ఆర్య వీరుల్లో ఈర్ష్య అసూయల బీజాలు ఎలా పడ్డాయి?
సాంస్కృతిక మహా సంగ్రామం.హరప్పనుల గాథ. అధ్యాయం -3 (ఈర్ష్య అసూయల నీడ) ఆంగ్లమూలం:The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi
రోజులు గడుస్తున్నాయి. పునీతుడు తన స్నేహితులైన అశ్విన్, వరుణ్ లతో కలిసి హరప్పా నగర అద్భుత వాస్తుకళ, అధునాతన నీటిపారుదల వ్యవస్థ, నిత్య సందోహంగా వుండే అంగడి ప్రాంతాల గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకోసాగాడు. అక్కడి భారీ ధాన్యపు గాదెలు, చక్కని పనితనంతో మలిచిన ముద్రలు, ఎంతో నైపుణ్యంతో రూపొందించిన ఆభరణాలు వాళ్ళను విభ్రమంలో ముంచెత్తాయి. జనసమ్మర్దానికి తగినట్టుగా విశాలమైన వీధులను సహజ వెలుతురు, ధారాళమైన గాలి ప్రవేశించేలా తీర్చిదిద్దారు హరప్పా నగర రూపకర్తలు. శాస్త్రీయ పద్ధతిలో మట్టి పైపులతో నిర్మించిన మురుగునీటి పారుదల వ్యవస్థ నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా వుంచి ప్రాచీన పట్టణ ప్రణాళిక విశిష్టత కు అద్దం పట్టింది.
ఎటు చూసినా వాళ్లకు మర్యాదస్తులైన, సంస్కారవంతులైన మనుష్యులే కనపడ్డారు. ప్రజాభవనాల కుడ్యాలపై చిక్కని అల్లికలాంటి మొజాయిక్ పురాణ గాథలను, ఐతిహ్యాలను ప్రతిబింబించింది. అందంగా తీర్చిదిద్దిన మృణ్మయ పాత్రలు, పింగాణి కళాకృతులు హరప్పనుల పని నైపుణ్యానికి, కళాదృష్టికి అద్దం పట్టాయి. హరప్పా నగర కళాకారులు నిష్ణాతులు, వాళ్ళు రూపొందించిన కళా ఖండాలు తాను గత యాత్రలలో చూసిన వాటి కన్నా చాలా ఉన్నతమైనవిగా పునీతుడికి అనిపించింది.
వ్యాపారులు తమతమ సరుకులను విక్ర యించే క్రమంలో చేసే పలువిధాల లయాత్మక ధ్వనులు, అంతటా కనువిందు చేసే వివిధరంగుల వస్తుసామాగ్రితో విపణి వీధులు చూపరులను కట్టిపడేసేలా వున్నాయి. అక్కడి గాలి రొట్టెల తాజావాసనతో, సుగంధద్రవ్యాల పరిమళంతో, వేయించిన మాంసపు కమ్మని వాసనతో వీస్తూ వాళ్ళ నోరూరించి కడుపులో ఆకలి కేకలు మొదలెట్టించాయి. మెత్తని శిల్కు, శ్రేష్టమైన నూలు మొదలుకుని.. తళతళ మెరిసే రత్నాలు, ధగధగ లాడుతున్న లోహ ఆభరణాలు..- అక్కడి క్రయవిక్రయాల వస్తు సామగ్రి వైవిధ్యం చూస్తూ వాళ్ళు ఆశ్చర్యంతో మైమరచిపోయారు.
వాళ్ళను కట్టి పడేసింది ఆ నగర భౌతిక స్వరూపం మాత్రమె కాదు –అక్కడి ప్రజలు కూడా. కుతూహల భరితులైన కొత్త వ్యక్తులను ఆత్మీయంగా స్వాగతించి తమ విజ్ఞానాన్ని, సంప్రదాయాలను వాళ్ళతో పంచుకునేంత ఉదార స్వభావులు, మైత్రికాముకులు హరప్పనులు. వాళ్ళు జ్ఞానులు, వివేకవంతులు ; ప్రకృతి, ప్రపంచం రహస్యాల గురించి లోతైన అవగాహన కలిగిన వారు కూడా. నగరాన్ని లోతుగా శోధిస్తూన్న ఆ ముగ్గురు సాహసికులకు –హరప్పా అంటే భవనాలు, మనుష్యుల సముదాయమే కాదు అంతకు మించినది ; అదొక సజీవమైన, శ్వాసిస్తోన్నఅస్తిత్వం ; తనకే సొంతమైన ప్రత్యక లయతో చురుకుగా స్పందిస్తున్న గుండె అని స్ఫురించింది. వాళ్ళ దానికన్నా పూర్తి విభిన్నమైన ఒక కొత్త ప్రపంచాన్ని చూసిన అనుభవం వాళ్ళు ఎన్నడూ మరువ జాలరు.
హరప్పా నగరం పట్ల ఆరాధనాభావం, అబ్బురపాటుతో పాటే వాళ్ళ మదిలో ఒక విధమైన అసూయ, ఈర్ష్య కూడా తలెత్తింది. తమ జాతివారు జీవిక కోసం పోరాడుతూ కేవలం ద్రిమ్మరిగా తిరిగే సంచార సమూహంగా వుంటే, వీళ్ళు, వీళ్ళ హరప్పా నగరం మాత్రం ఎందుకు అధునాతన వ్యవస్థలతో, నిర్మాణాలతో అలరారుతున్నది ? తాము దొరికినదేదో తింటూ కనాకష్టమైన బతుకు వెళ్ళ దీస్తూంటే హరప్పనులు ఇంత విజ్ఞానాన్ని, ఐశ్వర్యాన్నిఎందుకు సొంతం చేసుకోవాలి ? ఈ క్లేశం వాళ్ళ మదిని కుమ్మరిపురుగులా తొలిచింది ; అందులోంచే ఇంకా నేర్చుకోవాలన్న జిజ్ఞాస, ప్రాచీన నాగరికత నుంచి రహస్యాలు తెలుసుకోవాలన్న కుతూహలం, కళ్ళముందున్న వైభవం లో తామూ భాగం పంచుకోవాలన్న ఆశ.. పుట్టుకొచ్చినై.
‘‘ప్రతికూలమైన పరిస్థితుల్లో, స్టెప్పీ మైదానాల్లో, ఆర్యులు బతుకు తెరువు కోసం తెగ కష్ట పడుతూంటే హరప్పనులు సకల ఐశ్వర్యాలు ఎందుకు అనుభవించాలి? ’’ అసూయ, ద్వేషంతో నిండిన స్వరంతో అశ్విన్ గొణిగినట్టుగా అన్నాడు.
పునీతుడు అతనితో ఏకీభవించినట్టుగా చూస్తూ తల ఊపాడు. ‘‘ఔను. మనం కటిక చీకటిలో మ్రగ్గి పోతూంటే వీళ్ళు ఇంత వ్యవసాయ, నీటిపారుదల విజ్ఞానం సముపార్జించి హాయిగా బతకడం అన్యాయం.. ’’
వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండితుడు, రుషి లాంటి వాడైన వరుణ్ ఇలా అన్నాడు. ‘‘వీళ్లుసాధించింది హస్తగతం చేసుకోవడం కన్నా వీళ్ళ నుంచి నేర్చుకోవడం పై మనం దృష్టి పెట్టాలి. మన జీవితాల్ని మెరుగు పర్చుకునే విధంగా వీళ్ళ నవకల్పనల్ని మన సొంత అవసరాలకు అన్వయించుకోవాలి. అసూయ, ద్వేషం మన స్థితిని ఇంకా దిగ జార్చుతాయి. కృతజ్ఞతా భావనని, సమృద్ధిని సాధించుకునే విధంగా మన వేదవిజ్ఞానాన్ని వినియోగించుదాము.’’
కానీ అశ్విన్ బుర్రలో అసూయ అప్పటికే బలంగా పాదుకు పోయింది. ‘‘వాళ్ళ నుంచి నేర్చుకునే అవసరం మనకు లేదు. హక్కుగా మనకు ఏది రావాలో అది మాత్రమె తీసుకుందాం. మనం దేవుళ్ళ భాష మాట్లాడతాము – ఈ భూమిని పాలించమని దేవుడు మనలను ఎంపిక చేశాడు, హరప్పనులను కాదు. ’’
పునీతుడు కళ్ళు చికిలించాడు, సాధ్యాసాధ్యాల విషయమై అతని మస్తిష్కంలో మథనం ఆరంభమైంది. ‘‘అశ్విన్ చెప్పిందే బహుశ సరైనది. ఎలాంటి రక్తపాతం లేకుండా ఈ నగర సిరిసంపదలను హస్తగతం చేసుకుని మన ఆధిపత్యాన్ని ప్రకటించే సమయం ఇదే కాబోలు..హరప్పనులను మన దారిలోకి మళ్ళించాలి. ’’
వరుణ్ ముఖం వాడిపోయింది, కవళికల్లో నిరుత్సాహ చాయలు కమ్ముకున్నాయి. ‘‘నీ మాటలు నాకు రుచించడం లేదు ఆశ్విన్. నీ దురాశ, అసూయతో పునీతుడిని ప్రభావితం చేస్తున్నావు. నీ పంథా విద్వంసానికి దారి తీస్తుందని నీకు అర్థం కావడం లేదా? ’’
అశ్విన్ హేళనగా నవ్వాడు. ‘‘వరుణ్, నువ్వు మరీ మెతక మనిషివి. ప్రపంచం పోకడ నీకు తెలియదు. పునీతుడు ఇప్పుడు సత్యమేమిటో గ్రహించాడు. మమ్మల్ని వెనుకకు లాగాలని చూసే నీ పాతకాలపు జ్ఞానం మాకవసరం లేదు. ’’
వరుణ్ కళ్ళల్లో కలవరం కనిపించింది. ‘‘అశ్విన్, మన భవిష్యత్తు గురించే నా భయం. నీ ద్వేషం, దురాశ మన పతనానికి దారి తీయవచ్చు.’’
ఆర్యవీరులు అలా ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోగా ఘర్షణ కి బీజాలు పడ్డాయి. పెరుగుతోన్న ఉద్రిక్తతల గురించిన ఆలోచన లేని హరప్పనులు ఆత్మీయంగా చేతులు సాచి కొత్త వ్యక్తులకు స్వాగతించసాగారు, కమ్ముకు వస్తున్న తుఫాను గురించి వారికి తెలియదు. (సశేషం)