
తెలంగాణా ‘చంద్ర’కళలు,టిఆర్‌ఎస్ ఆటుపోట్లు
కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్రసమితి భవిష్యత్తు ఏమిటి? ఆ పార్టీ రజతోత్సవాలకు సిద్ధమవుతున్న సమయంలో రాజకీయ వ్యాఖ్యాత తెలకపల్లి రవి చేస్తున్న విశ్లేషణ: 1
చూస్తూ ఉండగానే తెలంగాణ రాష్ట్ర సమితి (Bharata Rashtra Samiti) పాతికేళ్లు పూర్తి చేసుకుంటోంది. భారత రాష్ట్ర సమితిగా మారి రాజకీయంగా ఎదురుదెబ్బతిన్న టిఆర్‌ఎస్ (TRS) కమ్ బిఆర్‌ఎస్ (BRS) భారీ ఎత్తున రజోత్సవాలు జరుపుకోవడానికి సమాయత్తమవుతున్నది. 2024 శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, 2025 లోక్‌సభ ఎన్నికల్లో సున్నా స్థానాలకు పరిమితం కావటం ఆ పార్టీ గమనంలో తోజా చేదు అనుభవాలు. ఓటమి తర్వాత కూడా అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Kalvakuntla Chandraseakhar Rao: KCR), కేటీ రామారావు (KTR) నాయకత్వ పద్ధతులు రుచించక పదిమంది శాసనసభ్యుల వరకు కండువాలు మార్చుకోవటం మరో విఘాతం. గతంలో తాము ప్రత్యేకంగా వెంటాడిన- టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరి పిసిసి అధ్యక్షుడై తమను వెంటాడిన -ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో హోరాహోరి రాజకీయ పోరాటం వర్తమాన అధ్యాయం.
కాలేశ్వరం సమస్యల నుంచి హెస్ సి యూ (Hyderabad Central University) భూముల వరకు ఏ సమస్యలో ఎవరు ఎంత పై చేయి అనేదలా ఉంచితే రాజకీయంగా బి ఆర్ ఎస్ గత వైభవ ప్రాభవాలను ప్రదర్శించవలసిన సందర్భంగా,దిద్దుబాట్లకు అవకాశంగా ఈ రజతోత్సవం ముందుకు వస్తున్నది.
2001 ఏప్రిల్ 27వ తేదీన జలదృశ్యం ప్రాంగణంలో కేసీఆర్ టిఆర్‌ఎస్ ఆవిర్భావాన్ని ప్రకటించారు. దానికి ముందు 2000 నుంచి మేధావులతో భావసారూప్యత గల వారితో చర్చలు,సమాలోచనలూ జరుపుతూ వచ్చారు.1999 ఎన్నికల్లో బిజెపితో కలిసి టిడిపిఅధినేత చంద్రబాబునాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాతా ి ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు. ఎన్టీఆర్ హయాంలో కొద్దికాలం మంత్రిగా పనిచేసిన కేసీఆర్ కొత్త ప్రభుత్వంలో ఉపసభాపతి పదవితో సరిపెట్టుకున్నారు. ఎన్టీఆర్ పై చంద్రబాబు వర్గం తిరుగుబాటు లేదా దుమారం లేవనెత్తినప్పుడు ఆయన పూర్తిగా బాబుతోనే ఉన్నారు.
వాస్తవానికి మనం చంద్రబాబు తరఫున ఆత్మాహుతి దళంగా పనిచేయాలని కెసిఆర్ తనతో అన్నట్టు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడైన నాటి తెలంగాణ సీనియర్ నేత ఒకరు నాతో చెప్పారు. చంద్రబాబుకు కోసం పార్టీ వ్యవస్థాగత పద్ధతులు బోధనా అంశాలు ఎంతో మెరుగుపరిచినప్పటికీ మాటలు చెప్పిన స్థాయిలోఆయన తమ ప్రణాళిక అమలుకు సిద్ధపడలేదని సిద్ధపడకపోవడంతో నమ్మకం సడలిపోయిందని స్వయంగా కెసిఆర్ ఓ సందర్భంగా మాటల్లో చెప్పారు. ఇంత చేసిన తనను ఒక సామాజిక వర్గానికి ప్రతినిధిగా మంత్రి పదవిలోకి తీసుకోకుండా పక్కన పెట్టడం, కేంద్రంతో సంబంధాల కోసం సిబిఐ మాజీ అధినేత విజయ రామారావు చేర్చుకొని మంత్రిని చేయటం కెసిఆర్ జీర్ణించుకోలేకపోయారని సన్నిహితులు అప్పటి రాజకీయ నేతలు, పత్రిక పరిశీలకులు చెబుతారు. కెసిఆర్ తెలుగుదేశం అధ్యాయం ఇంతకన్నా ఇక్కడ అవసరం లేదు కాకపోతే ఆ దశలో ఆయన తర్వాత తనకు చిరునామాగా మారిన తెలంగాణ విభజన ఉద్యమం గురించి పెద్ద కదలిక చూపిన దాఖలాలు లేవని మాత్రం చెప్పాలి. తాను తుమ్మల నాగేశ్వరరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి వంటివారితో దీనిపై మాట్లాడేవాణ్ణని తర్వాత ఆయన వారిని పార్టీలో చేర్చుకున్నప్పుడు చెప్పారు.
తెలంగాణ లో ఒక వెలుగు వెలిగిన మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు వంటి వారి తర్వాత-ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరులు, టిడిపి ద్వారా పెరిగి కాంగ్రెస్‌లో చేరిన వారు తప్ప సొంత పునాది గల హస్తభూషణులు కొరవడిన పరిస్థితి. అనేక రూపాల్లో ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీపడుతున్న వైయస్సార్ ఈ పరిస్థితిని గమనించడం వల్లనే మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యను ఎజెండాలోకి తీసుకురావడానికి కారకులయ్యారు.సోనియా గాంధీకి ఈ మేరకు విజ్ఞప్తి పత్రం అందజేశారు.ప్రస్తుత రేవంత్ సలహాదారు చిన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు రూపొందించిన పత్రాన్ని సీఎల్పీ నేతగా తాను అందించి అనే తప్ప వ్యక్తిగతంగా కాదని తర్వాత రాజశేఖర్ రెడ్డి స్వయంగా నాతోనే చెప్పారు.
అయితే ఆ చర్యకు చాలా స్పందన రావడం కెసిఆర్‌తో సహా చాలామంది గమనించి వుండాలి. 1990 దశకంలో తెలంగాణ వ్యవసాయ ధరల సంక్షోభాన్ని ,భయంకరమైన అప్పుల భారాన్ని ఎదుర్కొన్నది రైతుల ఆత్మహత్యలు , కరెంటు కోతలు గుండె కోతలుగా మారాయి ఉత్తరాదిన బిజెపి పెరుగుతూ కాంగ్రెస్ బలహీనమవుతున్న దశ. మొదటి నుంచి ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు తప్పని భావిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్, తో పాటు ఈ దారుణ పరిస్థితులకు పరిష్కారం రాష్ట్ర విభజన అని నమ్మిన ప్రొఫెసర్ కోదండరాం ,విశ్వేశ్వరరావు,మరో విధంగా హరగోపాల్ తదితరులు అధ్యయనాలు చేస్తూ పుస్తకాలు వేస్తూ మళ్లీ తెలంగాణ ఉద్యమ నాటి వాతావరణాన్ని తీసుకొచ్చారు. టిఆర్‌ఎస్ ఏర్పడినటి పూర్వ రంగం ఇది
విద్యుచ్ఛక్తి ఉద్యమం
ఇక్కడ తప్పక చెప్పుకోవాల్సింది ఉమ్మడి రాష్ట్రంలో 2000 లో ఉర్రూతలూపిన విద్యుచ్ఛక్తి ఉద్యమం. అప్పటి సిపిఎం కార్యదర్శి బివి రాఘవులు చొరవతో వామపక్షాలు, కాంగ్రెస్, ప్రజాసంఘాలు చంద్రబాబు నాయుడు విద్యుత్ విధానం పైన రేట్ల పెంపు పైన సమైక్య పోరాటం ప్రారంభించారు. 2000 ఆగస్టు 28న బషీర్బాగ్ కాల్పులు అది జలియన్వాలాబాగ్ గా మారిపోయింది అన్న మాట రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఆ సమయంలో ్ ఉపసభాపతిగా ఉన్న కేసీఆర్ ఈ కాల్పులను ఖండిస్తూ ప్రకటన చేయడం టిఆర్‌ఎస్ స్థాపనకు మొదటి అడుగు అయింది. ఈ అంశంపై చొరవ తీసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పు తీసుకురావచ్చని తాము కెసిఆర్ కు సూచించామని వి..ప్రకాష్ లాంటి మిత్రులు ఇప్పటికీ చెప్తుంటారు.వారు ఏంచెప్పారు అనే దానికంటే దాన్ని అందిపుచ్చుకోవడంలోనే కెసిఆర్ రాజకీయ చాతుర్యం సమయస్ఫూర్తి స్పష్టమవుతాయి. అవే ఆయనను ఆయన పార్టీని తెలంగాణలో కేంద్ర స్థానానికి తెచ్చాయి.కేసిఆర్ కాల్పులను ఖండిరచిన కొద్ది రోజులకే పదవికి టిడిపికి రాజీనామా చేసి బయటికి వచ్చారు.
ఆ దశలో కెసిఆర్ రెండు జిల్లా పరిషత్‌లను గెలుచుకోవటం, స్థానిక ఎన్నికల కోసమే హెలికాప్టర్ కూడా వాడటం జరిగిందంటే బలమైన ఆర్థిక సామాజిక వనరులు ఎలా సమకూరాయో తెలుస్తుంది. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల్లో నేతలు, ప్రజాప్రతినిధులలో ఒక భాగంతో పాటు బలమైన ధనాడ్య్ వర్గాలు, హైదరాబాద్ అభివృద్ధి వల్ల బలపడినవారు కూడా కేసిఆర్‌కు మద్దతుగా నిలిచారు. దీనికి తోడు ఇంతకుముందు చెప్పిన బుద్ధి జీవులు కూడా ఆయనను ఆయనతో నడవాలని నిర్ణయించుకున్నారు. చెన్నారెడ్డి నుంచి చెన్నారెడ్డి వరకు తెలంగాణ గురించి ఎవరు చెప్పినా నేను బలపరిచాను అదే పద్ధతిలో కెసిఆర్ కుకూడా మద్దతునిచ్చాను. ఆయన నాకు ఆయుధమే కానీ ఆధారం కాదని ప్రొఫెసర్ జయశంకర్ ఒకసారి నాతో అన్నారు
టిఆర్ ఎస్ బలపడటంలో కాంగ్రెస్ పాత్ర
ఈ సమయంలో వచ్చిన 2004 ఎన్నికల్లో రాజకీయబలాల మార్పులను టిఆర్‌ఎస్ పార్టీగా పెరగడంలోనూ కీలకపాత్ర వహించాయి. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఎం సత్యనారాయణ రావు స్థానంలో ధర్మపురి శ్రీనివాస్ వచ్చాక టిఆర్‌ఎస్ తో ఎలాగైనా చేతులు కలపాలనే ధోరణి పెరిగింది. వ్యక్తిగతంగా వైఎస్‌ఆర్ కు, సంస్థగతంగా కాంగ్రెస్కు ఈ ఎన్నికలు జీవన్మన పోరాటమే. ప్రపంచీకరణ ప్రైవేటీకరణ విధానాలపై సమరశీల సమిష్టి పోరాటాలు ప్రారంభించిన ప్రత్యేకత రాఘవులు వంటి వారిదైతే దానికి తెలంగాణ కోణం జోడిరచి రాజకీయ అధికారం వైపు నడిపిన చతురత కెసిఆర్ ది. అప్పటికే తెలంగాణ ఏర్పడాలని కోరిన రాష్ట్ర కాంగ్రెస్ రకరకాల రూపాల్లో టిఆర్‌ఎస్ తో కలవడం సహజ పరిణామం.
కేంద్రంలో వాజ్పేయి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరుకునే వామపక్షాలు విద్యుత్ ఉద్యమ ప్రతిష్టతో ఈ దశలో కీలక పాత్ర వహిస్తున్నాయి . సిపిఎంకు టీఆర్‌ఎస్ తో సంబంధాలు లేవుకానీ చంద్రబాబు బిజెపితో ఉన్నారు కనుక ఓడిరచవలసిన ఉమ్మడి లక్ష్యం కనిపించింది.చంద్రబాబు సైబర్ సిటీ గురించి విజన్ గురించి ఇప్పుడు ఎంతచెప్పినా 2004 నాటికి పూర్తిగా ఆత్మరక్షణలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం వైయస్ ముఖ్యమంత్రి కావటం టిఆర్‌ఎస్ 26 లో అసెంబ్లీ స్థానాలు ఐదు లోక్‌సభ స్థానాలు తెచ్చుకోవడం దాన్ని పెద్ద పార్టీగా నిలబెట్టాయి.
యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ నౌకాయన మంత్రిగా మొదట బాధ్యత తీసుకొని డీఎంకే కోసం కొంత కాలం దాన్ని వదులుకొని తనకు తెలంగాణ తప్ప పదవులు ముఖ్యం కాదని ఒక సంకేతం ఇవ్వగలిగారు. తెలంగాణపై ఢల్లీిలో వివిధ పార్టీలతో లాబీయింగ్ చేస్తూవచ్చారు లాబీ గులాబీ అన్నది అప్పుడు బాగా వాడుకలో వుండేది. వైయస్ మంత్రివర్గంలో చేరికపై కొంత వ్యవధి తీసుకొని తర్వాత చేరి మళ్లీ బయటికి వచ్చి రకరకాల ఎత్తుగడలతో తన రాజకీయ లక్ష్యాన్నివ్యూహాన్ని కాపాడుకున్నారు ఎమ్మెస్సార్ యధాలాపంగా అన్న ఒక మాటను అవకాశం తీసుకొని, కరీంనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి పుర్రె గుర్తు బీడీలపై నినాదం ముందుకు తెచ్చి పెద్ద మెజారిటీతో గెలిచారు. ఇవన్నీ ి తెలంగాణ రావాలని బలంగా కోరుకునే మీడియా మిత్రులు కూడా క్రమ పద్ధతిలో కెసిఆర్ ను ఫోకస్ లో నిలిపి పూర్తిగా సహకరించారు.
2008 ఏప్రిల్ లో టిఆర్‌ఎస్ మంత్రులు హరీష్ రావు, నాయనినరసింహ రెడ్డి, విజయ రామారావు రాజీనామాలు చేశారు. తర్వాతి కాలంలో టిఆర్‌ఎస్ ట్రేడ్ మార్క్ గా మారిన ఉపఎన్నికల వ్యూహానికి అది ప్రారంభం. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు మరణ శాసనం అవుతాయని కేసీఆర్ ప్రకటించినప్పుడు అదెలా సాధ్యమని నేను ఎన్టీవీ చర్చలో ప్రశ్నించాను. తనకు సాహిత్యం ఇష్టం కనుక మంచి భాష వాడుతుంటానని, నిజంగా మరణం శాసనమనికాదని ఆయన బదులిచ్చారు. తర్వాత కాలంలో కేసీఆర్ పదే పదే ప్రస్తావించిన నిజాం వర్సెస్ కాటన్ వాదన కూడా అప్పుడే జరిగింది నిజాం సమాధి దగ్గర మీరు వ్యక్తిగత హోదాలో నివాళులర్పించవచ్చు కానీ తెలంగాణ ప్రజలు ఓడిరచిన ఒక నిరంకుచపాలకుడిని కీర్తించడమేమిటని నేను అక్షేపించాను. గోదావరి మ్యారేజ్ కట్టినందుకు కాటన్ దొరను పూజించినట్టే మాకు పాజెక్టులు కట్టిన నిజామును పూజిస్తామని కెసిఆర్ అన్నారు.
అక్కడ తెలుగువారు కాటన్‌ను పూజిస్తున్నారు కానీ, విక్టోరియా మహారాణిని పూజించడం లేదని, అలాగే ప్రాజెక్టులు కట్టిన ఇంజనీర్ హైదర్ జంగ్‌ను పూజించవచ్చు కానీ నిజామును నెత్తిన పెట్టుకోవడం ఎందుకని? నేను అన్నాను ఆ చర్చలో మాతోపాటు ఉన్న మిత్రుడు పొఫెసర్ నాగేశ్వర్ మరో ప్రశ్నతో సర్దుబాటు చేశారు. ఇంతకూ ఆ తొలి ఉపఎన్నికలు సమరంలో టిఆర్‌ఎస్ దారుణంగా దెబ్బతిన్నది. కేవలం 7 అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ స్థానాలు మాత్రమే తెచ్చుకొని తక్కినవన్నీ కోల్పోయింది. కేసీఆర్ పదవీ సన్యాసం చేస్తున్న సమయంలో మళ్లీ అదే ఛానల్ లో మేము దానిపై ఉత్కంఠ భరితమైన చర్చ చేశాము మళ్లీ జయశంకర్ వెళ్లి ఆయనను ఒప్పించి పదవిలో కొనసాగించడం ఇప్పటికి గుర్తుంది.
తెలంగాణకు టిడిపి మద్దతు
ఈలోగా కాంగ్రెస్ టీఆర్‌ఎస్ రాజకీయ మల్ల గుల్లాలు కొనసాగుతూనే వచ్చాయి. తెలుగుదేశం విభజనకు అనుకూలమైన వైఖరి తీసుకోవడంతో పరిస్థితి మారింది. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించటం, సామాజిక తెలంగాణ కావాలనడం కూడా తోడైంది. ఆ పార్టీతో పొత్తుకోసం ఆఖరి వరకూ వెళ్లిన కెసిఆర్ చివరి దశ లో వెనుదిరిగారు. మిగిలిన వివరాలు పక్కనపెడితే 2009 ఎన్నికల్లో మహాకూటమి పేరుతో తెలుగుదేశం తో ఆ పార్టీ కలిసి పోటీ చేసింది. కమ్యూనిస్టులు కూడా తోడయ్యారు. చంద్రబాబు విజన్ ఏంటో తనకు తెలుసని తాను ఆయన టీం లో పనిచేశానని ఆ ఎన్నికల ప్రచారంలో ఒకసభలో కెసిఆర్ పొగడ్డం గుర్తుంది.అయిత లోలోపల పరస్పర విశ్వాసం లేని కెసిఆర్ చంద్రబాబు లోపాయికారిగా తిరుగుబాటు అభ్యర్థుల పోటీలు ప్రోత్సహించ్టడంతో మహాకూటమి గెలవలేకపోయింది. టిఆర్‌ఎస్ కేవలం 10 అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలకే పరిమితమైంది . వైఎస్ మొదటి దశ పోలింగ్‌లో తెలంగాణలో ఒక విధంగా,మలిదశలో ఆంధ్రాలో మరో విధంగా మాట్లాడటం రాజకీయ వేడిని పెంచింది కానీ కాంగ్రెస్‌కు తెలంగాణలోనూ బాగా స్థానాలు రావడం గమనించదగ్గది. అయితే ఇన్నిటితో ఒంటరిగా పెద్ద విజయం సాధించిన వైయస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం ఒక్కసారిగా రాజకీయ పరిస్థితిని మార్చివేసింది.రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక, అరెస్టు ,రకరకాల పరిణామాలు డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు తొలి ప్రకటన వెలువడటానికి నేపథ్యం, ఆ మరురోజు అంటే 10వ తారీఖున టీవీ చర్చలో నేను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కీర్తిశేషులు విద్యాసాగర్ రావుఉన్నాం. ప్రకటన వచ్చింది గనుక అంతా అయిపోయినట్టే భావించవద్దని, కాంగ్రెస్ రాజకీయం ఇంకా చాలా ఉంటుందని నేను అంటే ఇతరులు అదేం వుండదన్నారు. కానీ తర్వాత ఎన్ని మలుపులు కుదుపులు... తెలంగాణ జేఏసీ, కేంద్రం అఖిలపక్ష సమావేశాలు, శ్రీకృష్ణ కమిటీలు అన్నీ చూసాం. రోశయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిసిపోగా కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి నిష్క్రమించి వైయస్సార్ పార్టీ ఏర్పాటు చేయటం ఆ పరిణామాల్లో కీలకమైనవి. అంతర్యుద్ధం రాకుండా చూడటం, అహింస తన మార్గమని, ఉత్సాహం పెంచడానికి మాటలు తప్పవని కెసిఆర్ అంటుండేవారు. ఒకే వూపుగా పోరాటం సాగించాలనడం పొరబాటని ఆయన తీవ్రంగా మాట్లాడేవారికి కెసిఆర్ సర్ది చెబుతుంటారని కెటిఆర్ ఒక సందర్భంలో వివరించారు. .చౌరీచౌరా తర్వాత గాంధీజీ పోరాటం విరమించడం వంటివే ఈ విరామాలని టిఆర్‌ఎస్ సలహాదారులు కొందరు చెప్పేవారు. ఎవరినైనా అవసరమైనప్పుడు కలుపుకుంటూ ,విభేదించినపుడు పక్కనపెడుతూ కెసిఆర్ ఈ అయిదేళ్ల కాలంలోనూ తను కేంద్ర బిందువుగా కొనసాగారు. ఏదైతేనేం 2013 జూలై 30న కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారం ప్రకటించింది.
ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారిన టిఆర్ ఎస్
పార్లమెంటులో అసెంబ్లీలో యుద్ధాలు వగైరాల తర్వాత 2014 ఫిబ్రవరిలో తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ లో విలీనం అవుతామని హామీ ఇచ్చిన తాను ఇలా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరపడం ఇష్టం లేకనే ఆ పని చేయలేదని కెసిఆర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ తనను పిసిసి అధ్యక్షున్ని చేసి తెలంగాణ ప్రాంతంలో అభ్యర్థుల ఎంపిక అప్పగించాలని పెట్టిన షరతు నచ్చకనే కాంగ్రెస్ అందుకు నిరాకరించిందని అటు ఇటు ముఖ్యులు కొందరు నాతో సూటిగానే చెప్పారు. రాష్ట్రంపై నిర్ణయం జరిగిపోయింది గనక టిఆర్‌ఎస్ ఉద్యమ పార్టీ దశ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయిందని కెసిఆర్ స్పష్టంగా ప్రకటించారు.2014 మే ఎన్నికల తర్వాత ఎన్నికలలో టిఆర్‌ఎస్ బొటాబొటిగా 63 స్థానాలు గెలిచి అధికారుల్లోకి రాగలిగింది. రాజకీయ విజయం నిస్సందేహమే కానీ ఉద్యమం తాలూకు ఉద్వేగం అందులో కనిపించలేదు.
ఎందుకంటే ఇతరులందరికీ కలిపి దాదాపు అన్ని స్థానాలు దక్కాయి.మామూలుగా ప్రాంతీయ ఉద్యమాలు, ఉద్వేగభరితమైన అంశాలపై ఉద్యమాలు నడిపిన పార్టీల నేతలు అత్యధిక సా ్థనాలు తెచ్చుకోవడం, ఒకోసారి ప్రత్యర్థులు తుడిచిపెట్టుకుపోవడం కూడా జరిగేది.తొలిదశ తెలంగాణ ఉద్యమంగా చెప్పే 1969 ఆందోళన తర్వాత జరిగిన 1971ఎన్నికలలో చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి కూడా 14లో పది లోక్‌సభ స్థానాలు తెచ్చుకుంది. టిఆర్‌ఎస్ విషయంలో అలా ఎ ందుకు జరగలేదంటే రాజకీయంగా దానికి కొన్ని పరిమితులున్నాయని స్పష్టమవుతుంది.తర్వాతికాలంలో చూసిన అనేక పరిణామాలకు మూలాలు ఈ పరిస్థితిలోనే వున్నాయంటే అవాస్తవం కాదు. ఇంతకూ తొలిసారి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వాధినేతగా కెసిఆర్ తీరు, పాలక పక్షంగా బిఆర్‌ఎస్ వ్యవహరించిన తీరు ఎలా వున్నాయి? (సశేషం)