బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలి.
x

బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలి.

ఇదే 42 శాతం బీసీ రిజర్వేషన్లకు తొలి అడుగు


కాలం ఎవరికోసం ఆగదు. మనం జీవితానికి ఒక ప్రణాళిక వేసుకుంటాము. జీవిత లక్ష్యాలను నిర్ణయించుకుంటాము. అవి సాధించడానికి కృషి చేస్తుంటాము. అయితే అన్నికాలాలు, అన్ని సమయాలు మనకు అనుకూలంగా ఉండవు. కాలం, పరిస్థితులు అనేక మార్పులు తీసుకుంటాయి. ఆ సమయంలో తమను తాము తిరిగి పునర్నిర్నయించుకొని ముందుకు సాగాలి. పునర్నిర్మించుకొని ముందుకు సాగేవారే విజేతలు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం మనం ఊహించింది కాదు. ఆ యుద్ధాన్ని ఎవరు కోరుకోలేదు. కానీ ఆ యుద్ధం వల్ల ప్రపంచంలో అనేక పరిణామాలు సంభవించాయి. ధరలు పెరిగాయి. దేశాలమధ్య సంబంధాలు మారాయి.

రెండు దేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల జీవితాలు అల్లకల్లోలం అయ్యాయి. అలాగే హమాస్ పాలసీనా తరఫున ఇజ్రాయెల్పై అకస్మాత్తుగా విరుచుకుపడుతుందని ఎవరూ ఊహించలేదు. దాని పరిణామాలు భయంకరంగా, ఇంత తీవ్రంగా ఉంటాయని హమాస్ నాయకులు కూడా ఊహించి ఉండరు. చివరకు ప్రత్యక్షంగా అమెరికా ఇజ్రాయెల్ తరఫున నిలబడి అటు ఇరాన్ను ఇటు ఉ క్రెయిన్, రష్యాను, ఇండియా, పాకిస్థాన్ సంఘర్షణల్లో పాకిస్థాన్వైపు నిలబడి ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం మనం ఊహించిన సంఘటనలు కావు. అమెరికాలోని భారతీయ సంతతివారు డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఇలా భారతీయుల మీద విరుచుకుపడతాడని తెలియదు. తెలిసి ఉంటే ఓట్లు వేసి గెలిపించేవారు కాదు. డొనాల్డ్ ట్రంప్ ఏ పూట ఏ మాట మారుస్తాడో తెలియదు.

అలాగే అకస్మాత్తుగా రాష్ట్రపతి ధనఖర్ తన పదవికి రాజీనామా చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత వెంటనే ఉపరాష్ట్రపతికి ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఏ పార్టీ కూడా దీనికి సిద్దమై లేదు. ఈ అకస్మాత్తు పరిణామాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడి విదేశీ పర్యటనకు బయలుదేరాడు. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రాజీనామా ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ సమయంలో ప్రధాని విదేశాలకు పయనమయ్యారు. ఇక్కడ అన్ని పార్టీలు, పత్రికలు, మీడియా, సోషల్ మీడియా అనేక ఊహలు, ఊహాగానాలు చేస్తున్నాయి. పని పెరిగింది. ప్రధాన లక్ష్యాలు, కార్యక్రమాలు పక్కన పెట్టి ఈ మారుతున్న పరిస్థితులలో తమ తక్షణ కర్తవ్యాలను నిర్ణయించుకోవాల్సి వచ్చింది.

కాంగ్రెస్, ఇండియా కూటమికి, అధికారంలో ఉన్న బిజెపికి, ఆ కూటమికి ఈ విషయంలో ఏదో ఒక స్పష్టత ఉంటనే ఉంటుంది. వారికి ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కనుక వారు ఒకట్రెండు రోజుల్లోనే ఒక నిర్ణయానికి వస్తారు. నిర్ణయానికన్నా ముందు అనేక లీకులు ఇస్తుంటారు. ప్రజల్లో ప్రతిస్పందన చూసి నిర్ణయాలను మార్చుకుంటూ తుది నిర్ణయం ప్రకటిస్తుంటారు. ఇది రాజకీయ పార్టీలకు తప్పని కార్యక్రమం. అలా ప్రాంతీయ పార్టీలు కూడా తమ తమ నిర్ణయాలను, కార్యక్రమాలను తీసుకోవాల్సి ఉ ంటుంది. ఉదాహరణకు ఉపరాష్ట్రపతికి తమ అవగాహన తెలపడానికి ఆయా అభ్యర్థుల పేర్లను ముందుకు తీసుకువస్తుంటారు. వాటిమీద చర్చ చేస్తుంటారు.

అలా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు, మహిళా సంఘాలు తమ లక్ష్యాలకు అనుకూలంగా, కార్యక్రమాలకు అనుకూలంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థులను ప్రకటించుకోవాలి. చర్చలు చేయాలి. దళిత మహాసభ తరఫున గతంలో దళితుడే రాష్ట్రపతి కావాలని ఒక నినాదం ఇచ్చారు. ఆనాటి రాష్ట్రపతి 106 ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంపీల ప్రతినిధి బృందాన్ని కలవడానికి నిరాకరించారు. ఆ సందర్భంగా దళితుడే రాష్ట్రపతి కావాలని నినాదం ముందుకు వచ్చింది. కె.ఆర్. నారాయణన్ ఉప రాష్ట్రపతిగా, ఆ తర్వాత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం మనకు తెలుసు. అందువల్ల ఇప్పుడు బీసీలకు 42 శాతం చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో, ఉద్యోగ, విద్యా రంగాల్లో రిజర్వేషన్ కావాలని ఆందోళన చేస్తున్న సమయమిది. అందువల్ల ఈ ఉద్యమాల కాలంలో అన్ని పార్టీలకు మనదైన ఒక ఎజెండాను, అభ్యర్థుల పేర్ల ప్రకటనను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణా రాష్ట్ర ప్రజలుగా, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం అవసరం.

ఆ విధంగా అనేక కోణాల్లో ఆలోచించి తెలంగాణ నుండి ఉప రాష్ట్రపతి ఎన్నిక కావాలి అనే నినాదాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దాన్ని సాకారం చేసినప్పుడే 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించడానికి ఒక అడుగు ముందుకు పడుతుంది. ఈ విషయం గమనించకపోతే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాగా 42 శాతం నినాదం ఉట్టి నినాదంగా, ఏ కార్యక్రమం లేనిదానిగా మిగిలిపోతుంది. అది శుష్క నినాదంగా మారిపోతుంది. ఆనాడు దళితుడే రాష్ట్రపతి కావాలని అన్నారు. అన్ని పార్టీల నాయకులు దానికి మద్దతు ఇచ్చారు. దళితుడు రాష్ట్రపతి అయ్యాడు.

అలాగే ఈనాడు ఒక బీసీ ఉప రాష్ట్రపతి కావాలి అనే నినాదాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకురావాలి. ఆ ఉప రాష్ట్రపతి తెలంగాణవారై ఉ ండాలి. గతంలో ఆంధ్రా నుండి వెంకయ్యనాయుడు గారు ఉప రాష్ట్రపతి అయ్యారు. ఈసారి అనుకోని ఈ అవకాశంలో తెలంగాణ నుండి బీసీ సామాజిక వర్గం నుండి ఉప రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. అందుకు బండారు దత్తాత్రేయ అనేక అనుభవాలు సాధించిన బిజెపి నాయకులు గవర్నర్గా ఇటీవలే రిటైర్ అయ్యారు. గతంలో గవర్నర్గా పనిచేసి రిటైరైన ద్రౌపది ముర్ముగారిని మనం రాష్ట్రపతిగా ఎన్నుకున్నాము. అలా ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా నిలుపుకున్నాము. ఇప్పుడు ఒక నిఖార్సైన బీసీ సామాజిక వర్గానికి చెందిన బండారు దత్తాత్రేయగారిని తెలంగాణ నుండి ఉప రాష్ట్రపతిగా ప్రతిపాదించి ఎన్నికయ్యేటట్లు చూసుకోవాలి. ఇదే రేపటి 42 శాతం బీసీ రిజర్వేషన్ల పట్ల ఆయా పార్టీల కమిట్మెంట్ను సమీకరిస్తుంది. వర్గీకరిస్తుంది.

42 శాతం బీసీ రిజర్వేషన్లు అనే ఉద్యమం దేశంలో అన్నిటికన్నా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముందుకు సాగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు కట్టుబడి ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా బండారు దత్తాత్రేయను ఉప రాష్ట్రపతిగా ప్రతిపాదిస్తే కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలో చర్చిస్తామని ప్రకటించారు. ప్రతిపాదించారు. ఇది ఎంతో హర్షనీయం, అభినందనీయం. అందువల్ల ఇక తెలంగాణ బీసీవాదులు, ఉద్యమకారులు అందుకు ఉద్యమించడం దేశవ్యాప్తంగా కదిలించడం అవసరం. ఈ పని చేయకపోతే మరెప్పుడూ ఇలాంటి అవకాశం రాదు.

అలాగే బీసీ సామాజిక వర్గాలనుండి మరికొన్ని పేర్లను కూడా ఉప రాష్ట్రపతికి ప్రతిపాదించవచ్చు. వ్యక్తిగతంగా ఎవరికి ఇష్టమున్నా లేకున్నా కొన్ని పేర్లను మనం ప్రతిపాదించడం అవసరం. ఉదాహరణకు దశాబ్దాలుగా బీసీ విద్యార్థి యువజనుల కోసం కృషి చేసి తనదైన చరిత్ర నిర్మించుకున్న ఆర్. కృష్ణయ్యగారిని, అలాగే అనేక ఉద్యమాల్లో రాటు దేలిన ఈటల రాజేందర్ గారిని ఉప రాష్ట్రపతికి ఎన్నిక చేయడానికి అర్హులు అని ఎందుకు ప్రతిపాదించకూడదు?. ఇలా ఎవరో రకరకాల పేర్లను అభ్యర్థులుగా ముందుకు తెచ్చేకన్నా ముందుగా బీసీ సామాజిక వర్గాల నాయకులను రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆలోచించి ఆ పేర్లను అభ్యర్థులుగా ప్రతిపాదించడం, చర్చ చేయడం అవసరం. ప్రతి సందర్భాన్ని రాజకీయ చైతన్యానికి అనుకూలంగా ఉపయోగించుకునేవారే రాజకీయాల్లో విజేతలుగా, నిర్నేతలుగా నిలుస్తారు. అని మరిచిపోకూడదు.

Read More
Next Story