
‘ఎన్ కౌంటర్’ లో మరణించిన మావోయిస్టు లీడర్ హిడ్మా
హిడ్మా అంతం - ప్రశ్నలు అనంతం
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము విశ్లేషణ
ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి (Maredumilli) అటవీ ప్రాంతంలో నవంబర్ 18, 2025 (మంగళవారం) నాడు అనుమానాస్పద ఎన్కౌంటర్లో హిడ్మా హతుడయ్యాక మావోయిస్టు ఉద్యమం వెన్నువిరిగిందనడంలో సందేహం లేదు. అయితే, అయన మరణం పైన వస్తున్న పౌర స్పందన, జరుగుతున్న చర్చ నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. నిన్నటి దాకా పెద్దగా ఎవరికీ తెలియని ఒక మావోయిస్టు నాయకుడు ఇప్పుడు పెద్ద చర్చనియాంశం అయ్యాడు.
జల్, జంగిల్, జమీన్ నినాదంతో పెద్ద గిరిజన పోరాట సైన్యాన్ని నిర్మించి, తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించిన హిడ్మాను చరిత్రలో స్ఫూర్తిదాయక అధ్యాయాలైన బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు వంటి మన్నెం వీరులతోనే కాకుండా అంతర్జాతీయ విప్లవ యోధుడు చె గువేరా తో కూడా పోలుస్తున్నారు. ఇప్పుడు భారత విప్లవ స్ఫూర్తికి ఒక ప్రతీక గా హిడ్మా నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో, వర్గ శత్రువులుగా భావించి వివిధ ఆపరేషనల్లో డజన్ల కొద్దీ జవాన్లు, పోలీసులను, రాజకీయ నాయకులను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన హిడ్మా ఒక నరరూప రాక్షసుడని, ఆయనతో పాటు ఆయన్ను సమర్థిస్తున్న వారు కూడా దేశద్రోహులని తిట్టిపోసేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు. కొందరి దృష్టిలో హిడ్మా చేసింది స్ఫూర్తిదాయకమైన విప్లవ కవాతు, ఇంకొందరి దృష్టిలో అది మూర్ఖపు విప్లవ కరాళ నృత్యం!
దాదాపు ఇరవై ఏళ్లపాటు దండకారణ్యంలో జన సమీకరణలో, వ్యూహ ప్రతివ్యూహాలలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన 51 ఏళ్ల గిరిపుత్రుడు హీరోనా? విలనా? అన్నది మన సైద్ధాంతిక వివేచన మీద, రాజకీయ అభిరుచి మీద, వర్తమాన సామాజిక అవగాహన మీద ఆధారపడి ఉంటుంది.
హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
1) ఈ ఎన్కౌంటర్ మీద ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదు? మావోయిస్టుల ఏరివేత అనే కార్యక్రమంలో అయన కేంద్ర ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తున్నారా?
2) కమ్యూనిస్టు పార్టీలు తప్ప మిగిలిన రాజకీయ పార్టీలు ఆయన మరణం మీద ఎందుకు స్పందించడం లేదు? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సన్నిహితుడు పవన్ కళ్యాణ్ (ఒకప్పటి చె గువేరా భక్తుడు, ఇప్పటి unapologitic సనాతని) నోరు ఎందుకు మెదపలేదు?
3) హిద్మా అంత్య క్రియలకు ఢిల్లీ, ముంబాయి, హైద్రాబాద్ నుంచి సో కాల్డ్ అర్బన్ నక్సల్స్ ఎందుకు హాజరు కాలేదు?
4) భారీ ప్లానింగ్, దళాలు, నిధులతో లొంగుబాట్లు, అరెస్టులు, ఎన్కౌంటర్ల వల్ల మావోయిజం ఖతం అయిపోయిందా?
5) ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి వచ్చి దండకారణ్యంలో గిరిజనులతో దండు కట్టించి, కదం తొక్కించిన మావోయిస్టు అగ్రనాయకులు కీలక సమయంలో వెనక్కు తగ్గి లేదా చేతులెత్తేసి వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డరా? అగ్ర నాయకుల ప్లానింగ్ లోపం కొంప ముంచిందా?
6) ఈ రెండు రాష్ట్రల నుంచి వచ్చే మావోయిస్టు అగ్రనేతలను గిరిజనులు ఇంతకు ముందులాగా నమ్ముతారా?
7) మాటలతో విప్లవ రచయితలు, ఆట పాటలతో అరుణోదయ కళాకారులు రెచ్చగొట్టి అమాయక గిరిజనులను ఉత్తేజ పరిచి, కేంద్రం గుడ్లు ఉరిమేసరికి కామ్ అయి అమాయక గిరిజన యువకులను ఒంటరి చేశారా?
8) అతలాకుతలం, చెల్లాచెదురు అయిన మావోయిస్టు పార్టీ ఇప్పట్లో పునర్వ్యవస్థీకృతం కాగలదా?
9) ఇన్నాళ్లూ అన్నలు సమకూరిన నిధులు, ఆయుధ సంపత్తి ఎక్కడ? అవి ప్రభుత్వం చేతికి చిక్కాయా?
10) ఒక డెడ్ లైన్ (మార్చ్ 2026) లోపు తుడిచిపెట్టంత బలహీనమైనదా నక్సలిజం, మావోయిజం?
11) నూతన ప్రజాస్వామిక విప్లవం, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వంటి వాదాలు కాలం చెల్లాయా?
12) లక్షల కోట్ల విలువచేసే ఛత్తీస్గడ్ అటవీ సంపద ఇక కేంద్ర ప్రభుత్వ తాబేదార్ల పరమై పోతుందా?
13) గిరిజన జీవితాలను, సంస్కృతిని ఆగం చేయకుండా, వారి బతుకులు భరోసా ఇస్తూనే ఒక అభివృద్ధి నమూనా నిర్మించడం అసాధ్యమా?
14) వచ్చే ఏడాది మార్చ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న సో కాల్డ్ అర్బన్ నక్సల్స్ మీద పడబోతున్నదా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ దుస్సాహసానికి పాల్పడితే, దాన్ని ఎదుర్కొనే ఉమ్మడి కార్యాచరణ ఆర్మ్డ్ ఛైర్ , వైట్ కాలర్ కామ్రేడ్స్ కు ఉందా? లేదా?
15) హిడ్మా ఆహో, ఓహొ, జయహో... విప్లవం వర్ధిల్లాలి... అని పొట్ట కదలకుండా ఇంట్లో కూర్చుని అంటున్న వారు ఆయన అమ్మ లాంటి అమాయక తల్లులను ఆదుకునే ఏర్పాటు ఏమైనా చేస్తున్నారా?
(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రచయిత వ్యక్తి గత అభిప్రాయాలుగా గమనించాలి)
Next Story

