారిపోయింది. కార్మిక హక్కుల గురించి మాట్లాడడం అంటే, నేరం అయిపోయిన దశ ఒకటి దాపురించింది.
యూనియన్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం, జైళ్లకు పంపంపడం, గూండాలతో దాడులు చేయించడం, కార్మికుల సమ్మెల సమయంలో పోలీసులను పెద్ద ఎత్తున దించి చెదరగొట్టడం, కార్మిక శాఖను బలహీన పరచడం, ఆ శాఖలో ఖాళీలను పూరించకపోవడం సర్వ సాధారణంగా మారిపోయింది.
యూనియన్లకూ గతిలేదు
గత ముప్పై ఏళ్లలో జరిగిన ఈ పరిణామాలు కార్మికుల పోరాడే శక్తిని అత్యంత బలహీన పరిచాయి. టోకెన్ సమ్మెలు తప్ప ప్రభుత్వ రంగ పరిశ్రమల కార్మికులు నిరవధిక సమ్మెలకు పిలుపు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ప్రైవేట్ రంగంలో కార్మికులు కనీసం యూనియన్ లను కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా మోడీ ప్రభుత్వ హయాంలో అనేక కార్మిక చట్టాలను కలిపి నాలుగు లేబర్ కోడ్ లుగా తయారు చేశాక, కార్మికులు యూనియన్ పెట్టుకోవడం దాదాపు అసాధ్యమై పోయింది.
కోట్లాదిమంది శ్రామికులు పనిచేస్తున్న తెలంగాణలో కార్మిక శాఖ లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను చూస్తే, ఆ శాఖ ఎంతగా బలహీన పడిపోయిందో అర్థమవుతుంది. బడ్జెట్‌లో కూడా ఆ శాఖకు నిధులు తగ్గిపోయాయి. 2014- 2015 లో కార్మిక శాఖలో 610 మంది (అందులో 398 మంది పర్మినెంట్+ 212 మంది తాత్కాలిక) పని చేస్తుంటే, ఆ సంఖ్య రాష్ట్రంలో పెరిగిన కార్మికుల సంఖ్యకు అనుగుణంగా పెరగలేదు.
ఏళ్లుగా మారని సిబ్బంది సంఖ్య
ఈ శాఖలో 2019-2020 లో 631 మంది సిబ్బంది ఉండగా , 2024-2025 కు కూడా 631 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. మరీ ముఖ్యంగా కార్మికుల హక్కుల కోసం క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ( ALO) లు 2014-2015 లో 102 మంది పర్మినెంట్ ,16 మంది తాత్కాలిక స్థాయిలో ఉండగా, 2024-2025 నాటికి కూడా వీరి సంఖ్య కేవలం 119 మంది మాత్రమే. 2016 లోనే జిల్లాల సంఖ్య 33 కు పెరిగినా, ఇప్పటికీ కేవలం 21 మంది అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌లు, కేవలం 12 మంది డిప్యూటీ లేబర్ కమిషనర్లు మాత్రమే ఉన్నారు.
ఈ నేపధ్యంలో తెలంగాణ లో పని చేస్తున్న వలస కార్మికులు సహా, కోట్లాది మంది శ్రామికుల హక్కుల అమలు కోసం ప్రభుత్వం ఏమి చేయాల్సి ఉంటుంది ? పారిశ్రామిక రంగం అంటే, కేవలం పరిశ్రమల యజమానులు మాత్రమే కాదు, వాటిలో పని చేస్తున్న కార్మికులు కూడా అని ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పటికీ రద్దు కాని కార్మిక చట్టాల అమలుకు తగిన అధికారమిస్తూ, కార్మిక శాఖను చురుకుగా పని చేయించాలి. వారికి తగిన భరోసా కల్పించాలి. వసతులు కల్పించాలి. నిధులు కూడా ఎప్పటికప్పుడు విడుదల చేయాలి.
ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
రాష్ట్రంలో ఏర్పడుతున్న పరిశ్రమలు, సంస్థలలో పనిచేస్తున్న కార్మికులను నమోదు చేసే ప్రక్రియను సులభతరం చేయాలి. యాజమాన్యాలు అందించే సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ పై పెట్టాలి. అసంఘటిత రంగ కార్మికులు తమను తాము నమోదు చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండీ, రాష్ట్ర స్థాయి వరకూ విస్తృతమైన ఏర్పాట్లు చేయాలి. కార్మికశాఖ అధికారులతో పాటు, కార్మిక సంఘాలను, ప్రజా సంఘాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి.
కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్‌లకు, ఆశా వర్కర్స్‌కు, ఇందిరా క్రాంతి పథకం ,MNREGS ఉద్యోగులకు తక్షణమే వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తామనే హామీని ఇచ్చింది.
ఇది అమలు చేయడానికి తక్షణమే చర్యలు ప్రారంభించాలి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ కార్మికిలను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి ,రెండు పీఆర్సీ బకాయిలను చెల్లిస్తామని, రెండవ పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను కూడా చేరుస్తామనీ, ఆర్టీసీ యూనియన్ ల పునరుద్ధరణకు అనుమతి ఇస్తామనీ, ఇచ్చిన హామీల అమలుకు ఆయా కార్మిక సంఘాలతో చర్చలు మొదలు పెట్టాలి. ఆటో డ్రైవర్స్ కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సింగరేణి లో కాంట్రాక్టు కార్మికులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు. సంస్థలో కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడమే కాక, మానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు , సింగరేణి కార్మికుల సంక్షేమానికి,అభివృద్ధికి, బధ్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు అవసరం
బీడీ కార్మికులకు 2014 పీఎఫ్ కటాఫ్ తేదీని తొలగించి చేయూత పెన్షన్ అందిస్తామని, బీడీ కార్మికులను జీవిత బీమా, ESI పరిధి లోకి తీసుకు వస్తామని, మానిఫెస్టో లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, మహిళా కార్మికులు ఎదురు చూస్తున్నారు. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ , స్వీగ్గీ ,జొమాటో కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ, రాజస్థాన్ తరహాలో చట్టం చేస్తామని కూడా మానిఫెస్టోలో హామీ ఇచ్చారు.
ఇప్పటికీ ఆ వైపు అడుగులు పడలేదు. గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికులతో, సంస్థలతో కొన్ని చర్చలు జరిగినా , అవి ఆయా సంస్థల యాజమాన్యాలు సరైన సమాచారం ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ఆగిపోయాయి. వాటిని మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళాలి.
10 లక్షలకు పైగా ఉన్న గృహ కార్మికులు , తమ కోసం ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, కనీస వేతనాలను పెంచాలని కోరుతున్నారు. వారి యూనియన్లు ఇప్పటికే ప్రభుత్వానికి ఈ విషయాన్ని విన్నవించాయి. కానీ కార్మిక శాఖ ఇప్పటికీ ఇంకా తగిన చర్చలు ఆయా యూనియన్లతో ప్రారంభించలేదు. అలాగే హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, హమాలీలకు హెల్త్ కార్డులు కూడా అండ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఎన్నికల మానిఫెస్టో లో హామీ ఇచ్చింది. ఇప్పటికే హమాలీ కార్మికులు తమ విన్నపాలను ప్రజా భవన్ కు వచ్చి అధికారులకు వినిపించి వెళ్లారు. గల్ఫ్ కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు.
కేటాయింపులు అక్కర్లేదు
నిజానికి ఈ సంక్షేమ బోర్డు లు ఏర్పాటు చేయడానికి, బడ్జెట్ లో పెద్దగా కేటాయింపులు అవసరం లేదు. కానీ తమ కోసం ఆలోచించే ఒక బోర్డు ఉందని కార్మికులకు ఒక భరోసా కలుగుతుంది. ఆ బోర్డు నిత్యం ఆయా రంగాల కార్మికుల సంక్షేమం కోసం యూనియన్ లతో, యాజమాన్యాలతో చర్చలు జరుపుతూ పరిష్కారాలను అన్వేషిస్తుంది.
ప్రభుత్వం చేయవల్సిందల్లా కార్మిక శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వడం. ప్రస్తుతం కార్మిక శాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వద్దనే ఉంది. ఆయనకు ఉన్న పని ఒత్తిడుల రీత్యా . ఇప్పట్లో కార్మిక సంఘాలతో చర్చలు సాధ్యం కాకపోవచ్చు. ఆయన తగిన సమయం తీసుకుని , ఆయా రంగాల కార్మిక సంఘాలతో, కార్మిక శాఖ అధికారులతో చర్చించి తగిన మార్గదర్శకాలు ఇవ్వగలిగితే, ఇంకా మంచిది. లేదా కార్మిక శాఖకు మంత్రిని ప్రత్యేకంగా నియమించాలి. ఎప్పటికప్పుడు ఈ సమస్యలు పరిష్కారానికి కృషి మొదలవుతుంది . ఇంకా ఆలస్యం చేస్తే, ప్రభుత్వంపై నిరసన కూడా పెరుగుతుంది. ఆ పరిణామం జరగక ముందే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి, తక్షణ చర్యలు ప్రారంభించాల్సి ఉంది.