ప్రభుత్వం చెప్పే అభివృద్ధి ఒక గారడీ.. అందులో ఆడేది ప్రజలే..
x

ప్రభుత్వం చెప్పే అభివృద్ధి ఒక గారడీ.. అందులో ఆడేది ప్రజలే..

రేవంత్ అడుగుతున్నాడు, నోరు మూసుకుని మీ భూములు ఇచ్చేయండి .. అంతే

సాధారణ ప్రజలకు, సుస్థిర అభివృద్ధిని కోరుకునే ప్రజాస్వామిక వాదులకు కనపడడం లేదు, అర్థం కావడం లేదు కానీ, తెలంగాణా రాష్ట్రంలో అభివృద్ధి శర వేగంతో దూసుకుపోతున్నది. ప్రత్యేక రాష్ట్రంలో 11 ఏళ్ల క్రితం మొదలైన ఈ అభివృద్ధి ప్రణాళిక మూడు ఎక్స్ ప్రెస్ రోడ్లు, 6 భారీ పరిశ్రమలు సంస్థలు రాష్ట్రానికి తరలి వస్తున్నాయనే అట్టహాసపు ప్రకటనలతో ముందుకు సాగుతున్నది.

గత 11 ఏళ్లలో రాష్ట్రంలో అధికారం చెలాయించడానికి పరస్పర విమర్శలు చేసుకున్న రెండు పార్టీలు మారి ఉండవచ్చు, మూడు ప్రభుత్వాలు మారి ఉండవచ్చు. ప్రభుత్వాలకు నాయకత్వం వహించే నేతలు, క్షేత్ర స్థాయిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మారి ఉండవచ్చు. కానీ అభివృద్ధిలో మాత్రం అదే దూకుడు, అదే వేగం కొనసాగుతున్నది.

విచిత్రమేమిటంటే, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిన ఈ అభివృద్ధి నమూనా, అధికారం చేపట్టాక వాళ్ళకూ పరమ ప్రీతి పాత్రమై పోతున్నది. ఇంత కాలం ఇదే అభివృద్ధి నమూనాతో అధికారం చలాయించిన పార్టీ, ప్రతిపక్షంలోకి దిగ జారాక ,ఇదే అభివృద్ధి నమూనా అధికార పక్షంపై విమర్శకు మళ్ళీ అస్త్రమవుతున్నది.

అందువల్ల, ఈ అభివృద్ధి నమూనాతో ఎవరికి మేలు జరిగిందని ఎప్పుడూ, ఎవరినీ మీరు అడగ కండి. ఈ అభివృద్ధి కోసం భూములు పోగొట్టుకున్న రైతుల కుటుంబాలేమైనా బాగు పడ్డాయా అని అసలడగకండి. ఈ అభివృద్ధి జరిగిన ప్రాంతాలలో ఆస్తులెవరికి పోగుపడ్డాయని కూడా ఆరా తీయకండి. ప్రభుత్వాల ఈ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్న పౌర సమాజ మాట అసలు వినకండి.

కొందరు కాంట్రాక్టర్లు, వ్యాపార వేత్తలు, తాము అప్పటి వరకూ ఉన్న రాజకీయ పార్టీని వదిలి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పార్టీలో ఎందుకు చేరుతున్నారని మీరు ఆగ్రహించకండి. ఇదంతా అభివృద్ధి కోసమే అని సరి పెట్టుకోండి. వాళ్ళు మీకు మరింత సేవ చేయడానికే ఉవ్విళ్ళూరుతూ పార్టీలు మారుతున్నారని సరి పెట్టుకోండి.

ఈ అభివృద్ధి ప్రక్రియలో స్వంత భూములను పోగొట్టుకున్న రైతులకు అందిన పరిహారమెంత ?. తమకు అందిన పరిహారాన్ని ఆ రైతు కుటుంబాలు నిలబెట్టుకున్నాయా ? ఆ మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా మళ్ళీ భూములు కొనుక్కున్నాయా ? లేదా ఆ డబ్బులతో తిరిగి మరో జీవనోపాధిని ఏర్పాటు చేసుకున్నాయా ? లేదా ఆ డబ్బులన్నీ, అప్పులు తీర్చుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, శారీరక, మానసిక అనారోగ్యాల పాలై ఆసుపత్రి వైద్యానికి ఖర్చయిపోతే, మళ్ళీ రోడ్డున పడ్డాయా? తమ భూములు కోల్పోయిన గ్రామాల్లోనే ఆ కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయా? పొట్ట చేత బట్టుకుని నగరాలకు, పట్టణాలకు వలస పోయాయా? అని విచారణ చేయకండి. భూముల యజమానులు సరే, ఆ భూములపై ఆధారపడిన వ్యవసాయ కూలీలకు, పశు పోషకులకు పరిహారమేదైనా అందిందా ? అని ఆరా తీయకండి.

రైతుల నుండి భూములను కొల్ల గొట్టిన ప్రభుత్వం ఆ భూములను పరిశ్రమలకు అమ్ముకున్న రేటు ఎంత ? అనే లెక్కలు మాత్రం అసలు వేయకండి. ఈ అభివృద్ధి కోసం భూములు కోల్పోయింది అసైన్డ్ భూముల యజమానులు, సన్న, చిన్న కారు రైతులేనా ? రాష్ట్రంలో ఎక్కడ బడితే పదుల, వందల కొద్దీ ఎకరాల సాగు భూములు కొన్న బడా బాబులు, ప్రజా ప్రతినిధులు కూడా ఎవరైనా ఉన్నారా ? అని సమాచారం కోరకండి. పాలకుల ఆదేశాలతో ఆయా ప్రాంతాలలో భూసేకరణ ప్రక్రియను ముందుకు నడిపించిన అధికారుల, ఉద్యోగుల ఆస్తులు ఏ మేరకు పెరిగాయనీ, భూ సేకరణ చేపట్టిన ప్రాంతాల చుట్టూ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎవరివి వెలిశాయనీ తెల్సుకునే ప్రయత్నం అసలు చేయకండి.

రాష్ట్రంలో గత 30 ఏళ్లుగా ఇలాగే అభివృద్ధి పేరుతో, ఆయా కాలాలలో అప్పటి ప్రభుత్వాలు రైతుల నుండీ లాక్కున్న భూములన్నీ ఏమయ్యాయనీ , రాష్ట్ర ప్రజల ముందు ఆ భూముల వినియోగ వివరాలు ఎందుకు ఉంచడం లేదనీ నిగ్గదీయకండి. అంతెందుకు, గత BRS ప్రభుత్వం తన తొమ్మిదిన్నరేళ్ళ అధికార హయంలో వివిధ ప్రాజెక్టుల పేరుతో,పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా సేకరించిన రెండు లక్షల ఎకరాలకు పైగా రైతుల భూములు, ఎందుకోసం వినియోగించారో అడగబోకండి. ఆ భూముల్లో ఎన్ని రహదారులు వచ్చాయి ? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ? ఎన్ని నగరాలు బాగుపడ్డాయి ? అనే ప్రశ్నను మీ నోటి నుండీ బయటకు రానీయకండి.

అభివృద్ధి పేరుతో, వ్యవసాయ భూములు ఇలా పక్కదారి పట్టిస్తే, రాష్ట్ర జనాభాకు అవసరమైన తిండి ఎక్కడి నుండీ వస్తుందని దిగులు చెందకండి. గ్రామాలలో గతంలో పండిన పంటలన్నీ మాయమైపోతున్నాయనీ, ఒకటి రెండు పంటలే అన్ని గ్రామాలలోనూ ఉంటున్నాయనీ, గ్రామాల ప్రజలు కూడా పప్పులూ , నూనెలూ , కూరగాయలూ, పండ్లూ,చివరికి పాలు కూడా బయట ప్రాంతాల నుండీ తెచ్చుకుంటున్నారనీ ఆందోళన చెందకండి. అన్ని నిత్యావసర సరుకుల ధరలూ, పాల ధరలూ, కూరగాయల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయని వాపోకండి.

నగరాల చుట్టూ వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాక, గ్రామీణులకు చేతి నిండా పని లేక,పెరుగుతున్న ఖర్చులకు తగిన ఆదాయాలు లేక, నిత్యావసరాలు కూడా కొనుక్కోలేకపోతున్నామని సిగ్గు పడకండి. గ్రామాలలో మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు పౌష్టిక ఆహరం అందించలేని ప్రభుత్వాలు, గల్లీ గల్లీకీ బెల్టు షాపులు ఎందుకు పెడుతున్నాయని, తాజాగా బీరు కెఫెలు కూడా ఎందుకు తెస్తున్నారని ఆగ్రహించకండి.

ఊళ్ళో మగవాళ్ళూ, కుర్రాళ్ళూ, పిల్లలూ కూడా మద్యం, గంజాయి మత్తులో జోగుతూ అనారోగ్యాల పాలవుతున్నారనీ, గ్రామీణ ప్రాంత ప్రజలను చిన్న వయస్సు లోనే అనేక రకాల రోగాలు చుట్టు ముడుతున్నాయనీ, గ్రామీణ మహిళలు లక్షల సంఖ్యలో వితంతువులుగా మారి పోతున్నారనీ గణాంకాలు వల్లె వేయకండి.

ఇప్పటికీ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, ఐదెకరాల రైతు కుటుంబ ఆదాయం నెలకు 9400 రూపాయలు మాత్రమేననీ, రాష్ట్రంలో 30 లక్షల మంది చదువు కున్న యువత నిరుద్యోగులుగా ఉన్నారనీ, నగరాలలో పని చేసే అసంఘటిత కార్మికుల ఆదాయం 70 శాతం మందికి నెలకు 10,000 రూపాయలు దాటడం లేదనీ మీకు తెలిసినా, ప్రభుత్వ పెద్దలకు చేరేలా ఎవరికీ చెప్పకండి. ప్రభుత్వ పెద్దల మనసు చెదిరిపోవచ్చు. అభివృద్ధిపై ఉత్సాహం తగ్గిపోవచ్చు.

అరే భయ్యా, రోజూ ఉండే మీ భయాలనూ, మీ విషాదాలనూ కాసేపు పక్కన బెట్టేయండి. ఇప్పటికే మీరు బాగా వెనకబడి పోయారని ప్రభుత్వ పెద్దలు వాపోతున్నారు. మిమ్మల్ని అభివృద్ధి పథం లో పరిగెత్తించాలని వాళ్ళ ఆశ. ఎప్పుడూ మీ గొడవేనా ? వాళ్ళ తపనను మీరే కొంచెమైనా మనసు పెట్టి అర్థం చేసుకోవాలి కదా ? మీ ఊళ్ళో కూలి పోతున్న స్కూల్ గురించీ, దోమ కాటుకు, పాము కాటుకు కూడా మందులు లేక రాలి పోతున్న ప్రాణాల గురించీ, మీ గ్రామాలలో గాలి, నీరూ, ఆహరం విషంగా మారిపోయిన విషయం గురించీ అసలు పట్టించుకోకండి.

మిమ్మల్ని వాళ్ళు న్యూయార్క్, లండన్, సింగపూర్ లాంటి నగరాలకో , తేమ్స్ నదీ తీరానికో, అందమైన మరో దీవికో తీసుకు వెళ్ళాలని అనుకుంటారు. మీరు గ్రామాల నుండీ కదలరు. మీ పల్లె వెలుగు బస్సుల్ని రద్దు చేసి, మీరు జుమ్మని తిరిగేందుకు మిమ్మల్ని మెట్రో రైల్ ఎక్కించాలని కలలు కంటున్నారు. మీ కోరిక తీరేలా విమానాలలో ఎగరాలని , మీకు దగ్గర లోనే విమానాశ్రయాలను కూడా తెచ్చేస్తామంటున్నారు. మీరు కబడ్డీ మానుకుని, క్రికెట్ నేర్చుకుని ఆడడానికి ఒక కొత్త క్రికెట్ స్టేడియమూ, మీకు అసలు పరిచయమే లేని అందమైన గోల్ఫ్ కోర్టూ , మీరు ఊళ్ళో ఆడుకునే పచ్చీసాట మానుకుని గుర్రప్పందాలు కాయడానికి ఒక రేస్ కోర్టూ మీ ముంగిట్లోకే పట్టుకొస్తారట. చప్పట్లు కొట్టి, తోరణాలు కట్టి స్వాగతించండి.

మీ భూములను తీసుకుని, నగరాల చుట్టూ వాళ్ళు రింగు రోడ్లు వేస్తారు. రాష్ట్రమంతా 8 లేన్లు, 12 లేన్ల బడా రహదారులు కూడా వేస్తారు. కానీ, ఇవన్నీ మన భూముల్లో వేసిన రోడ్లే కదా అని, వాటి పైకి అదే పనిగా పోతే వాటిపై దూసుకు వెళ్ళే వాహనాల వేగానికి మీరు పచ్చడయి పోతారు.

పైగా మీరు మిగిలిన మీ పొలాల లోనో, పశువుల వెంటో తిరిగి, మురికి బట్టలు వేసుకుని ఆ రోడ్లపై నడిచి పోవడానికి, సైకిల్ తొక్కడానికి, బైక్ నడపడానికి వీలులేదు. మీరు ఆ రోడ్ల పైకి పోవాలంటే, మీ భూములకు ప్రభుత్వం పరిహారంగా ఇచ్చిన డబ్బులతో, కం సే కం , ఒక కారు కొనుక్కోవాలి. అప్పుడిక చూసుకోండి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ,గ్రామాల వెనకబాటుతనాన్ని ఈసడిస్తూ, నగరాల, రహదారుల అభివృద్ధిని ఆస్వాదిస్తూ మీరిక దూసుకుపోవచ్చు.

నగరాల చుట్టూ సేకరించిన భూముల్లో, ఎలాగూ కంపనీలు, పరిశ్రమలు , సంస్థలు వస్తాయి కదా? అని మీరు భ్రమిస్తునట్లున్నారు. వాటిల్లో మీకు చేసుకోవడానికి ఏదో ఒక పని దొరకక పోతుందా అని ఆశ పడుతున్నట్లున్నారు. మీ ఆశలు దొంగలు దోచుకెళ్ళ, అలాంటి ఆశలేమీ మీరు పెట్టుకోబాకండి.

మీ గ్రామాల చుట్టూ వచ్చే పరిశ్రమలలో మిమ్మల్ని పనిలో పెట్టుకుంటే, మీరు రోజూ 8 గంటలు పని చేసి వెళ్ళి పోతామంటారు. కనీస వేతనాలు చెల్లించాలంటారు. మూడేళ్ళ కొకసారి వేతనాలు పెంచాలంటారు.వారానికో రోజు సెలవు కావాలంటారు. పండగలకు కూడా సెలవులు అడుగుతారు. పి.ఎఫ్., ESI లాంటి సౌకర్యాలు అడుగుతారు. ప్రమాదం జరిగి గాయపడినా, మరణించినా పరిహారం ఇవ్వాలంటారు. మరీ బరి తెగించి, కార్మిక సంఘం కూడా పెడతారు.

మీకు అర్థం కావడం లేదు కానీ, కార్మికులకు ఇవన్నీ ఇవ్వాలంటే, కంపనీలు మన దగ్గరకు ఎందుకు వస్తాయి చెప్పండి ? ఇంకో రాష్ట్రానికి తరలి పోతాయి.అందుకే మన రాష్ట్ర పెద్దలు, ముందుగానే ఆయా కంపనీల వాళ్ళకు చాలా హామీలు ఇస్తున్నారు. పరిశ్రమల ,సంస్థల ఏర్పాటుకు ఉచితంగా స్థలాలు ఇస్తామనీ, నీళ్ళు, కరెంటు తక్కువ ధరకు సరఫరా చేస్తామనీ, పరిశ్రమల వరకూ రోడ్లు వేస్తామనీ, పన్నులలో రాయితీలు ఇస్తామనీ, ఇంకా అనేక ప్రోత్సాహకాలు ఇస్తామనీ, కార్మిక చట్టాలు అమలు చేయకుండా, మీకు ఇష్టమొచ్చినట్లుగా కంపనీలు నడుపుకోవచ్చని, సింగిల్ విండో సిస్టం లో 30 రోజుల్లో మీకు అనుమతులు ఇచ్చేస్తామని, మీరు రాగానే మా ప్రభుత్వ అధికారులే విమానాశ్రయానికి వచ్చి మీకు స్వాగతం పలుకుతారని, ఇలా అనేక మాటలు ఆయా దేశాలు తిరిగి చెప్పి వస్తున్నారు.

అంటే, ఆయా కంపనీలు రేపు మీపై కాలుష్యం వెదజల్లినా ఈ ప్రభుత్వాల పెద్దలు ఏమీ అనరు. స్థానికులను ఉద్యోగాలలో పెట్టుకోక పోయినా ఏమీ అడగరు. ఇతర రాష్ట్రాల నుండీ తక్కువ వేతనాలు ఇచ్చి కార్మికులను తెచ్చుకున్నా, వాళ్ళతో 12 గంటలు పని చేయించుకుని శ్రమను దోచుకున్నా వీళ్ళు కళ్ళు మూసుకుని కూర్చుంటారు. పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులు ఆయా పరిశ్రమల జోలికి వెళ్ళకుండా ముందుగానే తగిన ఆదేశాలిస్తారు. ఆయా పరిశ్రమలలో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగి, కార్మికులూ, చుట్టూ ప్రజలూ మరణించినా, అనారోగ్యం పాలైనా ఆ యజమానులను అసలు అరెస్టు చేయరు. వాళ్ళను పల్లెత్తు మాట అనరు. ఏదో ఒక పరిహారం మీ ముఖాన పడేసి, చేతులు దులిపేసుకుంటారు.

మీకు చదువు రాదనీ, పని రాదనీ , పని చాత కాదనీ, మీకు ఎలాంటి నైపుణ్యాలు లేవనీ, ఇంగ్లీష్ రాదనీ మిమ్మల్ని పనిలోకి తీసుకోవడానికి యాజమాన్యాలు నిరాకరిస్తాయి. ఈ రాష్ట్ర యువత నైపుణ్యాలు పెంచడానికి అవసరమైన శిక్షణలు ఇస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తాయి కానీ, అందుకు అనుగుణంగా వేగంగా చర్యలు చేపట్టకుండా కాలయాపన చేస్తాయి. రాష్ట్రంలో లక్షల మంది యువత ఖాళీగా, నిరుద్యోగులుగా ఉంటే, కొన్ని వేల మందికి శిక్షణ ఇవ్వడానికి మాత్రమే ఏర్పాట్లు చేస్తాయి. బడ్జెట్ లో తగిన నిధులు లేవు కనుక, మీకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని కన్నీళ్లు కారుస్తాయి. కానీ అభివృద్ధిని ముందుకు తీసుకు వెళతామని గప్పాలు కొడతాయి . అభివృద్ధి కోసం మరిన్ని భూములు తీసుకుంటామని మాత్రం తప్పకుండా ప్రకటిస్తాయి.

అయినా మీరేమీ దిగులు పడకండి. మా భూములు లాక్కుంటే మేమెలా బతకాలని ఆందోళన చెందకండి. మిమ్మల్ని చనిపోకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వాలు తీసుకుంటాయి. మీకో రేషన్ కార్డ్ ఇస్తాయి. రాష్ట్రంలో 3 కోట్ల 60 లక్షల జనాభా ఉంటే, ఇప్పటికే కోటికి పైగా రేషన్ కార్డులు ఇచ్చారు. 3 కోట్ల 15 లక్షల జనాభాను రేషన్ కార్డుల పరిధి లోకి తీసుకు వచ్చారు. నెలకు 6 కిలోల సన్న బియ్యం మీకు గ్యారంటీ. మీ కోసం ఒక ఆరోగ్య శ్రీ పథకం కూడా ఉంది. రోగమొస్తే, మీకు ఉచిత వైద్యం అందుతుంది.

మీరు మరీ పేదరికంలో ఉంటే, మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక పేరుతో 2,116 రూపాయల ఆసరా పెన్షన్ కూడా ఇస్తారు. వీటికి మాత్రం డబ్బులు ఎక్కడివని మీ అనుమానమా ? గత ప్రభుత్వం తన హయంలో సాగు నీళ్ళ కోసం, తాగు నీళ్ళ కోసం, కరెంట్ సరఫరా కోసం, ఇళ్ళ నిర్మాణం కోసం అంటూ రక రకాల కార్పోరేషన్లు ఏర్పాటు చేసి అప్పులు తెచ్చింది. ఈ ప్రభుత్వం కూడా అవసరమైతే, మీ పిల్లల చదువుల కోసం, సన్న బియ్యం పంపిణీ కోసం, ఆసరా పెన్షన్ ల చెల్లింపు కోసం అంటూ ఏదో ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేసి, అప్పులు చేసి మరీ మీకు సేవలు అందిస్తుంది. దిగులు పడకండి.

ప్రభుత్వాలు చేసే అప్పుల గురించి కూడా మీరేమీ దిగులు పడకండి. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసిపోయింది. భూ సేకరణ పేరుతో, మీ దగ్గర లాక్కున్న కొన్ని భూములను అమ్మింది. తన హయంలో ఈ ప్రభుత్వం కూడా మరో 7 లక్షల కోట్ల అప్పు చేస్తుంది. ఆ అప్పులను తీర్చడానికి తక్కువ పరిహారం చెల్లించి మీ దగ్గర లాక్కున్న కొన్ని భూములను మళ్ళీ అమ్మకానికి పెడుతుంది. అవి కూడా సరిపోక పోతే మళ్ళీ మీ భూముల కోసం వస్తుంది. మీ చేతుల్లో కొద్దిపాటి భూములు ఉన్నంత కాలం ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది.

అందుకే, ప్రభుత్వాలు ముందుకు తెస్తున్న ఈ అభివృద్ధిని చూసి మీరేమీ భయపడకండి.

మీ భూముల జోలికి ప్రభుత్వం వస్తే ఎదురు తిరగకండి. దణ్ణం పెట్టి భూములు ఇచ్చేయండి.

Read More
Next Story